2013-14 సంవత్సరంలో సేవాసమితి నిర్వహిస్తున్న ప్రేమార్చనలప్పుడు ఒక సోదరి పరిచయ మయ్యారు. ఆవిడ ఒకరోజు నాకు ఫోన్ చేసి, “రామ్మోహన్ రావు గారు ! మా విజయవాడలో ఉంటున్న మేనల్లుడి కూతురుకి ఇంజనీరింగ్ సీటు వచ్చింది. కానీ, మా మేనల్లుడికి కూతురిని చదివించే ఆర్థిక స్థోమత లేదు. అదేమో ఇంజనీరింగే చదువుతానని పట్టుబట్టింది. నేనొక ఐదు వేలు పంపాను. మీ సమితి ద్వారా మీరేమైనా సాయం చేయగలరా ? ” అన్నారు.
నాకు ఆమాట విని చికాకు, కోపం వచ్చింది.
“అక్కయ్య గారు, మా సమితికి ఇటువంటి సహాయం కోసం ఫండ్స్ ఉండవు. ప్రేమార్చనలు కూడా ఎవరైనా ఆర్థిక సహాయం చేస్తే నిర్వహిస్తున్నాం” అన్నాను. ఆవిడ, “దయచేసి కొంతైనా సహాయం చేస్తే మిగిలిన డబ్బుకి వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు” అన్నారు.
ఆవిడతో చికాకుగా మాట్లాడాను, కానీ మనసులో ఒక ఆడపిల్ల చదువు కోసం కదా, అమ్మ మీద భారం వేసి పదో, పదిహేను వేలో ఇస్తే వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు అనిపించింది.
ఎలా మొదలు పెట్టాలి ? ఆ అమ్మాయి గానీ, ఆమె తల్లిదండ్రులు కానీ ఎవరో తెలీదు. ఎవర్నైనా అడిగితే ఏమనుకుంటారో అనే సంశయపడ్డాను. ఏమైతే అది అవుతుంది అని, ముందుగా సోదరులు శ్రీ బి. వి. ఆర్. శాస్త్రిగారిని అడిగాను. ఎందుకంటే ఆయన ప్రేమార్చనలకి చాలా సహాయం చేస్తుంటారు. అన్నింటికీ నేనున్నా అని ముందుకు వచ్చేవారు.
ఆయనకు పరిస్థితి వివరించి ఏమైనా సహాయం చేయగలరా అని అడిగాను. వెంటనే వారు “రామ్మోహన్ గారు ! నేను పదివేలు ఇస్తాను” అన్నారు. నాకు మతిపోయింది. ఏంటి ఈయన ఉదారత ? వాళ్ళు ఎవరో తెలీదు, నా మీద నమ్మకంతో వెంటనే స్పందించారు.
సరే, తర్వాత మా రాధన్నయ్య కొడుకు సతీష్కి ఫోన్ చేసి ” శాస్త్రిగారు పదివేలు ఇస్తానన్నారు, నువ్వు కూడా ఏమైనా సహాయం చేయగలవా ?” అన్నాను. వెంటనే సతీష్, “అయితే నేను కూడా పదివేలు ఇస్తాను” అన్నాడు.
నాకు అసలు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.
సరే, ఇదంతా అమ్మ చేయిస్తోంది. ఆ అమ్మాయి అదృష్ట వంతురాలు అనుకున్నాను. వాళ్ళు ఇద్దరూ చెరో పదివేలు ఇస్తున్నారు కనుక నేను కూడా మా కుటుంబం తరఫున పదివేలు ఇద్దామని నిర్ణయించాను.
మర్నాడు వెంకటరామశాస్త్రిగారు ఇస్తానన్న పదివేలు తీసుకుందామని వారింటికి వెళ్లి మాటల్లో “75 వేలు ఫీజు కట్టాలట అన్నయ్య గారు. ప్రస్తుతానికి ముప్ఫై వేలు మాత్రమే వచ్చే లాగుంది” అని కొంత బాధతో అన్నాను.
