“ధర్మకార్యాచరణ పుణ్యం. అధర్మప్రవృత్తి పాపం. పుణ్యపాపాలను ఆచరించే వారికి – పుణ్యానికి ఫుణ్యఫలం, పాపానికి పాపఫలం ప్రసాదించే శ్రీమాత పుణ్యాపుణ్యఫలప్రద” – భారతీవ్యాఖ్య.
నిత్యజీవితంలో ఎన్నోరకాల ప్రవృత్తుల వారిని మనం చూస్తూ ఉంటాం. వారిలో కొందరు అతిమంచివారైతే, మరి కొందరు దుర్మార్గులు. ఇంకొందరు తటస్థులు., ఇలా రకరకాల వారు ఈ లోకంలో మనకు తారసపడుతూ ఉంటారు. అయితే దుర్మార్గులుగా మనం భావిస్తూ, భయపడుతున్న వ్యక్తులు పరమసుఖాల్లో మునిగితేలుతూ సుఖసంతోషాలతో హాయిగా కాలంగడుపుతూ కనిపిస్తారు. ఎవరినైతే మనం మంచివారు, సాధుస్వభావులు అని అనుకుంటామో వారు అన్నీ కష్టాలనే అనుభవిస్తూ, దుఃఖనిమగ్నులై దుర్భరజీవితాన్ని గడుపుతూ కనిపిస్తారు. ఇదేమిటీ? అది అంతే. ఈ జన్మలోని సుఖదుః ఖాలు ఈనాటివి కావు. “చేసుకున్నవారికి చేసుకున్నంత”, “పెట్టిపుట్టాడు” వంటి సామెతలు ఊరికే పుట్టలేదు. ఎందరి జీవితాలనో కాచి వడబోసిన పెద్దలు జీవితానుభవంతో చెప్పిన ఆణిముత్యాలు ఈ సామెతలు. ఈ జన్మలోని సుఖదుఃఖాలకు పూర్వం మనం చేసుకున్న కర్మలు కారణమవుతూ ఉంటాయి. అందుకే, ప్రారబ్ధం, సంచితం, ఆగామి – కర్మలని చెప్పుకుంటూ ఉంటాం. శ్రీ లలితాదేవి మనం చేసుకున్న పుణ్యకర్మలకు పుణ్యఫలాన్ని, పాపపు చేష్టలకు పాపఫలితాన్ని నిష్పక్షపాతంగా అనుభవించేలా చేస్తుంది. కనుక ఆమె పుణ్యాపుణ్యఫలప్రద.
“అమ్మ” పుణ్యాపుణ్యఫలప్రద. “అమ్మ” బిడ్డలలో ఒకరైన కీ॥శే॥డా॥ నారపరాజు శ్రీధరరావుగారిని పుణ్యాపుణ్య ఫలప్రదగా “అమ్మ” అనుగ్రహించిన తీరు ఒక విచిత్రోద్ధతం.
కీ॥శే॥ నారపరాజు శ్రీధరరావుగారు చీరాలలో గొప్ప వైద్యులుగా పేరు పొందారు. ఏ డాక్టరుకూ లొంగని మొండి జబ్బులు కూడా వారి వైద్యచికిత్సలో తగ్గి, పేషంట్లకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని కలిగించాయి. వైద్యవృత్తిలో ఉన్నా, ఆయన సాహిత్యాధ్యయనం చేసి, బహుగ్రంథకర్తలుగా ప్రసిద్ధికెక్కారు. “అమ్మ” అనుగ్రహం వల్ల తమకు కవిత్వం అలవడినట్లు వారే స్పష్టంగా చెప్పుకున్నారు. తనలో పెల్లుబికిన కవితాధారతో “అమ్మ”నే అభిషేకించిన ధన్యులు శ్రీధరరావుగారు. ఇదంతా వారి పూర్వ పుణ్యఫలం. పుణ్యఫలప్రదాయిని అయిన “అమ్మ” శ్రీధరరావుగారిని ఒక గొప్పరచయితగా తీర్చిదిద్ది, మహాకవుల సరసన కూర్చోబెట్టింది. ఘనంగా సత్కరించింది.
1986-1992 సంవత్సరాలు శ్రీధరరావుగారి జీవితంలోని చీకటిరాత్రులు. ఈ ఆరేళ్ళూ వారు మంచానికే పరిమితమైనారు. శరీరంలోని అన్ని అవయవాలూ క్షీణించి, పనిచేయడానికి మొరాయించాయి. ఇది ఏనాటి అపుణ్యఫలితమో ఇలా వారు అనుభవించడం జరిగింది. అయితే విచిత్రమేమిటంటే, ఇంతటి శారీరక బాధల్లోనూ వారి మనస్సు సాహిత్యాధ్యయనం నుంచి మరలలేదు. మంచం చుట్టూ పుస్తకాల బల్లలు. ఎప్పుడూ చదువుకుంటూ ఉండేవారు. అంతేనా ! జీవిత చరమాంకంలో పరిపక్వ మానసికస్థితిలో వారు “యోగసంగ్రహము” అనే గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథావిష్కరణ 1992 ఆగష్టు 8న పొన్నూరులో వైభవంగా జరిగింది. 1992 డిసెంబరు 9న వారు “అమ్మ” సన్నిధికి చేరుకున్నారు. చివరిక్షణంలో “అమ్మ” నామ స్మరణతో గాఢ నిద్రలోనే దీర్ఘనిద్రలోకి జారుకున్నారు. ఆరేళ్ళుగా ఎంతబాధను అనుభవించినా, ఆఖరిక్షణంలో అనాయాసంగా “అమ్మ”ఒడిని చేరుకున్నారు. ఇది వారికి “అమ్మ” ఇచ్చిన వరం, వారికి దక్కిన పుణ్యఫలం.
పుణ్యాపుణ్యఫలప్రద అయిన “అమ్మ” – శ్రీధరరావు గారికి శారీరక రుగ్మతను కలిగించి, శరీరాన్ని బాధకు గురిచేసినా, మానసికంగా చివరిక్షణం వరకు వారికి మంచి ధారణా పటిమను, ఆలోచనాశక్తిని, కవితాసక్తిని అనుగ్రహించింది. 1992 డిసెంబరు 8వ తేది రాత్రి కూడా వారు ఒక శతకాన్ని వ్రాయాలనే కోరికను వ్యక్తం చేశారు. అంతటి రచనాసక్తి వారిది. వారి శారీరక బాధను, మనస్సుకు సోకకుండా చేసిన మహిమాన్విత మూర్తి “అమ్మ”. వీరి జీవితానుభవాలలో “అమ్మ” పుణ్యాపుణ్య ఫలప్రదగా కనిపించింది. “అమ్మ” అనుగ్రహ వీక్షణం మనందరిపై నిరంతరం ప్రసరించాలని అర్థిస్తున్నాను.
(“కృతజ్ఞతలు : శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్యకు, అయ్యగారి కుసుమక్కయ్యకు…)”