(అమ్మ జీవిత చరిత్రలో లభించిన ఒక అద్భుతమైన సంఘటనను ధారావాహికంగా ‘మదర్ ఆఫ్ ఆల్’ పాఠకులకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాము. సంపాదకులు)
(గత సంచిక తరువాత…)
హనుమంతయ్యగారు : ఇప్పుడేనా మొదట నుండి అట్లాగే వుండేదా.
పాపయ్య: అట్లా అంటే నాకేం తెలియదు మొదులు చివరా చూడాలనిపిస్తున్నది చూస్తున్నా.
హనుమంతయ్యగారు : భుజంమీద పడుకోబెట్టుకొచ్చింది యీ అమ్మాయినేనా? పాపయ్య అప్పుడు పడుకోబెట్టుకొచ్చింది పోతరాజునే యిప్పుడు చూచేది పోతరాజునే.
హనుమంతయ్యగారు : అదీ సంగతి! యిప్పుడు తేలింది. పోతరాజు అనే మూర్తిని తను చిత్రించుకుని లగ్నమయ్యే సమయంలో అమ్మాయి కనపడివుంటుంది. అదే యిదిగా అనుకుని భ్రమపడివుంటాడు. అంతకంటే మరేంలేదు భయపడాల్సిన పనేం లేదు. అతనే కుదుటపడతాడు. యేరకంగా ఆలోచించినా అతని స్థితి మంచిదే. మానవుల్ని భగవంతుడుగా గుర్తించాడు.
అమ్మ : మంచిది కాకపోవటమేమిటి మంచిదే! మానవుల్ని భగవంతుడుగా భ్రమపడ్డాడుగాని, భగవంతుణ్ణి మానవునిగా భ్రమపడలా. మనకంటే అతను ధన్యుడే యేదయినా భావమేగద !
తాతమ్మ : (హనుమంతయ్యగారితో యేమోరా అబ్బాయి నాకు యీసాకార పూజలు అలవాటు లేదు.
హనుమంతయ్యగారు : సాకారమే నిర్వికారంలోకి తీసుకెళుతుంది.
తాతమ్మ : నిజమే, అలవాటు లేదు వూరికే ధ్యానం చేయటం తప్ప. అమ్మ ధ్యానం యెవరిని చేస్తావు. యెట్లా చేస్తావు. ధ్యానం అంటే యేమిటి?
తాతమ్మ : దృష్టిని మనస్సుని ఏకం చేసి చూస్తా.
అమ్మ దృష్టిని మనస్సుని ఏకం చేసేది మనస్సే కద. అప్పుడు నీవు యెక్కడ వుండిచేస్తావు?
హనుమంతయ్య గారందుకుని విసుగుతో, నీకు “యెన్నిసార్లు చెప్పాలి చిన్నపిల్లవు నీకెందుకు?”
తాతమ్మ : చిన్నపిల్లెనా ఆత్మజ్ఞానం కలిగిన పిల్లే. అంత తెలియని పిల్లేం కాదులేరా. నాకు యిప్పుడు సమయం కాదు యింటికెళ్లి వంట చేసుకోవాలి. యింటికి వెళ్లి మాట్లాడుకుందాంలే అమ్మా. అమ్మ, తాతమ్మగారు యింటికి వస్తారు.
పాపయ్య : అమ్మ యెదురుగుండా లేకపోయినా పాపయ్య అదే దృష్టితో ఒకవారం పదిరోజులు మంచినీరు, ఆహారం, నిద్రా లేకుండా నడుస్తున్నా, యే పని చేస్తున్నా, తన యిష్ట దైవాన్నే చూస్తాడు. మొదలు తన దున్నలకు జబ్బు చేసినప్పుడు మొక్కుతాడు. వాటికి వెంటనే బాధ నివారణ అవుతుంది. రెండు సంవత్సరాలు నియమంగా ఆరాధించగా కలిగిన ఫలితం ఇది. తోటలో అమ్మకు కనపడే నాటికి ఇది జరిగి 9 నెలలు. నీళ్లు వెళ్లగొట్టటానికి చేనుకు వచ్చిన పాపయ్యకు అమ్మను చూచి యెవరో కూర్చుంది తెలుసుకుందామని ఆసక్తి కలుగుతుంది. చేలో వుండి “యెవరా కూర్చుంది?” అని కేక వేస్తాడు. అమ్మ పలకదు.
పాపయ్య (గట్టిగా) యెవరంటుంటేను.
అమ్మ అప్పుడూ పలకదు.
