(ఆగష్టు సంచిక తరువాయి)
అనంతరం సభా నిర్వహణని కూడా చేసిన శ్రీ PSR గారు అనర్గళంగా అనేక పద్య గద్యాలతో నేను చేస్తున్న అమ్మ సేవలను ప్రశంసిస్తూ, సభలో అందరినీ సన్మాన కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తూ, అనేక రకాల రుద్రాక్ష, స్పటిక, నవరత్నమాల, ముత్యాల, పూలమాల, పూలతో నను అభిషేకిస్తూ నాకూ, నా కుటుంబ సభ్యులకు నూతన వస్త్రాలు పెట్టిన అనంతరం S.V.J.P యాజమాన్యం, శ్రీ రవి అన్నయ్య గార్లతోపాటు అనేకమంది అందరింటి సోదరీసోదరులు నన్ను నూతన వస్త్రాలతో సత్కరించారు. “జీవితసాఫల్య పురస్కారం”గా దాదాపు రూ.50,000/- విలువైన బంగారు గొలుసును శ్రీస్వామివారిచేత నా మెడలో ధరింపచేసి, నాపై ఆయన రాసిన సన్మాన పత్రాన్ని చదివి స్వామివారిచే ఆ సన్మాన పత్ర Frame ని నాకు ఇప్పించారు.
అనంతరం వేదికపైన ఆశీనులైన పెద్దలంతా నన్ను ప్రశంసిస్తూ మాట్లాడుతుండగా ఇంత ఘనంగా అద్భుతంగా శ్రీ PSR గారు సన్మాన కార్యక్రమం తలపెట్టారని ఊహించని నాలో భావోద్వేగం పెల్లుబికి దాన్ని కంట్రోలు చేసే క్రమంలో నా కళ్ళు చమర్చ సాగాయి. అంతలో వేదికపై నాగేశ్వర కళ్యాణానికి అంతా సిద్ధమయిందని. ఇక సన్మాన కార్యక్రమం ముగించాలనే పురోహితుల పిలుపు విన్న శ్రీ PSR గారు ఎంతో అహ్లాదవాతావరణంలో జరుగుతున్న ఆ కార్యక్రమాన్ని ముగింపు దశకు చేరుతోందని చివరగా చి॥ ప్రసాద్ క్లుప్తంగా మాట్లాడాక ఈ సభ ముగుస్తుందని మైక్ని నా చేతికి అందించారు.
అప్పటిదాకా తెలియని భావోద్వేగంలో ఉన్న నేను సంబాళించుకొని శ్రీ PSR గారికి నాపై ఉన్న అపారమైన ప్రేమను, అందరమ్మ నిరంతరం నాపై కురిపిస్తున్న కరుణను నాకు చాతనయిన బాషలో 10 నిమిషాలు వ్యక్తీకరించి, అందరింటి సోదరీ సోదరులకు, నాకు సన్మానాన్ని తలపెట్టిచేసిన శ్రీ PSR వారికి నా కృతజ్ఞతలతో ముగించాను. నాడా సభలో పాల్గొన్న పిన్నలూ, పెద్దలూ నాకింతటి సన్మానంచేసిన శ్రీ PSR Charitable Trust గార్కి, సన్మాన గ్రహీత అయిన నన్ను ప్రశంసలతో ముంచెత్తారు. అనంతరం అందరూ పాల్గొని వీక్షించిన “శ్రీ నాగేశ్వర కళ్యాణం” అమ్మ పూజావేదిక పై వైభవంగా కొడుకులూ, కోడళ్ళూ పీటలపై కూర్చొని నిర్వహించారు. సోదరీసోదరులంతా ఆనందించిన తిలకించి అనంతరం అన్న పూర్ణాలయంలో ఏర్పాటుకాబడ్డ కళ్యాణ భోజనాన్ని అంతా స్వీకరించి సంతోషించారు. ఈ సన్మాన కార్యక్రమాన్ని Youtube లో చూచిన అనేకమంది సోదరీ సోదరులనించి నాకూ, శ్రీ PSR గార్కి అభినందనలు రాసాగాయి. ముందుగా తెలిపివుంటే తామూ పాల్గొనేవారమంటూ కొందరు నిష్ఠూరాలాడగా అనేకమంది తమ అభినందనలు తెలిపారు. రెండురోజుల అనంతరం అనేకమంది ఫోను ద్వారా తమను అభినందిస్తున్నారని ఫోన్ చేసి శ్రీ PSR గారు నాతో అంటే నేనన్నానూ అయ్యా! మీరు సన్మానం చేయాల్సింది నాకు కాదు. తన చిన్నతనం నుంచీ అమ్మ ఆలయ ప్రవేశం చేసేదాకా అమ్మ చెంతనే ఉండి అమ్మని సేవించుకొని, ఈనాడు వృద్ధాప్యం తలుపులు తడుతున్నా అనారోగ్యంతో ఉన్నా, ఓర్పుతో, అమ్మే సర్వస్వంగా అమ్మను దర్శించవచ్చే అందరికీ ఆదరణతో తన ఆప్యాయతానురాగాలు పంచుతూ, నిరంతరం అమ్మ ధ్యాసతో అమ్మ చెంత జీవనయానం చేసే శ్రీమతి వసుంధరక్కయ్యని ముందుగా సన్మానించాలి అని నేనంటే, శ్రీ PSR గారు అవును అని అంగీకార సూచకంగా విన్నారు.
