మీరు తఱచు అమ్మ దగ్గరకు వెళ్ళుతుంటారు గదా! ఆమె మన బాధలను పోగొట్టుతుందా ? మన రోగాలను నయం చేస్తుందా ? లేక మన కోరికలను తీరుస్తుందా? అనలు ఆమె ప్రత్యేకత ఏమిటి? – ఇటువంటి ప్రశ్నలను చాలామంది నన్ను అడుగుతుంటారు. వీటికి సమాధానం ఎలా చెప్పాలో తోచక సాధారణంగా నేను నవ్వేస్తుంటాను.
ఆ పనులను ఆమె చేస్తుంటే చేస్తుందనీ, లేకపోతే లేదని చెప్పవచ్చు గదా ! ఆ ప్రశ్నలేమంత కఠినమైనవి కావే?” అని మీరనవచ్చు, కానీ ఆ ప్రశ్నలు అంత తేలిక సమాధానాలతో కొట్టి వేయదగినవి కావని నా నమ్మకం. ఎందుచేతనంటే అవి తఱచు నన్ను గూడా కలవర పరుస్తుంటాయి గాబట్టి. అందువల్ల వానికి సరియైన సమాధానం రాబట్టుకోవాలని యెప్పుడూ అనుకుంటాను. ఈ నా ఆలోచనల ఫలితమే యీ వ్యాసం.
అందు సమస్తమైన ఆధ్యాత్మిక సాధనల పరము ప్రయోజన మేమిటి ? సుఖదుఃఖాలయందు సమదృష్టి గలిగియుండటం, అనగా ద్వంద్వాలకు అతీతంగా ఉండగల్గటం, భిన్నదృష్టి లేకపోవటం, అన్నింటిలో ఏకత్వాన్ని చూడగల్గటం కాదు. అన్నీ ఒకటిగానే కనపడటం. దీనినే మరొక రీతిలో ఆత్మ సాక్షాత్కారం అనవచ్చు. సర్వమానవ కోటికి ఇదే అసలైన గమ్యం. ఈ లక్ష్యాన్ని ‘అమ్మ’ మాటలతో గాక చేతలతో విస్పష్టంగా చెబుతుంది . ప్రతిక్షణం అమ్మ జీవితం ఈ ద్వంద్వాతీత ప్రవృత్తినే చాటుతుంది. తాను నిరంతరం ద్వంద్వంలో ఉంటూ దాని ప్రభావానికి కొంచెం గూడ లోనుగాకుండా తామరాకు మీది నీటి బొట్టు చందంగా విలక్షణంగా ఉంటుంది. సాధ్య, సాధన. సాధకత్రయం ఆమెకు లేవు. ఆ మూడూ తానే అయింది. అందుచేత ఒకప్పుడు సాధారణ స్థితిలో నుండి సాధన వలన ఆమె ఈ స్థితి పొందలేదు. ఈ ద్వంద్వాతీత ప్రవృత్తిగానే ఆమె ఆవిర్భవించిందనవచ్చు. భౌతిక దృష్టి ప్రధానమైన యీ కాలంలో ఈ మహత్తర సందేశాన్ని క్రియాత్మకంగా చాటటానికే తాను అవతరించిందేమో అనిపిస్తుంది.
ఇటువంటి నిర్వికారమూర్తిని మన మేమి అడగాలి? ఆమె మనకు ఇచ్చేదేమిటి? మానవ జీవితానికి లక్ష్యం అశాశ్వతమైన విషయసుఖమే అనుకునే వారికి ఈ చర్చవల్ల ప్రయోజనమేమీ ఉండదు. కాని ద్వంద్వాతీత స్థితి లేక ఆత్మసాక్షాత్కారం మాత్రమే మానవుడు సాధించదగిన ఏకైక లక్ష్యం అనుకునే వారికి కొంత ప్రయోజనం కలుగవచ్చు.
