మీరు తఱచు అమ్మ దగ్గరకు వెళ్ళుతుంటారు గదా! ఆమె మన బాధలను పోగొట్టుతుందా ? మన రోగాలను నయం చేస్తుందా ? లేక మన కోరికలను తీరుస్తుందా? అసలు ఆమెలోని ప్రత్యేకత ఏమిటి? – ఇటువంటి ప్రశ్నలను చాలామంది నన్ను అడుగుతుంటారు. వీటికి సమాధానం ఎలా చెప్పాలో తోచక సాధారణంగా నేను నవ్వేస్తుంటాను.
“ఆ పనులను ఆమె చేస్తుంటే చేస్తుందనీ, లేకపోతే లేదని చెప్పవచ్చు గదా ! ఆ ప్రశ్నలేమంత కఠినమైనవి కావే?” అని మీరనవచ్చు.
కానీ ఆ ప్రశ్నలు అంత తేలిక సమాధానాలతో కొట్టి వేయదగినవి కావని నా నమ్మకం. ఎందుచేత నంటే అవి తఱచు నన్ను కూడా కలవర పరుస్తుంటాయి గాబట్టి. అందువల్ల వానికి సరియైన సమాధానం రాబట్టుకోవాలని యెప్పుడూ అనుకుంటాను. ఈ నా ఆలోచనల ఫలితమే యీ వ్యాసం.
అందు సమస్తమైన ఆధ్యాత్మిక సాధనల పరము ప్రయోజన మేమిటి ? సుఖదుఃఖాలయందు సమదృష్టి గలిగియుండటం, అనగా ద్వంద్వాలకు అతీతంగా ఉండగల్గటం, భిన్నదృష్టి లేకపోవటం అన్నింటిలో ఏకత్వాన్ని చూడగల్గటం కాదు, అన్నీ ఒకటిగానే కనపడటం. దీనినే మరొక రీతిలో ఆత్మ సాక్షాత్కారం అనవచ్చు. సర్వమానవ కోటికి ఇదే అసలైన గమ్యం. ఈ లక్ష్యాన్ని ‘అమ్మ’ మాటలతో గాక చేతలతో విస్పష్టంగా చెబుతుంది . ప్రతిక్షణం అమ్మ జీవితం ఈ ద్వంద్వాతీత ప్రవృత్తినే చాటుతుంది. తాను నిరంతరం ద్వంద్వంలో ఉంటూ దాని ప్రభావానికి కొంచెం గూడ లోనుగాకుండా తామరాకు మీది నీటి బొట్టు చందంగా విలక్షణంగా ఉంటుంది. సాధ్య, సాధన. సాధకత్రయం ఆమెకు లేవు. ఆ మూడూ తానే అయింది. అందుచేత ఒకప్పుడు -సాధారణ స్థితిలో నుండి సాధన వలన ఆమె ఈ స్థితి పొందలేదు. ఈ ద్వంద్వాతీత ప్రవృత్తిగానే ఆమె ఆవిర్భవించిందనవచ్చు. భౌతిక దృష్టి ప్రధానమైన యీ కాలంలో ఈ మహత్తర సందేశాన్ని క్రియాత్మకంగా చాటటానికే తాను అవతరించిందేమో అనిపిస్తుంది.
ఇటువంటి నిర్వికారమూర్తిని మన మేమి అడగాలి? ఆమె మనకు ఇచ్చేదేమిటి? మానవ జీవితానికి -లక్ష్యం అశాశ్వతమైన విషయసుఖమే అనుకునే వారికి ఈ చర్చవల్ల ప్రయోజనమేమీ ఉండదు. కాని ద్వంద్వాతీత స్థితి లేక ఆత్మసాక్షాత్కారం మాత్రమే మానవుడు సాధించదగిన ఏకైక లక్ష్యం అనుకునే వారికి కొంత ప్రయోజనం కలుగవచ్చు.
“ఏది వచ్చినా సుఖంగానీ దుఃఖంగానీ భగవత్ప్రసాదమే” అంటుందమ్మ. “అనుకున్నది జరుగదు – తనకున్నది తప్పదు” – అని గూడా ఆమె అంటుంది. అనగా మనం కోరుకున్నది లభిస్తుందని గానీ వద్దనుకున్నది పోతుందని గానీ నమ్మకం లేదు గాబట్టి దేనినీ వద్దనవద్దు. కావలెననవద్దు. ఎప్పటి కేది ప్రాప్తమౌతుందో దానిని సమబుద్ధితో అనుభవించటమే మన కర్తవ్యమని దాని అర్థం. ఈ స్థితినే స్థితప్రజ్ఞత్వంగా కృష్ణ భగవానుడు భగవద్గీతలో పేర్కొన్నాడు.
“య స్సర్వత్రానభిస్నేహ స్తత్తత్రాప్య శుభాశుభం,
నాభినందతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా.”
అనగా ఎవడు అంతటా స్నేహాన్ని చూపకుండ తనకు గల్గిన శుభాశుభాల యెడల సంతోష ద్వేషాలను పొందడో వాడే స్థితప్రజ్ఞుడు అని ఆ శ్లోకార్థం. ఈ స్థితిని పొందిన వానికి ఇక పొంద వలసినదంటూ లేదు.
