(గత సంచిక తరువాయి)
నలభై ఏళ్ళక్రితం – ఒకసారి నాన్నగార్కి అనారోగ్యం చేసింది. వైద్యం కోసం బాపట్ల వెడుతున్నారని తెలిసింది. అమ్మదగ్గరకి వెళ్ళి ‘నాన్నగార్కి సహాయంగా నేను వెడతాను’ అని అభ్యర్ధించాను. ‘అలాగే, నాన్నా!” అని అనుమతి
నిచ్చింది.
బాపట్లలో వారం రోజులు ఉండి చికిత్స పొందారు. వారికి స్వస్థత చేకూరింది. ‘వారికి రోజూ fruit juice ఇవ్వాలి’ అన్నారు డాక్టర్ గారు. సరిపడ మందులు కొన్నారు. ‘జిల్లెళ్ళమూడి వెడదాం’ అని అన్నాను. చీరాల వెళ్ళి శ్రీధరరావుగార్కి x-ray, మందుల చీటి చూపించి వెడదాం అన్నారు నాన్నగారు. వెంటనే చీరాల వెళ్ళాం. డా!! నారపరాజు శ్రీధరరావుగారు x-ray, అన్నీ చూసి వైద్యం సవ్యంగానే జరిగింది అని ధ్రువీకరించారు. కారులో జిల్లెళ్ళమూడి బయలుదేరాం. బాపట్లవచ్చాం. రైల్వేగేట్ వేసిఉండటంతో కారు కొంత సేపు నిలిచిపోయింది. ప్రక్కనే పళ్ళదుకాణాలు ఉన్నాయి. డజను బత్తాయిలు తీసుకు వెడితే రోజూ నాన్నగార్కి పళ్ళరసం ఇవ్వచ్చు – అనుకున్నాను. వెంటనే ‘అమ్మ దగ్గరకి ఎన్నోపళ్ళు వస్తాయి. రోజుకి రెండు పళ్ళు తీసుకోవచ్చు అని ఊరుకున్నాను. కారు జిల్లెళ్ళమూడి చేరుకుంది. నాన్నగారు అమ్మకు అన్నివిషయాలు వివరించారు.
నేను సావధానంగా అమ్మ దగ్గరకి వెళ్ళాను. పాలకడలిపై శేషశాయిని తలపిస్తూ అమ్మ మంచంమీద పడుకున్నది. పాలపిట్టరంగు పట్టు చీరె కట్టుకున్నది. నన్ను చూసి చిరునవ్వు నవ్వింది. అపుడు –
అమ్మ: నాన్నా! మద్రాసు వెళ్ళినపుడు యస్. జానకి పెట్టింది రా ఈచీర ఎలా ఉంది?
నేను: చాకులా ఉందమ్మా (చాల బాగుంది అనటానికి)
అమ్మ: (నవ్వుతూ) నువ్వూ చాకులాంటి కుర్రాడివే (క్షణం ఆగి నాన్నా! డాక్టర్గారు ఏమన్నారు!
నేను: fruit juice రోజూ ఇమ్మన్నారు.
అమ్మ: (క్షణం ఆగి) బాపట్ల నుంచి వచ్చావు కదా! డజను పళ్ళు తీసుకురావాల్సింది.
నేను: (దొంగవానికి తేలు కుట్టినట్లుగా)…..
అమ్మ: (మరొక క్షణం ఆగి) నాన్నా! వాళ్ళూ వీళ్ళూ ఇక్కడికి పళ్ళు తెస్తారు వాటిని ప్రసాదంగా వాళ్ళకి తిరిగి ఇవ్వాలి మనం వాడుకుంటే బాగుండదుకదా!
నేను: నీకు అన్నీ తెలుసు. నామనస్సులో మాట తెలిసే అంటున్నావు. నాదంతా పాత్రధారణే.
అలా సంతోషంగా గడిచాయి ఆక్షణాలు. మర్నాటి ఉదయం అమ్మ మంచంమీద కూర్చున్నది. నేను ఒక ప్రక్కగా క్రింద కూర్చున్నాను. శాయమ్మగారు వచ్చి అమ్మకి ఎదురుగానిలిచి “నాన్నగార్ని ఆస్పత్రినుంచి అష్టమినాడు తీసుకువచ్చారేమిటి? అని అంటున్నారమ్మా” – అన్నది. ఆ విమర్శ వినగానే నేను గతుక్కుమన్నాను, వారిని తీసుకు వచ్చింది నేను కనుక నాడు అష్టమిఅనీ, తీసుకురాకూడదనీ తెలియదు. తెలియక చేసిన తప్పుకి తలదించుకున్నాను. అమ్మ దృష్టిలో అది తప్పుకాదు. తప్పు అని తెలిసీ తప్పించుకోలేక తప్పనిసరిగా చేసేది తప్పు. కళ్ళనీళ్ళపర్యంతం అయింది. నా మనోవ్యధని అమ్మ గమనించి ఉంటుంది.
