(గత సంచిక తరువాయి)
నేనెరిగిన శ్రీ పి.యస్.ఆర్.
అందరింట నేను నా చిన్ననాటి నుంచి P.S.R. గార్ని చూస్తూ పెరిగిన వాణ్ణి. అమ్మ అనుగ్రహంతోనే గత 40 సంవత్సరాలుగా ఆయనతో నా అనుబంధం పెనవేసుకుని పోయిందనేది కూడా వాస్తవం. నాలో ఏమి చూచి వారి కన్నబిడ్డలతో సమానంగా నన్నాయన ఆదరించారో నాకయితే తెలియదు కాని, నాపై ఆయన అకారణ ప్రేమను తలచుకొంటే మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. నా జీవితాన అధిక భాగం అడుగడుగగా ఆయన నాపై చూపిన ప్రేమానురాగాలను నెమరు వేసుకొంటే కేవలం పరోక్షంగా అమ్మ నాపై కురిపించిన అవ్యాజకరుణగా నేను భావిస్తాను. గంభీరమైన విగ్రహం. తాను సత్యం అనుకొన్న దాన్ని నిస్సంకోచంగా వ్యక్తం చేసే నైజంగల P.S.R. గారు క్రొత్తవారికి ఆయన మాట కాస్త కరకుగా అనిపించినా, క్రమంగా ఆయన మనసు వెన్నకన్న సున్నితమని తెలుసుకొంటారు. మనిషి భోళాశంకరుడు. పేదలపట్ల జాలి, ప్రేమ, దయ కరుణలు ‘అందరమ్మ’ వారసత్వంగా వీరికి అబ్బాయి అనటంలో అతిశయోక్తి లేదు. పేదల బాధలకి స్పందించి వీరు అనేక పర్యాయాలు గుప్తదానాలు చేయటం నాకు తెలుసు. ఒకసారి ప్రయాణంలో ఆయన పర్సు పోయింది. కొంతసేపటికి గుర్తించి ప్రక్కన ఉన్న నాతో చెప్పారు. పర్సులో ఎంత ఉంది ? అని అడిగాను. షుమారు 10,000రూ. పైగా ఉండవచ్చన్నారు. అయితే బస్సు ఆపి కంప్లైంట్ చేద్దాం అంటే, అవి ఎవరికి చేరాలో వారికే అమ్మ చేర్చింది. “పాపం వాడికెంత అవసరమో ! అవి మనవి కావు. మనవయితే అవి పోవు” అంటూ ప్రశాంత చిత్తంతో పలికే ఆయన మాటలు విని కంగారు పడిన మనసును అదుపు చేసుకోవటంలో నిమగ్నమవాల్సి వచ్చింది.
“అందరింట” ధాన్యాభిషేకానికి ఆద్యుడు
అమ్మ ఆలయప్రవేశానంతరం అందరింట చోటు చేసుకొన్న అనేక పరిణామాల అనంతరం ‘అందరిల్లు’ అనేక ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సమయం అది. ఒకనాడు అమ్మను దర్శించే క్రమంలో ప్రయాణించి జిల్లెళ్ళమూడి వస్తున్న P.S.R. గారికి అమ్మ ఇచ్చిన ప్రేరణతోనే అమ్మ చెంతన “ధాన్యాభిషేకం” వార్షికంగా చేయాలన్న సంకల్పం కలిగి, అది క్రమంగా బలీయమై జిల్లెళ్ళమూడి చేరే సమయానికి వేళ్ళూని ఒక వృక్షమైంది. ‘ధాన్యాభిషేకం’ లో అందరూ పాల్గొనే విధంగా మనందరం చేద్దామని. అదికూడా రైతులకందరికీ పండిన ధాన్యం జనవరి, ఫిబ్రవరి మాసాలలో ఇంటికి చేరుతాయి. కావున ఫిబ్రవరి 