శ్రీ మాజేటి గురవయ్య హైస్కూల్ ఎందరో మహనీయులు విద్యనభ్యసించి ఉన్నత శిఖరాల నధిరోహించిన పాఠశాల. అందులో ఒక వ్యక్తి కిటికీ అవతల కూర్చొని ఫీజులు వసూలు చేసేవారు; సాధారణ మైన జీవితం గడిపేవారు.
పాఠశాలలో S.S.L.C. Register చెదలు పడితే, ప్రధానోపాధ్యాయులు ఆదేశము గైకొని కొత్త Register రూపొందించిన విధ్యుక్త ధర్మదీక్షాపరుడు. కొండా ఆంజనేయులు, రామారావులు మిత్రబృందంతో పాఠశాల కార్యక్రమములను దిగ్విజయంగా నిర్వహించిన కార్యశీలి. వారి అన్నగారు విద్యాదేవ కులపతి, యతి, జగద్గురువు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి.
మొదటిసారి తన అనుంగు మిత్రుడు తంగిరాల కేశవశర్మతో సైకిలు మీద జిల్లెళ్ళమూడి వచ్చారు ఆయన.
ఆయన ఎవరో కాదు శ్రీ పి.యస్.అర్. అంజనేయప్రసాద్ అన్నయ్య. స్వయంకృషితో అందరింటి అష్టానపీఠాన్ని అధిరోహించి, అమ్మచే ‘నువ్వు ఈస్థానకవి’ అని గుర్తించబడిన, సమ్మానింపబడిన ధన్యజీవి. ఆశుకవిత్వంతో ఎందరో అందరింటి సోదరీ సోదరులను, కవులను, కళాకారులను ఘనంగా సత్కరించిన దిట్టకవి.
అమ్మ మహత్వానికి దర్పణం పట్టే అద్భుత అనుభవాలు పొందిన భాగ్యవంతుడు. ఒక ఉదాహరణ. ఒకసారి పి.యస్. ఆర్. అన్నయ్య రాత్రిపూట మఱిపూడి మీదుగా జిల్లెళ్ళమూడి వస్తూ కాలవ దాటవలసి వచ్చింది. అక్కడ గడ్డికప్పుకుని నిద్రిస్తున్న మనిషిని లేపి ‘రేవు చూపించు. నీకు కాఫీ డబ్బులు ఇస్తాను’ అని, రేవును దాటి అమ్మ దగ్గరకు చేరారు. అమ్మ “నాన్నా! నిన్ను కాల్వ దాటించినవాడికి ఎంత ఇచ్చావురా!” అని అడిగింది. అమ్మ సర్వజ్ఞత్వానికి సంభ్రమాశ్చర్యాలను పొందారు.
నిజజీవితంలో కన్నబిడ్డను, కట్టుకున్న భార్యను పోగొట్టుకొన్నప్పటికి అమ్మ ఎడల అచంచలభక్తి విశ్వాసాలతో అమ్మ సేవయే ఊపిరిగా జీవించిన భాగవతుడు, ధైర్యశాలి, ధీరుడు. బ్రహ్మాండం వంశానికి ‘తాతయ్య’గా గుర్తింపబడి పింకీ, స్వీటీ, చైతన్య, శరత్లచే అభిమానింపబడిన బంధువు. పలుమార్లు అనసూయావ్రత, హైమవతీవ్రతాచరణలు సమర్థవంతంగా నిర్వహించిన అర్చకుడు. ‘విశ్వజనని’ మాసపత్రిక మేటి సంపాదకులు, ‘Mother of All’ పత్రికలో ‘ధన్యజీవులు’ శీర్షికన అమ్మసేవల్లో తరించి అమ్మలో ఐక్యమైన మహితాత్ముల గాధలను, సేవలను విశదపరిచారు.
పి.యస్.ఆర్.అన్నయ్య లేని లోటు చుక్కాని లేని బోటు. అన్నయ్య చిరస్మరణీయుడు, ఆదర్శవంతుడు, ధన్యుడు.