(గత సంచిక తరువాయి)
“రాక విచిత్రమైనది – సరాసరి సైకిలు పైన వచ్చి నీ
పాకకు చేరినాను పరిపాలన చేయుదువంచు నెంచుచున్
నీకడ కూరుచుంటి – కమనీయ దయామయ దృక్షసారముల్
సోకగలేదు నాపయిన – సోకిన పల్క వదేమి చిత్రమో!”
అని సాగింది ఆయన మొదటి దర్శన అనుభవంతో కూడిన పద్యరచన. ఆ తర్వాత అప్పటికప్పుడు అమ్మను కీర్తిస్తూ రాసిన 1, 2 పద్యాలను కూడా చదివి తిరిగి వచ్చి ప్రేక్షకులలో కూర్చున్నారు శ్రీ పి.యస్.ఆర్. అంతమంది దిగ్గజాలైన కవిపండితులు అమ్మ చుట్టూ కూర్చొని ఉండగా, క్రింద ప్రేక్షకులలో కూర్చున్న శ్రీ పి.యస్.ఆర్.ని వేదిక పైకి అమ్మ పిలిపించి, తన మెడలో ఉన్న పూలహారాన్ని తీసి శ్రీ పి.యస్.ఆర్. మెడలో వేసి తలపై పూలు చల్లి ఆశీర్వదించింది. శ్రీ పి.యస్.ఆర్. తో నాన్నా! నీవు తిరిగి వెళ్ళి లోపల మరోసారి నీవు రాసిన పద్యాలు నాకు చదివి వినిపించ మంది. అనాడే పి.యస్.ఆర్.ని తన సేవకై ఎంచుకొని తన వెంట తెచ్చుకొన్నానన్న సంకేతాన్ని పరోక్షంగా ఇచ్చింది. వేదికపై తన ప్రక్కనే కూర్చొని ఉన్న శ్రీ కులపతిగారితో మీ పుస్తకంలో వాడి పద్యాలు ఎందుకు ప్రచురించలేదని అడిగింది. వాడసలు పద్య రచన చేస్తాడని నాకు తెలియదమ్మా అంటూ సమాధాన మిచ్చారాయన.
అమ్మ అడిగినట్లుగానే గుంటూరుకు తిరిగి వెళ్ళే ముందు తన పద్యాలు అమ్మకి చదివి వినిపించిన శ్రీ పి.యస్.ఆర్. మదిలో ఆనాటి నుండీ నిరంతరం అమ్మను గురించి ఆలోచన. అంతు బట్టని అవ్యక్తానందాలు చెలరేగి మళ్ళీ అమ్మను దర్శించాలనే తలుపు వెన్నంటి వేటాడసాగింది. అమ్మ ఆయనకి బొట్టు పెడుతూ నీకెప్పుడైనా ఇక్కడికి రావాలనిపిస్తే మీ అన్నగారితోనే కాదు. నీ అంతట నీవు రావచ్చు. నాన్నా అంది. అమ్మ చెప్పిన ఆ అమృత వాక్కులు ఆయన చెవిలో నిరంతరం ప్రతిధ్వనించసాగాయి.
