అమ్మ నన్ను స్పృశించింది. ఆ స్పర్శన దర్శనం ఓ అద్భుత రోమాంచం కలిగించాయి. అది పటం కాదని “పవిత్ర ప్రేమ స్వరూపిణి” అని సజీవమయిన అమ్మ అనే జ్ఞానం కలిగింది.
ఓహో ఏమానందమది! నా శిరస్సును అమ్మ వడిలో వుంచి విలపిస్తూ కనీసం రోజుకొకసారి అమ్మ ప్రేమచైతన్య రూపం నాకు లభించాలని ప్రార్థించాను. 1964లో, అమ్మ అంగీకారం సూచకంగా నన్ను తన రెండు చేతులతో పట్టుకొని మాటలకందని ప్రేమ భావంతో తొణికిసలాడించింది. మైమరచిన ఆనందంతో నేను అపుడు మేల్కొన్నాను. అపుడు సమయం 3.25 గంటలు ప్రాతఃకాలం. అమ్మ నా మంచం వద్దనే నిలబడి వుంది. అమ్మ ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుతున్నదని నాకు ధృడనిశ్చయం కలిగింది. అమ్మ కరుణకు, ప్రేమకు గుర్తింపు అది
నిష్టద్వారా భక్తి కలుగుతుంది. భక్తి పరిపక్వమైనపుడు అది భావంగా పరిణమిస్తుంది. అన్నిటి కన్నా చివరగా వున్నది మాతృప్రేమ. ప్రేమ అన్నది తాడులాంటిది. భక్తుడికి ప్రేమ కలిగితే భగవంతుడు అతడికి బద్ధుడవుతాడు. పారిపోలేడు, జగజ్జనని చూసుకుంటుందనే దృడనిశ్చయంతో. అమ్మకూ తన బిడ్డకూ సంబంధం అతి ప్రత్యేకమయినది. హృదయపూర్వకంగా పిలిచినపుడు ఆ అమ్మ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయదు. మనను రక్షించడానికి పరుగున వచ్చి చేరుతుంది. అమ్మ గదిలో పడుకొని వున్నది అమ్మ పాదాలకు నమస్కరించాను.
కలియుగంలో పుట్టిన కరుణామయి, కలియుగ దేవత అమ్మ ‘విశ్వమాత’. తమ బిడ్డలకు అన్ని విధాల తోడ్పడుతూ వారి క్షేమం కోసం తపన, ప్రేమతో ఆదరిస్తుంది. అలసట విసుగు అనేవి ఎరుగ కుండా ఎప్పుడూ చిరునవ్వుతూ ఎందరు వచ్చినా అమ్మ ప్రతివారితో ఆదరంగా మాట్లాడేది. ఆనందంతో ఇంటికి పంపేది.
పంచభూతాలకు ప్రాణం జ్ఞానం లేదు. యీ రెండూ వున్న మానవులపై అవి అధికారాన్ని చూపిస్తున్నాయి. వీటిని జయించాలంటే ఏం చేయాలి? మహత్తరమయిన శక్తిని పూజించాలి. ఆ శక్తి ఎవరు? ‘ఆమే అమ్మ” ఆ తల్లి అనుగ్రహంతో అన్ని సుఖాలు కలుగుతవి. ప్రతి వానికి ఆత్మ విశ్వాసం వుండాలి. అదే మనకున్న ‘విలువైన ధనం’, మనకు సకల సౌభాగ్యాలను చేకూర్చుతుందని ఓసారి అమ్మ అన్నది..
అమ్మ తత్వం ఎప్పుడూ వరద అభయ ముద్రలతో ఆశ్రయించినవారికి అభయ ప్రదానం చేస్తూ సాక్షాత్కరించి వారి కోరికలను తీరుస్తుంది.
బిడ్డల ఆలనా పాలనా చూచుకొనేది ‘అమ్మే’ కదా! విశ్వ జనని అవడంతో అతిశయోక్తి లేదు.
ప్రార్ధన అనేది మన కష్టాన్ని తగ్గించటానికి కాదు. మన గుండె బలాన్ని పెంచటానికి. అమ్మ మీద నమ్మకాన్ని వదులుకోకండి. అపార ప్రేమాభిమానాలను పంచి యివ్వగల అమృతమూర్తి. ప్రేమను పంచే దేవతలా అమృతవర్షాన్ని కురిపిస్తుంది.
సృష్టిలో తీయనైన పిలుపు ‘అమ్మ’. అమ్మ అనే పదం ‘అమృతం’ భక్తితో అమ్మను స్మరించే బిడ్డలకు తల్లివాత్సల్యాన్ని అందిస్తుందేకాని అపకారం ఎందుకు చేస్తుంది.
అమ్మా భగవత్ స్వరూపిణి! నీ శరణు చేరిన వారికి అభయమిచ్చి రక్షించడం, నీ ‘నీకు వినోదం’. నీ బిడ్డలకు ఇష్టదైవము. దుష్టులకు కూడా ప్రేమతో శుభాలనిచ్చే తల్లివి.
ఓం శ్రీ అనసూయమాతా నమో నమః —