పాపయ్య దగ్గరకు వెళ్లి తెలుసుకుందామని కర్రనేలకు వేసి కొట్టుకుంటూ వస్తాడు. ఆ కర్ర చప్పుడుకు అమ్మ వొడిలోకి రాగా మిగిలిన జంతువులన్నీ కిచకిచలాడుతూ యే జంతువు గొంతు ధ్వనితో ఆ జంతువు అరుస్తూ యేం చేస్తారొ చూస్తాం మా అమ్మ దగ్గరకు పోతున్నాం అన్నట్లు పరుగెత్తుకు వస్తాయి. పాపయ్య జంతువులు పరుగెత్తటం చూచి, విని, ధైర్యం చేసి రాలేక మధ్యలో నుంచుంటాడు. లోగడ వున్నవి అప్పుడు వచ్చినవి అమ్మతో వాటి వాటి భాషతో మొరపెట్టుకుంటై.
అమ్మ : రా నాయనా యెందుకు అక్కడ నుంచున్నావు.
యెవరో యెక్కడో మనుషులు మాట్లాడినట్టు వుంటుంది గాని అమ్మ పిలిచిందనుకోడు. నాలుగు వైపులా చూస్తాడు.
అమ్మ : నేనే నాయనా పిల్చేది : (అమావాస్య ముందు త్రయోదశినాడు తెల్లవారు ఝామున నాలుగున్నర, తెల్లని చీరమీద కొద్ది వెన్నెల పడుతుంది. కాకులు కావు కావుమని అరుస్తుంటై. కాని అవి కేకవేసేది అమ్మా అమ్మా అనే. ప్రతి జంతువు వాటి వాటి గొంతులో వుండే ధ్వనితో అమ్మా అమ్మా అనే కేకలు వేస్తె అది మనకు అర్థం కాక రకరకాలుగా అనుకుంటాం) రా నాయనా, అవి వాటి అమ్మ దగ్గరకు వచ్చినై యెందుకు భయపడ్డావు.
పాపయ్య : మెల్లిమెల్లిగా అడుగులు వేసుకుంటూ దగ్గరకు వస్తాడు. యెవరమ్మా నువ్వు.
అమ్మ : నేను యెవరైతే యేంలే కూర్చో.
పాపయ్య :యింత చిన్నపిల్లవు అర్థరాత్రి వేళకొచ్చి కూర్చున్నావు అరిగివచ్చి కూర్చున్నావా?
అమ్మ : అవును అలిగాను.
పాపయ్యః యెవరి మీద తల్లీ. ఆడపిల్లవు యిట్లా రావచ్చునా. మంచి బుద్ధి కలిగివుండాలి గాని, యిదా పని? అసలు నీది యేవూరు, యే కులం యేమిటి కత, యేమన్నా తప్పు చేసావా?
అమ్మ : ఆ చేశా నాయనా చెప్పరాని తప్పునే చేశాను. చేయరాని తప్పు నువ్వు చేశావు.
పాపయ్యః అంటే నిన్నడగటమే తప్పనా? నీ కులం యేమిటంటే చెప్పలేదే.
అమ్మః నాకులమే నాయనా. పాపయ్య : నీ కులానికి ఒకపేరు లేదా.
అమ్మ : మీ అందరి కులాలు నాకులమే. నాకు వేరే కులం లేదు నాయనా.
పాపయ్య : నీకు వేరే కులం లేదన్నమాట. ఒక్క భగవంతుడికేగా కులం లేంది.
అమ్మ : ఆ సంగతి నాకు తెలియదు నాయనా.
పాపయ్య : (మెడవంచి చూసి) యీ జంతువులేమిటి యీ పెట్టలేమిటి? నువ్వు యెవరివి అసలు? యీ పాములు కరిస్తే చావవూ? భయంలేదూ. నీకు? అసలు నీవు యెవరివంటే?
అమ్మ : అసలు నేనే నాయనా. యివన్నీ నావే, నేనే.
పాపయ్య : యింకొక కాలు ముందుకు వేసి, కనపడక కర్ర వొళ్లో వేస్తాడు. ఆ కర్ర ఒకపాము నడుము మీద పడుతుంది. పాము తల పైకెత్తి అటూయిటూ తిప్పుతుంది పాపయ్య అర్థం చేసుకోడు. : కర్ర పైకెత్తు నాయనా తమ్ముడు నడుము మీద కర్ర పడ్డది. అమ్మ
పాపయ్యః తమ్ముడెవరమ్మా? యెక్కడ? (అని కర్ర పైకెత్తుతాడు) కప్పలు ఒకటి రెండు పాపయ్య మీదకు ఎక్కి కిందపడతై యీ పాడు జంతువుల్లో యెట్లా కూర్చున్నావమ్మా యేం కర్మ మొచ్చింది నీకు? యెంత కోపం వస్తే మాత్రం చోటు దొరకలా నీకు?