17వ తేది “నాన్నగారి” ఆరాధన ఉత్సవంనాడు అందరింటి సోదరీ సోదరులతో పాటు రైతు సోదరులకు ప్రచారం చేసి అందరూ ఈ ధాన్యాభిషేకంలో పాల్గొని తమ వంతు ధాన్యాన్ని గానీ, అంతకు తగ్గ ధనాన్ని గానీ సమర్పించుకొనే విధంగా ఈ అభిషేక కార్యక్రమం నిర్వహిస్తే, అలా సేకరించిన ధాన్యాన్ని సంవత్సరం పొడవునా అన్నపూర్ణాలయ నిరతాన్న దాన కార్యక్రమానికి వినియోగించవచ్చని. దీనివలన శ్రీ విశ్వజననీపరిషత్కి అందరింట అన్నపూర్ణాలయానికి ఆర్థిక పుష్టి ఏర్పడుతుందనే తమ ఆలోచనను అందరింటి S.V.J.P. సభ్యులందరితో చెప్పి ఒప్పించి అప్పటికప్పుడు అక్కడున్న సభ్యులందరి చేత ప్రారంభ సూచకంగా ‘ధాన్యాభిషేకానికి’ తలా ఒక బస్తా బియ్యాన్ని విరాళంగా స్వీకరించారు. 1987 నవంబర్, డిసెంబరు మాసంలో ఈ ఆలోచన P.S.R. గారికి కలిగితే 1988 ఫిబ్రవరి 17న నాన్నగారి ఆరాధనోత్సవం నాడు మొదటిసారి “అందరింట” ధాన్యాభిషేకం కార్యక్రమం 99 బస్తాల బియ్యం, ధాన్యసేకరణలతో ప్రారంభం అయినది. మొదట ‘అందరింట’ ఉండే కొందరు ఈ కొత్త ప్రక్రియను చాటుగా విమర్శించినా, క్రమంగా రాను రాను ఈ ధాన్యాభిషేక కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఉన్న అమ్మ బిడ్డల నుండీ చుట్టు ప్రక్కల గ్రామాల రైతు సోదరీ సోదరుల నుండీ విశేష స్పందనను చూచి ధాన్యాభిషేక కార్యక్రమాన్ని వారూ అభినందించక తప్పలేదు. కొన్ని సంవత్సరాలు ప్రతి సంవత్సరం డిసెంబరు నుండి అందరింటి స్థానిక సోదరీ సోదరులు ఈ ధాన్యసేకరణకు వివిధ ప్రాంతాలు పర్యటించే వారు.
రాను రాను అమ్మ అనుగ్రహంతో వివిధ ప్రాంతాల నుంచి ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ ధాన్యాభిషేక కార్యక్రమానికి తమవంతు ధనధాన్యాలను S.V.J.P. కి సమర్పించుకొంటారు. అన్నపూర్ణేశ్వరి అమ్మ అనుగ్రహాశీస్సులు పొందియున్నారు. అమ్మ ప్రేరణ సంకల్పించి శ్రీ P.S.R. ప్రారంభించిన ఈ కార్యక్రమమే నేడు నిరంతరాయంగా నిరంతరం అందరింట అన్నపూర్ణాలయంలో జరిగే నిరతాన్న మహాయజ్ఞానికి వెన్నెముకయై శ్రీ విశ్వజననీపరిషత్ వారి ఆర్థిక తుష్టికి, పుష్టికి కారణభూతమై నిలచింది. అమ్మ తాను చేయదలచిన కార్యక్రమాలను, తన అనుంగుబిడ్డలకు ప్రేరణ ఇచ్చి అందరింటి వ్యవస్థను అభివృద్ధి పథంలో నడుపుకొంటున్నా ఆ అమ్మ సంకల్ప ప్రేరణలో భాగమై పాలుపంచుకొన్న శ్రీ P.S.R. చరితార్ధుడు కదూ!
