1. Home
  2. Articles
  3. Mother of All
  4. పోతరాజు కథ

పోతరాజు కథ

Dr Tangirala Simhadri Sastry
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 14
Month : July
Issue Number : 3
Year : 2015

(అమ్మ జీవిత చరిత్రలో లభించిన ఒక అద్భుతమైన సంఘటనను “మదర్ ఆఫ్ ఆల్” పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము.)

అమ్మ తోటలోకి వెళుతుంది.

ఒక రాత్రివేళ తాతగారికి మెళుకువ వచ్చి చూస్తారు. ఇంటి చుట్టూ వెతికి పడుకుంటారు.

అమ్మ తోటలో అడుగు పెట్టగానే చెట్లన్నీ ఇంతకాలం యెక్కడికి పోయినావన్నట్లుగా అలిగిన పసిపిల్లలల్లె ఒక్క ఆకైనా కదలకుండా మూతిముడుచుకు కూర్చుంటై. ఒక్క అరగంట జరుగుతుంది. చూస్తున్న కొద్ది సంతోషం ఆగక చెట్లన్నీ ఒకసారిగా కదిలి కౌగలించుకుంటై. చెట్లతో పాటు, చెట్ల మొదళ్లల్లో వుండే చీమలు, గాజు పురుగులు, యింకా అనేక రకాల పురుగులు శరీరమంతా పాకి యిన్నాళ్ళకు కనపడ్డావని ముద్దు పెట్టుకుపోతై, అవి ముద్దు పెట్టుకున్నప్పుడు శరీరం మీద యేదో తడి, అవుతుండేది. వుసుళ్లు అమ్మ శరీరమంతా మూగి వాటి రెక్కలు శరీరం మీద వదిలి ప్రాణాలు విడుసై. మిడతలు వాలి కరుచుకుని వదిలేవి కావు. అమ్మకు తీసివెయ్యాలనిపించేది. కాదు, వాటికి ఎంత మమకారమో అనుకుండేది. పక్కన మాగాట్లో నుండి యెలుకలు అమ్మ వొడిలోకి వచ్చి కూర్చుంటై, ముంగిసలు, పాములు కలిసి వొడిలోకి వచ్చి వాటి గుణాన్ని అవి మర్చేపోయి అమ్మను చూస్తూ ఆడుకున్నై.. అట్లా తెల్లవారు ఝామున నాలుగు గంటలు గడిచినది. జోరున వర్షం. పొలంలో నీళ్లు వెళ్లగొట్టుకోవటానికి కొట్టా పాపయ్య అనే రైతు వస్తాడు. అమ్మ 1 సం. – 2 సం.ల వయస్సప్పుడు అప్పుడప్పుడు ఎత్తు కుంటుండేవాడు. అమ్మ పెద్దదయిన తరువాత ఇదే చూడటం. అతనిని గుర్తించింది గాని అతను అమ్మను గుర్తించడు. అతను పోతరాజు దేవస్థానానికి (గ్రామదేవత) రోజూ వెళ్లి బియ్యం, బెల్లమూ కలిపి నివేదన చేస్తూ వుండేవాడు. అమ్మ రోజూ తొటలో నుంచి వచ్చే సమయం అతను పోతరాజు దేవస్థానంలో నివేదన చెయ్యటం రెండూ ఒకేసారి జరుగుతుండేవి. ఒకరోజు అమ్మ పోతరాజు దేవస్థానంలోకి వెళుతుంది. పాపయ్య నివేదన చేస్తుంటాడు అతను కళ్లు తెరచి చూసేసరికి అమ్మ పోతరాజు విగ్రహం దగ్గర నుంచుని వుంటుంది. పోతరాజే ఇట్లా దర్శన మిచ్చాడనుకుని అమ్మను కౌగలించుకుని, భుజంమీద పడుకో బెట్టుకుని ‘నాకు స్వామి దొరికాడు’ అని ‘నా పోతరాజు దొరికాడు’ అని కేకలు పెట్టుకుంటూ యింటికి తీసుకెళతాడు. పాపయ్య భార్య అతని భుజము మీద పడుకుని వున్న అమ్మను చూచి ‘యెందుకు ఈ అమ్మాయిని తీసుకొచ్చావు’ అని కిందికి దించుతుంది. భుజం తపుడుకుంటాడు. యెదరుగుండా వున్న అమ్మ తను యెప్పుడూ చూస్తుండే పిల్లేననుకుంటాడు. చిన్నప్పుడు తను యెత్తుకుండే పిల్లే యీ అమ్మ అనే గుర్తు కూడా లేదు.

సుబ్బలక్ష్మి : (పాపయ్య భార్య) ఆ అమ్మాయిని ఏడాది పిల్లప్పుడు యెత్తుకోలా? కరణంగారి అమ్మాయి.

