శ్లో || సో-జో సుమిరత సిధి హో ఇ |
గన నాయక కరిబర బదన
కరఉ అనుగ్రహ సోఇ,
బుద్ధిరాశి సుభగున సదన ||
తా || పరమశివుని ప్రధమగణములకు అధిపతి. యగు గజాననుడు తనను స్మరించినవారికి కార్యసిద్ధిని కలిగించును. అతడు విజ్ఞానఖని (భక్తులకు బుద్ధి ప్రదాత), సుగుణాలరాశి, అట్టి శ్రీ వినాయకుడు నన్ను అనుగ్రహించు గాక.
అదుగో అల్లదిగో – అక్కడో కుగ్రామం నిండా వేయి గడపలు కూడా లేవు. ఐనప్పటికి ఒక కరణంగారు వారి సతీమణి శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి ఐన అనసూయాదేవి నివసిస్తున్నారు. ఆమె లోకానికి తల్లిగా వ్యక్తం చేసుకొని జీవనయానం సాగించడం ఆరంభించినది.. కాల గర్భంలో అక్కడ కేతించిన మగమహారాజులు అన్నయ్యలని, స్త్రీ శిఖామణులు అక్కయ్యలని, ఒకరి కొకరు సంబోధించుకొంటూ కలసి మెలసి పనిపాటలను – చేసుకొంటూ అన్నపూర్ణాలయంలో చింత, గోంగూర, ఉసరిక పచ్చళ్ళతో – నీళ్ళ మజ్జిగ, నీళ్ళ చింతపండు చారుతో భోజనాలు చేస్తూ కడుపు నింపుకొనేవారు. రోజులు గడుస్తున్న కొద్దీ జనం రావడం ఎక్కువైంది. ఏమిటంటే ఏమిటని ప్రశ్నల వర్షం కురిసేది. ఎవరికేమి తెలుస్తుంది? తదుపరి కాలంలో విద్య అనెడి అలంకార భూషితులు – వేదాంతశిఖామణులు రావడం. తలకు మించిన ప్రశ్నలు వేసి జవాబులను అర్థం చేసుకోలేక – అర్థం ఐనట్లుగా తలలను ఎగరేసుకొంటూ అన్నపూర్ణాలయ భోజనం కడుపార భుజించి, కాసేపు వరండాల్లో విశ్రమించి కునుకు తీసి ఆనందంగా కాలిబాటన వెళ్ళిపోయేవారు. ప్రయాణ సౌకర్యం తక్కువ (nil) అంటేనే సబబుగా వుంటుంది. అమ్మవారికి సంసార నౌక ఏర్పాటైంది కనుక చుట్టరికం కూడా వుందనే చెప్పాలి. అందరూ మంచం చుట్టూ కూర్చొని కొంచెం సేపు స్వంత అనే మాయాజాలభారాన్ని పక్కన పెట్టేసి ప్రశాంతంగా కూర్చోవడం నేర్చుకొన్నారు. ఇదే బావుంది. ఇల్లు వాకిళ్ళు వద్దు – వావి వరసలు అసలే వద్దు. చేద్దాం అందరం అమ్మ వారి నామభజన అంటూ జయహోమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరీ అనే నినాదం మేళ తాళాలతో ఆకాశం అంతా మిన్ను ముట్టేట్టు చేయడం మొదలు పెట్టారు. మెల్లిగా అఖండ నామం, అఖండ దీపారాధన, అఖండంగా అన్నపూర్ణాలయం గుండిగలు చోటు చేసుకొన్నాయి. జనప్రవాహం ఆనంద ఆశ్చర్యములతో తేలియాడుతూ ఈలాంటి ప్రదేశాన్ని మేము ఎక్కడా చూడనే లేదు. భూలోక వాసులం మనము ఏకాకులము కాదు – మన బిడ్డలకు వారి సంతతికి తిండి కరువు రాదు – భారతదేశంలో Poverty కి చోటు లేదు. గుప్పెడు మెతుకుల కొరకు ఎలాగా అని ఎదురు చూస్తుంటే అక్కడ ఆ భూమాత నెలకొన్న ప్రదేశంలో గుండిగలే ! రాజ్య ఏలుతున్నై. ఆనాటి ఆ భూమాత వెల్లడి చేసిన వాక్యం ఏమిటో తెలుసా వినండి ఇటు స్విచ్ వేస్తే అటు – భోజనాలు, ఇటు గుడ్డలు, దేవతామూర్తి వారి సంకల్పమే మనకు శుభాశీస్సులు. జ్ఞానం అనే పదాన్నే రూపు మాపేసి – చిన్న పెద్ద