ఆ మర్నాడే ఉ॥ 6 గం. లకు శ్రీ PSR గారినించి ఫోన్ వచ్చింది. రాత్రి నీవు చెప్పింది నాకు బాగా నచ్చింది ప్రసాదు. వసుంధరను కూడా నేను సన్మానిద్దామను కొంటున్నాను అని అంటే చాలా మంచి నిర్ణయం అండీ! ఈ సారి అక్కయ్యని దశాబ్దాలుగా ఎరిగి అభిమానించే సోదరీసోదరులందరికీ Magazine ద్వారా ముందుగా తెలిపి, అందరినీ కలుపుకొని ఘనంగా చేద్దాం. దీనిని హడావుడిగా కాక ఒక ఆదివారం ఉ॥ 10 గం. లకు ఉంటుందని మన మాసపత్రికలో ప్రోగ్రామ్ ప్రకటించి చేయండి అన్నాను. తన జీవితాన్నే అమ్మకు అంకితంచేసిన వసుంధరకు “కనక పుష్పాభిషేకం” అందరినీ కలుపుకొని చేస్తానన్నారు. అన్నట్లుగానే డిశెంబరు 9 న శ్రీమతి వసుంధరక్కయ్యకి అందర్నీ కలుపుకొని 11 సవర్ణ పుష్పాభిషేక సన్మానాన్ని “న భూతో న భవిష్యతి” అన్న చందాన చేసి అందరికీ ఆనందాన్ని కలగజేశారు శ్రీ PSR గారు. అనారోగ్య కారణాన హైదరాబాదులో ఉండి నేను కార్యక్రమానికి హాజరు కాలేకపోయాను. కానీ Live లో వీక్షించి ఆనందించాను.
సన్మాన కార్యక్రమం అనంతరం 2 రోజులకి నాకు ఫోను చేసి శ్రీ PSR గారికి అభినందనలు తెలిపితే, సన్మాన కార్యక్రమం బాగా జరిగింది. అందరూ ఆనందించారు ప్రసాదు అని, అయితే అభిప్రాయం చెప్పాలంటే నేను నిర్వహించి చేసిన ఈ రెండు సన్మాన కార్యక్రమాలలో ఇంకొకరి ప్రమేయం లేకుండా నీకు చేసిన సన్మాన కార్యక్రమం నాకు ఎక్కువ సంతృప్తినిచ్చింది. వసుంధర సన్మాన కార్యక్రమాన్ని కూడా ఇంకొకరి ఆర్థిక Involvement లేకుండా నేను చేస్తే బాగుండేదేమో? అనిపించింది అన్నారు. అందరినీ కలుపుకొని అద్భుతంగా నిర్వహించిన అక్కయ్య సన్మాన కార్యక్రమం ఎందరికో ఆనందాన్ని పంచిందండీ. మీరిలా భావించకండి. మీరు నిర్వహించి చేసిన రెండు సన్మాన కార్యక్రమాలకి మీదైన ఒక ప్రత్యేక ముద్రను వేశారు. మళ్ళీ అంతటి స్థాయిలో వ్యయప్రయాసలకోర్చి, సన్మానాలు నిర్వహించటం ఎవరికైనా సులభసాధ్యం కాదు. వీటి ద్వారా మీ ఉదారత, ప్రేమతో కూడిన మనస్సులను అమ్మ అందరికీ తేటతెల్లపరచిందని నేనంటే నాదేం లేదయ్యా! అంతా అమ్మ అనుగ్రహం. ఇవన్నీ అమ్మ నిర్ణయాలే! కేవలం నేను నిమిత్తమాత్రుడిని అంటూ నిరాడంబరతతో అమ్మయందు తమకుగల అచంచల భక్తి విశ్వాసాలను వెల్లడించారు.
