అమ్మ శతజయంతి సందర్భంగా శ్రీవిశ్వజననీ పరిషత్ ట్రస్ట్స్ ఆధ్వర్యంలో పలుపట్టణాల్లో అమ్మ సందేశ సదస్సులు, సభలు, లలితాసహస్రనామ పారాయణలతో కుంకుమ పూజలు, అనసూయావ్రతాలు, శోభా యాత్రలు చేస్తున్న సంగతి సోదరసోదరీమణులకు విదితమే.
అక్టోబర్ నెల 21 వ తేది ఆశ్వయుజ బహుళ ఏకాదశి శుక్రవారంనాడు చిలకలూరిపేట సమీపంలోని పురుషోత్తమపట్నంలో షిరిడీసాయిబాబా మందిరంలో శ్రీ పాద శ్రీ వల్లభస్వామివారి అంతర్థాన ( ఆరాధన) మహెూత్సవాలలోని 3 వరోజున శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్స్, జిల్లెళ్ళమూడి వారి ఆధ్వర్యంలో లలితాసహస్ర నామాలతో కుంకుమపూజ, అనసూయా వ్రతం చేయడానికి షిర్డీసాయి మందిర యాజమాన్యం అంగీకరించారు.
జిల్లెళ్ళమూడి నుండి టెంపుల్స్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ శ్రీ దినకర్ అన్నయ్య గారు మరియు ట్రస్టీలు శ్రీ యం.వి.ఆర్. సాయిబాబు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు, సోదరులు శ్రీకాంత్ గారు, జి. మధుసూదనరావు, యం. శివ శంకరం గార్లు పాల్గొన్నారు. కార్యక్రమం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30 వరకు జరిగింది. శ్రీ సాయిబాబు గారు అమ్మ నామం, హైమ నామంతో కార్యక్రమం ప్రారంభించి తొలిపలుకులు పలుకగా శ్రీ యం. దినకర్ అన్నయ్య అమ్మ దివ్యతత్వాన్ని, జిల్లెళ్ళమూడిలో జరిగే పలుకార్యక్రమాల వివరాలు తెలియజేశారు. తదుపరి శ్రీ సందీప్ శర్మగారు పూజాకార్యక్రమం నిర్వహించగా, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు, లలితాసహస్రనామాలతో కుంకుమార్చన చేయించి అనసూయావ్రతం కథలు చదివారు. అమ్మ అవతార వైశిష్ట్యాన్ని వివరించారు. పూజా సామాగ్రి, అమ్మ ఫోటో, ప్రసాదాలు, అమ్మ పాకట్ సైజు జీవితచరిత్ర పుస్తకాలు, ఉచితంగా అందించ బడ్డాయి.
పురుషోత్తమపట్నం భక్తులు దాదాపు 150 నుండి 200 మంది ఈ పూజలలో పాల్గొని భక్తి శ్రద్ధలతో జిల్లెళ్ళమూడి అమ్మ అనసూయా వ్రత కథలను ఆసక్తిగా వింటూ దాదాపు 3 గంటల పైన కదలకమెదలక కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. లలితా సహస్రనామం, వ్రతాలు అయిన తరువాత షిర్డీసాయి మందిరం వారు వచ్చిన భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేశారు. జిల్లెళ్ళమూడిలో నవంబరు 14 న జరగబోయే లలితాకోటినామ పారాయణలో పాల్గొనవలసినదిగా వారినందరినీ కరపత్రాలు అందించి ఆహ్వానించడం జరిగింది. అక్కడ కార్యక్రమ నిర్వాహకులకు అమ్మ శేషవస్త్రాలు అమ్మ ప్రసాదంగా అందించడం జరిగింది.
జయహోమాతా