పైమాట చెప్పి తనను చూపించుకుంటూ “నేనే లడ్డూనయితే? ఎల్లాగా?” అని అమ్మ ఒక సందర్భంలో అన్నది. ఈ మాటను విస్తరించి వ్యాఖ్యానించటం. ఒక సాహసమే అవుతుంది. అయినా అమ్మ ఆశీస్సుల ధైర్యంతో రాస్తున్నాను. తానే లడ్డూ అయితే దానిని అనుభవించి, రుచి చూసి ఆస్వాదించే దెలాగ? అమ్మకు ఎదురైన సమస్య. మాధుర్యమే మధురిమను కోరితే ఎలాగవుంటుంది? అందుకే పరబ్రహ్మస్వరూపంలో వున్న తాను అమ్మగా అవతరించి అద్వైత స్థితి నుండి ద్వైతస్థితిలోకి వచ్చి ఈ మాయా సృష్టిని దైవత్వంలో జీవులను వేరేగా తన బిడ్డలుగా సృజించి జీవాత్మ పరమాత్మల మధుర ప్రేమసంబంధాన్ని అనుభవించే ఆనందంకోసమే ద్వైతస్థితిలోనికి అవతారంగా వచ్చింది. ఈ మధురానుబంధం భగవంతుడికీ జీవుడికీ ఎన్నియుగాలైనా కొనసాగే రసమయప్రేమైక్య సంబంధం.
మనమూ, అమ్మా విడిగా ఉనికి కలిగి వుంటేనే కదా అమ్మని ఆరాధించినా.. పూజించినా, ప్రేమించినా అమ్మ అపార ప్రేమను పొంది ధన్యత పొంది ధన్యత పొందాలన్నా సాధ్యపడేది! అమ్మను విడిచి వెళ్ళేటప్పుడు వియోగంతో కార్చే కన్నీళ్ళు. చాలా కాలం తర్వాత వచ్చి ఆమె ఒడిలో వాలి కార్చే కన్నీళ్ళూ, ఆమె బుగ్గలు నిమిరి ఓదార్చటాలు, గారాబం చెయ్యటాలు, గోరుముద్దలు తినిపించటాలు వంటి మధురమైన లీలలు మనమూ ఆమే అనుభవించేది!’ అందుకోసమే అమ్మ మనల్ని లడ్డూలుగా (బ్రహ్మైక్యం) మార్చకుండా బిడ్డలుగానే ఉంచుకుని తానే లడ్డూ అయి మనకి మాధుర్యాన్ని రుచి చూపించింది. తాను అమ్మగానే ద్వైతరూపంలో అవతరించింది. ఈ బద్ధజీవులను తరింప చేయటానికి, ద్వైతంలోని సుఖదుఃఖ భూయిష్టమైన సంసారంలో అమ్మగా అనేక పాట్లు బిడ్డల కోసం అనుభవించింది. ఆమె కరుణకు ప్రేమకు కళ్ళు చెమర్చని భక్తులు (బిడ్డలు) వున్నారా? ఆ కన్నీళ్ళు చాలా విలువైనవి. పవిత్రమైనవి. పరమప్రేమతో కార్చే కన్నీళ్ళు ఆత్మను పరిశుద్ధ మొనరించుతాయి. అందుకోసమే అమ్మ ప్రేమతో కన్నీళ్ళు కార్చి మనందరి చేత కన్నీళ్ళు పెట్టించింది. ఈ బద్ధ జీవులను ఉద్ధరించి ప్రేమమాధుర్యాన్ని చూపి తరింపచేయు సంకల్పమే ఆమె అవతరణకు, ఉనికికి గల కారణం. ఒకసారి ఒకరు అమ్మని ‘సన్యాసం పుచ్చుకోవాలని వుంది’ అని అడిగారు. “సన్యాసం, పుచ్చుకుంటే వస్తుందా నాన్నా!” అని ఒక ప్రశ్న వేశారు. “సన్యాసం అనేది ఒక మానసిక స్థితి.. అది కాషాయాలు ధరించటం వల్ల దీక్ష తీసుకున్నందు వల్లా వచ్చేది కాదు. మనిషి మానసిక పరిపక్వత కల్గి అర్హత కల్గినపుడు ఆ సన్యాసస్థితి వస్తుంది. అది పుచ్చుకుంటే వచ్చేది కాదు” అన్నది. ఇది ఎంతటి నగ్నసత్యం? ఇంత కఠినమైన సత్యాన్ని ఎంత మృదువుగా ఎవరికీ బాధ కల్గకుండా చెప్పింది?
