1. Home
  2. Articles
  3. Viswajanani
  4. పరంజ్యోతి

పరంజ్యోతి

S. Rama Devi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : January
Issue Number : 6
Year : 2014

గృహలక్ష్మియైన అమ్మ అందరికీ తల్లినంటూ ప్రకటించింది. మాటలు చెప్పినంత తేలిక కాదు ఆచరించడం. ఆనాడు చూచింది ఒక స్త్రీ మూర్తినే. ఆ రూపం ఒక శక్తి స్వరూపిణి అని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. ఈనాటి సంఘంలో మాతృమూర్తులను తమ యొక్క సౌఖ్యాల కొరకు స్వార్థంతో కూడిన వారై చెట్టుకు పుట్టకు వదిలివేస్తున్నారు. ఈ హృదయ విదారక నేపధ్యంలోనే, ఆ మాతృమూర్తి అందరికి సొమ్ముగా ఈ భువిపై కాలు మోపింది. జన్మనిచ్చిన తల్లికి రిక్తహస్తాలు చూపిస్తున్నారు. ఈనాటి బిడ్డల యొక్క దౌర్భాగ్యపు పరిస్థితిని – కఠిన హృదయులను – మానసిక దౌర్బల్యంతో కూడిన వారని దండించక తానే అందరికి తల్లిగా అయిపోయి అటువంటి మూర్ఖులకు కూడా తన ఒడిలో ప్రవేశం కల్గించడం అనేది అత్యంత ఆశ్చర్యం కల్గించే గొప్ప సంగతి. కరుడు గట్టిన మానవతా విలువలకు కళ్ళు తెరిపించింది.

పాలు, నీళ్ళు, తినే పదార్థాలు, వాతావరణం – అంతా కల్తీనే అంటూ బల్ల గుద్ది ఉపన్యాసాలిస్తూ అసలు సిసలైన కల్తీలం, మనమే నని తెల్సినా తెలీనట్లుగా దొంగ ముసుగేసుకొని కోతికి కొబ్బరికాయ దొరికిన చందాన స్వేచ్ఛావాయువును, విచ్చలివిడితనంతో, కలుషితం చేసి చేయిస్తూ, అందరింటి సొగసును, పరువాలను, మురిపాలను, స్వచ్ఛతను, నాణ్యతను, వైభవాన్ని ఉంచ వలసినంత ఘనంగా ఉంచలేక ‘56′ అక్షర సువర్ణమాలను మెలికలు తిప్పుతున్నాం. ఆహో, ఓహో అనసూయమ్మ వైభవమే కడువైభవమే. అన్నపూర్ణాలయంలో రామక్రిష్ణ – శ్యామల అని భార్యభర్తలు ఉండేవారు. అతను నాక్కూడా డబ్బు ఉంటే అమ్మ సంస్థకు ఇచ్చేవాడిని అనేవాడు. ఈ నేల యొక్క మాహాత్మ్యం అలాంటిది. పుణ్యభూమిలో పుణ్యక్షేత్రం. కనుకనే అలాంటి ఉన్నతమైన భావాలు కలుగుతుంటాయి అనడంలో ఎటువంటి సందేహము లేదు. పైగా మనకు ఈలాంటి ‘యింటిపేరు’ (అందరిల్లు) మరెక్కడ కన్నడదు.

వినాయకో విఘ్నరాజా – ముందెత్తుగానే మీరు పార్వతీ పరమేశ్వరులైన తల్లిదండ్రులను సేవించుట మూలముననే కదా మీకు పుణ్యము దక్కి ప్రధమ పూజలను గైకొనుచున్నారు. మేము కూడా ఈ భూలోక వాసులం అదే స్థితిలో ఆనందంతో తేలియాడుచున్నాము. ఔనా కాదా గజాననా ? ఆ తల్లిని సేవిస్తూ నాకంటే గొప్పవారుగా భూలోకంలో నా వారసులుగా అయినారు, మీ కన్నా నేనేమియు గొప్పకానే కాదు అని అనండి. ఒక్కసారి అన్నా అంటారుగా మరి అనండి. ఇప్పుడు నా మనస్సుకు తృప్తి అయినది. ఇదే కదా మోక్షం. మాతృదేవోభవ! అని అన్నది వేదం. వేదశాస్త్రాలే మనకు ప్రమాణ గ్రంథాలు.

అందువల్లనే తల్లిగా ఏతెంచి మనకు ఏమీ తెలియనంత విధానంలో అదృశ్యంగా వుండి అసంకల్పిత ప్రతీకారచర్యవలె, మన చేతనే పూజలను చేయించుకొని – తాను స్వీకరించి – పుణ్యఫలాన్ని మనకు దక్కేట్లుగా చేసి ప్రధమస్థానంలో నిలబెట్టిన ఈ అసమానమూర్తికి పదే పదే శతకోటి సహస్ర నమస్కారాలు తెలియజేయడం భావ్యం. అదొకవరం.

ఆ గ్రామం పేరు తలచుకొంటేనే చాలు మనస్సు పురివిప్పి నాట్యం ఆడుతుంది. అందరిల్లు అనగానే ఉప్పొంగుతుంది. ఆ గాలి, నీరు, నేల, తలంపుకు రాగానే గర్వంతో శరీరం వూగులాడుతుంది. ఆ చూపుడు వేలు గుర్తు కొస్తేనే చాలు ‘నేను’ అనేది నశించి – నేను నేనైన నేను అని అంటుంది. స్వచ్ఛతకు, స్నేహానికి, ఆహ్లాదానికి, పలకరింపులకు అన్నింటికి మారుపేరే – ఈ అందరిల్లు, ఒకసారి పాదం మోపామా ఇక వదలనే వదలం. ఇక్కడ అందరికి ఏదో తెలియని స్వేచ్ఛ అందులో కూడా నదురు బెదురు లేని స్వేచ్ఛ.

సిగ్గు-బిడియం, నాది-నీది దాచుకోవడం – దోచుకోవడం – అనుపదాలకు అర్థమే తెలీదు. అంతా అమ్మే అనే ధృడ సంకల్పంతో జీవన యానం సాగిస్తున్న ధన్యజీవులు. అంతా తెలిసిన, నిండిన, పరంజ్యోతికి – ఇవే నా ప్రణామాలు – సోదరీసోదరులకు క్రిస్మస్ సంక్రాంతి శుభాకాంక్షలు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!