“ఏది వచ్చినా – సుఖంగానీ దుఃఖంగానీ భగవత్ప్రసాదమే” అంటుందమ్మ. “అనుకున్నది జరుగదు
– తనకున్నది తప్పదు” – అని గూడా ఆమె అంటుంది. అనగా మనం కోరుకున్నది లభిస్తుందని గానీ వద్ద సుకున్నది పోతుందని గానీ నమ్మకం లేదు గాబట్టి దేనినీ వద్దనవద్దు. కావలెననవద్దు. ఎప్పటి కేది ప్రాప్తమౌతుందో దానిని సమబుద్ధితో అనుభవించటమే మన కర్తవ్యమని దాని అర్థం. ఈ స్థితినే స్థితప్రజ్ఞత్వంగా కృష్ణభగవానుడు భగవద్గీతలో పేర్కొన్నాడు.
“య స్సర్వత్రానభిస్నేహ స్తత్తత్రాప్య శుభాశుభం,
నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ॥
అనగా ఎవడు అంతటా స్నేహాన్ని చూపకుండ తనకు గల్గిన శుభాశుభాల యెడల సంతోష ద్వేషాలను పొందడో వాడే స్థితప్రజ్ఞుడు అని ఆ శ్లోకార్థం. ఈ స్థితిని పొందిన వానికి ఇక పొందవలసినదంటూ లేదు. ఈ మహాసందేశాన్ని అమ్మ ఆచరణాత్మకంగా మనకు బోధిస్తుంది. నిజంగా ఇంతకంటే మానవులకు కావలసింది, బోధించవలసిందీ, మరేముంటుంది ? తేజ స్తిమిరాలకు సామానాధికరణ్యం అనుభవ విరుద్ధమైనదని శాస్త్రజ్ఞులు చెబుతారు. కానీ ‘అమ్మ’ మాత్రం చీకటిని గుర్తించేది వెల్తురనీ, వెలుగుకు చీకటి ఆధారమనీ అంటుంది. అతి సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే ఈ మాట పరమసత్యంగా ఎవరికైనా తోచక తప్పదు. అసలీ తేజస్తిమిరాలు ఒక వస్తువు యొక్క రెండు భాగాలు. అనగా వీని యునికి ఆధార మొక్కటే అన్నమాట! మరి పై శాస్త్రజ్ఞుల మాట యేమయినట్లు ? అందుకే “అనుభవం శాస్త్రాన్నిస్తుందిగాని, శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు” అని అమ్మ అంటుంది. అంటే శాస్త్రం అబద్ధమని అమ్మ తాత్పర్యం గాదు. ద్రష్టలైన మహర్షులే శాస్త్రాలను వ్రాశారు. వారు వారి అనుభవాన్ని శాస్త్ర రూపంలో చెప్పారు. వాక్యాలను గ్రుడ్డిగా పొగడినందు వలన లాభం లేదు. దానిని నీ అనుభవంలోనికి తెచ్చుకోవాలి అని ఆ సూక్తి తాత్పర్యం.
మనం ‘యోగసాధన’ అన్న పదాన్ని వాడు యోగ ఉచ్యతే” – అని చెప్పబడింది. లాభాలాభాలలో, జయాపజయాలలో, రాగద్వేషాలలో, సుఖదుఃఖాలలో సమానస్థితి, యోగ మనగా ఇదే. భక్తి యోగమైనా, కర్మ యోగమైనా, రాజయోగమైనా, మఱి యే యోగమైనా దాని పరమార్థమిదే. ఈ మహా యోగాన్ని అమ్మ ఆచరణ రూపంలో అలవోకగా హాస్యోక్తులతో రంగరించి మధుర మధురంగా బోధించి సుసాధ్యం చేస్తుంది. మహా మంత్రోపాసన, జ్ఞానమార్గం, కర్మ మార్గం – ఒకటేమిటి? అన్నింటియొక్క యేకైక లక్ష్యమైన ఈ స్థితి అమ్మ సన్నిధిలో సుగమమై యుండగా మనం ఆమెను కోర పనేలేదు. ఎప్పటి కేది ప్రాప్తమో దానిని అనుభవించటమే మన కర్తవ్యమనే భావం కల్గిన తర్వాత మనం పొందవలసినది ఏముంటుంది? ఈ స్థితి కోరితే ఇచ్చేదీగాదు, వచ్చేదీగాదు; అసలు దేనిని కోరినా మనం ద్వంద్వాతీతులం గామన్న మాటే. అమ్మ దర్శనంచేత మనకేది కావాలో మనకు తెలియకుండానే లభిస్తుంది. అయితే యిక్కడొక చిన్న సందేహం. అమ్మ దర్శనం చేయకపోయినా మనకు పాపమున్నదేదో లభిస్తుంది గదా: అనవచ్చు నిజమే! కాని మన మెక్కడుండి చేసే సాధనలకైనా సాధ్యం ఆమెయే. గాబట్టి మన సాధన లక్ష్యాన్ని ఇక్కడ సాకారంగా చూడగల్గటమే విశేషమని ఒప్పుకోక తప్పదు.
