మన అమ్మ అమ్మగా మనకు మాతృప్రేమ అనంతంగా అందించటమే కాదు, వేదాంతపు లోతులను కూడా అమ్మగానే దర్శింపచేసింది.
ఏదైనా విషయాన్ని వివరించాలంటే జ్ఞానుల పద్ధతి ఒకటి.
గురువుల పద్ధతి మరొకటి.
భక్తుల దృక్పథం ఇంకొకటి.
అదే అమ్మ బోధిస్తే ఆ తీరే వేరు.
దాంట్లో భయం ఉండదు, భరోసా తప్ప.
దాంట్లో దండన లేదు, లాలన తప్ప.
అందరూ కొందరికి ఉత్తమ గతులు,
మరికొందరికి అధోగతులు అంటే,
అమ్మతత్త్వం ఈ విచక్షణను అంగీకరించలేదు.
అందుకే ‘అందరికీ సుగతే’ అంది.
మరి అందరూ చేస్తున్న పాపపుణ్యాల సంగతి ఏమిటి? అంటే మనిషి కర్తృత్వం అమ్మ అంగీకరించ లేదు. దైవ ఆజ్ఞ లేనిదే మనిషి ఏమీ చేయలేడు కదా! మరి అలాంటప్పుడు ఆ మంచి చెడులకు దైవమే బాధ్యత వహించాలి అంటూ తన బిడ్డలను వెనకేసుకు వచ్చింది. బిడ్డల మంచి-చెడు బాధ్యతను తాను తీసుకున్నది.
ఇలా అన్ని సందర్భాల్లోనూ అమ్మ అమ్మగానే తరించారు. ఆలోచించింది.
ఒక సామాన్య గృహిణి ఎలా తన కుటుంబ సభ్యుల ఆకలి గురించే ఆలోచిస్తుందో అమ్మ కూడా జగన్మాతగా తన ఆలోచనలను బోధలనూ ఎప్పుడూ తన బిడ్డల ఆకలి చుట్టే తిప్పింది. దానిని సకల జీవరాసులకూ విస్తరింపచేసింది.
ఒకతను వచ్చి నాకు ఏదైనా ఉపదేశం చేయమ్మా అంటే “అదిగో అక్కడ బాపట్లలో అగ్నిప్రమాద బాధితుల కోసం పులిహోర పొట్లాలు కడుతున్నారు. నువ్వూ కట్టూ’ అంది.
ఒక సేవాసంస్థ వారు సందేశం ఇమ్మంటే “మీ సేవ కొనసాగించండి. అయితే అది వేరే ఎవరికో చేస్తున్నట్లు కాక మీ బిడ్డలకు చేస్తున్నట్లు భావించండి.”
“అమ్మా! “ఆ పిల్లి పిల్లల కోసం తెచ్చిన ఆహారం నీ గదిలోకి తీసుకుని వచ్చి గదంతా మలినం చేసేస్తోందమ్మా!” అంటే “దాంట్లో తప్పేముంది నాన్నా! మీరు మీకు రుచికరమనిపించిన పదార్థాలు మీ పిల్లలకు తినిపించాలనుకోరూ?” అని ఆ పిల్లిలో కూడా తన బిడ్డనే చూస్తుంది.
ఇంతవరకు లోకంలో ఎందరో మహానుభావులు, ఋషి పుంగవులు, యోగీశ్వరులు “అహం బ్రహ్మాస్మి” అని సంభావన చేయగలిగారు. “తత్త్వమసి “అని ఉపదేశం చేశారు. “అయమాత్మా బ్రహ్మా” అని ప్రబోధించారు. “సర్వం ఖల్విదం బ్రహ్మా” అని దర్శించారు. ఆ యోగులు, ఆ ఋషులు ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత లోపల, వెలుపల భాసించేది ఒక్కడేనని తెలుసుకున్న తరువాత, కొందరు అంతర్ముఖులై ఆనందామృతపాన చిత్తమత్తులై తరించారు.
మరికొందరు బహిర్ముఖులై తామెరిగిన సత్యాన్ని ప్రపంచానికి బోధించి ప్రవక్త లైనారు. ప్రకృతి పరిణామ శీలమైనది. అభివృద్ధి పథ గామి. అందుకే వారి వారి బోధనలను అదే పరిణామ క్రమంలో ప్రకటించారు.
బుద్ధుడు మానవ జీవిత క్లేశాలకు ‘కోరిక’ కారణమన్నాడు. ఆ కోరిక వదులుకుంటే మనిషి శాంతితో జీవిస్తాడని తనదైన జీవనశైలిని ఆవిష్క రించాడు. ఒక మతానికి ప్రవక్త అయినాడు. కాని అమ్మ ‘కోరికను విస్తృత పరుచుకో’ మన్నది.