అమ్మ వదనమండలం కుంకుమ ప్రభవలె ఎరుపెక్కింది. “అలా అని ఎవరన్నారు? నా ఎదురుగావచ్చి అనమ్మను. చెంపలు పగులగొడతా” అన్నది. అమ్మ దృష్టిలో అన్నితిధులూ శుభతిధులే. అదే సత్యదర్శనం. నిత్యం పూజామందిరంలో ‘శుభతిధౌ’ అనే సంకల్పం చెపుతాం, కానీ ఆ భావం రక్తంలో జీర్ణంకాదు. కాలస్వరూపిణి అమ్మకి త్రికరణశుద్ధిగా ఉంటుంది. మానవులు దంత వేదాంతులు, దైవం సత్యస్వరూపం.
వారం, పది రోజులు గడిచాయి. నాన్నగారు మందులు వాడుతున్నారు ఆయనకి injection చేయించుకోవాలంటే భయం, tablet వేసుకోవాలంటే బాధ. నాన్నగారు tablet వేసుకోండి అని పోట్లాడేవాడిని. ఆయన tablet వేసుకుని ‘ఏమిటో” నీక్షోభ! అంటూ నవ్వేవారు. ఎవరికైనా తనను కన్నవాళ్ళమీద కన్నా తాను కన్నవాళ్ళ మీద ప్రేమ ఎక్కువ కదా! అదే అనురాగ రక్తసంబంధం.
నాకు ఉపాధ్యాయునిగా ప్రభుత్వోద్యోగం వచ్చింది.అని తెలిసింది. అన్నపూర్ణాలయంలో పాయసం చేయించుకుని తీసుకు వెళ్ళి అమ్మకి నివేదన చేశాను. దానిని నాతోపాటు చుట్టూ ఉన్నవారందరికీ అమ్మ పంచింది. “దీని అర్ధం – నీ సంతోషాన్ని అందరికీ పంచటం” అన్నది. హడావిడిగా బొట్టుపెట్టు అమ్మా! వెళ్ళొస్తాను అన్నాను. నెమ్మదిగా అమ్మ, నాన్నా ! ఇవాళ నాన్నగార్కి టెంపరేచర్ చూశావా” అని అడిగింది. నేను నిర్ఘాంతపోయాను, ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. “లేదమ్మా! వారం రోజుల నుంచి జ్వరం రావటంలేదు. కులాసాగానే ఉన్నారు – అన్నాను, నీళ్ళునములుతూ.
అమ్మ పరంగ మనం ఏమరుపాటుగా ఉన్నా, నిర్లక్ష్యంగా ఉన్నా – అది అపచారం అని అనుకోదు. ఆగ్రహించదు, తల్లికనుక. నాన్నగారి విషయమై పొరపాటు దొర్లితే అమితంగా బాధపడుతుంది. దీనికి రెండవవైపు కూడా సత్యమే. అంటే నాన్నగార్కి మనస్ఫూర్తిగా కించిత్సేవ చేసినా అమ్మ హృదయం ఆనందతరంగాల్లో తేలియాడుతుంది.
ఇక అమ్మ వద్ద క్షణకాలంకూడ ఉండలేక అమ్మవైపు చూడలేక గబగబా రెండు అంతస్థులు దిగినాన్నగారి దగ్గరికి వెళ్ళాను. ఆశ్చర్యం. 100 డిగ్రీలు జ్వరం ఉన్నది. అమ్మ ఎక్కడో రెండవ అంతస్థులో ఉన్నది. అయినా జ్వరంగా ఉన్నది అని తెలిసింది. ఎదురుగా ఉన్నవాళ్ళకి తెలియలేదు. తనకి పరధ్యానం ఉంటే కదా!. మనమధ్య నవ్వుతూ మాట్లాడుతున్నా, పూజలందుకుంటున్నా సమస్యలకి పరిష్కారాలని అందిస్తున్నా అమ్మకి ఏమరుపాటులేదు – అక్షరాలా నాన్నగారి అర్ధాంగి. పురాణాల్లో చదివాం, పతివ్రతని రెండు కళ్ళతోచూశాం, మన అదృష్టం, భాగ్యం.