అమ్మ : పాడు జంతువులు కాదు నాయనా, యెంతసేపు నుంచునుంటావు. కూర్చో అన్నయ్యా అని పిల్చినాయి. వాటి భాష మనకు అర్థంకాక భాష.
పాపయ్య : (తెల్లవారుతున్నకొద్ది అమ్మవొడిలో వున్న జంతువులన్నీ స్పష్టంగా కనబడి అతను భయపడతాడు.) ఏం అమ్మా నీవు యెవరివి? మాంత్రికురాలివా? యెవరికయినా చాతబడి చేయటానికి వచ్చావా? కనికట్టు విద్య యేమైనా నేర్చావా? యేమిటి నీ సంగతి నిజంగా చెప్పమ్మా భయమేస్తున్నది నేను పోతున్నా. పోవటానికీ భయం వేస్తున్నది. నేను లేనిపోనిది వచ్చానే?
అమ్మ : నీకేం భయం లేదు నాయనా.
పాపయ్యః సరేగాని యేందమ్మా యింతకు ముందన్నావు ఆ అన్నమాటయేంటి. చెప్పరాని తప్పునే చేశాను. చేయరాని తప్పు నువ్వు చేశావు అన్నావే.
అమ్మః పోతరాజుకు నివేదన మానుకున్నావెందుకు. అది చేయరాని తప్పు.
పాపయ్యః నువ్వు చేసిన తప్పేమిటమ్మా?
అమ్మ : పిలుస్తున్నది నీవని తెలిసి నేను ఫలానా అని చెప్పకుండా నిన్ను తిప్పలు పెట్టటమే చెప్పరాని తప్పు.
పాపయ్యః నేను నివేదన చేయటం నీకు యెట్లా తెలుసు తల్లీ.
అమ్మ : నువ్వు యెందుకు మానుకున్నావో చెప్పితే?
పాపయ్యః యెక్కడ పడితే అక్కడ కనపడుతున్నాడు యింక నివేదన యెక్కడని చేసేది.
అమ్మః పొలంలో కనపడ్డాడా?
పాపయ్యః కాస్త తల్చుకుంటే చాలు కరణంగారి అమ్మాయిలాగ కనపడతాడు. నీవు నమ్ము నమ్మకపో, యిందాకటి నుంచి లేదుగాని యిప్పుడు నీ దగ్గర కూడా కనపడుతున్నాడు.
అమ్మ : ఇంతకు ముందు మాంత్రికురాలివా అంటివే.
పాపయ్యః అప్పుడు అట్లా కనపడ్డావు, క్షణ క్షణానికి నీ రూపం మారుతున్నదమ్మా. “ఆ తండ్రి నాకు యిన్ని రూపాల్లో కనపడుతున్నాడా” అని ఒక్కొక్క అక్షరమే నిమ్మళంగా అంటాడు. లేకపోతే యిన్ని రకాల జంతువుల్ని వొళ్లో కూర్చోబెట్టుకుని యిట్లా యీ రకంగా చెప్పటం మానవులకు సాధ్యంకాదు. అప్పుడు కరణంగారి అమ్మాయి మాదిరిగా దర్శనమిచ్చి, ఇప్పుడు యీ రూపంగా మనుషులు, విష జంతువులు పిపీలికాది, అంటే ఆపై మాట నోరు తిరగదు. అన్నీ నేనేనని యిట్లా చూపిస్తున్నావా నాయనా, అని అమ్మను కౌగలించుకుంటాడు. అప్పుడైనా అందరికీ కరణంగారి అమ్మాయల్లే వుందిగాని నాకు యేమిటో చెప్పలేని పరిస్థితి. చూడగా చూడగా నీవెవరమ్మా కరణంగారి అమ్మాయివా? కరణంగారి అమ్మాయల్లేవున్నావే.
అమ్మ : నీకు యెట్లా కనపడితే అట్లా చూడు నాయనా.
పాపయ్య : అట్లాగే వున్నావమ్మా. కరణంగారి అమ్మాయల్లేనే వున్నావు. పోతరాజు నీమీద పూనికై వున్నాడన్నమాట.
అమ్మ : అంటే యేమిటి పాపయ్యా.
పాపయ్య : పోతరాజు యెవరికి దర్శనమివ్వాలన్నా నీ రూపంతో యిస్తాడన్న మాట.
