RRనేను హైదరాబాద్లో పిల్లల వద్ద ఉంటూ, ఔషధ సేవ చేస్తూ, విశ్రాంతి తీసుకుంటున్న సమయాన ఫిబ్రవరి 16, 2022 సాయంత్రం ఫోన్ రింగ్ అయింది. అవతల నించి ‘ఆరోగ్యం ఎలా వుంది ప్రసాద్’ అనే ఆప్యాయత నిండిన శ్రీ రవి అన్నయ్య పరామర్శకు నా కళ్ళు చెమర్చాయి. ఒక ప్రక్క నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నా, మరోవైపు నాలో అనేక భావ సంఘర్షణలు చెలరేగసాగాయి. అయిన వారనుకొనే రక్త సంబంధీకులకంటే, ఎంతో ఆప్యాయంగా పరామర్శించే వీరంతా ఎవరు ? నా తోబుట్టువులా ? కాదు అంతకంటే ఉత్తమ భావాన్ని వ్యక్తం చేసే భాష రాదు నాకు. కానీ అందరమ్మ అందరినీ తన వాత్సల్యానురాగాలతో గుది గ్రుచ్చి ఏకోదరులలా బంధించిన సోదరీ సోదరులు అవ్యక్తానుబంధం యిది. అనుభవిస్తే గాని అర్థం కానిది. అందరింట సోదరీ సోదరులపై అనుక్షణం అమ్మ వర్షించే అనురాగానికి బంధమిది. 1960వ దశకం నించి అందరింటి సోదరీ సోదరుల మధ్య నిష్కల్మషమైన ఆప్యాయతానురాగాలతో అందరినీ కలిపి అందరమ్మ ముడివేసిన పవిత్రబంధమిది.
మా మాటల మధ్యన ఈ మధ్యనే అమ్మలో ఐక్యం అయిన శ్రీ పి.యస్.ఆర్.గారి ప్రస్తావన వచ్చినపుడు దుఃఖంతో నా గొంతు జీరబోయింది. శ్రీ పి.యస్.ఆర్ అమ్మ చెంతకు చేరారనే వార్త విన్న దగ్గరనుంచి, ఆయనతో నాకు అమ్మ ఏర్పరచిన అనురాగబంధం నిరంతరం గుర్తుకు వస్తూనే, ఇంకా ఏదో అమ్మ సేవ చేసుకోవాలనే నా తపన, ప్రయత్నాలకు, కోలుకోలేని విఘాతం అమ్మ కలిగించిందనే బాధ నన్ను కలచివేయ సాగింది. నా బాధ నర్థం చేసుకొన్న శ్రీరవి అన్నయ్య, శ్రీ పి.యస్.ఆర్. వియోగం లోపల తననూ బాధిస్తున్నా, నా కంటే పెద్దవాడుగా నన్ను ఓదారుస్తూ, ముందు నువ్వు ఆరోగ్యాన్ని సంతరించుకొన్నాక నీవు తలపెట్టిన అమ్మసేవను నిరాటకంగా కొనసాగించవచ్చునంటూ నన్ను ఓదార్చారు. “60 ఏళ్ళకు పైగా, అమ్మతోనూ, అందరింటితోనూ అనుబంధాన్ని కొనసాగించే పాతతరం సోదరీ సోదరులంతా క్రమంగా అమ్మ సన్నిధికి చేరుకొంటున్నారు ప్రసాదు! ఇంకా ఆ తరం వాళ్ళం ఎంతమందిమి ఉన్నాము. వేళ్ళమీద లెక్కించదగ్గ మందిమే మిగిలామన్న రవి అన్నయ్య మాటలు విన్నాక అది సత్యం కదా! అని చాలా బాధ అనిపించింది. క్రమంగా పాతతరం సోదరీ సోదరులందరినీ “అమ్మ” తన చెంతకు చేర్చుకొంటుందన్నయ్యా! అమ్మ ‘అందరింట’ క్రమంగా క్రొత్త తరాన్ని ఏర్పరచుకొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ముందు ముందు భౌతికంగా “అందరిల్లు” అనేక నిర్మాణ వసతులతో, అనేక మార్పులు, చేర్పులు సంతరించుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి అనేకులు అమ్మని దర్శించి తరిస్తారు. ఇపుడు జరిగేవీ, జరగబోయేవీ అన్నీ అమ్మ నిర్ణయం లోని పరిణామ క్రమభాగాలే అని అన్నపుడు రవి అన్నయ్య కూడా అవునంటూ అంగీకరించారు.
