(ఆగష్టు సంచిక తరువాయి)
నాకు చేతకాని ఇన్ని పనులు త్వరగా చేసే సామర్థ్యం లేక, పెరుగుతున్న వయసు, అనారోగ్య సమస్యలతో కూడిన అననుకూల పరిస్థితులను అధిగమిస్తూ శ్రీ P.S.R. గారు భౌతికంగా ఉండగానే వీటన్నింటినీ పూర్తి చేయటంలో నేను సఫలీకృతుణ్ణి కాలేకపోయి నందుకు విచారిస్తున్నాను. కానీ 2021 ఆగష్టు నుండి సోదరి బి.యల్. సుగుణ సహకారంతో అనేకమంది పూర్వవిద్యార్థులు, అందరింటి సోదరీ సోదరులతో కలిసి మాతృశ్రీ డిజిటల్ సెంటర్, జిల్లెళ్ళమూడి కేంద్రంగా Technical గా వల్లూరి ప్రేమ్ సహాయ సహకారాలతో అందరం కలిసి అమ్మ ప్రేరణతో ఒక యజ్ఞంలో 200 మంది సోదరీసోదరుల అనుభవాలను రాయటమేకాక వాటన్నింటినీ డి.టి.పి. కూడా చేసి Digitalise చేయటం పూర్తి అయిందని ఫోన్లో నా ద్వారా విని శ్రీ P.S.R. ఎంతగానో ఆనందించారు. ఆ మర్నాడే నవంబరు 15, 2021న ఆయన నుండి నాకు ఫోన్ వచ్చింది.
నీకు సన్మానం చేస్తానన్న ప్రస్తావన
నీవు ఇంటి వద్ద ఉండగా నాకు ఫోన్ చేయి నేను నీతో విడిగా మాట్లాడాలని దాని సారాంశం. అయ్యా! నేనిపుడు ఒంటరిగానే ఉన్నాను, మీరు మాట్లాడువచ్చు అన్న నా సమాధానానికి ఆయన ఇలా అన్నారు. “నేను చెప్పేది శ్రద్ధగా విని, నీవుకాదనకు. నేను నీకు సన్మానం చేద్దామనుకొంటున్నాను. నీవంగీకరించాలి” అన్నారాయన. ఆ మాటకి మొదట విస్తుపోయినా తేరుకొని. అయ్యా గత 4, 5 నెలల క్రిందటే మీరు S.V.J.P. పెద్దలు 4, 5గురుతో కలిసి నాకూ సన్మానం చేశారు. ఇప్పుడు మళ్ళీ ఈ సన్మానమేంటి? వద్దండి! అదీగాక నేను చేస్తున్న ఈ ప్రాజెక్టు ఇప్పటికి సగమే అయింది. ఇంకా కావాల్సిన పని చాలా ఉంది అన్నాను. ప్రసాద్ పెద్దవాడిగా అది నా కోరిక. నీవు కాదనకు. అసలీ ప్రాజెక్టు ఈ దశకి వస్తుందనే నమ్మకం ఇప్పటి దాకా నాకూ లేదు. కానీ “అమ్మ” నీ చేత “శ్రీపాద” వారి కన్నా ఎక్కువ కృషి చేయిస్తుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలీ సన్మానాన్ని S.V.J.P. వారే నీకు చేయాల్సి ఉంది. వారు చేస్తారో ! చేయరో ! నాకయితే తెలియదు. నేను నీకు చేద్దామనుకొంటున్నాను. నీవు దానికి అంగీకరించాలి అంటూ చాలా ఉద్వేగభరితంగా ఆయన మాట్లాడ సాగారు. ఆయన ఉద్వేగానికి కొంత Break వేయదలచి సరే నేను ఆలోచించుకొని చెబుతాను లెండి! అన్నాను అప్పటికి. మరోవైపు 4 రోజులలో అంటే నవంబరు 19న కార్తీకపౌర్ణమి రోజు నా భార్య కోరిక మేరకు శ్రీ నాగేశ్వర కళ్యాణం శాస్త్రోక్తంగా జిల్లెళ్ళమూడిలో జరిపే ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నాను. 18వ తేదీకే హైద్రాబాద్ నుండి భార్య, కొడుకులు, కోడళ్ళూ, మనవలూ, మనవరాళ్ళంతా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఆ కార్యక్రమ నిర్వహణ హడావుడిలో ఉంది నా మనసంతా ! నేనలా ఆలోచించి చెబుతానంటే ఆయనే వీడికి ఇంత బెట్టా అని ఆలోచన నుంచి విరమించుకొంటారనేది నా భావన. ఆ రోజు రాత్రి నా పనులు ముగించుకొని రాత్రి 10.45 ని.లకు నిద్రకుపక్రమించాను మళ్ళీ P.S.R. గారి ఫోన్ సన్మానం గురించి ఏమి ఆలోచించావంటూ! అలాగే ఈ ప్రాజెక్టు పూర్తి అయ్యాక నేనే అడిగి మీ చేత సన్మానం చేయించుకొంటానన్నాను. “నీ వెప్పుడో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే అందాకా నేనుండొద్దూ? అమ్మ ప్రసాదించిన నా ఈ జీవిత చరమాంకం 2022 ఫిబ్రవరిలో తప్పక జరుగుతుందని నాకు తెలిసింది. నా తృప్తి కోసం నీవు నా కోరికను కాదనకు” ఆయన పదే పదే అంటుంటే, ఆ సమయాన ఆయన ఫిబ్రవరి అన్న మాటపై నాకు నమ్మకంలేకపోయినా అంతపెద్దవాడి చేత ఇంతగా అడిగించుకోవాలా? సరేనంటే పోతుంది. కాకపోతే కాసేపు ఆయన చెప్పినట్లు వింటే, 4 ధోవతులు, 4, 5 దండలు మెడలో వేసి, నా నుంచి కూడా నాలుగు మంచి మాటలు మాట్లాడిస్తారని భావించి అయిష్టంగానే సరేనండి ! మీ ఇష్టం. మీరేమి చేయమంటే ఆనాడది చేస్తానన్నాను. ఆయనెంతగానో సంతోషించి మీ కుటుంబం అంతా నవంబరు 19న జిల్లెళ్ళమూడికి వస్తున్నారు కాబట్టి రోజే నీ సన్మాన కార్యక్రమం అన్నారు.
