1. Home
  2. Articles
  3. Viswajanani
  4. పుట్టుకకు పూర్వము ఏమిటి ?

పుట్టుకకు పూర్వము ఏమిటి ?

K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 15
Month : October
Issue Number : 3
Year : 2015

మరణానికి తరువాత, పుట్టుకకు పూర్వము ఏమిటి? అనేది – ఆధ్యాత్మికంగా మౌలికమైన ప్రశ్న. ఎవరికైతే పుట్టుకవుంటుందో వారికి మరణంవుంటుంది. ఇది సాధారణంగా ప్రతివారు వేసుకోవలసిన ప్రశ్న. పుట్టుకకు పూర్వము “అసలునేనెవరు? అని ప్రశ్నించుకోవాలి. నీవు ఎవరో తెలుసుకోమని శ్రీరమణమహర్షి వేసిన ప్రశ్న. నేను ఎవరు అని నన్నునేనే ప్రశ్నవేసుకుంటే దేహమంతా ఉన్నదినేను అనితెలుస్తున్నది. అంటే ఈ దేహము నేనుకాదు అనేతేలింది. ఈ దేహలో అంతా నేనువుంటూ ఈ దేహమునకు అంటకుండా అంతర్యామిగా వుంటున్నది నేనే అని తెలుస్తున్నది. ఇట్లా అన్ని దేహాలలో అంతర్యామిగా పున్ననేనే, “నేనునేనుగా” భాసిస్తున్నాను. అన్నినేనులు “నేనైననేనే” అని అమ్మ తెలియ చేస్తున్నది. దానినే “అహం బ్రహ్మాస్మి” అని ఉపనిషత్తు పేర్కొంటుంది. అంటే నేను బ్రహ్మనై ఉన్నాను అని అర్ధము. బ్రహ్మ అంటే సర్వంతర్యామి, సర్వవ్యాపినిగా వున్నది నేనేఅని. పుట్టుకవున్న ఈదేహానికి మరణము వుంటుంది కాని – అంతర్యామిగావున్న నాకు పుట్టుకలేదు, మరణములేదు. కనుక ఈదేహము మరణించిన తరువాత, నేను నేనుగనే ఉంటాను. నాకు నాశనము లేదు, మార్పూలేదు. “ప్రజాపతి” ఏప్రాణులకైతే, ప్రాణమిస్తాడో, వారు ప్రజాపతినుండి వేరుకాదు. వారి పుట్టుకకుముందు ఈజగత్తులో వేరొక జీవి పదార్ధములేదు. ‘ఏకమేవా అద్వితీయం’ అని పరబ్రహ్మ నిర్దేశము జరిగినది అయితే ఈ జగత్ నిర్మాణమునకు కర్త ఎవరు? ఎవరివలన ఈ బృహత్కార్యము నిర్వహించబడుతున్నది! పరబ్రహ్మము యొక్క మాయా రూపమే సగుణబ్రహ్మ. ఈమాయారూపమైన బ్రహ్మయే జీవులందరి యొక్క ఆత్మగా వారిహృదయాలలో ప్రవేశించి వారికి నామరూపములిచ్చి “జగత్ సృష్ఠి ప్రారంభించట మైనది” అని మహానారాయణోపనిషత్ తెలియ – జేయుచున్నది.

“ఈ శరీరములో నియమితమైన కాలమువుండి బాల్యంలో బాల్యముగా, యవ్వనంలో యవ్వనంగా, వృద్ధాప్యములో వృద్ధాప్యరూపంగా ఆ పరమేశ్వరుడే స్థితికలిగి వున్నాడు అని” జ్ఞానవాశిష్ఠము పేర్కొంటున్నది.

వేలాది తరంగాలలో ఒకేజలము, వేలాది బొమ్మ లలో ఒకేమట్టి, వేలాది ఆభరణములలో ఒకే బంగారము లాగ, అనంత సంఖ్యలతోగల దేహములలో ఒకే ఆత్మ వ్యక్తీకరమౌతుంది అని సుస్పష్టముగా గమనిస్తున్నాము.

మరణానంతరము ఈతనికి స్మృతి లేనప్పుడు పూర్వానుభవమే వుండదు. కనుక ఈజన్మలోనే అంతమౌతుందని అనవలసి వస్తుంది.