తర్వాత కాలంలో నాన్నగార్కి గుంటూరు ఆస్పత్రిలో శస్త్రచికిత్స చేశారు. ఆసమయంలో వారికి కించిత్సేవ చేసుకున్నాను. అది జననీజనకుల అనుగ్రహవిశేషం.
నాన్నగారు ఆలయప్రవేశం చేసిన తర్వాత జిల్లెళ్ళమూడివచ్చాను. అమ్మదర్శనం చేసుకుందామని వెళ్ళాను. అమ్మగది అంతా చీకటి zero candle bed bulbs మాత్రమే మినుకు మినుకు మంటోంది. అమ్మ మంచంమీద కూర్చోని ఉన్నది. అమ్మ పాదాల చెంత రామకృష్ణఅన్నయ్య కూర్చొని ఉన్నాడు. ఆరాధన, ఉపాసన, దీక్ష, తపస్సు, త్యాగం వంటి పదాలకి నిలువెత్తురూపంగా దుర్నిరీక్ష్యంగా ఉన్నది. నా బోటి అల్పునికి ఆ ధర్మ స్వరూపాన్ని దర్శించగలగటం అసాధ్యం. అమ్మ దగ్గరకి వెళ్ళి నా శిరస్సును అమ్మ పాదాలకు ఆనించి లేచి, ఏమీ మాట్లాడలేక వెనుతిరుగుతున్నాను. “నాన్నగారు ఆస్పత్రిలో ఉండటం, వీడు సేవచేయటం” అని హీనస్వరంతో అన్నయ్యకి గుర్తుచేసింది. తనకి మహోపకారం చేసినందుకు సీతాసాధ్వి ఆంజనేయస్వామిని ‘వసుధాస్థలి వర్ధిలు బ్రహ్మకల్పముల్ అని ఆశీర్వదించింది – లంకలో. కానీ, అమ్మతత్త్వంవేరు. అమ్మ అనుగ్రహం అనవరతం అందరికీ ఉంటుంది. ‘ఆశీర్వదించమ్మా’ అని ఒక సోదరుడు ప్రార్ధిస్తే, అమ్మ అది ఎప్పుడూ ఉన్నది” అన్నది. కాగా మనం అమ్మకి చేసేసేవ కనిపిస్తుంది. అమ్మ మనకి అందించే ఆపన్నహస్తం, రక్షాకవచం సర్వదా మన కంటికి కనిపించవు.
నాన్నగారిని ఆలయప్రవేశం చేయించి దానికి శ్రీఅనసూయేశ్వరాలయం అని నామకరణం చేసింది అమ్మ. తన మంగళసూత్రాలనే జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది. అక్కడ నిత్యం జరుగవలసిన కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షించింది. అందులోభాగంగా శ్రీఅంబికా సహస్ర నామస్తోత్రపూర్వక అర్చనను నిర్దేశించింది. తన చిన్నారులను సహస్రబాహువులతో నిర్దిష్టమైన దారిలో నడిపించింది. తన కన్నీళ్ళను తానే తుడుచుకున్నది.
‘పునిస్త్రీ’ అనేపదానికి విలక్షణమైన విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన నిర్వచనాన్ని నిరుపమానంగా అను గ్రహించింది, చివరివరకు భర్తయోగక్షేమాన్ని, వేయి కళ్ళతోచూసి సదాశివునిగా సుప్రతిష్టితం చేసింది. త్యాగేనైకే అమ్మతత్వమానశుః అనే వేదార్థానికి ప్రతీక అమ్మ.
తన పిల్లలు కాళ్ళమీద నిలబడగలరు అని నిర్ధారించుకొన్న తర్వాత తన ఒడిలోని అశేషసంతానాన్ని ఎత్తుకుని ఒక్కసారి కడసారి ముద్దుపెట్టుకొని నిర్దాక్షిణ్యంగా దించి ప్రక్కన పెట్టి తాను సంతోషంగా సరాసరి వెళ్ళి నాన్నగారి సరసన సుప్రతిష్ఠిత అయ్యింది. ‘నిర్దాక్షిణ్యంగా అనటానికి కారణం – ప్రేమకంటే ధర్మంగొప్పది. అమ్మకి రెండు ప్రధానధర్మాలు. ఉన్నాయి – మొదటిది సతీధర్మం, రెండవది మాతృధర్మం. సదాశివులైన నాన్నగార్ని సాంబశివుని చేసింది. ఇది చరిత్ర. తరాలు, యుగాలు, అర్థం చేసికోలేని అంతు చిక్కని మహోన్నత పారమార్ధిక సత్యం.