శ్రీ పి.యస్.ఆర్. గారి గురించి క్లుప్తంగా:
‘అందరింట’ అందరూ నిరంతరం ఆప్యాయంగా పిలుచుకునే పేరు పి.యస్.ఆర్. గారు. ఆ అన్నయ్య పూర్తి పేరు శ్రీ పోతరాజు సీతారామాంజనేయ ప్రసాద్. తల్లిదండ్రులు శ్రీ పురుషోత్తమరావు, శ్రీమతి స్వరాజ్యలక్ష్మి గార్లు. భార్య శ్రీమతి గిరిబాల. సంతానం ముగ్గురు కుమారులు. చదువు బి.ఎ., గుంటూరు శ్రీ మాజేటి గురవయ్య హైస్కూలులో సీనియర్ అసిస్టెంట్గా పదవీ విరమణ చేశారు. వీరు సంతమాగులూరు ‘ఏల్చూరు’ గ్రామంలో 30-04-1939 న నలుగురు అన్న దమ్ములు, ఒక తోబుట్టువుల నడుమ రెండవ సంతానంగా జన్మించారు. నేడు కుర్తాళం పీఠాధి పతులుగా ప్రసిద్ధి చెందిన శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వాములవారే పూర్వాశ్రమంలో వీరి అన్నగారైన శ్రీ ప్రసాదరాయకులపతిగారు.
అమ్మ మొదటి దర్శనవైనం:
ఉపాధ్యాయవృత్తి రీత్యా వీరి తండ్రిగారు గుంటూరుకు చేరటంతో, గుంటూరులోనే వీరి జీవితం కోరారు. స్థిరపడి కొనసాగింది. మధ్యతరగతి కుటుంబం వీరిది. నాటి వారి అన్నగారైన కులపతిగారి సహాధ్యాయి అయిన కీ.శే. తంగిరాల కేశవశర్మగారితో చిన్నతనాన్నించే వీరికి మంచిసాన్నిహిత్యం ఉండేది. అదీకాక వీరిరువురూ ఆర్.యస్.యస్.లో స్వయం సేవకులు, ఒక క్లాసులో చదవకపోయినా రాత్రిళ్ళు వీరిరువురూ కలిసి గుంటూరులో ఒకే రూమ్లో combined study చేసేవారు. అలాంటి రోజులలో శ్రీ కేశవశర్మగారు క్రమంగా రాత్రిపూట కలిసి చదువుకొనే నిమిత్తం రావటం తగ్గించారు. పి.యస్.ఆర్ గారు రాత్రిళ్ళు చదువుకోవటానికి ఎందుకు నీవు రావటం లేదని శర్మగార్ని తరచి తరచి అడిగాక తమ కాలేజి క్లాసు అవ్వగానే సైకిల్ పైన బాపట్ల దగ్గరగా ఉన్న జిల్లెళ్ళమూడికి అమ్మను దర్శించేందుకు వెళ్ళి అమ్మను దర్శించి తిరిగి తెల్లవారేసరికి సైకిల్పైన గుంటూరులో college classes కి attend అవుతున్నానని చెప్పగా విని ఆశ్చర్యంతో శ్రీ పి.యస్.ఆర్. ఏమిటి? నీకేమైనా పిచ్చిపట్టిందా? జిల్లెళ్ళమూడిలో అమ్మ వారేంటి? నీవిలా రాత్రింబవళ్ళూ సైకిలు పైన అటూ ఇటూ గుంటూరు నుంచి తిరగటం ఏమిటి? అని నిలదీస్తే, శ్రీ కేశవశర్మ అమ్మను గురించి ఇలా వివరించారు. జిల్లెళ్ళమూడిలో సాక్షాత్ దైవం మానవరూపంలో మాతృమూర్తిగా అవతరించిందనీ, కుల, మత, వర్ణ, వర్గ జాతి లింగభేదాలు లేకుండా సర్వులపై అమ్మే కన్నతల్లిగా అనురాగాన్ని కురిపిస్తుందనీ, ఆ తల్లి సన్నిధిన ఏదో తెలియని ఆనందం, మనశ్శాంతి, ఒక్కసారి ఆ తల్లిని దర్శిస్తే నిరంతరం ఆమె చెంతనే ఉండిపోవాలనే కోరిక, మళ్ళీ మళ్ళీ చూడాలనే తపన అందరికీ కలిగి అవ్యక్తానందంతో మనశ్శాంతిని పొందుతామని ఆయన చెప్పిన మాటలు విన్న శ్రీ పి.యస్.ఆర్. గారు “అయితే నేనూ ఒకసారి నీతో వచ్చి ఆమెను దర్శిస్తాను. ఈసారి నీవు వెళ్ళేటప్పుడు నీతో నన్నూ తీసుకువెళ్ళమ”ని కోరారు.