ఈ మహాసందేశాన్ని అమ్మ ఆచరణాత్మకంగా మనకు బోధిస్తుంది. నిజంగా ఇంతకంటే మానవులకు కావలసింది, బోధించవలసిందీ, మరేముంటుంది ? తేజ స్తిమిరాలకు సామానాధికరణ్యం అనుభవ విరుద్ధమైనదని శాస్త్రజ్ఞులు చెబుతారు. కానీ ‘అమ్మ’ మాత్రం చీకటిని గుర్తించేది వెల్తురనీ, వెలుగుకు చీకటి ఆధారమనీ అంటుంది. అతి సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే ఈ మాట పరమసత్యంగా ఎవరికైనా తోచక తప్పదు. అసలీ తేజస్తిమిరాలు ఒక వస్తువు యొక్క రెండు భాగాలు. అనగా వీని ఉనికి ఆధార మొక్కటే అన్నమాట! మరి పై శాస్త్రజ్ఞుల మాట యేమయినట్లు? అందుకే “అనుభవం శాస్త్రాన్నిస్తుందిగాని, శాస్త్రం అనుభవాన్ని ఇవ్వదు” – అని అమ్మ అంటుంది. అంటే శాస్త్రం అబద్ధమని అమ్మ తాత్పర్యం గాదు. ద్రష్టలైన మహర్షులే శాస్త్రాలను వ్రాశారు. వారు వారి అనుభవాన్ని శాస్త్ర రూపంలో చెప్పారు. వాక్యాలను గ్రుడ్డిగా పొగడినందు వలన లాభం లేదు. దానిని నీ అనుభవంలోనికి తెచ్చుకోవాలి అని ఆ సూక్తి తాత్పర్యం.
మనం ‘యోగసాధన’ అన్న పదాన్ని వాడు తుంటాం. యోగమంటే యేమిటి? వెనుక చెప్పిన ద్వంద్వాతీత స్థితియే యోగం. గీతలో గూడ “సమత్వం యోగ ఉచ్యతే” – అని చెప్పబడింది. లాభా లాభాలలో, జయాపజయాలలో, రాగద్వేషాలలో, సుఖదుఃఖాలలో సమానస్థితి, యోగ మనగా ఇదే. భక్తి యోగమైనా, కర్మ యోగమైనా, రాజయోగమైనా, మఱి యే యోగమైనా దాని పరమార్థమిదే. ఈ మహా యోగాన్ని అమ్మ ఆచరణ రూపంలో అలవోకగా హాస్యోక్తులతో రంగరించి మధుర మధురంగా బోధించి సుసాధ్యం చేస్తుంది. మహా మంత్రోపాసన, జ్ఞానమార్గం, కర్మ మార్గం – ఒకటేమిటి? అన్నింటి యొక్క ఏకైక లక్ష్యమైన ఈ స్థితి అమ్మ సన్నిధిలో సుగమమై యుండగా మనం ఆమెను కోర పనేలేదు. ఎప్పటి కేది ప్రాప్తమో దానిని అనుభవించటమే మన కర్తవ్యమనే భావం కల్గిన తర్వాత మనం పొందవలసినది ఏముంటుంది? ఈ స్థితి కోరితే ఇచ్చేదీగాదు, వచ్చేదీగాదు అసలు దేనిని కోరినా మనం ద్వంద్వాతీతులం గామన్న మాటే. అమ్మ దర్శనంచేత మనకేది కావాలో మనకు తెలియకుండానే లభిస్తుంది. అయితే యిక్కడొక చిన్న సందేహం. అమ్మ దర్శనం చేయకపోయినా మనకు ప్రాప్తమున్నదేదో లభిస్తుంది. గదా: అనవచ్చు నిజమే ! కాని మన మెక్కడుండి చేసే సాధనలకైనా సాధ్యం ఆమెయే. గాబట్టి మన సాధన లక్ష్యాన్ని ఇక్కడ సాకారంగా చూడగల్గటమే విశేషమని ఒప్పుకోక తప్పదు.
ఇక ఆమెలోని విశేషమేమిటి ? అనే అంశాన్ని గూర్చి కొంచెం విచారిద్దాం. అమ్మ దేవ్యవతారమని విజ్ఞుల ప్రగాఢ విశ్వాసం. విశ్వాస మన్న తర్వాత దానిని ఋజువు పరచబూనుకోవటం అనవసరం. దానికి ఋజువులతో నిమిత్తం లేదు. ఎందుకంటే…
“Faith transcends intellect and reason” అన్నారు పెద్దలు – కాని ఈ విశ్వాసం మూఢవిశ్వాసం కాదనీ, సహేతుకమైనదనీ చెప్పటమే నా ఉద్దేశ్యం. విశ్వసృష్టి, స్థితి, లయ హేతుభూతయై, ఆది మధ్యాంత రహితయైన ఆ జగన్మాత యొక్క ముఖ్య లక్షణాలుగా సర్వశక్తి మత్వం సర్వజ్ఞత్వం సర్వాంతర్యామిత్వం అను వానిని పేర్కొనవచ్చు. అయితే ఇటువంటి శక్తి అజమూ, అవ్యయముగదా, ఇది మానవరూపం ధరించటం ఎలా సంభవం ? అని అడగవచ్చు. ఈ సంశయాన్ని పరమేశ్వరావతారమగు శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఈ విధంగా -వివరించాడు.
ఆజోలి పి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరోపి సన్
ప్రకృతిం స్వామధిష్ఠాయ సంభవా మ్యాత్మమాయయా!!
అనగా “నేను జన్మరహితుడను, నాశ రహితుడను, అఖిలభూతేశ్వరుడను -అయినప్పటికీ జగ న్మోహనమూ, సర్వవ్యాపకమూ అయిన మాయచేత నిజ ప్రకృతిని అవలంబించి పుట్టుచున్నాను” అని దాని అర్థం. కాబట్టి అజుడూ, అవ్యయుడూ అయిన భగవానుడు మానవ రూపంలో అవతరించటం అసంభవం కానే కాదు.
(సశేషం)