అయ్యా! అ రోజంతా నాగేంద్రుని కళ్యాణానికి సంబంధించి అభిషేక, హెూమాల క్రతువులుంటాయి. ఇక సాయంత్రం 6 గంటల నుండి నాగేంద్రుని కళ్యాణ కార్యక్రమం, అనంతరం అన్నపూర్ణాలయంలో అందరికీ కళ్యాణ భోజనాలకి ఏర్పాట్లు చేశాము. అందరం ఉదయం నుండి రాత్రి 9 గంటల వరకు బిజిగా ఉంటాము. ఆ రోజు వద్దన్నాను. నీకేమీ ఇబ్బంది కలిగించను. సాయంత్రం 4 గంటల నుండి 6 గంటలలోపల నీ సన్మాన కార్యక్రమాన్ని పూర్తి చేస్తాను కదా! నీవు ఆ సమయానికి వచ్చి కూర్చుంటే సరిపోతుందని నన్ను ఒప్పించి మరీ ఆ కార్యక్రమాన్ని తలపెట్టారు శ్రీ P.S.R. నవంబరు 19వ తేదీ కార్తీకపౌర్ణమి రానే వచ్చింది. అందరింట సోదరీ సోదరులలో చాలామంది ఉపవాసాలుంటారు. ఈ కార్యక్రమాలన్నీ పూర్తి అయి రాత్రి 8 గంటల కల్లా అందరికీ అందరింట భోజనాలు చేసేటట్లు జరిగిపోవాలి. నాకు సన్మానం ఘనంగా జరపాలనే తలంపుతో 83 ఏళ్ళ వయసులో ఒంటరిగా అన్ని ఏర్పాట్లు గుంటూరులోనే చేసుకొని 19 ఉదయానికల్లా P.S.R. గారు జిల్లెళ్ళమూడికి చేరారు. నాటి ఉదయం నుండి జిల్లెళ్ళమూడిలో ఎడతెరపి లేనివాన. అయినా నిర్విఘ్నంగానే నాటి నాగేంద్ర కళ్యాణంలో భాగాలయిన అభిషేక హెూమ కార్యక్రమాలు చి. నవీన్ శర్మ ఆధ్వర్యంలో ఋత్విక్కుల సహాయంతో మధ్యాహ్నం 2-45 ని.లకు పూర్తి అయ్యాయి. ఇక సా. 6 గంటలకు అమ్మ పూజావేదికపై జరబోయే కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మా కుటుంబం అంతా అన్నపూర్ణాలయంలో భోజనాలు ముగించే సరికి మధ్యాహ్న 3.30 ని. అయింది. వెంటనే నేను డ్రెస్ మార్చుకొని వాత్సల్యాలయం ప్రక్కన ఏర్పాటు చేసిన సన్మాన వేదిక వద్దకు బయలుదేరాను. త్రోవలో శ్రీ P.S.R. కనబడి ఈ మధ్యనే సన్యాసాశ్రమం స్వీకరించిన తమ పూర్వాశ్రమ సోదరుని ఈ కార్యక్రమం కొరకు ఆహ్వానించాననీ, ఆయన రాగానే కార్యక్రమం ప్రారంభించుదాం అన్నారు. స్వామివారు రాగానే శ్రీ రవి అన్నయ్య తదితరులతో కలిసి వాత్సల్యాలయం లోని వేదిక వద్దకు చేరాం. అప్పటికే P.S.R. గారు ముందుగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణంలో కాలేజి విద్యార్థులు, స్థానిక సోదరీ సోదరుల హడావుడితో కూడి కోలాహలంగా ఉంది. అందరూ స్థిమితంగా ఆశీనులయ్యాక శ్రీ P.S.R. గారు ముందుగా స్వామి వారిని వేదిక నలంకరింప జేశారు. తర్వాత నన్ను S.V.J.P. నిర్వాహకులతో పాటు శ్రీ రవి అన్నయ్యని వేదిక పైకి ఆహ్వానించారు. ఏదో ఒక గంట కూర్చుంటే ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. అనంతరం అమ్మ పూజావేదిక పై తలపెట్టిన నాగేశ్వర కళ్యాణ కార్యక్రమంలో పాల్గొనాలనే ఆలోచనలతో నేను నాకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆసనంపై వేదికముందు శ్రీ P.S.R. గారి ఆదేశానుసారం కూర్చున్నాను.
(సశేషం)