ఇక లడ్డూ అన్న పదానికి అర్థాలు చెప్పటానికి ఎన్ని పేజీలైనా సరిపోవు. క్లుప్తంగా నాకు తోచిన ఉదాహరణలు వివరిస్తాను.:
“లడ్డూ” స్థితి. జీవస్థితిలోనూ పొందవచ్చు. ఒక పరిస్థితిలో భక్తుడు శరణాగతి చేసి భగవంతుడే తనకు సర్వరక్షకుడని నమ్మి ఆ సిద్ధాంతంతో జీవితంలో ఎన్ని కష్టాలెదురైనా చలించకుండా, భగవంతుడ్ని ఆరాధిస్తూ పూర్తి నమ్మకంతో వుంటాడు. చరిత్రలోని మహా భక్తులంతా ఈ కోవలోని వారే. కాని దీనికన్న ఉన్నతమైనది “లడ్డూ” స్థితి.
త్రేతాయుగంలో రామావతారంలో దశరథుడు రాముడు అడవులకు వెళ్ళిపోతూవుంటే ఈ ముళ్ళ బాటలో నా సుకుమార బాలరాముడు ఎన్ని కష్టాలు పడతాడో అని విలపిస్తూ – ఆయన చూపు రామునితోనే వెళ్ళిపోయింది. విలవిల లాడుతూ ఆ బాధకు ప్రాణాలు వదిలేశాడు. ఇది పరమ ప్రేమస్థితి. ఈ స్థితిలో భక్తుడు తానే భగవంతుడ్ని రక్షించుకోవాలని పరమ ప్రేమతో తాపత్రయ పడిపోతూ ఆ మధురప్రేమ బాధతో జీవితమంతా గడుపుతాడు. భక్త శబరి తను ఎంగిలి చేసి పుచ్చులు లేకుండా చూసి ఆఫలాలను రామునికి తినిపించింది. ఆమె రాముని సీతా వియోగ దుఃఖానికి చలించి దుఃఖించి సీతను వెదికే మార్గం చూపించింది. వేల సం||రాలు ఆయన రాకకై ప్రేమతో ఎదురుచూసి కొన్ని నిముషాలు రాముని ప్రేమకు కరిగి నదియై పొంగిపారింది. ఇంక లక్ష్మణుని సంగతి సరేసరి. 14 సం॥రాలు నిద్రలేకుండా రాముడ్ని రక్షించుకోవాలనే తాపత్రయంతో అన్నీ త్యాగం చేశాడు. రామునిపై ప్రేమే ఆతని ఊపిరి.
ఇక ద్వాపరయుగంలో యశోదా దేవి కృష్ణుడిని రాక్షసుల బారి నుంచి ఎల్లా రక్షించుకోవాలా అని తాపత్రయ పడుతూ ఆయాసపడుతూ మాతృప్రేమ మాధుర్యాన్ని అవధులు వాటి ప్రవహింప చేసింది. అమ్మ దేవకీ దేవి కడుపు తీపితో కృష్ణుణి కొడుకుగా పొంది కూడా రేపల్లెకు పంపి రక్షించుకుంది. ఎన్నో, సం॥రాలు కారాగారంలో పుత్ర వియోగాన్ని అనుభవిస్తూ కన్నీళ్ళు కారుస్తూ గడిపింది. వీళ్ళంతా భగవంతుడ్ని మనం రక్షించే దేమిటి? అని భావించ లేదు. ప్రేమోన్మత్త స్థితిలో వాళ్ళే భగవంతుడికి రక్షకులుగా వుండి ఆయన్ని గుండెల్లో భద్రంగా దాచుకున్నారు. ఇల్లాటి “లడ్డూ” స్థితియే బృందావనంలోని గోపగోపికలది.
