(జూన్ సంచిక తరువాయి)
జరిగేది అంతా అమ్మ నిర్ణయమనే నిశ్చింత
తల్లిదండ్రులను పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజ్యభావంతో మెసలే చేతి కందివచ్చి గుంటూరు హిందూ కాలేజి లెక్చరర్ గా పనిచేసే వివాహితుడైన చెట్టంత పెద్దకుమారుడు మరణం పాలయ్యారని తెలిసి, అతని దహన సంస్కారాలైనాక కొంత సమయానికి హైదరాబాద్లో ఉన్న నేను, ఇంతటి విషాదాన్ని అనుభవిస్తూ ఆయనెలా ఉన్నారూ అనే ఆవేదనతో ఒకసారి ఆయన్ను పలకరిద్దామని ఆయనకి ఫోన్ చేశాను. వారి పెద్దకుమారుని వియోగానికి నా సానుభూతి వాక్యాలయ్యాక, వారితో నాకు గల చనువుతో “ప్రస్తుతం మీరెక్కడ ఉన్నారు? ఏమి చేస్తున్నార”ని నేనడిగితే “విశ్వజనని” అమ్మ మాసపత్రిక ఫ్రూఫ్ దిద్దుతున్నానన్న ఆయన సమాధానం విని నేను దుఃఖించాను. నా వేదనని ఫోన్లో విన్న శ్రీ P.S.R. “మనం ఏమి చేయగలం ప్రసాద్?” అది అమ్మ నిర్ణయం. ముందుగానే అమ్మ వాడ్ని తన దగ్గరకు తీసుకొంది. బ్రతికినంతకాలం ఓపికున్నంతవరకు చేతనైన ‘అమ్మ సేవని’ మనం చేసుకోవాలి కదా!” అన్నారు. అమ్మ చెప్పిన జీవన రహస్యాలను అర్థం చేసుకొని క్లిష్ట సమయాన కూడా ఆచరిస్తూ అద్వైత శిఖరాగ్రాన నుండి ఆ సమయాన పలికిన ఆయన మాటలు విన్న నేను, అంతుబట్టని పాతాళానికి దిగజారిపోతున్న భావనని పొందాను. అమ్మ ఆధ్యాత్మిక సందేశాల యందు బలీయమైన నమ్మకమే కాదు, అవసర సమయాన వాటిని ఆచరించి చూపే శ్రీ P.S.R. విధానం తలపుకు వచ్చినప్పుడల్లా ఇప్పటికీ నా ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
ఇంతటి మహనీయులు అమ్మ చెంత అందరింట మన మధ్య మనతో సంచరించారా! అవును ఇది నిజమే! వారిని అందరూ అర్థం చేసుకొన్నా, చేసుకోకున్నా అలాంటి వారితో కలసి అమ్మ వాత్సల్యాన్ని పంచుకొని పెరిగిన మనం ఎంత అదృష్టవంతులం ? ఇలానే విషాద సమయాన కూడా అంతా అమ్మ కృప అనే సమభావనతో అమ్మ యందు అచంచల విశ్వాసంతో, చలించక వ్యవహరించిన ఒకరిద్దరు సోదరులను నేనెరుగుదును. అందు ఒకరు భార్య వియోగసమయాన శ్రీ రాజుబావ గారైతే మరొకరు శ్రీ బులుసు లక్ష్మీ సత్యనారాయణ శాస్త్రిగారు తమ చేతికందివచ్చిన పెద్దకుమారుని అకాల మరణ సందర్భాన ఏ మాత్రం చలించక అంతా అమ్మ నిర్ణయం. అనుగ్రహమనే భావనలతో మెసలిన సందర్భాలను ఈ రెండింటిని కూడా నేను చూచాను. వీరంతా అతి సామాన్యులుగా అందరింట అమ్మ అనురాగాన్ని మనతో కలిసి పంచుకొన్న అసామాన్యులు.
తన అంత్యకాలసమయం ముందుగానే తెలుసు కొన్న శ్రీ P.S.R.
కాలానుగుణంగా P.S.R. గారు అమ్మ కృపతో ఆర్థిక పుష్టిని సంతరించుకొని అందరింట అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ పాలుపంచుకోవటమే కాక, అందరింటి అభివృద్ధి కార్యక్రమాలను ఆర్థికంగా కూడా విరివిగా తమ వంతు సేవలందించసాగారు. నేను ఫిబ్రవరి 2022 నెల దాటి ఈ భువిపై ఉండనని ప్రకటించిన మహనీయుడతడు. అమ్మ శతజయంతి ఉత్సవాలకు తనెలాగూ ఉండనని తలచి, తాను లేకపోయినా ఆ ఉత్సవాలకి తమవంతు సేవలు అమ్మకి అందించాలనే యోచనతో, తాము అమ్మపై రచించి ఇంకా ప్రచురణకి నోచుకొని రెండు గ్రంథాల ముద్రణకు అవసరం అయిన ఆర్థిక వనరులు ముందుగానే ఏర్పాటు చేసి, అలాగే ఆ ఉత్సవాల గుర్తుగా S.V.J.P. నిర్మింప తలపెట్టిన 100 అడుగుల స్థూప నిర్మాణానికి భారీగా తమవంతు విరాళాన్ని ముందుగానే ఏర్పాటు చేసిన నిరంతర అమ్మ సేవాతత్పరుడు, భావితరాల అమ్మ దర్శించవచ్చే అమ్మ బిడ్డ లందరికీ ఆదర్శప్రాయుడు శ్రీ P.S.R.