ఇక ఆమెలోని విశేషమేమిటి ? అనే అంశాన్ని గూర్చి కొంచెం విచారిద్దాం. అమ్మ దేవ్యవతారమని విజ్ఞుల ప్రగాఢ విశ్వాసం. విశ్వాస మన్న తర్వాత దానిని ఋజువు పరచబూనుకోవటం అనవసరం. దానికి ఋజువులతో నిమిత్తం లేదు. ఎందుకంటే…
“Faith transcends intellect and reason” అన్నారు పెద్దలు . కాని ఈ విశ్వాసం మూఢవిశ్వాసం కాదనీ, సహేతుకమైనదనీ చెప్పటమే నా ఉద్దేశ్యం. విశ్వసృష్టి, స్థితి, లయ హేతుభూతయై, ఆది మధ్యాంత రహితయైన ఆ జగన్మాత యొక్క ముఖ్యలక్షణాలుగా, తుంటాం. యోగమంటే యేమిటి? వెనుక చెప్పిన సర్వశక్తి మత్త్వం సర్వజ్ఞత్వం సర్వాంతర్యామిత్వం – అను ద్వంద్వాతీత స్థితియే యోగం. గీతలో గూడ “సమత్వం వానిని పేర్కొనవచ్చు. అయితే ఇటువంటి శక్తి అజమూ, అవ్యయముగదా, ఇది మానవరూపం ధరించటం ఎలా? సంభవం ? అని అడగవచ్చు. ఈ సంశయాన్ని పర మేశ్వరావతారమగు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా నివారించాడు.
“అజోపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరో2పి సన్।
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవా మ్యాత్మమాయయా||”
అనగా నేను జన్మరహితుడను, నాశరహితుడను, అఖిలభూతేశ్వరుడను -అయినప్పటికీ జగన్మోహనమూ, సర్వవ్యాపకమూ అయిన మాయచేత నిజ ప్రకృతిని అవలంబించి పుట్టుచున్నాను” అని దాని యర్థం. కాబట్టి అజుడూ, అవ్యయుడూ అయిన భగవానుడు మానవ రూపంలో అవతరించటం అసంభవం కానే కాదు. అసలు సర్వశక్తిమంతుడని అంగీకరించిన తర్వాత పై సంశయానికి తావే లేదు. అయితే పై ఉపపత్తి దేవుడు మానవుడుగా అవతరించటంలో సరిపోవచ్చు; గాని దేవి మానుషరూపంలో అవతరించటాని కెట్లా సమన్వయింపబడుతుంది ? – అని అడగవచ్చు. ‘దేవుడు దేవి’- ఈ రెండు ‘బాహ్యాకారంలో భేదమేగాని వస్తుతత్త్వంలో భేదమేమీ లేదు. దేవత్వమన్నా, దేవీత్వమన్నా స్వయంప్రకాశకత్వమనే అర్థం. స్వయం ప్రకాశమాన జ్యోతి స్వరూపమైన శక్తి పురుషరూపంగానూ భాసించవచ్చు స్త్రీ రూపంగానూ భాసించవచ్చు. స్త్రీత్వ పురుషత్వాలు ఒకే శక్తి యొక్క ద్వివిధ రూపాలని చెప్పవచ్చు. జగత్పిత యైన పరమేశ్వరుడు జ్ఞానరూపుడు. జగన్మాతయైన పరమేశ్వరి ప్రేమరూపిణి. జ్ఞానానికీ ప్రేమకూ తత్త్వంలో తేడా లేదు. జ్ఞానం లేనిదే ప్రేమ కలుగదు. ప్రేమ లేనిది జ్ఞానంగాదు. జ్ఞాన ప్రేమలకు ప్రతీయమానమైన భేదం ప్రాతిభాసికం మాత్రమే. పార్వతీ పరమేశ్వర (శక్తి శక్త) సంబంధం వాగర్థ సంబంధం వంటిదని మహాకవి కాళిదాసు రఘువంశ మహా కావ్యాదిలో “వాగర్థా వివ సంపృక్తా వాగర్థ ప్రతిపత్తయే॥ జగతః పితరౌవందే పార్వతీ పరమేశ్వరౌ” అను శ్లోకంలో పరమ రమణీయంగా వర్ణించాడు. భగవంతుడు తండ్రీ, తల్లి అవుతాడనేది నిర్వివాదం. పురుష రూపంలో తండ్రియై జీవలోకానికి ధర్మోపదేష్టయై ప్రపంచాన్ని శాసిస్తాడు. స్త్రీ రూపంలో తల్లియై వాత్సల్యమూర్తియై ప్రేమతో లాలిస్తాడు. కాబట్టి “అజోరి ..” ఇత్యాది గీతా శ్లోకం భగవంతుడు మానుషరూపంలో అవతరించ టానికీ, మానుషి రూపంలో అవతరించటానికి గూడ ప్రమాణం అవుతుంది.
అయితే ఈ జిల్లెళ్ళమూడిలో ఉన్న అమ్మ ఆ పరదేవతయే, ఆ జగన్మాతయే అని ఎలా చెప్పగలవు ? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. నిజమే! ఈ ప్రశ్నకు సులభంగా సమాధానం చెప్పలేము. కాని అసలు పుట్టవలసిన ప్రశ్న, సమాధానం సరిగా చెప్పవలసిన ప్రశ్న ఇదే !
భగవంతుని ముఖ్య లక్షణాలైన సర్వజ్ఞత్వ, సర్వశక్తిమత్వ, సర్వాంతర్యామిత్వాలు ఈమెలో ఉన్నాయి. ఈ లక్షణాలు ఈమెలో ఉన్నాయని చెప్పటానికి సామాన్య వ్యక్తిత్వం చాలదు. అతీంద్రియ జ్ఞానం కావాలి. అది గలవారు ద్రష్టలైన ఋషులు మాత్రమే. కాబట్టి అస్మదాదులకు ఈయమ్మ తత్త్వం అజేయంగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె సన్నిధిలో ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఆమె చెప్పే మాటల్లో నిగూఢ వేద శాస్త్ర ప్రమాణాలు వినిపిస్తాయి. ఆమె ఒక నిర్వచనం ఇచ్చిందంటే అది వేదమే అవుతుంది. ఇవిగాక ఆగతానాగత విషయాల నెన్నింటినో తమాషాగా ముచ్చటిస్తుంది. కాని మనం వినేటప్పుడు ఆ మాటలు ఆమె సర్వజ్ఞతకు నిదర్శనాలని తట్టక పోవచ్చు. తర్వాత తీరికగా చర్చించుకునేటప్పుడు వానిలోని గాంభీర్యానికి, వైదికత్వ సిద్ధికి విస్తుపోతాము! పంచభూతాలపై ఆమెకు పరిపూర్ణాధికారమున్నది. సముద్రుడూ, వాయువూ, అగ్నీ మొదలైన వారు ఆయా సందర్భాలలో అమ్మకు తలవంచారు ! పంచభూతాలు అమ్మ యాజ్ఞను – శిరసావహించటం చూచిన ధన్యులు చాలమంది ఉన్నారు. అమ్మ చోదనా రూపిణియై సర్వజీవులయందున్నది. ఆస్తిక్యబుద్ధి గలవారికే ఈ విషయం స్పష్టమవుతుంది. నాస్తికులలో