“సర్వత్రానురాగమే విరాగ”మన్నది. ‘కోరిక పోవాలనుకోవటం కూడా ఒక కోరికే’ అన్నది. సంసారం, భర్త, భార్య, సంతానం, మమకారాలు అన్నీ లౌకిక బంధాలని, ఇవి దుఃఖానికి హేతువులని పూర్వులు నమ్మితే అమ్మ అనురాగానికి, మమకారానికి సరిహద్దులు పరిమితులు చెరిపేసి “సర్వత్రానురాగం”, “అపరిమిత మమకారం”, “మాధవత్వానికి మారు పేర్లు” అనేసరికి మనకున్న అపోహలు దూదిపింజ లైనాయి. సుడిగాలిలో
“మన బిడ్డ యందు ఏమి చూస్తున్నామో అందరి యందు దానిని చూడటమే బ్రహ్మ స్థితిని పొందడం” అని అమ్మ ప్రబోధం. లౌకికంగా కూడా అందరిలో మన బిడ్డను చూడగలిగితే ఈనాటి ఎన్నో సమస్యలకు అది పరిష్కారం..మన బిడ్డ కలెక్టర్ అయితే ఒకసారే సంతోషం. కలెక్టర్ అయ్యేవాళ్ళందరిని మన బిడ్డలుగా భావించగలిగితే రోజూ సంతోషమే. ఇక ఈర్ష్యాసూయ లకు తావెక్కడ? అసూయను పారద్రోలటానికేగా ఈ “అనసూయమ్మ” రాక. అలాగే ఎవరికి కష్టం వచ్చినా “తనబిడ్డకే కష్టం వచ్చినట్లుగా భావించగలిగితే వారి ఎడల మనప్రవర్తన ఎంత దయగా ఉంటుంది. ఒకసారి ఒక స్వచ్ఛంద సేవాసంస్థకు చెందిన వారికి అమ్మ ఇచ్చిన సందేశం గమనించండి.
“తమ బ్రతుకు తాము బ్రతుక లేని బలహీనులకు ఆసరా ఇవ్వండి. వారికి తోడ్పడండి. అయితే అది వారిపై జాలితో కాక, వారిని “మీ బిడ్డలు” గా భావించి చేయండి.” ఇలా మనం చేయగలిగితే, ఇక ప్రపంచంలో దుఃఖానికి స్థానమెక్కడ? దుఃఖానికి స్థానం లేకుండా అంతా సంతోషమే. అయితే, అదేగా సంప్రదాయ వేత్తలు చెప్పే స్వర్గం, సంస్కర్తలు కోరే “నవ సమాజం”. అందుకే అమ్మ వేదాంత వనంలో ప్రభవించిన మహా మానవతా పుష్పం. మానవతా మహావనంలో విరబూసిన దివ్య పారిజాతం. ఆధ్యాత్మిక జీవితానికి మానవతా పరిమళాలు అద్దిన ఆదిశక్తి అమ్మ.
మానవతావాదానికి ఆధ్యాత్మిక సౌందర్యం చేకూర్చిన వినూత్న ప్రబోధం అమ్మది. “మీకు ఉన్నది తృప్తి గా తిని, ఇతరులకి ఆదరంగా పెట్టండి” అన్న వాక్యం అమ్మ మానవతా పరిమళాలు వెదజల్లుతుంటే “మీకు ఉన్నది తృప్తిగా తిని ఇతరులకి ఆదరంగా పెట్టండి. అంతా వాడే చేస్తున్నాడని భావించండి.” అన్న అమ్మ బోధ మానవతా పుష్పానికి ఆధ్యాత్మిక సౌరభాలు అబ్బింది.
అందరికీ అన్నాలు పెట్టే అన్నపూర్ణాలయంలో అమ్మ మహామానవతా వాదం ప్రతిబింబిస్తుంటే, ఇది అన్నదానం కాదు ఎవరి అన్నం వారు తింటున్నారన్న అమ్మ మాట సమస్త జీవరాశి పోషణకు బాధ్యత వహించిన నారాయణ అవతారం అమ్మే అని తెలియ చేస్తున్నది. సాటి మానవునికి సేవచేయండి అన్న ప్రబోధం అమ్మ విశాల హృదయం తెలియచేస్తే, సాటి మానవునికి సేవచేయండి అది మీ సోదరుడికో, మీబిడ్డకో చేస్తున్నట్లుగా భావించండి అన్న అమ్మ మాట అమ్మ జగన్మాతృత్వానికి ప్రత్యక్ష దర్పణం.
