క్రిందటి సంచికలో అనిల్ బన్సల్ గారి అనుభవం మీకు వివరించాను. వారి మరో అనుభవం మీకు చెప్తాను.
ఒక రోజు సాయంత్రం మద్రాసులో ఉన్న అనిల్గారి ఆఫీసుకి వెళ్ళాను. ఆయన, ఆయన తమ్ముడు సునీల్ ఇద్దరూ చాలా దిగులుగా కన్పించారు. నేను కనపడంగానే ఉత్సాహంగా పలకరించేవాళ్ళు మౌనంగా, స్తబ్దుగా ఉండటంతో వాళ్ళు worry గా ఉన్నారని నాకు స్పష్టంగా అర్థం అయింది. వాళ్ళు అలా ఉండటానికి కారణం అడిగితే ఇలా చెప్పారు.
“మీరు వచ్చే 5 నిమిషాల ముందు మాకు జర్మనీ నుంచి ఫోన్ వచ్చింది. ఈ మధ్యనే మేము పంపించిన మందులు (వాళ్ళకి పాండిచ్చేరిలో Bulk Drugs తయారుచేసే ఫ్యాక్టరీ ఉంది) మా standards కు తగినట్లుగా ప్యాకింగ్ లేనందున మేము తీసుకోలేము (Rejected). మీ స్వంతఖర్చులతో వీటిని మీరు వెనక్కి తీసుకోండి” అని చెప్పారు. ఇదే మా మొట్టమొదటి export ఇలా నష్టం రావడమే కాకుండా మార్కెట్లో మా పేరుప్రతిష్ఠలు దెబ్బతింటాయి” -అని. ఈ విషయం విని నేను కూడా బాధపడ్డాను.
ఆ రోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం వాళ్ళ ఆఫీసులో సాయంత్రం వేళ పూజ చేస్తారు. ఎందు కనిపించిందో అనిల్గారితో ‘ఇవాళ పూజ నేను చేయనా?’ అని అడిగితే వారు ఎంతో సంతోషంతో ఒప్పుకొన్నారు. ఆ గదిలో కొంచెం ఎత్తులో ఒక అర (rack) మీద కొన్ని దేముడి ఫోటోలతో పాటు అమ్మ ఫోటో కూడా ఉంది. నేను స్థూలు మీదకు ఎక్కి అమ్మ ఫోటోలో ఉన్న అమ్మ చేతుల మీద నా చేతులు పెట్టి శిరస్సు వంచి “అమ్మా! వీళ్ళు నిన్ను చూడకపోయినా, జిల్లెళ్ళమూడి రాకపోయినా నువ్వంటే ఇష్టం. భక్తి కలవారు. నేను ఎప్పుడు అడిగినా మన సంస్థకు సంతోషంగా తమ వంతు ఏమీ ఆశించకుండా ఆర్థిక సహకారం అందించారు. ఇప్పుడు నువ్వు వాళ్ళని ఆదుకోకపోతే వాళ్ళ నమ్మకం దెబ్బతింటుంది కదా! ఈ పరిస్థితులనుంచి వాళ్ళని దాటించు అమ్మా” అని మనసారా ప్రార్థించాను.
ఇంతలో ఫోన్ మ్రోగింది. అది జర్మనీ నుంచి వచ్చిన కాల్. వాళ్లు ఏమన్నారంటే “మీరు (అనిల్ గారు) ఇదే తొలిసారి మాతో బిజినెస్ మొదలు పెట్టారు. కాబట్టి స్పెషల్గా మీ ప్యాకింగ్ని ఒప్పుకొంటున్నాము. మీ సరుకులో చిన్న శాంపిల్ తీసుకొని Lab Test చేసి మళ్ళీ చెబుతాము” అని. నేను అమ్మకి పూలదండవేసి చిన్న స్తోత్రం చదవడం ముగించాను. అమ్మకి నా అభ్యర్థన కొనసాగుతూనే ఉంది. మళ్ళీ ఫోను మ్రోగింది. మళ్ళీ జర్మన్ నుంచే. ఈసారి వర్తమానం ఏమిటంటే “మీ శాంపిల్ మా testలో పాస్ అయింది. అయితే deviation policy క్రింద మా పై వాళ్ళకు తెలియజేసి వారి అనుమతి తీసుకోవలసి ఉన్నది. మళ్ళీ ఫోను చేస్తాము” అని.
నా పూజా కార్యక్రమం సాగుతూనే ఉంది. అక్కడ నుంచి ఫోను వచ్చినప్పుడల్లా అనిల్ గారు నాకు ఏ సమాచారం వచ్చిందో చెబుతూనే ఉన్నారు. కొబ్బరికాయ కొట్టి, అరటిపళ్ళు, స్వీటు అమ్మకు నివేదన చేసి హారతి ఇచ్చాను. స్టూలు దిగి హారతి అందరికీ అందిస్తూ ఉండగానే మళ్ళీ ఫోను వచ్చింది. జర్మనీ వారు పూర్తిస్థాయిలో అనిల్ కంపెనీవారు పంపిన మందులు ఆమోదించారనే శుభవార్త.
అనిల్, వారి సహ ఉద్యోగులు అందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు. ఒక్క 10-15 నిమిషాలలో పరిస్థితులన్నీ తారుమారయి అనిల్గారికి అనుకూలంగా మారి పోయాయి. అమ్మ పూర్తి కృప వారిపై కలిగిందని అందరికీ నమ్మకం కలిగి భక్తివిశ్వాసాలు పెరగడానికి దోహదం అయింది. అమ్మ తలచుకొంటే ఏదైనా చేయకలదని నిరూపణ అయింది కదా!
ఒకరోజు మధ్యాహ్నం అమ్మ గదిలో నేను కూర్చొని ఉండగా అమ్మ నెమ్మదిగా “మనం (అంటే తను – ఎంతో ఠీవిగా ఉంది అమ్మ పలుకు మరి అమ్మ శ్రీ మహారాజ్ఞికదా) తలుచుకొని ఏదైనా చేయాలంటే రెప్పపాటు కాలం ఎంతో ఆలస్యం నాన్నా!” అని అంది. అమ్మ సర్వజ్ఞ; సర్వ సమర్థ.