అమ్మ లేదా ? అనవచ్చు. వారిలో గూడ ఉన్నది, కాని ఉన్నదని వారు గుర్తించ లేరు. ధూళిచ్ఛన్న మైన అద్దంలో ప్రతిబింబం కనబడుతుందా? నాస్తికుల విషయంలో కూడా అంతే! ఒక్కొక్కసారి మనకు ఇష్టమున్నా లేకపోయినా బలవంతాన ఏదో కార్యం నెపంతో ఆమె సన్నిధికి ఆకర్షింపబడతాము. అప్పుడామె ఎన్నో కథలు చెబుతూ మనలోని కుళ్ళును తెలియనట్లుగా బయట పెడుతుంది. మనం గూడ “ఆమె మన సంగతి మాట్లాడటం లేదులే” అని మేకపోతు గాంభీర్యాన్ని అభినయించినా మనస్సులో నైనా ఆమె మాటల యథార్థ్యానికి చకితులమౌతాము. అమ్మ అనేక పర్యాయాలు భయంకర మృత్యువేదనను అవలీలగా, త్రోసిరాజంటుంది! స్థూలదృష్టికైనా యివన్నీ ఆమె సర్వజ్ఞురాలనీ, సర్వశక్తిమతియనీ, సర్వాంతర్యామిని అని స్ఫురింపచేస్తాయని నా నమ్మకం. అయితే “నీ మనస్సులో ఈ కోర్కె ఉన్నది; నీ బాధను నేను తీర్చగలను” వంటి వాక్యాలను అమ్మ ఎప్పుడూ చెప్పదు. ఒక వేళ అలా ఆమె చెప్పినా మన బాధలను తీర్చినా అవి ఆమె పరదేవతాత్వానికి ఆధారములవుతాయని నమ్మలేము. ఎందుచేతనంటే అష్టసిద్ధులలో ఏ కొన్నింటిని సాధించిన వారైనా ఇటువంటి పనులను చేయగలరు. ఈపాటి శక్తులున్నంత మాత్రంచేత దైవత్వాన్ని అంగీకరించటం సహేతుకం గాదు. “నాకేం తెలియదు.” – అనే ఆమె మాటలో “సర్వానికి కారణం నేను. నేను అలంఘ్యమైన విధిని” – అన్న భావం స్ఫురిస్తుంది !
మనలోని మంచినీ, చెడునూ చూస్తూ తనకు గలిగే కష్టాన్నీ, సుఖాన్నీ సాక్షీభూతురాలై అనుభవిస్తూ ఆమె నిర్లిప్తంగా ఉంటుంది. స్థితప్రజ్ఞుడైన మహాయోగి యొక్క స్థితిగూడ ఇదేగదా ! ఈమె ఆ యోగిని యెందుకు కాకూడదు ? అనే ప్రశ్నగూడ రావచ్చు. కాని ఈమె చేసే యోగసాధన లేమీ లేవు. ఈ స్థితి ఆమెకు ఆజన్మసిద్ధమైనది. ఈమె యొక్క సాక్షాత్పరమేశ్వరీ స్వరూపాన్ని సందర్శించిన ధన్యాత్ములున్నారు. కాని ఈ ధన్యాత్ముల మాటలు గూడ మనకు విశ్వసనీయాలు గాక పోవచ్చు. మనకు ఆస్తిక్యబుద్ధి కలగటానికి గూడ ఆ పరమేశ్వరీదయ కావాలిగా. తాను స్వేచ్ఛతో తీసుకున్న పథకం ప్రకారం మన అందరినీ విభిన్న కాలాలలో ఆ అమ్మ తనలో చేర్చుకుంటుంది. ఈ సంధి కాలంలో పిల్లలమైన మనం తెలిసీ తెలియక చేసే చేష్టలను చూచి అమ్మ వినోదిస్తుంది, అంతే !
ఇంకొక విషయం : అవతారమూర్తియై కృష్ణుడు. గీతలో
“యదా యదా హి ధర్మస్య గ్లాని ర్భవతి భారత!
