“అరే! దాశరధీ” – అనే పిలుపు దూరవాణిలో వినిపించింది. అలా అన్నది, అనగలిగినది ఎవరోకాదు మా అన్నయ్య ఒక్కడే. ఆయనే పి.యస్.ఆర్. ఆ పిలుపు నాకు ఆహ్లాదాన్నీ, ఆనందాన్నీ కలిగించేది. అందులో ప్రేమ, అనురాగం, ఆప్యాయత, అభిమానం కనిపించేవి.
పి.యస్.ఆర్ నా కంటే ఒక సంవత్సరము రెండు నెలలు పెద్ద. మేము అక్కచెల్లెళ్ళ పిల్లలం. చదువుకొనే రోజులలో ప్రతి ఎండాకాలము శలవులలో మా స్వగ్రామానికి వచ్చేవారు. ఆయనకు బంధుప్రీతి ఎక్కువ.
అన్నయ్య, నేను యిరువురము రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్.యస్. యస్) కార్యకర్తలమే. క్రమశిక్షణ, దేశభక్తి, సమాజసేవ, జాతీయ భావాలు మాలో జీర్ణించుకొని పోయాయి. ఆయన గుంటూరులో ముఖ్యశిక్షక్గా ఉండేవారు. నేను నరసరావుపేటలో స్వయంసేవక్గా ఉండేవాడిని. మొదటినుండి పి.యస్.ఆర్ ధైర్యశాలి. ఎవరికీ తలవంచని నైజ గుణము. ఆయన విద్యాభ్యాస మనంతరము గుంటూరు హిందూ హైస్కూల్లోను, మాజేటి గురవయ్య హైస్కూల్లోనూ పనిచేశారు. నేను తెలంగాణాలో ఉపాధ్యాయునిగా, తదుపరి కళాశాలలో పనిచేశాను. విశ్వహిందూ పరిషత్లో విభాగ్ ప్రముఖ సేవలందించాను.
ఒకసారి ఎండాకాలపు శలవులలో పి.యస్.ఆర్. మా గ్రామము (గుత్తికొండ) వచ్చినపుడు యిరువురము కలిసి కాలినడకన తంగెడ అవతల ఒడ్డు అయిన మట్టపల్లి క్షేత్రానికి వెళ్ళాము. అక్కడ కొలువున్న శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించదలచి చేరితిమి.
అది వైశాఖమాసము. నడి ఎండాకాలము. చెప్పులు లేకుండా నడవాలి. మాకు ఆ భగవంతుడు కనిపించాడు. (కాళ్ళు బొబ్బలెక్కాయి). అప్పుడు పి.యస్.ఆర్. అన్నయ్య “రక్షలు రక్షలు పాదరక్షలు. మట్టపల్లిలో ప్రాణరక్షలు” అని అనుకోకుండా ఆశు వుగా చెప్పారు. అప్పటినుండే వారిలో కవితాశక్తి మొదలైనదని చెప్పారు. వంశపారంపర్యంగా వచ్చిన కవిత్వధార అది.
ప్రతి పెండ్లిలోను, పుట్టినరోజు సందర్భంగాను వారు తప్పక హాజరై పద్యాలలో ఆశీస్సులందించేవారు. ప్రధానంగా నాకు 80 సంవత్సరాలు పూర్తి అయినప్పుడు పద్యరూపంలో అందించిన అశీస్సులు మరువలేనివి. పి.యస్.ఆర్. ఎన్నో ఖండకావ్యాలు, గ్రంథాలు రచించి ఖ్యాతిగాంచినారు. కళ్యాణవీణ, విజయవిపంచి, విశ్వజనని మొదలగునవి అందు ముఖ్యమైనవి. ఆయన నిత్యసాహిత్య కృషీవలుడు. ఎన్నో భువన విజయాలు, రూపకాలు, సభలు నిర్వహించారు. ఎక్కడైనా సమయపాలన ఖచ్చితంగా పాటించేవారు. డా॥ ప్రసాదరాయకులపతి (వారి అగ్రజులు) గారికి సాహిత్య వారసుడు పి.యస్.ఆర్. అనవచ్చు. “పురుషోత్తమ పుత్ర భార్గవ” అనే కలం పేరుతో ఎన్నో రచనలు చేశారు. ఇదంతా ఒక ఎత్తు. జిల్లెళ్ళమూడితో ఉన్న అనుబంధం మరొకవైపు. అమ్మతో పరిచయం విచిత్రంగా జరిగినది. తదుపరి అమ్మతో అనుబంధం ఎప్పటికీ తెగిపోనిది. అమ్మకు ప్రేమపాత్రుడై చివరివరకు విశ్వజననీ పరిషత్తుకు అనన్య సేవలనందించారు. అమ్మయే లోకంగా జీవించారు.