అప్పటికే Guntur Hindu College High School Office లో పనిచేసే శ్రీ పి.యస్.ఆర్. జిల్లెళ్ళమూడి నుంచి తిరిగి గుంటూరుకు చేరిన కొద్దిరోజులకే ‘అమ్మ’ని చూడాలన్న కోరిక బలీయమై, ఒక రోజు సాయంత్రం స్కూలు పని ముగిశాక జిల్లెళ్ళమూడికి బయలుదేరారు. అడపా దడపా Private Bus లను పట్టుకొని అంచెలెంచలుగా గుంటూరు నుంచి బాపట్లకు వెళ్ళే మెయిన్ రోడ్డు పై నున్న ‘మర్రిపూడి’ గుడుల వద్ద బస్ దిగారు. అప్పటికే రాత్రి షుమారు 8.30 గంటలు అయింది. అవి కృష్ణపక్ష రాత్రులు. అక్కడ నించి జిల్లెళ్ళమూడి చేరవచ్చని విన్న కారణాన గబగబా అంగలు వేస్తూ ఆ గ్రామాలు దాటి జిల్లెళ్ళమూడికి దారి తీసే డొంకలోకి అడుగిడిన పి.యస్.ఆర్.కి అప్పటికే కాటుకలాంటి చీకటి అలుము కున్న ఆ రాత్రి వేళ తానెటు వెళుతున్నది తెలియక ఒక చోట నిలుచుండి పోయారు. కరెంట్ లేని నాటి గ్రామాల లోని ప్రజలు పనులు ముగించుకో రాత్రి 8 గంటలకే నిద్ర కుపక్రమించే రోజులవి. అంత చీకటి రాత్రివేళ ఎవరదీ ? అంటూ శ్రీ పి.యస్.ఆర్. ఎదుట పడ్డాడు. ఒక రైతు. తాను జిల్లెళ్ళమూడి వెళ్ళాలంటే ఈ గట్టుమీద నడిచిపొమ్మని సలహా ఇచ్చాడతడు. అలా పి.యస్.ఆర్. ఆ గట్టు వెంబడి కొంత దూరం నడిచాక, మధ్యలో ఒక 10, 12 గజాల వెడల్పులో ప్రవహించే కాలువను దాటాల్సి వచ్చింది. ఎక్కడ దిగితే ప్రమాదం లేకుండా ఆవలివడ్డును చేరగలమా? అని యోచిస్తూ ఆ కృష్ణపక్ష చంద్రుని కాంతిలో చుట్టూ కలయజూసిన శ్రీ పి.యస్.ఆర్.కి కాస్తదూరంలో ఆ కాలువ గట్టుమీదే ఎండుగడ్డి పరచుకొని దానిపై దుప్పటి కప్పుకుని నిద్రించే ఒక వ్యక్తి కనబడ్డాడు. మంచి నిద్రలో ఉన్న అతడు ఈయన లేపినా, నాకు నిద్రవస్తుందంటూ విసుక్కొని ఎక్కడ కాలువదాటాలో చెప్పటానికి ఇష్టపడలేదు. బాబ్బాబు! చాలా దూరం నుంచి వస్తున్నాను. నేనీ కాలువదాటి జిల్లెళ్ళమూడి వెళ్ళాలి. ఎక్కడ దిగాలో కాస్త ఆ రేవుని చూపించు బాబు. ఏదో నాకు తోచింది ఇస్తాలే!’ అంటూ శ్రీ పి.యస్.ఆర్. బ్రతిమలాడగా అతడు లేచి కాలువదాటాల్సిన రేవును చూపించాడు. అతడికేదో కొంత డబ్బులు యివ్వజూపిన పి.యస్.గారితో నాకేమీ వద్దు. నన్ను కాస్త పడుకోనివ్వు అంటూ అతడు ముసుగు తన్ని తిరిగి పరుండి పోయాడు. అనంతరం పి.యస్.ఆర్. కాలువదాటి తిరిగి పొలాల గట్ల మీద నుంచి కొంత దూరం నడిచాక తాను దారితప్పాననే అనుమానంతో ఒక చోట నిలుచుండిపోయారు. అంతలో అంత రాత్రివేళ చేత కర్రను పట్టి ఒక రైతు ప్రక్క చేలో నుంచి వచ్చాడు.