అమ్మ: ‘తెల్లవారింది నాన్నా’ అంటూ పాము తలకాయ మీద చెయ్యి పెట్టి నిమురుతూ అంటుంది. అట్లాగే అన్ని జంతువుల శరీరం మీద సవరిస్తూ బుజ్జగించి ఆడుకుంటుండండి నేను వెళ్లి వస్తా అని పైకి లేచి నుంచుంటుంది. జంతువులన్నీ ఒక్కసారి కాలికి చుట్టేసుకుని మేముండం నీతో వస్తామని మారాం చేసై. పాపయ్య విచిత్రంగా చూస్తుంటాడు.
అమ్మ : వద్దమ్మా మీరు యిక్కడే వుండండి. మిమ్మల్ని యెవరన్నా చంపుతారు. మీకు మనస్సూ, ప్రాణమూ వున్నది. మనుషులకు వుండే గుణాలే మీకూవున్నై అని మిమ్మల్ని వారు (మనుష్యులు) గుర్తించ నంత వరకు, మీరు యెక్కడ వాళ్లకు దొరికితే అక్కడ పట్టుకు చంపుతారు. మీ శరీరానికి వత్తిడి తగిలి ప్రాణం పోతున్నది. తప్పని సరి అనుకున్నప్పుడే మీరు కరుస్తారు. యీ మనుష్య జాతి అట్లాకాదు. వాళ్ల మనస్సుకు కష్టం తోచినా చాలు యిష్టం లేకపోయినా చాలు ఒకరి నొకరు అర్థం చేసుకోలేక పోయినా, ఒకరకమైన మనస్సు ఒకరిదై, యింకొక రకమైన మనస్సు మరి ఒకరిదై, వారి వారి మనస్సును బట్టి ఒకరినొకరు అర్ధం చేసుకుని ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకోలేక కలహాలు పెంచుకుని అనుక్షణం కరుచుకుంటూనే వుంటారు (అంటే అనుక్షణం ద్వేషించుకుంటూనే వుంటారు) (పాపయ్యతో), కాదూ పాపయ్యా? పాపయ్య : మంచిమాట చెప్పావమ్మా. కానీ, నీవిప్పుడు మాట్లాడినవన్నీ వాటికి
అమ్మ : యింతకు ముందంతా నేను చెప్పిందదేగా. వాటికి అర్ధమయిందో లేదో మనకు అర్ధం కాదు.
పాపయ్య : అయితే అమ్మాయిగారు, వాటి భాష నీకు అర్థమవుతుందా అమ్మా.
అమ్మ : పోతరాజును పట్టుకుని అమ్మాయిగారు అంటున్నావే?
పాపయ్యః యెందుకో అమ్మా ! యిప్పుడు అట్లా అనిపించింది. యిప్పుడు యీ జరిగేవన్నీ తీసుకెళ్లి వూళ్లో యెప్పుడెపుడు చెపుదామా అనిపిస్తున్నది.
అమ్మః నీవు చెప్పినా యెవరూ నమ్మరు. ప్రత్యక్షంగా చూస్తేనే కాని నమ్మరు. నీకు 9 నెలల నుండి పిచ్చెక్కిందని వాడుక. నీమాట యెవరు లెక్క చేస్తారు పాపయ్యా. నీకెందుకు? నీవు చూచిందాన్ని నువ్వు గుర్తు పెట్టుకుని నువ్వు ఆనందపడు.
పాపయ్యః అంటే తేళ్లను, పాములను, జంతువులను, పక్షులను చెట్లను గుర్తు పెట్టుకోమంటావా.
అమ్మ : అవును అవన్నీ పోతరాజు స్వరూపమని గుర్తుపెట్టుకో.
పాపయ్యః ఇవన్నీ పోతరాజల్లే కనబడితే గుళ్ళోకెళ్లి దణ్ణం పెట్టుకోవటం
అమ్మ : మరి యెందుకు మానుకున్నావు.
పాపయ్యః అప్పటి నుంచీ యెప్పుడు జ్ఞాపకమొస్తే అప్పుడు నీరూపంతో కనపడుతూ వుంటాడమ్మా.
అమ్మ : యేంటో రకరకాలుగా చెపుతావు.
పాపయ్యః నాకు మాట్లాడటం చేతకాకపోయినా ఒక నమ్మకం వుందమ్మా యివన్నీ పోతరాజల్లే కనపడకపోయినా, యివన్నీ ఆ తండ్రి చేత యేర్పడ్డవనే నమ్మకం వున్నది.