‘ఈ ఊరు నాది
ఈ రాష్ట్రం నాది
ఈ దేశం నాది
అన్నవాళ్ళు ఉన్నారుకానీ ఈ సృష్టి నాది అన్నది ఒక అమ్మ మాత్రమే’ అంటాడు రామకృష్ణ అన్నయ్య. నన్ను అందరూ ప్రేమిస్తారు. అందరిళ్ళల్లో నన్ను సభ్యుడిగా చూస్తారు అన్నవాళ్ళను చూశాం.
కానీ తన ఇంటిని అందరిల్లుగా మార్చిన వారిని చూడగలమా? మన అమ్మను తప్ప. ఆకలేసి అడిగితే అన్నం పెట్టే కొందరిని చూశాం. అడగకుండానే స్వతంత్రంగా అన్నాలు తినే చోటు జిల్లెళ్ళమూడిలోని అన్నపూర్ణాలయం తప్ప మరొకటి భూప్రపంచం లో ఉందా?
‘నీకు కారు కొనిస్తానమ్మా!’ అని ఒక సోదరుడు అంటే,“నాన్నా! పిల్లలు అన్నం తినటానికి కష్టంగా ఉన్నది. రేకుల షెడ్ వేయించమని చెప్పే అను రాగమయి ఈ అమ్మ కాక మరెవ్వరు? మార్వా అనే విదేశవనిత తన దేశానికి వెళ్ళిపోతూ, కొన్నాళ్లకు తాను తగు మొత్తం సంపాయించగలనని, అమ్మ అనుజ్ఞ అయితే ఆ దేశంలో అమ్మ పై ఒక పుస్తకం ప్రచురిస్తానని, లేకపోతే తానే అమ్మను చూడటానికి జిల్లెళ్ళమూడి వస్తానంటే “నన్ను చూడక పోతే తాను దిగులు
తాను కడుపులో చిచ్చు పెట్టుకుని జగమందరికీ తల్లిప్రేమ ఎవరు అందించగలరు? మన అమ్మ అనసూయమ్మ తప్ప. తన బిడ్డను బలి ఇచ్చి కలియుగ పడుతుంది. తననే ఇక్కడకు రమ్మనండి . “అన్నది అమ్మ. కల్పతరువు హైమాలయంకు శంకువుగా ఎవరు సమర్పించ గలరు? ఒక్క మన అమ్మ తప్ప.
తన పేరు ప్రఖ్యాతుల కంటే బిడ్డ మనసుకు ప్రాధాన్యం ఇచ్చే ఇలాంటి ప్రేమమయి ఇంకెవరున్నారు? ఈ జగాన మన తల్లి తప్ప.
1977లో తుఫాన్ వచ్చినప్పుడు, తుఫాన్ అనంతరం నీరు అలభ్యమైనపుడు రామకృష్ణ అన్నయ్య ప్రభృతులు “అమ్మా! చాలామంది సోదరులు నిన్ను వాళ్ళ ఊర్లకు ఆహ్వానించి ఉన్నారు. ఈ సమయంలో మనం ఎక్కడకో అక్కడకి వెళితే తిరిగి నీళ్ళు లభ్యం అయినపుడు రావచ్చు.”అన్నారు.
“అట్లా నేను రాలేనురా. నా ఉనికే వీరికి కొండంత అండ” అన్న అమ్మ ఆప్యాయతను పోల్చేందుకు పూర్వ ఘట్టాలు ఏమన్నా ఉన్నాయా ఈ విశాల విశ్వంలో.
తాను పసిప్రాయంలోనే అమ్మ ప్రేమకోల్పోయి అఖిలాండ బ్రహ్మాండకోటికి అమ్మ ప్రేమను చవిచూపటం ఏ తల్లికి సాధ్యం?
తాను అన్నం తినకుండా ఈ సకల జీవుల అన్నార్తిని తీర్చాలని కంకణబద్ధురాలైన విశ్వజనని అమ్మకు అమ్మే సాటి.
తన ఇంటిని ప్రయోగశాలగా మార్చి విశ్వమానవాలయం నిర్మించిన జగజ్జనని ఎవరు? మన అమ్మ తప్ప. ఆ అమ్మ ఈ పుడమి పై కాలుపెట్టి నూరవ సంవత్సరం లోకి అడుగిడిన తరుణంలో శతజయంత్యుత్సవాలకు ఆనందోత్సవాలలో అమ్మ బిడ్డలు పరుగెడుతున్నారు. అమ్మకు శతసహస్ర వందనాలు సమర్పిస్తున్నారు.