ఇంత రాత్రివేళ ఈ చీకట్లో ఎటు వెళుతున్నావ్? అన్న ఆ రైతు ప్రశ్నకి నేను జిల్లెళ్ళమూడికి వెళ్ళాలన్న పి.యస్.ఆర్.సమాధానం విని ఆ రైతు అయితే నాతోరా! నేనూ అక్కడికే వెళుతున్నాలే అని ముందుకుసాగాడు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని అతడిని అనుసరించాడు శ్రీ పి.యస్.ఆర్. తన ముందు జిల్లెళ్ళమూడి ఊరి బయటదాకా నడిచిన ఆ రైతు పి.యస్.ఆర్.తో ఆ కనిపించేదే జిల్లెళ్ళమూడి. మెల్లగా నీవు నడిచివెళ్ళు. నాకిక్కడ పొలానికి నీరు పెట్టే పని ఉందంటూ ప్రక్క పొలంలోకి వెళ్ళి చీకట్లో కలిసి పోయాడు.
అక్కడక్కడా మినుకు, మినుకు మంటూన్న జిల్లెళ్ళమూడి గ్రామప్రజల ఇళ్ళలోని కిరోసిన్ దీపపు కాంతుల ఆధారంగా ఆ కాస్తదూరం చకచకా నడుస్తూ జిల్లెళ్ళమూడి గ్రామంలోకి అడుగిడిన శ్రీ పి.యస్.ఆర్. సరాసరి అమ్మ నివసించే కుటీరానికి చేరేసరికి లాంతరు వెలుగులో తన కోసమే ఎదురు చూస్తున్నట్లున్న అమ్మ కనపడి రా నాన్నా! నీ కోసమే చూస్తున్నానంటూ అప్యాయంగా ఆయన్ని ఆహ్వానించి మంచినీరు అందించి కుశల ప్రశ్నలు వేస్తూ ప్రయాణం ఎలా జరిగిందని పరామర్శించే అమ్మపాదాలపై తన తలనుంచి అప్పటిదాకా పడిన శ్రమనంతా మరచి సేదదీరిన మనసుతో అవ్యక్తానందానుభూతిని పొందారు. యువకుడై ఉన్న శ్రీ పి.యస్.ఆర్. అప్పటికి రాత్రి షుమారుగా 11.45, 12.00 గంటలవుతుంది. ఆ సమయాన కాళ్ళు కడుక్కొన్న శ్రీ పి.యస్.ఆర్. గారికి అమ్మ ఆప్యాయతతో అన్నం తినిపించి మాటల మధ్యలో ఇంతకీ ఆ కాలువ గట్టున నిద్రించి, నీకు దారి చూపిన వాడికి ఎంత డబ్బులిచ్చావ్? నీకు తోడుగా ఊరిబయట దాకా వచ్చిన రైతు పేరేమి? అని అడిగిన అమ్మ ప్రశ్నలు పి.యస్.ఆర్. గారిని ఉలిక్కిపడేలా చేశాయి.
అయితే మనం ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, మన ప్రతికదలిక ఈ తల్లికి తెలుసునన్నమాట. నన్ను ఇంత చీకటి రాత్రిలో ఈ సమయాన కూడా క్షేమంగా తన సన్నిధికి చేర్చుకొన్నది అమ్మే నన్న తలంపు రాగానే గగుర్పాటుతో ఒళ్ళు పులకించి ఎంతో ఆనందాన్ని అనుభవించారు శ్రీపి.యస్.ఆర్.. కాలక్రమంలో అమ్మ ప్రసాదించే అనేక దివ్యానుభూతులతో ఈ తల్లి అధీనంలోనే మన ప్రతి కదిలిక జీవిత సర్వస్వం ఆధారపడిందనే విశ్వాసం బలపడసాగింది. శ్రీ పి.యస్.ఆర్. తమకు ఏమాత్రం అవకాశం కలిగినా జిల్లెళ్ళమూడి అమ్మ సన్నిధికి వచ్చి అమ్మను దర్శిస్తూ జిల్లెళ్ళమూడిలో అమ్మ ఏర్పరచిన “అందరింట” ఉండే అన్నయ్యలు, అక్కయ్యల నిష్కల్మషమైన ఆప్యాయతాను రాగాల తలమునకలౌతూ ఏదో తెలియని దివ్యానందాను భవాన్ననుభవించసాగారాయన.
– సశేషం