జనవరి 13 భోగి పండగకి హైదరాబాదు నుంచి అమ్మను దర్శించవచ్చే శ్రీ పొత్తూరి ప్రేమ్ గోపాల్ గారితో కలిసి అమ్మ ఆశీస్సులు పొందివచ్చానని ఫోను చేసి చెప్పారు. ఈ వత్సరం కూడా భోగినాడు అమ్మ దర్శనం చేసుకొన్నానని సంతసించారు. రెండురోజుల అనంతరం నేను ఫోను చేశాను. ఆయన గొంతు భారంగా ఉంది. విషయమేమిటని అడిగితే నాకు కరోనా వచ్చిందిట ప్రసాదు. మా పిల్లలు నాకొక ప్రత్యేక గదిని కేటాయించారు. ఫోను మాట్లాడుకొంటానికి ఈ కరోనా మనకి అడ్డు కాదు కదా! అని చమత్కరించారు. మరొక రోజు గడిచాక తనను హాస్పిటల్లో పిల్లలు చేర్చారని ఫోను చేసి చెప్పారు. అప్పటికే నాకూ అనారోగ్యంతో వళ్ళంతా Cramps తో బాధ పడుతున్నాను. నేనూ హాస్పిటల్కి వెళ్ళాల్సివస్తుందేమో! అని చెప్పాను. తమ ఆరోగ్యపరామర్శ చేసిన కొందరితో ప్రసాద్ అనారోగ్యంతో హాస్పిటల్లో చేరానని PSR చెప్పారంటూ నాకు పరామర్శలు వచ్చాయి. అప్పటినుండి నేనూ హాస్పిటల్ లో చేరకున్నా సోడియం శరీరంలో తగ్గి నేనూ ఆ తర్వాత హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. నేను హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చాక శ్రీ PSR గారు ICU లో ఉన్నారనే వార్త తెలిసి వారి పిల్లలకు ఫోన్ చేస్తే వారి స్పందనలేక వివరాలు జిల్లెళ్ళమూడి సోదరులద్వారా తెలుసుకొంటూ ఆయన ఆరోగ్య పరిస్థితికి బాధపడ్డాను. నా అనారోగ్యంతోపాటు శ్రీ PSR గారి ఆరోగ్యాన్ని గురించిన ఆలోచలనతో నీరసించి ఉన్న సమయాన వారి పిల్లలనుంచి నాకు Video call వచ్చింది. మేం మీరు బాగానే ఉన్నారని చెప్పినా మా నాన్నగారు హాస్పిటల్లో ICU Bed మీదనించి పదే పదే మీ ఆరోగ్యం గురించి వాపోతున్నారని, మీరే Video call లో కనబడి ఆయనతో మాట్లాడితే ఆయనకి తృప్తి ఉంటుందంటూ, Video call లో ICU Bed పై నీరసించి పడుకొని ఉన్న శ్రీ PSR ని వారు నాకు చూపించారు. ఆయన రూపు, పరిస్థితి చూడగానే కళ్ళు చమర్చాయి. ఎలావున్నారని అడిగాను. నేను మాట్లాడిన మాటలను ఆయన చెవిలో వారి పిల్లలు వినిపించసాగారు. ఇదిగో యిలా ఉన్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్న వారి ప్రశ్నకు బాగానే ఉన్నానని నా సమాధానాన్ని చెవిలో పిల్లలు చెప్పగా విన్నారు. “మీకేమీ ఫరవాలేదు. అమ్మ కృపతో మీరు త్వరలో కోలుకొంటారు. ఇంకా అమ్మ Centenary celebrations కి మనం ఇరువురం కలిసి అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంది” అన్న నా మాటలు పిల్లలు వారి చెవిలో చెప్పగా విని అంతా అమ్మ నిర్ణయం. “అదంతా ఆ తల్లి ఇచ్చ” అన్నారు. మీరు ఆరోగ్యాన్ని సంతరించుకొని త్వరగా ఇంటికి తిరిగిరండి అంటే నమస్కరించి ఊరుకొన్నారు. డాక్టరు వచ్చే సమయం అయినందున పిల్లలు వారి ఆ కాల్ కట్చేస్తున్నామంటూ కట్ చేశారు. అదే నేను PSR గారిని అఖరిసారిగా చూడటం. మాట్లాడటం.