అలా శ్రీ పి.యస్.ఆర్. శ్రీ కేశవశర్మగారు చెరో సైకిల్పైన తమ 19వ ఏట మొదటిసారి గుంటూరు నుండి జిల్లెళ్ళమూడి చేరారు. అదొక కుగ్రామం. అమ్మ ఉన్న చోట 3, 4 పూరిపాకలున్నాయి. నులక మంచంపైన ఒక స్త్రీమూర్తి పడుకొని ఉంది. మొత్తం చుట్టుపట్ల 10 మంది దాకా జనం ఏవో పనుల హడావుడిలో ఉన్నట్లు, అటూ ఇటూ తిరుగుతూ కనిపించారు. నీవు అలా చెంత ఈ మంచం దగ్గర కూర్చొ! నేనిప్పుడే పనిచూసుకొని వస్తానంటూ అమ్మ పడుకొన్న నులకమంచం దగ్గర శ్రీ పి.యస్.ఆర్.ని కూర్చోబెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు శ్రీ కేశవశర్మగారు. 2, 3 గంటల సేపు అక్కడే కూర్చున్నా, మంచంపై పరుండిన అమ్మ కళ్ళు తెరచి పి.యస్.అర్.ని చూడలేదు. అసలు కళ్ళు తెరిస్తే కదా! పలకరించటం. శ్రీ కేశవశర్మ అందాకా అమ్మ ఉండే నివాసం చుట్టూ ఉన్న మట్టి అద్దిన తడికలకు రేగడిమన్ను, పేడ కలిపిన మిశ్రమాన్ని పూసి, బావిదగ్గర చేయి కడుక్కొని చేయి తుడుచు కొంటూ వచ్చి శ్రీ పి.యస్.ఆర్. తో “భోజనానికి సమయం అయింది ఇకలే” అన్నారు. పి.యస్.ఆర్ లేచి శ్రీ కేశవశర్మతో నాలుగు అడుగులేశాక, అమ్మ నిన్ను పలకరించిందా? నీవేమైనా అమ్మతో మాట్లాడావా? అన్న కేశవశర్మతో పి.యస్.ఆర్. ‘అలా ఏమీ లేదు. ఆవిడ పడుకొనే ఉంది. నన్ను కన్నెత్తి చూడలేదు’ అన్నారు చిరుకోపంగా! అదేమిటి? అమ్మ అందరినీ ఆప్యాయంగా పలుకరిస్తుందే! అయితే నా వెంటరా! నేను నిన్ను అమ్మకి పరిచయం చేస్తానంటే, పి.యస్.అర్.గారు ‘వద్దు కేశవా! నీవు ఆవిడ అమ్మ అన్నావు. ఆప్యాయంగా పలకరిస్తుం దన్నావు. నేను నీతో వచ్చా! అమ్మగా ఆవిడే నన్ను పలుకరించాలి. అలా జరగలేదు. ఇక చాలు. నేనిక ఆవిడను చూడనక్కరలేదు. ఇకపద. పరిచయాలక్కర్లేదు. భోజనం అయ్యాక తిరిగి త్వరగా సైకిళ్ళపై గుంటూరు చేరాలి’ అంటూ ఉడుకు రక్తావేశంతో భోజనాలు ముగించాక తిరిగి ఇరువురూ గుంటూరుకు ప్రయాణ మయ్యారు. శ్రీ పి.యస్.ఆర్ గారి మొదటి అమ్మ విలక్షణ, విచిత్ర దర్శనం అలా జరిగింది.