నేనెంచుకొన్న అమ్మ సేవలో శ్రీ P.S.R.
ప్రత్యక్షంగానూ పరోక్షంగాను చిన్ననాటి నుంచి నా సర్వస్వం తానే అయి ఈనాటికీ తన ప్రేరణతో చేయిపట్టి నడిపిస్తుంది అమ్మ. తన ఆలయ ప్రవేశం అయ్యాక ప్రత్యక్షంగా నాకు తోడుగా ఏర్పరచింది P.S.R. గార్నే. అయితే అమ్మ తన నోటితో ఆయనతో చెప్పిందని కాదు. ఆ తల్లి కరుణతోనే, అకారణంగా ఆయన తుదిశ్వాస వరకూ నేను ఆయన ఆప్యాయతాను రాగాలను పొందాననేది వాస్తవం. అయితే నేనేదో ఆయన నుండి ఆర్థిక సహాయం పొందానని కాదు. కానీ నిరంతరం నేనెక్కడున్నా, నా కుటుంబ సభ్యులతో ఆనాటి ఆర్థిక ఒడిదుడుకుల నెదుర్కొంటూ నేనెలా జీవిస్తున్నానని తపనపడుతూ నిరంతరం నా యోగ క్షేమాలను, అభివృద్ధినీ కాంక్షించిన మహోన్నతు డాయన. పెద్ద చదువు, ఉద్యోగాలు లేకపోయినా, ఆత్మాభి మానంతో బిడియస్తుడనైన నేను. నా శక్తి సామర్థ్యాల మీద నమ్మకం నా కంటే ఆయనకి ఎక్కువ. నేనేరకమైన అమ్మ సేవ చేస్తానన్నా, కొండంత అండగా నిలచి, నన్ను ప్రోత్సహించిన స్ఫూర్తి ప్రదాత. ఏమీ తెలియని, ఏ మాత్రం అనుభవ పరిజ్ఞానం లేని నేను సోదరీ సోదరుల అనుభవాలను ఇంటర్వ్యూ చేసి వీడియో రికార్డింగ్ చేస్తానన్నాను. ఈనాడు నేనేదైనా అమ్మను గురించి రాస్తున్నా, 200 మంది సోదరీ సోదరుల అనుభవాలను గ్రంథస్థం చేయబూనినా అమ్మ పాటలతో “ఇంటింటా అమ్మపాట”ల కార్యక్రమాలు చేబట్టినా ఆయనతో కలసి సాహితీ సభలలో పాల్గొన్నా, ఇరువురం కలిసి అనేక సామూహిక “అనసూయా వ్రతాలు” నిర్వహించినా వీటన్నింటిలోనూ నిరంతరం నన్ను ప్రోత్సహిస్తూ నన్ను అమ్మ సేవవైపు శ్రీ P.S.R. నడిపించినా, అమ్మ తన సేవను చేస్తూ నా జీవన యానం చేయాలనే నా కోరికను అమ్మ ఈ విధంగా తీర్చిందని నా విశ్వాసం. తానుండగానే నేను తలపెట్టిన అన్ని అమ్మ సేవా కార్యక్రమాలు పూర్తి కావాలని శ్రీ P.S.R. గారు ఆశించారు. తరచూ ఈ విషయాన్ని ఫోన్ చేసి నాకు గుర్తు చేసేవారు.
శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్య “అమ్మతో అనుభవాలను” నేను ఇంటర్వ్యూ ద్వారా సేకరించిన దాన్ని పుస్తకరూపంలో డి.టి.పి. పూర్తి చేస్తే దానిని చదివి తగిన చిన్న చిన్న సూచనలు చేయటమే కాక ఆ పుస్తకానికి, అలాగే కీ.శే. శ్రీరాచర్ల లక్ష్మీనారాయణ గారి అమ్మతో అనుభవాల పుస్తకానికి అచ్చువేయటానికి తమ అభిప్రాయాలను కూడా ముందుగానే రాసి ఇచ్చారు. వీటన్నింటితో పాటు మరో ప్రక్కనేను కూడా నా చిన్ననాటి నుంచి అమ్మ సన్నిధిన నేను పెరిగినవైనాన్ని నా జీవన ప్రయాణంలో ప్రత్యక్ష పరోక్షంగా అమ్మ ప్రమేయంతో 1960 నుండి 60 సంవత్సరాల పైగా నేటి వరకు నేను గ్రహించిన “అందరింట” జరుగుతూ వచ్చిన అనేక పరిణామాలతో కూడిన అభివృద్ధి, ఒడిదుడుకులు, ఆయా సందర్భాలలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అమ్మ ప్రమేయం. ఇలా నా జీవితంలో అధికభాగం నేను అందరింట గ్రహించిన అనేక సంఘటన సన్నివేశాలతో పాటు ఒక రకంగా నా జీవిత జీవన విధానాన్ని కూడా తెలియబర్చే ఒక పుస్తకాన్ని రాయటం ప్రారంభించాను. ఇప్పటికే దాదాపు చాలా వరకు రాయటం జరిగింది. ఆ పుస్తకాన్ని త్వరగా పూర్తి చేయమని తరచూ నాకు ఫోన్ చేసి చెప్పేవారు P.S.R.
(సశేషం)