పాపయ్య : కరణంగారి అమ్మాయిని నేనెరుగనూ, పసిపిల్లైతే.

సుబ్బలక్ష్మి : పాపయ్య :

యెప్పుడూ అట్లాగే వుంటుందీ, పెరగలా ! నీకు తెలీదులే వూరుకో, ఆ పిల్లవేరు.

సుబ్బలక్ష్మి : ఆ పిల్ల వేరేమో నాకు తెలియదు కాని యీ పిల్ల కరణంగారి కూతురు.

పాపయ్య : ఆ పిల్లపోలిక లేదేం యీ పిల్లకు.

సుబ్బలక్ష్మి : పెద్దదయిన పిల్లకు యెట్లావుంటుంది. దాదాపు పదకొండు సంవత్సరాలుంటై.

అమ్మ: నాకు పదకొండు సంవత్సరాలు కాదమ్మా ఇప్పుడు పడ్డానుగు సంవత్సరాలు. యింకా, కొద్ది రోజుల్లో పడ్డానుగు వెళ్లి పదిహేను వస్తాయి.

సుబ్బలక్ష్మి : పడ్డానుగు సంవత్సరాల పిల్లల్లే లేవమ్మా.

పాపయ్య: (భార్యతో) నా భుజం మీద దేముణ్ణి దించావు, యేమైనాడు ?

సుబ్బలక్ష్మి : నేను దించింది ఈయమ్మాయినే నమ్ము నమ్మకపో.

పాపయ్య: కాదే అంటుంటే.

సుబ్బలక్ష్మి : నీకు మతిపోయినట్టుంది. దేముడో రాముడో అని రోజూ పావలా ఖర్చు పెట్టి నివేదనలు మొదలు పెట్టావు. నీ మతి చెడిపోయింది. 

అమ్మ: నీ భుజము మీద పడుకుంది నేనే పాపయ్యా.

పాపయ్య : నీవు కరణంగారి అమ్మాయి నంటున్నావుగా.

అమ్మ: నీ యిష్టదైవం నా మాదిరిగా కనుపించాడు (ఆ మాట పాపయ్యకు అర్థం కాదు) నన్ను మళ్లీ భుజం మీద పడుకోబెట్టుకో యెట్లా వుంటానో చూడు.

పాపయ్య: భుజం మీద పడుకో బెట్టుకుంటాడు. అప్పుడు మొదట కనుపించినట్టు పోతరాజు స్వరూపంతో కనుపిస్తుంది అమ్మ.

అమ్మను గట్టిగా చేతులతో వత్తి ‘నువ్వేనా అమ్మ నువ్వేనా అమ్మా నా పోతరాజువు నువ్వేనా’ అని అడుగులేసుకుంటూ భజన చేస్తాడు. యిట్లా మూడు గంటలు చేస్తాడు వళ్లు తెలియకుండా. అమ్మ అతని ముఖము వంక చూస్తుంది.

పాపయ్య : అంతా నన్ను కన్నతల్లి అంటాడు.

సుబ్బలక్ష్మి : యేమిటి ఆ బిడ్డని అన్యాయంగా చంపుతావా యేమిటి! అంటూ చేతులు వూడదీస్తుంది అమ్మను దింపటానికి, ఆ సమయంలో ఆమెకు కూడ అమ్మ చిన్న ఆకారంగా కనపడుతుంది. ఆయనకే మతిపోయిందనుకున్నాను. నిజంగా యేమిటి యీ అమ్మాయి పరిస్థితి అని అనుమానపడుతుంది.

పాపయ్య: కదలకుండా నుంచునిపోతాడు. యెటు వేసిన చెయ్యి అటే కదిలించినా కళ్లు తెరవడు. కొయ్యబారి పోయి నుంచుంటాడు.

సుబ్బలక్ష్మి :(పాపయ్య భుజం మీద వున్న అమ్మను కిందికి దించి) పోదాం పద మరిడమ్మగారి దగ్గరికి, యేంటో ఈ సంగతి తెలుసుకుందాం. పెద్దతల్లి, దేముడంతది, అని. అమ్మను తాతమ్మగారి దగ్గరకు తీసుకెళుతుంది.

తాతమ్మగారు మడికట్టుకోను స్నానానికి వెళ్లబోతూ వుంటుంది. ఉదయం గం. 9 లు అమ్మను చేతబట్టుకు రావటం ‘చూచి యేమిటి దాన్ని తాకావు?’ (అమ్మతో)

అమ్మ: ఎప్పుడూ తాకేవున్నానుగా.

తాతమ్మ: యెప్పుడూ తాకటమేమిటి నీ ముఖం..