అప్పుడిక పుణ్యపాపములుగానీ, ఇహపరములు గానీ మరణానంతర స్థితిగతులు మొదలైనవన్నీ తిరస్కరించవలసి వస్తుందని “జ్ఞానవాసిష్ఠము తెలియజేయు చున్నది”, ఆత్మకు వేరుగా మనసులేదు, మనసుకువేరుగా జగత్తులేదు. అందుకే అందరికీ సుగతే అని ‘అమ్మ ప్రకటించింది’. గతిఅంటేగమ్యము, స్థితి అని అర్ధమౌతుంది. అలా అనటంలో సమస్తజీవులు చేరవలసిన గమ్యము నేనే అని ప్రకటించటమే. “మీరు నాలోనే పుట్టి, నాలోనే పెరిగి, నాలోనే లీనమౌతారు” అని “అమ్మ” స్పష్టపరుస్తుంది. కనుక జీవికి గమ్యము, స్థితి బ్రహ్మమే. చివరకు చేరవలసింది తన స్వస్థానమైన బ్రహ్మములోనే అన్ని జీవాత్మలు, పరమాత్మలో లీనం కావలసిందే. ఆదేశాశ్వితగమ్యం-గతి. అది అందరికీ గమ్యము కాబట్టి ‘అదిసుగతి’ అవుతుంది. నదీనాంసాగరోగతిః – అన్నినదులు, మురుగుకాలవలతో సహా చేరవలసింది సముద్రమే. సముద్రానికి పుణ్యనది, మురుగుకాలవ అని వివక్షతలేదు. అట్లాగే సర్వవ్యాప్తమైన “అమ్మ” ప్రకటించినట్లుగా, తననుండి జీవులను ఉద్దరింపచేసి తనలో లీనం చేసుకుంటుంది, అదే అందరికీ సుగతి, దానికి స్థితి తారతమ్యములు లేవు.

అమ్మ ఒకసారి నాతో అన్నది. “నాన్నా టైరు పంచరు పడింది అనుకో, ఏమౌతుంది? ఆగాలి ఈ విశ్వంలోకే పోతుంది అని నేను అన్నాను,” ఈటైరుకు గాలి కొట్టారనుకో, ఎక్కడనుండి కొడతారు అన్నది అమ్మ, ఈ విశ్వంనుండే అన్నాను.

“మన విషయం కూడా ఇంతే నాన్న అన్నది. అంటే మనం పీల్చేగాలి, వదిలే గాలి, ఈవిశ్వంనుండే, మనము ప్రాణవాయువును పీల్చుకొని బొగ్గుపులుసు వాయువును వదులుతున్నాము. చెట్లు అదే బొగ్గుపులుసు వాయువును పీల్చుకొని ప్రాణవాయువును వదులుతున్నాయి ఈ విశ్వంలోకే. ఈ విశ్వమంతా సర్వవ్యాప్తమై మనకు – బైట లోపలకూడా వుండేది, ఆత్మస్వరూపమే” అందుకే – ‘అమ్మ’ మనం విశ్వజనని అంటే, విశ్వజనని కాదునాన్నా ఈ విశ్వమే – జని అన్నది.

విగతజీవుడు అయినపుడు ఆశరీరము నాశనముగాక, మార్పుచెందుతుంది. అనగా పంచభూతాత్మకమైన శరీరము మరల పంచభూతములలోనే కలుస్తుంది. పంచభూతములు ఆత్మే. “శరీరము కూడా ఆత్మే అనిపిస్తుంది. మారేదీ, మారనిది కూడా ఆత్మే, ‘మరణమంటే పరిణామమే’ పరిణామానికి చరమదశ బ్రహ్మ – స్వరూపము, అని” “అమ్మ – అమ్మవాక్యాలు” పేర్కొంటున్నది.

“ఇంద్రియాలకన్నా” మనస్సు బలోపేతమైనది. మనసుకన్నా బుద్ధి బలోపేతమైనది. బుద్దికన్నా ఆత్మ అమిత శ్రేష్ఠమైనది. శ్రేష్ఠమైన ఆత్మకన్నా అవ్యక్తము శ్రేష్ఠమైనది. అవ్యక్తముకన్నా భగవంతుడు శ్రేష్ఠుడు.” “ఆయనసర్వవ్యాపి – ఆయనే సర్వగమ్యం.”

 – కఠోపనిషత్.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!