అనంతరం రెండు రోజులకు రాత్రి 8 గంటలకు దాటాక “అందరిల్లు” whatsapp group లో PSR గారు అమ్మ చెంతకు చేరారనే వార్తను చూచి ఖిన్నుడనైనాను. నా మెదడు మొద్దుబారి స్తబ్దత నావరించింది. నిరంతరం నా వెన్నంటి, నా వెన్నుతట్టి ప్రోత్సహిస్తూ నాచేత అనేక విధాల అమ్మసేవ చేయిస్తూ వచ్చిన నాలోని ప్రోత్సాహక శక్తి అకస్మాత్తుగా నన్ను వీడినట్లయి, అమ్మను తల్చుకుంటూ అమ్మ ఆయనతో నాకేర్పరచిన దశాబ్దాల జ్ఞాపక తరంగాలు చుట్టుముట్టగా నిస్సత్తువతో కూలబడ్డ సమయాన చి. జొన్నాభట్ల సుబ్రహ్మణ్యం చేసిన ఫోన్ కాల్ PSR మరి ఇకలేరన్న వాస్తవాన్ని ధృవీకరించింది. ఆ రోజే నా అనారోగ్య కారణాలు తెలుసుకోవటానికి నాకు MRI పరీక్ష చేశారు. ఆ మర్నాడే నా అనారోగ్య నిర్థారణకి తగిన ఔషధ సేవలకి Doctor Appointment ఉంది నాకు. నీరసించిన నిస్సహా పరిస్థితిలో మా పిల్లలు ఇక PSR తాతగారు లేరు అనే వార్తను చెప్పారు. చిన్ననాటి నుంచి PSR గారితో వారి అనుబంధాన్ని తలచుకొని వారంతా బాధపడ్డారు. అయినా మీరు ఈ సమయాన ఎక్కువగా ఆలోచించకుండా స్థిమితంగా ఉండాలి అన్న వారి మాటలకు దశాబ్దాల అనుబంధం కలిగిన అనుబంధం దూరమయితే వెంటనే మామూలుగా ఉండగలగటం కేవలం అమ్మ అనుగ్రహం వల్లే సాధ్యం అనిపించింది. నా అనారోగ్య కారణాన వెళ్ళలేక PSR గారి కోరిక మేర వారి పిల్లలు ఆయన దహన సంస్కారాలు జిల్లెళ్ళమూడిలోనే చేస్తున్నారని తెలిసి S.V.J.P. వారు ఆయన అంతిమ యాత్రని Live లో చూపిస్తే ఆ పార్థివ దేహానికి చివరగా అశ్రునివాళితో నా శ్రద్ధాంజలి ఘటించాను.
చివరగా అమ్మ తన వెంట ఎంచుకొని తెచ్చుకొన్న ఎందరో అజ్ఞాత మహర్షి సమానులు, మహానుభావులతో నా ప్రమేయం ఇసుమంత లేకుండానే “అందరింట” దశాబ్దాల తరబడి నా జీవన యానం కొనసాగుతుంది. అమ్మ నిర్ణయ సంకల్పాలతో సాగుతున్న ఈ సుదీర్ఘ జీవనయానంలో ఇప్పటికీ అనేకులు తమ గమ్యాలు రాగానే, ఆ ప్రయాణాన్ని విరమించి, అమ్మ చరణాల చెంత విశ్రమించసాగారు. గమ్యమెంత వరకో ఎరుగని ఈ అనంత జీవనయానంలో ఎవరి గమ్యం ఎంతవరకో ముందుగా ఎవరికి ఎరుక? సృష్టి, స్థితి, లయకారిణి అనంతశక్తి స్వరూపిణి అయిన “అందరమ్మే” ఆ ఎరుకను కలిగించి పరిపూర్ణ జ్ఞానంతో మనను నడిపించాలి.
మనమంతా ఏదో చేస్తున్నాం. ఇంకా ఏదో చేయాలనే తపనతోనే జీవిస్తున్నాం. కానీ “చిక్కం అల్లినవాడికే, చిక్కించుకోవటం ఎలానో తెలుస్తుంది” అన్న అమ్మకే మనచే ఏది, ఎంతవరకు ఎలా చేయించుకోవాలో తెలుసు. “విధి వర్షం లాంటిది. కొందరికి అనుకూలం, కొందరికి ప్రతికూలం” లాంటి అనేకమైన వెన్నో జీవన సత్యాల్ని అమ్మ బోధించినా, మనలో నేనూ, నాది అనేది తరచుతోక ఝాడిస్తూనే ఉంది. అది మనసు స్వభావం. అలా తోక ఝాఢించటం కూడా అమ్మ అనుగ్రహంలో భాగమే కదూ!