 అమ్మ: యీ సుబ్బలక్ష్మిని చేత్తో తాకటం కాదు. నేను అనేది అందరిలో వున్నది గదా. అందుకే యెప్పుడూ తాకే వున్నాను గదా అన్నాను.. విసుగు ముఖంతో అడిగిన తాతమ్మ యీ మాట వినగానే పకపకా నవ్వుతుంది.

సుబ్బలక్ష్మి : (ఆదుర్దాతో నేను వచ్చిన పనికాస్త వినండి మరిడమ్మగారు. (పాపయ్య, సుబ్బలక్ష్మి తెలగవారు)

తాతమ్మ : ఏమిటే ఇంకా వడ్లు ఎండబోయలా. వడ్లు యెండబోసి కబురు చేస్తా..

సుబ్బలక్ష్మి : అది కాదమ్మా నేను వచ్చిన పని వేరు, నామాట ఆలకించు.

తాతమ్మ : అదేలేవే నాకు తెలుసు వడ్లు యెండబోసి కబురు చేస్తా. యెండెక్కుతున్నది. సీతాపతికి ప్రొద్దెక్కితే వుండలేడు అని స్నానానికి బావి దగ్గరకు వెళుతుంది. సుబ్బలక్ష్మి వెంబడి పడుతుంది. నా పెనిమిటి ప్రాణం మీదకు

వచ్చింది మరిడమ్మగారు అని కేకవేస్తుంది. 

తాతమ్మ : ఏమిటి నేను అక్కడ వున్నంత సేపు వూరుకుని యిప్పుడు కేకలు వేస్తావు..

సుబ్బలక్ష్మి : : నేను యిందాకట నుంచి కొట్టుకుండేది ఇదే తల్లీ అని, పాపయ్య అమ్మను భుజాన యేసుకుని వచ్చిన దగ్గర నుండి అంతా చెపుతుంది.

తాతమ్మ: అమ్మను జూచి ‘యేమిటమ్మా?’ అని అడుగుతుంది.

అమ్మ పకపకా నవ్వి, నాకేం తెలియదంటుంది.

తాతమ్మ : అది అట్లా చెపుతుంటే పకపకా నవ్వుతావు నాకేం తెలియదంటావు. యేమిటో చెప్పు. తెలియకపోతే నవ్వు యెందుకు వస్తుంది.

అమ్మ: ఆ ఏమీ తెలియని నవ్వు..

తాతమ్మ : నీకా తెలియంది, నవ్వుకా. 

అమ్మ : నేనెవ్వరో నవ్వుకు తెలియదు. నవ్వు యెవరో నాకు తెలియదు.

తాతమ్మ : నువ్వు యెవరో నీకు తెలియకేం తెలుసు. 

అమ్మ: ఏమిటి నాకు తెలిసింది.

తాతమ్మ : నువ్వు అంటే సంతోషం, సంతోషానికి సూచన తెలియ పర్చటమేగా.

అమ్మ: యివి రెండూ మనసుకు సంబంధించినవే.

తాతమ్మ : అప్పుడు నవ్వు యెవరో నీకు తెలుసుగాని నువ్వు యెవరో నవ్వుకు తెలియదు.

అమ్మ : ఒక నవ్వే కాదు మీరు అందరూ యెవరో నాకు తెలుసు. నేను ఎవ్వరో మీకు తెలియదు.

తాతమ్మ : బావి తాగాడి మీద కాలు పెట్టి వంగి చెద వెయ్యబోతూ, నువ్వు యెవరో చెప్పు పోని, మాకు తెలియక పోతే మానె నువ్వు చెప్పు. బావి దగ్గర్లో వున్న మల్లెపందిరి కింద నుంచుని పరికిణి రెండు అమ్మ చేతులతో రెండు వైపులు, చూపుడు వ్రేలు బొటన వ్రేళ్ళతో పట్టుకుని, గిరగిరా గిరగిరా అల్లి బిల్లి తిరుగుతూ ‘మీరంతా నేనే, మీరంతా నేనే, యిదంతా నేనే యిదంతా నేనే’ అని ఆ ముక్కలతో పాట పాడుతూ తిరుగుతుంది.

సుబ్బలక్ష్మి : ఒక్కసారి మా యింట్లో అడుగుపెట్టి ఆయన్ని, ఏమిటో చూచిరా మరిడమ్మ తల్లీ కాసేపు పోతరాజు అనుకుంటాడు, కాసేపు ఆయన తల్లి అనుకుంటాడు. నీకు దణ్ణం పెడతా అని యేడుస్తుంది.

అమ్మ :ఏమిలేదు తాతమ్మా అతను పోతరాజు గుళ్లో నివేదన చేస్తున్నాడు. నేను ప్రసాదం కోసం లోపలకు వెళ్లాను. పోతరాజు విగ్రహం దగ్గర నుంచున్నాను. నన్ను భుజాన వేసుకుని తీసుకెళ్లాడు. ఇంతకు తప్ప నాకు యేం తెలియదు.

