శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ అన్నయ్య గారు శరణాగతి మార్గమును ఎంచుకుని తనను అమ్మకు అంకితం చేసుకున్నారు. ఆయన ఆలోచన, నోటిమాట, చేత ఒకటే. తాను చెప్పదలచుకొన్న విషయాన్ని స్పష్టంగా నిర్భయంగా చెప్పటం ఆయనలోని విశిష్ట లక్షణం. ముక్కుసూటిగా ప్రస్తావిస్తారు.
‘నిండు మనంబు నవ్య నవనీత సమానము, పల్కు దారుణాఖండల శస్త్రతుల్యము… విప్రుల యందు’ – అన్న పౌష్యుని వచనాలు అన్నయ్య గారి పట్ల అక్షర సత్యం అనిపిస్తుంది. అంటే మనస్సు నవనీతం, మాట కటువు. అమ్మ స్థాపించిన సేవా సంస్థల నిర్వహణ, అభివృద్ధికి శక్తివంచన లేకుండా శ్రమించారు.
సభా నిర్వహణలు, అనసూయావ్రతాచరణలు రసవత్తరంగా సమర్థతతో నిర్వహించేవారు. ‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదకునిగ ప్రతినెల 10 వ తారీఖు నాటికి పాఠకుల చేతుల్లో పత్రిక ఉండేట్లు తపస్సుగా దీక్షగా రెండు దశాబ్దాల కాలం వారు అందించిన సేవలు అనన్య సామాన్యములు.
తాను మేటి రచయితగా గ్రంథరచనలు చేయటమే కాక, ఎవరు అమ్మ వాఙ్మయసేవగా అమ్మ తత్త్వప్రసారదిశగా రచనలు చేసినా తన గ్రంథమునకు ఎంత శ్రద్ధ వహిస్తారో అంతే శ్రద్ధతో ఆయాగ్రంథాల్ని ప్రచురించారు.
ఆయన మనోబుద్ధులు ఎల్లప్పుడు అమ్మ సంస్థల అభివృద్ధి గురించే; అన్యభావనలు లేవు. త్రికరణ శుద్ధిగా ‘అమ్మే సర్వస్వం’ అని నమ్మి, అనన్యచింతనతో జీవితమంతా అమ్మసేవలో తపించి తరించారు. అందుకే ఆయన శ్రీకృష్ణపరమాత్మ అభివర్ణించిన ‘యుక్తతముడు’ అని భావిస్తున్నాను. (భగవద్గీత 6-47)
‘యోగినామపి సర్వేషాం మద్దతేనాంతరాత్మనా |
శ్రద్ధావాన్భజతే యోమాం సమే యుక్తతమో మతః॥
(ఎవడు నా యందు సక్తమైన అంతరంగముతో భక్తిగలవాడై నన్ను భజించుచున్నాడో, అట్టివాడు యోగులలో ఉత్తముడు.)
అంతేకాదు. జీవితంలో కష్టాలు ముప్పిరి గొన్నప్పుడు మనిషి స్వభావం తేటతెల్లమవుతుంది. తన జ్యేష్ఠకుమారుడు, ధర్మపత్ని తన కళ్ళముందే అమ్మలో ఐక్యమయినప్పుడు ఆయన ఎంత స్థిరముగా ఉన్నాడో గమనిస్తే ఆయన స్థితప్రజ్ఞలక్షణం స్పష్టమయినది.
ఆయనకి మృత్యుభయం లేదు. కనుకనే తొందరపడి తాను నిర్వహించవలసిన కార్యక్రమములు సంపన్నం చేసుకున్న ధీమంతుడు. “ఇతరులలో మంచిని చూడటమే తన మంచితనం. సర్వత్రా మంచిని చూడటమే మంచితనం ఎదుటివారిలో మంచిని చూస్తున్నంతసేపు మనలో దైవత్వం కలుగుతుంది” అన్నది అమ్మ. ఏటా అమ్మ బిడ్డల్ని, కవుల్ని, పండితుల్ని, కళాకారుల్ని సన్మానించి తనలో మంచిని పెంచుకున్నారాయన.
అందుకే పి.యస్.ఆర్. నాకు మార్గదర్శకులు, స్ఫూర్తిప్రదాత.