శ్రీ P.S.R. ఉద్యోగ విరమణ అనంతరం నాతో “ఇక ఈ నా జీవితం నిరంతరం సంపూర్ణంగా అమ్మ సేవకే అంకితం చేసుకొనే అవకాశం ఆ తల్లి నాకు కల్పించింది ప్రసాదు. అమ్మ నాచే ఏమి చేయించు కొంటే వాటిని ఒక పరికరంలాగా ఉపయోగపడుటయే నా కర్తవ్యం. అంతా అమ్మ కరుణే అయినా ఈ నా జీవితం అంతా అమ్మ ప్రసాదించిన grace period. ఇకనించి సంపూర్ణంగా నా ఈ జీవితం, జీవనం అంతా అమ్మ సేవకే” అన్నారు. మరొక్కసారి అమ్మ కరుణని తల్చుకొంటూ “నేను అదృష్టవంతుణ్ణి ప్రసాదు. యోగ్యులైన భార్యా, పిల్లలను ఆ తల్లి నాకు అనుగ్రహించింది” అంటూ మురిసిపోయేవారు.
అందరింటి అనుకోని కొన్ని పరిణామాల అనంతరం నేను భార్యాపిల్లలతో జిల్లెళ్ళమూడిని వీడి హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకొంటూ జీవనం చేయాల్సి వచ్చింది. నేనెపుడన్నా జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడల్లా గుంటూరులో ఆయన ఇంటికి రావాలని కోరుకొనేవారు. ఎపుడైనా అలా వారింటికి నేను వెళ్ళకపోతే ప్రేమతో కూడిన బాధతో నిష్టురాలాడేవారు. అదీ కాక ఆయనతో కలిసి నాడు దేశం నలుమూలలా శ్రీ ప్రసాదరాయకులపతిగారు నిర్వహించే సాహితీ రూపకాల్లో నేనూ ఒక వాగ్గేయకారునిగా పాల్గొనటానికి తరచు P.S.R. గార్ని నేను కలవాల్సి వచ్చేది. వెరసి తరచూ ఏదో విధంగా అటూ ఇటూ తిరుగుతూ P.S.R. గారింటికి ఒక సభ్యునిగా వారి ఆతిథ్యాన్ని స్వీకరించే వాడిని. P.S.R. గారు నన్ను ఎంతగానో అభిమానించ టాన్ని గమనించిన వారి భార్య ఒకరోజు మా ఇద్దరికీ వారింట అన్నం వడ్డించి, నాతో “ప్రసాద్ గారు! మీ వయసెంతండి?” అని అడిగారు. ఆనాటి నా వయస్సు చెప్పాను. “మీకంటే ఈయన 14, 15 సంవత్సరాల వయసులో పెద్దవారు కదా! ఏమిటండీ మీ ఇద్దరి మధ్య ఇంతటి స్నేహబంధం? మీరంటే ఎందుకీయనకింత అభిమానం?” అని ఆవిడ ప్రశ్నిస్తే అన్నం తినేవాడిని ఒక్కసారిగా నేనూ ఆలోచనలో పడ్డాను. అవును ఏమిటి ఈ పెద్దాయనతో నా అనుబంధం? మా మధ్య బంధుత్వ రక్త సంబంధాలేవీ లేవే? అయినా వీటన్నింటిని మించిన ఆత్మీయతాను బంధం. మా మధ్య నా ప్రమేయమే లేకుండా ఎలా పెనవేసుకొంది ? అర్థం కాలేదు. కేవలం అమ్మ కరుణతో నా కొరకు ఏర్పరచిన ఏదో అనుబంధం అనిపించింది. ఆమెతో ఏం చెప్పాలో అర్థంకాక, నాకూ అర్థం కాలేదమ్మా! అదేంటో P.S.R. గార్నే అడగండి అన్నాను. మా సంభాషణంతా వింటున్న శ్రీ P.S.R. గారు పకపకా నవ్వుతూ “ముందు మమ్మల్ని అన్నం తిననీయవే!” అన్నారు.
(సశేషం)