“నీకున్నది తృప్తిగా తిని యితరుకు ఆదరంగా పెట్టుకో” అన్న విశ్వజనని జిల్లెళ్ళమూడి అమ్మ మాటను ఆచరణలో పెట్టి – అమ్మ ప్రేమసందేశాన్ని ప్రపంచానికి తెలియజేయాలనే సదుద్దేశ్యంతో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడి పూర్వ విద్యార్థులచే తేది: 06-08-2021న కళాశాల స్వర్ణోత్సవ వేడుకల వేళ – జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి పార్వతీపురం పేరుతో, ఒక సామాజిక సేవాసంస్థను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఆకలితో బాధపడుతున్న కొద్ది మందికైనా అన్నం పెట్టాలనే ఆలోచనతో తొలుత పార్వతీపురంలోని జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో, పుడ్బ్యాంక్ (Food Bank) ఏర్పాటుచేసి దూరప్రాంతాల నుండి వచ్చిన రోగులకు, వారి సహాయకులకు అదే రోజున (6-8-2021న) అమ్మ అనుగ్రహాత్ 100 మందికి అమ్మ భోజనం అందించడం జరిగింది. అలా ఆ రోజు ప్రారంభమైన అమ్మ అన్నయాగం – ఇంతింతై వటుడింతయై అన్నట్లుగా దినదినాభివృద్ధి చెందుతూ పార్వతీపురం అమ్మ కుటుంబ సభ్యుల నిరంతర శ్రమ, పట్టుదల, భక్తివిశ్వాసాలతో – రోజుకి 100, 200 -300 మంది వరకు అన్నార్తులకు అమ్మ అన్నప్రసాదం అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అమ్మ కుటుంబం, పార్వతీపురం సభ్యుల శ్రద్ధాసక్తులతో పాటు, గురువులు, పెద్దలు, జిల్లెళ్ళమూడి కళాశాల పూర్వ విద్యార్థులు, అమ్మ బిడ్డల సహకారం, పార్వతీపురం ప్రజానీకం సహాయ సహకారాలు తోడు కావడంతో, జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి పార్వతీపురం తలపెట్టిన ఈ అమ్మ అన్నప్రసాదవితరణ యాగం నిరంతరంగా నిర్విఘ్నంగా కొనసాగుతూ తేదీ 01-06-2022 నాటికి 3వందల రోజులు పూర్తి చేసుకుంది.
ఈ శుభ సందర్భంలో యింతటి సదవ కాశాన్ని, శక్తియుక్తుల్ని ప్రసాదించిన అమ్మకు కృతజ్ఞతా పూర్వక వందనాలు తెలియజేసుకొని, మనస్ఫూర్తిగా అర్చించుకోవాలని, అమ్మ కుటుంబం, పార్వతీపురం సభ్యులంతా కలసి ఆనందాన్ని పంచుకోవాలని, అన్నప్రసాద వితరణ యాగం – మధురానుభూతులను తనివితీరా చెప్పుకోవాలని – తేదీ 01-06-2022న “త్రిశత దినోత్సవ వేడుక” సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఉదయం 9.30 గంటలకు అమ్మ కుటుంబ సభ్యులంతా కుటుంబ సమేతంగా చేరుకోవడం జరిగింది. అందంగా అలంకరింపబడిన N.G.O. PO (N.G.O. Home, Parvathipuram) ముందుగా అమ్మను ఆహ్వానించి, చిత్రపటానికి పూలమాల వేసి- ధూప దీప నైవేద్యాలతో అమ్మను పూజించారు. అనంతరం జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి, పార్వతీపురం, వ్యవస్థాపక కార్యదర్శి గంటేడు చిన్నంనాయుడు అమ్మ అన్నప్రసాదవితరణ – త్రిశతి దినోత్సవ వేడుక విశేషాల్ని కార్యక్రమ వివరాలను సభకు తెలియజేశారు. అనుకున్న ప్రకారం ముందుగా పూర్వవిద్యార్థి పి. మధుసూదనరావు ఆధ్వర్యంలో ‘జయహో మాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి’ అన్న అమ్మ నామ పారాయణ అత్యంత అద్భుతంగా, మధురాతి మధురంగా చేసి, అమ్మను మనసారా పూజించుకున్నారు. అనంతరం 11 గంటల నుండి 12 గంటల వరకు అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన “లలిత సహస్రనామపారాయణ” చేసి అమ్మబిడ్డలంతా పరవశించిపోయి అమ్మ పాదాలకు భక్తితో ప్రణమిల్లారు. 