నాకు పి.యస్.ఆర్ గారు తండ్రి లాంటి వారు. 2002 వ సంవత్సరం పరిచయం. నేను ఒక ప్రెస్లోలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నప్పుడు ‘విశ్వజనని’ మ్యాగజైన్ వర్క్ నాకు ప్రెస్ వాళ్ళు ఇచ్చారు. అంతకముందు ఆ ప్రెస్లోనే శ్రీ పి.యస్.ఆర్ గారి బుక్స్ కూడా ఇచ్చేవారు. ఆ ప్రెస్ వాళ్ళు చాలా బిజీగా ఉండేవారు. అందువలన ఆ బుక్స్ టైపింగ్ కొంచెం ఆలస్యంగా జరిగేవి. శ్రీ పి.యస్.ఆర్. గారు అక్కడికి వచ్చినపుడు నా వర్క్ చూసి, నా పుస్తకాలు ఆ అమ్మాయికే ఇవ్వండి. తప్పులు లేకుండా చేస్తున్నది, అని అన్నారు. అప్పుడు మాస్టారు గారు అన్నారు నాతో- ‘అమ్మా ! నా వర్క్ చాలా వుంది. ఇంట్లో సిస్టమ్ వుంది అన్నావు గదా! నా వర్క్ చేస్తావా’ అని. అలాగే మాస్టారు అన్నాను.
తరువాత శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయ ప్రసాద్ గారు – శ్రీ సిద్ధేశ్వరీ పీఠం బుక్స్, జిల్లెళ్ళమూడి బుక్స్, మరియు అనేక ఆధ్యాత్మిక వేత్తలను కూడా పరిచయం చేసి నాకు చాలా వర్క్ ఇప్పించారు. తండ్రిలాంటి శ్రీ పి.యస్.ఆర్. ఆంజనేయప్రసాద్ గారు నన్ను చాలా ఆదుకొన్నారు. మా అబ్బాయిని C.A. చదివించుకొన్నాను, మా అమ్మాయి B.Tech పూర్తి చేయించాను. అమ్మ దయవల్ల మా అమ్మాయికి (Infosys) సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. నీ కష్టాలన్నీ తీరిపోయినాయి అమ్మా ! అని ఎంతో సంతోష పడినారు. ఈ రోజు నాకు అంతమంది పెద్దవాళ్ళను పరిచయం చేసి నాకు వర్క్ ఇప్పించి ఇంట్లోనే చక్కగా వర్కు చేసుకుంటూ నాకు తిండికి, గుడ్డకి లోటు లేకుండా ఈ రోజు నాకు గడిచిపోతున్నది అంటే అంతా శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారి ఆదరణ.
శ్రీ పి.యస్.ఆర్ గారు పని ఉంటే నిద్దుర పోరు. పని చేసే వారిని నిద్రపోనీయరు. ఆయన నవ్వుతూ ఎలా మాట్లాడతారో పని చేయకపోతే అలా కోప్పడతారు. ఎన్ని పనులున్నా మొదలు పి.యస్.ఆర్ గారి పని చేసిన తరువాతనే మిగతావాళ్ళ వర్క్స్ చేసేదానిని. నాకు ఆయన అంటే అంత భయము, గౌరవము, అభిమానము.
అంతకు ముందు శ్రీ పి.యస్.ఆర్. గారి ఇంటికి దగ్గరలో ఉండేదానిని. ఆరు నెలల క్రితం 4 కి.మీ. దూరంలో మా బావగారి ఫ్లాట్లోకి మారాము. చివరిసారిగా నేను ఆయనను కలిసినది జనవరి మొదటి వారంలో. ఆ రోజు మాట్లాడుతుంటే ‘అమ్మా ! ఏదైనా అభిప్రాయాలు గానీ, సన్మానపత్రాలు గాని చేయించాలంటే నీవు చాల దూరంగా ఉన్నావు. ఏమిటో మరి’ అని అన్నారు. “మాస్టర్ నేను మీ పత్రికకు, మీ పుస్తకాలకు ఎటువంటి ఇబ్బంది పెట్టటం లేదు” అని అన్నాను. కానీ ఆయనే మనలని వదిలి చాలా దూరం వెళ్ళిపోతారని అనుకోలేదు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
మాతృప్రేమ పునీతమై నిలుచు ప్రేమ స్నిగ్ధ కారుణ్యముల్
చేతస్సుందర సర్వసృష్టి మహిత శ్రీవత్సలత్వ ప్రభల్
పాతివ్రత్య మహత్వదీప్తియుత సంప్రాప్త ప్రభాశక్తి సం
ప్రీతిన్ తీర్ధము అన్నపానముల ప్రాప్తింగూర్చితే భూమిపై
– శ్రీ పి.యస్.ఆర్