సుబ్బలక్ష్మి : ఆయన రోజూ నైవేద్యం యెత్తుకు పోతూనే వున్నాడు గదా, రోజే ఇట్లా ఎందుకు అయిపోవాలి.

అమ్మ నేను రోజూ ఆయన్ని చూస్తూనే వున్నా, ఈ రోజూ ప్రసాదానికి వెళ్లా. తాతమ్మ : నువ్వు రోజూ, అసలు అటు ఎందుకు వెళుతున్నావు ?

అమ్మ : పున్నయ్యగారి తోటలోనికి బైటికి వెళ్లినప్పుడు గుడి మీదుగా వస్తా.

తాతమ్మ : అతి భక్తిలో వొళ్లు తెలియక అతను, నిన్ను భుజాన వేసుకు వెళ్లాడనమాట.

అమ్మ: అంతే అంతే.

సుబ్బలక్ష్మి: ఇదేం ఖర్మో మా ఖర్మ ఎట్లావుందో. ఆయన ఏం పాపం, పుణ్యం తెలిసినవాడు కాదు.

అమ్మ : ఆయనకు పాపం, పుణ్యం తెలియక పోయినా భగవంతుడు తెలుసు కదా..

సుబ్బలక్ష్మి : భగవంతుణ్ణి తెలుసుకుంటే బాధేముంది అమ్మాయిగారు. నిన్ను జూచి భగవంతుడని భ్రాంతి పడ్డాడు గాని.

అమ్మ : అటువంటి భ్రాంతి చేత నన్ను భగవంతుడనుకున్నాడు. భ్రాంతిపోతే తనే భగవంతుడయ్యేవాడు.

సుబ్బలక్ష్మి : ముందు ఆయన్ని లేపే సంగతి చూడమ్మా మరిడమ్మ తల్లి.. ముందు ఆయన మత్తు వదిల్తే చాలు ఇవన్నీ నాకెందుకు.

అమ్మ: ఆయన మత్తు వదిలేవుంది. మనకే మత్తువుంది. 

తాతమ్మ : స్నానం చేసి నీళ్లు యింట్లో బెట్టి సుబ్బలక్ష్మి గారింటికి వెళ్తుంది. యీ గోల విని మన్నవ హనుమంతయ్యగారు వస్తారు. పాపయ్య సుబ్బలక్ష్మి, తాతమ్మ వెళ్లేటప్పటికి పడుకుని వుంటాడు. హనుమంతయ్యగారు చూచి సుబ్బలక్ష్మిని ఏం జరిగిందని అడిగి తెలుసుకుని యిది బహుశా సవికల్ప సమాధి అయి వుంటుంది. అంటాడు.

తాతమ్మ : అది సవికల్ప సమాధి కాదురా నాయనా, నిర్వికల్ప సమాధి అనుకుంటా.

హనుమంతయ్య : ఇది నిర్వికల్ప సమాధి అయితే పిల్ల భుజం మీద వేసుకువచ్చిన స్థితియేమిటి ?

తాతమ్మ : అది తన్మయావస్థ.

అమ్మ : తన్మయం అంటే తన్ను మర్చేపోయిన స్థితా.

హనుమంతయ్య : ఆ – నీకెందుకు చిన్నపిల్లవు, నువ్వు అవతలకు పో. అమ్మ యిది ఎన్ని సంవత్సరాల వాళ్లు వినాలి తాతయ్యా ?

తాతమ్మ : దీనికి వయస్సెందుకమ్మా.

అమ్మ * తాతయ్య వుద్దేశమేమిటో, ప్రహ్లాదుడెన్ని యేళ్లవాడు? ధృవుడెన్ని సంవత్సరాలవాడు?

హనుమంతయ్య : పిల్ల చిన్నదైనా పెద్ద యెక్కాలు చదువుకుందే !

అమ్మ: అసలు వొంట్లే రాని వాళ్లకు యెక్కాలు యేం వొస్తాయి. పాపయ్య లేచి కూర్చుని అమ్మకు నమస్కారం చేస్తాడు. యెవరు పిల్చినా పలక్కుండా అమ్మ వైపువే చూస్తూవుంటాడు. యీ స్థితి చూచి హనుమంతయ్యగారు, తాతమ్మగారు, యే సమాధి అయింది, యేమయింది నిర్ణయించలేకపోతారు. అతన్ని అడుగుతారు ఆ అమ్మాయిని చూస్తే ‘నీకు యెట్లా వుంది యేమిటి’

పాపయ్య:  నేను యేమీ చెప్పలేను చూడబుద్ధి అవుతున్నది. దణ్ణం పెట్టాలనిపిస్తున్నది.

(ఇంకా వుంది)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!