అమ్మ : యెట్లాగైనా ఒకటే, వూళ్లో మాత్రం చెప్పకు, పోతరాజు కోప్పడతాడు
పాపయ్యః సరేలే అమ్మా సరేలే! ఆయనకు కోపం రాకుండా చేయి. (అమ్మ, పాపయ్య కట్ట మీదవున్న రావిచెట్టు కిందకు వస్తారు. బాగా తెల్లవారుతుంది. కొంగలు, నీటి బాతులు చెర్లో అప్పుడే కదులుతూవుంటై. పాపయ్య యింటివైపు వెళ్లబోతూ) చెరువు చూడమ్మా యెంత వరవడిగావుందో అంటాడు. నిన్న సాయంకాలం యింత చెరువు లేదు.
అమ్మ : చెరువు యెప్పుడూ వుంది. నీళ్లు నిండినై.
పాపయ్య : నీళ్లు వుంటేనే కద అమ్మాయిగారు చెరువు అయ్యేది.
అమ్మ : నీళ్లు నిలవటానికి త్రవ్వి పారుదల లేకుండా నాలుగువైపులా చదరంగా యేర్పరచిందాన్ని చెరువు అంటారు. బావిలో నీళ్లు వుంటే చెరువు అంటారా? నీళ్లు వున్నచోటల్లా చెరువు అంటున్నారా? నేను చిన్నపిల్లను కాదు మా తాతను అడిగి చెరువు అంటే యేమిటో చెపుతాలే.
పాపయ్య : అదేమిటమ్మా అదేమిటి? అని పెద్ద పెద్దగా అరుస్తూ, నీళ్లు పరుగెత్తుకు వస్తున్నై, నీళ్లు, పక్షులు పరుగెత్తుకు వస్తున్నట్టున్నై చూడమ్మా యెన్ని రకాల పక్షులు? ఆ ధ్వని యేమిటి? నీళ్లకు ఆ ధ్వని వుంటుంది. కోయిలలు, పాలపిట్టలు, గోరంకులు, పావురాలు, ఒక రకం ఏమిటి, చిలకలు అవి యెన్ని రకాలు వున్నాయో, అన్ని రకాలు, గుడ్లగూబలతో సహా, అమ్మ చుట్టూ ప్రదక్షిణం చేసినట్టు తిరిగి చెట్లు యెక్కుతై. మేం అమ్మా యేమిటి యీ పక్షులలోకం. మానవ లోకంలోనే పక్షులు తిరుగుతున్నై.
అమ్మ : పక్షులు మానవులకొరకే యేర్పడ్డె. మానవులు పక్షులకోసం యేర్పడ్డారు. ఒక మానవులేమిటి, ఒకదానికి ఒకటి అవసరం. ఆ అవసరం యెట్లా వుంటుందంటే, విస్తరి కావాలి – బాదం చెట్టుతో అవసరం. చింతపండు కావాలి – చింతచెట్టుతో అవసరం. మిరప కావాలి – మిరపచెట్టుతో అవసరం. ఉప్పు కావాలి – సముద్రముతో అవసరం. ఉప్పు అవసరం కదా అని వట్టి ఉప్పును తినలేం. విస్తరి అవసరం కదా అని వట్టి విస్తరి తింటామా! ఒకటి అవసరమైనా యింకొకదాన్తో కలిస్తేకాని ఆ వస్తువు వుపయోగపడదు. ప్రొద్దు కూకిందాక దీపం గుర్తుకు రాదు. దీపంతో అవసరం కలగాలంటే చీకటి రావాలి. అట్లాగే యిట్లాంటివి యెన్నో వున్నై. ప్రపంచమంతా యీ ద్వంద్వాలతోనే వుంది. అన్నీ మనకు అవసరం. మనం అన్నిటికీ అవసరం. (అమ్మ చెరువు వైపు యింకా రెండడుగులు ముందుకు వేస్తుంది. వూరు జనం అప్పుడే చెంబులు చేతబట్టి కట్ట వైపుకు వస్తూంటారు. అరుణోదయం అవుతున్నది. అమ్మ చెరువులో కాలు పెడుతూ) ‘రా, పాపయ్యా చెర్లో స్నానం చేసి పోదాం’.
పాపయ్యః నాకు ప్రొద్దున్నే… అని సరే వస్తాలే అమ్మా అని అతను చింతపుల్ల విరిచి నోట్లో పెట్టుకుని అమ్మకు ఒక పుల్ల తీసుకువస్తాడు.
(ఇంకా వుంది)