అనెడి తారతమ్యం లేక ప్రేమ అనే రెండు అక్షరాలకు విపరీతార్థాలను సృష్టించుకొంటున్న తరుణంలో మాతృదేవోభవ అన్నది వేదం. ఈ రూపంలో ఐతేనే మానవులను ఉద్ధరించడానికి సులభసాధ్యం. దగ్గరకు చేర్చుకొని గోరుముద్దలతో కొంతవరకైనా – గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మార్పుచెందినట్లు మార్చవచ్చుననే సంకల్పమే – అమ్మ రాకడకు కారణమైంది. ఈ సృష్టిలో ఈ మారుమూల ఒక పరిణామక్రియ జరిగింది. ఏమిటి దీని అర్థం? ఎవరికొరకు? ఈ విధంగా చేస్తే ప్రయోజనం ఏంటి ? మొదలైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటిని ఇలా తర్కిస్తూ, చింతిస్తూ పోతే జవాబే లేదు. అశోకుడు చెట్లు, నాటెను, బావులను త్రవ్వించెను. చరిత్ర జ్ఞాపకం చేసుకోవాల్సిందే. అంతెందుకు మాజీ సి.యమ్. గారు నారా చంద్రబాబునాయుడుగారు జన్మభూమి కార్యక్రమంలో చెట్లు పెట్టించెను. ఎందుకొరకు, ఎందుచేత, పరమార్థం ఏంటి? కాస్త ఇందులో రాజకీయ వారసత్వం కన్పిస్తుంది. ఆనాటి రాజులు ప్రజల క్షేమం కొరకే రాజ్యాధికారాలను చేపట్టినారు. దుర్గాబాయ్ దేశముఖ్ స్త్రీ జాతికి చదువు అనే సుమగంధాలను ప్రసాదించింది. కలియుగ మహారాణి శ్రీమతి ఇందిరాగాంధీ. Dictator, నేటి స్త్రీజాతికి పెన్షన్ అనే రూపంలో ఆర్థిక బలాన్ని చేకూర్చింది. ఇలా చెప్పుకుంటూ పోతుంటే మట్టిలో మాణిక్యాలు ఎన్నెన్నో.
కాని ఇప్పుడు మన కళ్ళెదుటనే చూచి ఆనంది స్తున్నాం. అద్వైత బ్రహ్మ ఆధ్యాత్మిక చక్రవర్తి సురలోకపూజిత, ఇహపరలోక సంచారిణి, వేదాంత డిండిమాన్నే బద్దలు కొట్టిన ఒక మగువ కారడవిలో నివాసమును ప్రతిష్ఠించుకున్న దేవతామూర్తి, Money – Money Money అనే నినాదాలను పల్కుతున్న భూలోకవాసులను అమ్మ – అమ్మ – అమ్మ అనే పిలుపుతోనే పల్కరింపజేస్తున్న పుణ్యవతి – సాధుజన సంరక్షణి ! నీకిదే నా ప్రణతులు.
ఒక సగటు స్త్రీమూర్తిలోని మాతృప్రేమనే వెలకట్టలేము. అటువంటిది ఒక భగవత్ స్వరూపం మాతృస్వరూపాన్నే ఎంచుకోవడం అద్భుతమైన స్థితి – దీనిని మించిన అదుర్సు లేదనే చెప్పొచ్చు.
నేటి యుగానికి తగినట్లుగా మనమధ్యనే నివసించే స్థితిని వారు ఏర్పాటు చేసుకోవడం వల్ల – అమ్మకు మారుపేరుగా జడపదార్థాలైన గుళ్ళూ గోపురాలు, సంస్థలు, సభ్యత్వాలు సన్మానసభలు, విచ్చలవిడిగా దేశం నలుమూలలా ఏర్పాటై – ఎల్లలు సముద్రాలను కూడా దాటిపోయినాయి. ఏమి చేసినా, ఎంత చేసినా కోట్లాను కోట్ల రూపాయిలే కాని అందులో మనకు అమ్మ యొక్క తత్త్వం (Ammaness) బహిర్గతం కాలేదు. వాళ్ళు కన్పడరు. వెల్లడికారు. అలా అయినట్లయితే – మన ఈ కళ్ళు గ్రహించలేవు. ఆ శక్తిని తట్టుకోలేవు – జంతునాం నరజన్మ దుర్లభం – అన్నారు మహనీయులు వారిని అనుకరిద్దాం.
పుట్టినిల్లు + మెట్టినిల్లు = అందరిల్లు
సరదాల హరివిల్లు
పుణ్యాల పుట్టిల్లు
పరువాల మెట్టినిల్లు = అర్కపురి