12 గంటల నుండి 12.30 వరకు – పూజ్యులు, గురువర్యులు, పెద్దలు, అమ్మబిడ్డలు పంపించిన ప్రేమపూర్వక ఆత్మీయ సందేశాలను సభలో వినిపించడం జరిగింది. ఇందులో భాగంగా మాన్యశ్రీ విఠాల రామచంద్రమూర్తిగారి ఆత్మీయ సందేశాన్ని పి.మధుసూదనరావు, గౌరవనీయ శ్రీ శ్రీమన్నారాయణ మూర్తిగారి ఆత్మీయ సందేశాన్ని బి. శ్రీరామమూర్తి నాయుడు, గౌరవనీయులైన శ్రీమతి యు. వరలక్షి గారు సందేశాన్ని బి. అడివినాయుడు, గౌరవనీయులైన శ్రీమతి బి.సుగుణగారి సందేశాన్ని జి. సోమేశ్వరరావు సభకు వినిపించారు. నిత్యమూ తమ అమూల్య సందేశాలతో, ప్రేమాభిమానాలతో ప్రోత్సహిస్తూ, ఆర్థిక, హార్దిక సహాయ సహకారాలు అందిస్తున్న తమ గురువులకు కార్యదర్శి చిన్నం నాయుడు సభాముఖంగా ధన్యావాదాలు తెలియజేశారు. పిమ్మట అమ్మ ఊపిరి, అమ్మ ధ్యేయం, అమ్మ ఆశయం, అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన అన్న ప్రసాద వితరణ చేయడం కోసం ముందుగా జిల్లా ఆసుపత్రి ఆవరణలో గల నిత్య (నిరంతర) అన్నప్రసాదవితరణ ప్రాంగణానికి చేరుకుని అమ్మ బిడ్డలందరూ కలిసి 150 మందికి ఎంతో ప్రేమగా అమ్మ భోజనం అందించారు. తర్వాత రైతుబజారులో గల నిరాశ్రయుల వసతి గృహంలోని – 50 మందికి అమ్మప్రసాదం అందించి అక్కడి నుండి లెప్రసీ కాలనీలోని 50 మందికి ఆకలి తీర్చడం జరిగింది. యింకా పట్టణ శివారు ప్రాంతంలోని గుడిసెల్లో కొంతమంది ఆకలితో ఉన్నారని తెలిసి అమ్మ బిడ్డలు అక్కడికి చేరుకొని అక్కడున్న 50 మందికి కూడా అమ్మ ప్రసాదం అందించడం జరిగింది. ఈ విధంగా మూడువందల రోజుల పండుగనాడు 3 వందల మందికి – అమ్మ కుటుంబ సభ్యులు అమ్మ ప్రసాదాన్ని అందించడంతో నాటి కార్యక్రమం తృప్తిగా ముగిసింది.
అనంతరం సమావేశానికి హాజరయిన సుమారు 70 మంది అమ్మ కుటుంబసభ్యులు అంతా కలిసి ఒకే పంక్తిన అమ్మ ప్రసాదం స్వీకరించి, ఆనందానుభూతితో సంబరం చేసుకున్నారు. 2 గంటల నుండి మరల 4 గంటల వరకు దూరప్రాంతాల నుంచి వచ్చిన అమ్మ బిడ్డలు, పూర్వవిద్యార్థులు – అమ్మతో తమ అనుభవా లను అందరితో పంచుకున్నారు. నేటి సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రముఖ కథారచయిత, అమ్మ సేవా సమితి – గౌరవసలహాదారులు శ్రీ గంటేడ గౌరు నాయుడు మాట్లాడుతూ, ఇంత చక్కని కార్యక్రమం చేస్తున్న మీరంతా ధన్యులని, సత్సంకల్పంతో చేస్తున్న మీ “అన్నయాగం” నిరంతరం తప్పక కొనసాగుతుందని, మీ అందరికీ అమ్మ ఆశీస్సులు పుష్కలంగా లభించాలని… ఆశీఃపూర్వక సందేశాన్ని అందించారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అమ్మకు హారతి నిచ్చి, నిర్విఘ్నంగా, నిరంతరంగా అన్నయాగం కొనసాగించేలా ఆశీర్వదించమని అమ్మను వేడుకుంటూ అమ్మ అన్నప్రసాద వితరణ త్రిశ దినోత్సవ వేడుక సభను ముగించుకోవడం జరిగింది.