వారు కృష్ణ ఐక్యస్థితిలో పరమ ప్రేమతో జీవితాన్ని సార్ధకం చేసుకున్నారు. ఒకసారి శ్రీ కృష్ణ పరమాత్మకు తీవ్రమైన శిరోవేదన కల్గింది. ఆ లీలా కృష్ణుడు నారదులు వారిని పిలిచి భక్తుల పాదధూళితో గానీ తన బాధ తీరదన్నాడు. నారదుడు ఆయన భార్యలందరి దగ్గర అడిగి లేదనిపించుకున్నాడు. నరకానికి పోతామని వారంతా భయపడ్డారు. చివరకు బృందావనం వెళ్ళి గోప గోపికలను అడిగితే వారు పోటీలు పడి పాదధూళిని ఇచ్చారు. క్రిష్ణయ్యకు తల నెప్పి తగ్గటమే వారికి కావల్సింది. పాపపుణ్యాలూ, స్వర్గ నరకాల గురించి ఆ అమాయకులకు తెలియదు. ఎప్పుడూ క్రిష్ణ ధ్యానంలో వుండి క్రిష్ణునిలో ఐక్యము పొందిన వారికి కృష్ణుడు మధురకు వచ్చాక వాళ్ళ మొహం ఒక్కసారైనా చూడక పోయినా, జీవితమంతా క్రిష్ణమయంగా దర్శించి ధన్యత పొందారు. వారు సంఘంలో అనేక సంఘర్షణలకు బాధలకు లోనయ్యారు. వీరి మధురానుబంధం గూర్చి, నేటికీ, వాగ్వివాదాలు వున్నాయి. దీనికి అద్భుతమైన సమాధానం రెహనతాబీ అనే ముస్లిం యువతి రాసిన “Heart of a Gopi” లో సరైన సమాధానం దొరికింది నాకు. అందులో నీలాదేవి అనే గోపిక తన భర్తతో యమునానదికి వాహ్యాళికి వెడుతూ అతడి హృదయ మధనాన్ని సందేహాలను తీర్చింది. ఆమె “నాథా ! మిమ్మల్ని గాఢంగా ప్రేమించి ఆరాధించటం వల్లనే నాకు బహుమతిగా క్రిష్ణప్రేమ లభించింది. ఆయన ప్రేమను పొందాకే మిమ్మల్ని ఇంకా గాఢంగా ప్రాపంచిక యెల్లలను దాటి ప్రేమిస్తున్నాను. మీలో కృష్ణుణ్ణిచూశాను. దివ్య ప్రేమను అనుభవించాను” అందుకు ఆమె భర్త సమాధానపడి అతను కూడా కృష్ణ భక్తుడు అయ్యాడు. వారికి జగమంతా క్రిష్ణమయంగా మార్చగల శక్తి వుంది. ఇదే అమ్మ చెప్పిన లడ్డూ స్థితి. దీనికి లింగభేదం లేదు. అన్ని జీవులకు ఈ స్థితి కలుగవచ్చు. గజేంద్రుడిలాగ అమ్మ మనల్నందరినీ లడ్డూలగా మార్చాలని ప్రార్ధిస్తూ అమ్మ కిష్టమైన హారతితో ఈ వ్యాసం ముగిస్తున్నాను. “కళ్యాణహారతిని కళవూ నీవేదేవి, ఇలవేల్పు వైవుంటివే ఇల్ల శుభకళలదీవింపవే ఓ తల్లి!”