శాస్త్రిగారు వెంటనే “రామ్మోహన్ గారూ! మీరు ఒక మంచి పని చేపట్టారు. చూస్తుండండి, మొత్తం డెబ్భైఐదువేలు అమ్మ మీచేత ఇప్పిస్తుంది” అన్నారు. ఆ తర్వాత మా సతీష్ ఇచ్చే పదివేలు కోసం వెళ్తూ, మా శాస్త్రి అన్నయ్య ఇంటికి వెళ్లి నేను వెళ్తున్న పని గురించి చెప్తే, అన్నయ్య, అనసూయ కూడా వెంటనే చెరో రెండు వేలు ఇచ్చారు. అట్లా, రెండు మూడు గంటల్లో ముప్ఫైఐదువేలు వచ్చింది.
ఆ రోజు రాత్రి ముప్పై ఐదువేలు ఇవ్వగలమని ఆ సోదరికి చెప్పాను. వెంటనే ఆవిడ ఉద్వేగంతో, “రామ్మోహన్ గారూ ! ఇంత సహాయం మీరు చేస్తారని నేను ఊహించలేదు. నాతో ముఖపరిచయమే గానీ, ఆపిల్ల ఎవరో కూడా మీరు చూడలేదు. నిజంగా ఆ పిల్లకి చదువుకునే ప్రాప్తం ఉంది. అది అదృష్ట వంతురాలు” అన్నారు.
“అక్కయ్య గారు ! ఇదంతా అమ్మ చేయిస్తోంది. నాదేం లేదు. మిగిలిన డబ్బుకి వాళ్ళని ప్రయత్నించు కోమని చెప్పండి” అన్నాను.
ఇటువంటి కార్యక్రమం చేపట్టినప్పుడు వఝా ప్రసాద్ అన్నయ్యకి చెప్తుంటాను. ఆయనకు ఫోన్ చేస్తే మేం షిర్డీ వెళ్తున్నాం. వచ్చాక మాట్లాడుతానన్నారు”
ఇంకా ఎవరైనా ఇస్తారేమోనని నా ప్రయత్నాలు కొనసాగించాను. నేను ఎవరికి ఫోన్ చేసినా వాళ్ళు వెంటనే కనీసం రెండు వేలు ఇచ్చారు.
మా పెద్దమ్మ గారి అబ్బాయిని అడిగితే, ” ఆడపిల్ల చదువు కనుక నేను ఐదు వేలిస్తాను. ఆ అమ్మాయి చదువు పూర్తి అయ్యేదాకా సంవత్సరానికి ఐదువేలు ఇస్తాను” అన్నారు. ఇవన్నీ నేను ఊహించని పరిణామాలు అట్లా, మూడు రోజుల్లో 73,000 పోగైంది. సోదరికి చెప్పి ఆమె మేనల్లుడు అకౌంట్లో జమ చేశాను. అంతలో వఝా ప్రసాద్ అన్నయ్య షిర్డీ నుంచి వచ్చారు.
ఆయనకు ఈ విషయం చెప్తే, “అలాగా! 75000 పూర్తి చేద్దాం. మిగిలిన రెండు వేలు నేను వాళ్ళ అకౌంట్లో వేస్తాను “అన్నారు.
వెంకట్రామ శాస్త్రిగారు మొదటి రోజు నాకిచ్చిన ఆశీర్వాదం ఈ విధంగా నిజమైంది.
కొసమెరుపు : ఆ అమ్మాయి ఇంజినీరింగ్ చదువు పూర్తి అయేదాకా వద్దు వద్దు అనుకుంటూ (ఎందుకంటే, నేనెవరినైనా అడిగితే ఈయనేంటి మా వెంట పడ్డారు అనుకోవచ్చు) అయినా అమ్మ మీద భారం వేసి “నేనొక మంచి పని చేస్తున్నాను కనుక వాళ్ళు ఇచ్చినంతే పోగుచేద్దాం” అని నా ప్రయత్నాలు నేను చేశాను.
అట్లా ఆ అమ్మాయి చదువు పూర్తి కావడానికి ఇతోధికంగా సాయం అందించాము. ఆ అమ్మాయికి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం వచ్చింది. అంతా అమ్మ దయ.