ఆ తర్వాత శ్రీ కేశవశర్మగారు తమ త్రోవన తాను తరచుగా అమ్మని దర్శించసాగారు. శ్రీ పి.యస్.ఆర్. గారు కొంతకాలం అమ్మను గురించి మరచారు. ఇలా కొంతకాలం జరిగింది. ఆ తర్వాత తనకంటే తమ సోదరులు శ్రీ ప్రసాదరాయకులపతి నాడు గుంటూరు ఆధ్యాత్మిక పరిస్థితి, జిజ్ఞాస కలిగిన పెద్దలైన శ్రీ కృష్ణభిక్షువు, శ్రీ మిన్నెకంటి గురునాధశర్మగార్లతో తరచు జిల్లెళ్ళమూడికి వెళ్ళి అమ్మను దర్శిస్తున్నారని తెలిసి ఆశ్చర్యపోయారు శ్రీ పి.యస్.ఆర్. 1959 ప్రాంతాన అమ్మ పొన్నూరులోని శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారింటికి వచ్చిందని తెలిసి శ్రీ కులపతి ప్రభృతులు కారులో అమ్మని దర్శించేందుకు వస్తుంటే వారితో పాటు పొన్నూరు వచ్చి దూరం నుంచే అమ్మని దర్శించారు శ్రీ పి.యస్.ఆర్. అలా అమ్మతో మాట్లాడే సందర్భం ఆనాడాయనకు రాలేదు. కానీ అక్కడే ఉన్న హైమక్క ఆయన్ని పలకరించగా కొంతసేపు ఆమెతో సంభా షించారు.
అది 1960-61 సంవత్సరాలలో ఒక సంక్రాంతి పర్వదినం. అప్పటికే అమ్మ ప్రసాదించిన అనేక దివ్యాను భూతులకు ప్రభావితులైన శ్రీ కులపతి, మిన్నెకంటి గురునాథశర్మ, కృష్ణభిక్షు, పి.యస్.ఆర్. తండ్రిగారైన పురుషోత్తమరావు తదితర కవి పండితులు అమ్మను కీర్తిస్తూ ఒక కవితా సంకలనాన్ని ప్రచురించి అమ్మ సన్నిధిన సంక్రాంతి రోజున ఆ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారితో కలిసి యాంత్రికంగా శ్రీ పి.యస్.ఆర్. జిల్లెళ్ళమూడికి వచ్చారు. అందరింట ఏర్పాటు చేసిన సభావేదికపై అమ్మ సింహాసనం చుట్టూ ఈ కవిపండితులంతా కూర్చొని పుస్తకావిష్కరణని అలాగే చేయించి తమ ఆ కవితలతో, అమ్మ ప్రసాదించిన అనుభవాలను మేళవించి అనేక ప్రసంగాలు చేసిన అనంతరం ఆనాడు ఆ సభను నిర్వహిస్తున్న శ్రీ ప్రసాదరాయకులపతి Mike లో ‘ఇప్పటిదాకా అమ్మను గురించి మేము రాసిన కవితలనే చదివాం. ఈ సభలో అనేక కవిపండితులు అమ్మను గురించి అనేక కవితలు రాసి ఉండవచ్చు. అలాంటి వారు మీ కవితలు ఈ వేదిక వద్దకు వచ్చి Mike లో చదవవచ్చ’ని ప్రకటించారు. అప్పటిదాకా ప్రేక్షకులలో కూర్చొని కార్యక్రమం వీక్షించే శ్రీ పి.యస్.ఆర్. లేచి Mike అందుకొని తాను అమ్మపై రాసుకొన్న 1, 2 పద్యాలు భావావేశంతో అనర్గళంగా Mikeలో చదివి అక్కడ ఉన్న అందరినీ ఆశ్చర్య పరిచారు. అది మొదలు తమ 83వ ఏట 13-02-2022న అమ్మలో ఐక్యం అయ్యేదాకా అమ్మ అనుక్షణం ప్రసాదించే దివ్యాను భూతులతో అనేక పద్య, గద్య, గ్రంథాలు అమ్మపై రచించి ప్రచురించి, అమ్మ దివ్యత్వాన్ని ప్రపంచానికి చాటారు. శ్రీ పి.యస్.ఆర్. ఆనాడు తమ 19, 20 వయసులో అమ్మను గురించి చేసిన మొదటి రచన ఇలాసాగింది.
– సశేషం