అభ్యుత్థాన మధర్మస్య తదా? 9 త్మానం సృజామ్యహమ్”
పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే”
అను శ్లోకద్వయంలో ధర్మానికి గ్లాని కల్గి అధర్మం పొడ చూపినపుడు తనను తాను సృజించుకొంటాననీ, సాధు సంరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంస్థాపన తన కర్తవ్యాలనీ తెలుపుతారు. మరి అమ్మ భగవంతుడే అయితే ఈ కర్తవ్యాలను నిర్వహిస్తున్నదా? ఆచరణలో నిర్వహిస్తున్నట్లు కనపడదే ? భగవదవతార కర్తవ్యాలను నిర్వహించనపుడు ఆమె భగవంతుడెట్లా అవుతుంది ? అనే మరొక ప్రశ్న ఈ సందర్భంలో తలయెత్తుతుంది ? నిజమే
అనలు ధర్మమంటే యేమిటో ముందు తెలుసుకోవలసి వుంది . “ధ్రియతే – విశ్వం అనేనేతి ధర్మః” అనునది ధర్మశబ్ద వ్యుత్పత్తి. “ధర్మో విశ్వస్య జగతః ప్రతిష్ఠా” అనునది అభియుక్తోక్తి. సమస్తమయిన విశ్వము యొక్క స్థితికి హేతు భూతమయినదే ధర్మమని పై వాక్యముల యొక్క సారాంశము. ఈ ధర్మస్థితి దేశ కాలాలకు అవిరుద్ధమయినది. ఇది దేశ కాలానుగుణంగా మారుతుందన్న మాట. ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం.
ఒక తల్లికి ఇద్దరు కొడుకులుంటారు. ఒకడు ఆరోగ్యవంతుడు, చక్కని జీర్ణశక్తిగలవాడు. మరియొకడు దీర్ఘ రోగి, బలహీనుడు. మొదటి వానికి షడ్రసోపేతమైన భోజనం పెడుతుంది. రెండవ వానికి స్వల్పమైన వథ్యాహారమిస్తుంది. అంటే కారపు మెతుకులే పెడుతుంది. అంతమాత్రం చేత ఆమెకు పక్షపాతం ఉందంటామా? శిశు సంరక్షణమే మాతృధర్మం. తల్లి బిడ్డలకు వారి వారి ఆరోగ్యస్థితులను బట్టి ఆహార మిస్తుంది. ఇరువురి యందు ఆమె ప్రేమ అన్యూనాధికం.
ధర్మం తల్లి ఇచ్చే ఆహారం వంటిది. ఆహారం బిడ్డ యొక్క ఆరోగ్యాన్ని చక్కబరుస్తూ ఆయుర్దాయాన్ని పెంచేదిగా ఉండాలిగాని బిడ్డను మృత్యువు పాలు చేసేదిగా ఉండరాదు. మరి ధర్మం గూడ ఇలాగే ఉండాలి. అందుకే ధర్మం విశ్వస్థితి హేతువని పెద్దలు నిర్వచించారు. ఈ ధర్మం దేశయుగాను గుణంగా మారేదీ, బహు విధమైనది అని అనుకొన్నాం. ఆనాడు రామకృష్ణాద్య అవతారమూర్తులు దుష్ట సంహారం శిష్టరక్షణ చేసి వర్ణాశ్రమ ధర్మాలను కాపాడారు. అపుడు దుష్టులను వధించటం ద్వారా శిష్టరక్షణ జరిగింది. ఆనాడు వధయే శిక్షణ మయింది. నేడు ఈయమ్మ పరివర్తనరూపంలో శిక్షణను సాధిస్తున్నది. ఇక శిష్టరక్షణం నాడూ నేడూ సమానమే. నాటి యవతారమూర్తులు పితృస్వరూపులు. నేటి యీ యవతారమూర్తి మాతృస్వరూపిణి. శాసనం పితృధర్మం; లాలనం మాతృధర్మం.
అందుచేత నాటి దుష్టశిక్షణ, శిష్టరక్షణ నేడు గూడ ఈయమ్మ నిస్సందేహంగా జరుపుతున్నది. ఆచరణ విధానంలో భేదమేగాని, ఉద్దేశంలో భేదమేమీ లేదు. అసలు ఈ జనన మరణాలు మనకుగాని. కాల బాధ్యుడయిన పరమేశ్వరునికి లేవుగా, అసలు చావన్నది లేనే లేదు, అంతా పరిణామశీలమే ! ఈ పరిణామాలనే మనం కాలాంతరాల్లో జనన మరణాలని వ్యవహరిస్తాం. కాలబద్ధులమైన మనకు భూత భవిష్యత్తులున్నాయిగాని కాలస్వరూపుడైన పరమేశ్వరునికి లేవుగా! అందుకే అమ్మ “చావుపుట్టుకలకు తేడా ఏముంది ? నాకు కాలమంతా వర్తమానంగానే ఉంటుంది” అని అంటుంది.