మాకు అమ్మ దర్శనం చేయించిన మహనీయుడు పి.యస్.ఆర్. అన్నయ్య. నేను, నా భార్య ఒకసారి గుంటూరులో మా పిన్ని (పి.యస్.ఆర్. గారి తల్లి) ని ని వెళ్ళాము. అప్పుడు వి. యస్. ఆర్. “క్కడిదాకా వచ్చారు కదా! జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను దర్శించుకోండి” అని సలహానిచ్చారు. వారి సలహాను పాటించి బస్సులో బాపట్ల చేరి అక్కడినుండి జిల్లెళ్ళమూడి చేరాము. అప్పటికి మిట్టమధ్యాహ్నము అయినది. భోజన సమయం. నేరుగా మేము అమ్మ నివసించే గదికి వెళ్ళి నమస్కరించి అమ్మ మంచం ప్రక్కనే కూర్చున్నాము. అమ్మ ప్రేమగా కరణారస దృష్టితో “భోజనం చేశారా, నాన్నా!” అని అడిగారు. “లేదమ్మా, నేరుగా మీ దర్శనానికి వచ్చాము” అన్నాము. “ముందు భోజనంచేసి నా దగ్గరకు రండి” అని అమ్మ సెలవిచ్చినది. అటులనే భోజనంచేసి అమ్మ దగ్గరకువచ్చి అమ్మ ఆశీస్సులు తీసికొన్నాము. నా ధర్మపత్నికి నొసట కుంకుమ పెట్టి కొన్ని పొట్లాలనిచ్చింది. ఈ విధంగా మాకు అనసూయమాత దర్శనము, ఆశీస్సులు అందించిన వ్యక్తి మా పి.యస్.ఆర్. అన్నయ్య. వారికి మేమెంతో ఋణపడియున్నాము.
తిరుగు ప్రయాణంలో బస్సుకొటుకు రోడ్డుదాకా కొంతదూరం నడవాలి. అలా నడుస్తుండగా.. కారుమేఘాలు కమ్ముకున్నవి. పెద్ద వర్షం వచ్చే సూచన లున్నవి. ఎంచేయాలో తెలియలేదు. “జయ హె మాతా. శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పర అనుకుంటూ అమ్మను ప్రార్ధించాము. అద్భుతం. వెంటనే మబ్బులు విచ్చుకొని పోయాయి. ఆకాశం నిర్మలంగా కనిపించింది. ఈ విధంగా అమ్మ మమ్ములను అనుగ్రహించినదని భావించాము. ఇది జరిగి దాదాపు 40 -45 ఏండ్లక్రితం కావచ్చును. కాని యిప్పటికి యిదంతా పి.యస్.ఆర్. అన్నయ్య ప్రేరణ వలనేకదా! అని గుర్తుకొస్తుంది.
అమ్మ అనసూయకు అత్యంత అపుడవై, కులపతిగారికి ప్రియతను సోదరుడవై, పురుషోత్తమపుత్ర భార్గవుడవై, పి.యస్.ఆర్.గా ప్రఖ్యాతిగాంచితివి. పలుగ్రంధములను రచించితివి. పలు సాహిత్యసభలను నిర్వహించితివి. భువనవిజయాలు చేసి భీవ్ అనిపించుకున్న నీ గంభీర ఆకృతి ఏది? నీ గంభీర కంఠస్వరంబేది? కనుమరుగైనదేమి? మూగబోయిన దేమి? మా అందరినీ శోకసాగరంలో ముంచి అమరపురికేగితివా అన్నయ్యా? ఆంజనేయప్రసాదు! అందుకొనుమిదే మా ఆశ్రునివాళి. ఓం తత్సత్.