ఇక వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థాపకం అనేది కేవలం మానవజాతి శ్రేయస్సుకై యేర్పడింది. ఈ వర్ణాశ్రమాలూ వాని ధర్మాలూ అన్ని యుగాలలో ఒకేవిధంగా ఉండవనేది వండిత సమ్మతమైన విషయమే. పరిణామశీలమైన జగత్తులో మారనిదేమున్నది ? సత్యస్వరూపుడైన ఒక్క భగవంతుడు తప్ప ! ఏ మార్పూ లేకపోతే ఇన్ని యుగాలూ, ఇన్ని ధర్మ భేదాలూ ఎందుకు ఉత్పన్న మౌతాయి ? ఇంత భేదమే లేకపోతే సృష్టివైచిత్ర్య మేమున్నది ? ఎప్పటికేది అవసరమో దాన్ని ఆ సర్వేశ్వరుడే చేసుకుపోతుంటాడు. అసలు ఇంత పెద్ద వివరణం అనవసరం. సర్వసృష్టికర్తయైన వాడు. పరమేశ్వరుడేనని ఒప్పుకున్న తర్వాత, ధర్మాధర్మాలను గురించి వర్ణాశ్రమాదులను గురించి మానవ మాత్రులు చేయదగ్గ విమర్శలంటూలేవని అనిపిస్తుంది. చతురుడైన శిల్పి అనేక శిల్పాలను తయారుచేసి దానిని అనేక పర్యాయాలు అనేక విధాలుగా పేరుస్తుంటాడు. భగవంతుడు విశ్వశిల్పి. అతడు నిర్మించిన మానవ లోకంలో ధర్మరక్షణ పేరిట తానుచేసే దుష్టశిక్షణ, శిష్ట రక్షణ, వర్ణాశ్రమ ధర్మవ్యవస్థాపనాదులు ఆయనకు వినోదమాత్రాలే గదా !
పూర్వయుగాల్లో సాధింపబడిన వర్ణాశ్రమ ధర్మవ్యవస్థనే జగజ్జననియైన యీ అమ్మ రూపాంతరంలో సాధిస్తున్నది. కాముకతా కళంకితమైన మానవ హృదయాన్ని నిర్మల ప్రేమభావసుధాతరంగిణిలో ప్రక్షాళితం చేసి మనందరికీ విశ్వమానవ సౌభ్రాత్రాన్ని బోధిస్తున్నది. పరబాధాకరంగాని, స్వాభిమత వివిధవృత్తి సమాశ్రయణాన్ని శక్తివంచన లేకుండా బాధ్యతా యుతంగా నిర్వహించవలసినదిగా మానవజాతిని ప్రేమాదరాలతో ప్రేరేపిస్తున్నది. ఇది వర్ణాశ్రను వ్యవస్థాపనం కాక మరే మవుతుంది ?
చాతుర్వర్ణ్య సృష్టి గావించిన శ్రీకృష్ణుడు గీతలో
“చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః ।
తస్య కర్తార మపి మాం విద్యకర్తార మవ్యయమ్” |॥ అని సూచించాడు.
ఈ సందర్భంలో ఇది గమనార్హం. మానవ శ్రేయస్సుకై తాను నిర్మించిన చాతుర్వర్ణ్యమునకు కృష్ణుడు తానతీతుడుగా నుండునట. అందుచేతనే అమ్మ వివిధజాతి మతస్థులనూ వివిధ వృత్తులవారినీ ఒకే విధంగా ప్రేమించి లాలించుతుంది!
కాబట్టి యీ జిల్లెళ్ళమూడి అమ్మ విశ్వమాత; పరదేవత. ఆమె సందర్శనం సర్వబంధవిమోచన హేతువు; సచ్చిదానంద సంధాయకం.
(ఏప్రియల్ 1966, ‘మాతృశ్రీ మాసపత్రిక నుండి యం.డి.సి. వారి సౌజన్యంతో గ్రహింపబడినది.)