1. Home
  2. Articles
  3. Mother of All
  4. పోతరాజు కథ

పోతరాజు కథ

Unknown
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 15
Month : January
Issue Number : 1
Year : 2016

(గత సంచిక తరువాత…)

కాకి రావి చెట్టు మీద తన బిడ్డలకై కట్టుకున్న గూటిలో నుండి ఒక పుల్ల తెచ్చి అమ్మ పాదాల ముందు పడేస్తుంది.

పాపయ్య : పుల్లతెచ్చి యిదిగో అమ్మా అంటాడు.

అమ్మ : యెందుకులే నాయనా కాకి తెచ్చి యిచ్చిందిలే. 

పాపయ్య ః యివ్వటం కాదమ్మా అది కరుచుకుపోతూ పోతూ వదిలి పెట్టింది. అదేం పుల్లో పాడుపుల్ల.

 అమ్మ : నేను యింతకు ముందే చెప్పాను కదా నాయనా! వాటి భాష మనకు

పాపయ్య : అయితే మాకర్థం కాదు, నీకు అర్థం అవుతున్నదనేగా నీవు చెప్పటం. 

అమ్మ: నేను చెప్పేదే ముంది మీతో కాలం గడుపుతున్నట్లే వాటితో కాలం గడుపుతున్నాను.

పాపయ్య ః నీ దృష్టిలో మనుషులు యితర జంతువులు ఒకటిగానే వున్నై.

అమ్మ : “ఆఁ అవును” అని యితరమని అనిపించటం లేదు అన్నీ “నేనే” నని అనిపిస్తుంది.

పాపయ్య ః అన్నీ నీవే అనిపిస్తే యెట్లా చేస్తుంటా ఈ పనులన్నీ. అమ్మ: నేను అన్ని రూపాలై అన్నింటిని వాడుకుంటున్నా ననుకుంటా.

పాపయ్య ః యేదోలే అమ్మా! అడుగుతానే కాని నాకు యేం తెలియదమ్మా శూద్ర ముండా కొడుకుని, ఆ ఒక్క పోతరాజు తండ్రిని కొల్చుకోవటమే తప్ప యితర మేమీ తెలియదు. మీ మారుతల్లి పొలం నేనే చేస్తూ వుంటా.

అమ్మ : యేదీ తెలియకుండా వాడొక్కడ్నే తెలుసుకోవటం కంటే కావలసిందేముంది. అందరూ చేసే ప్రయత్నం అదే. నీవు చాలా ధన్యుడివి పాపయ్యా. యిద్దరం ముఖం కడుక్కుని స్నానం చేద్దాం. లోపలకు రా.

కట్టమీద వచ్చేవారు పొయ్యేవారు అమ్మను చూచి కార్తీక స్నానాలు చెయ్యటానికి వచ్చినట్టుంది. మరిడమ్మగారు కూడా లేకుండా వచ్చిందే. వూళ్లో లేదుగా యెప్పుడొచ్చిందో అని మెల్లిగా అనుకుంటూ పలకరించబోయి యిప్పుడెందుకులే అనుకుని వెళ్లిపోతారు.

పాపయ్య : అమ్మా ! చెరువు సంగతి అడిగితే చెప్పలేదేం? యేమిటి ఈ ధ్వని.

అమ్మ : యేమీ లేదు నాయనా, ఆ జంతువులల్లేనే చెరువు కూడా యెప్పుడొచ్చా అమ్మా అని పలకరించి నవ్వుతున్నది. 

పాపయ్య : చెరువుకూడా నువ్వు అమ్మవనే అనుకుంటుందా అమ్మా!

అమ్మ : ఆఁ! అనుకుంటుంది.

పాపయ్య ః యీ తెల్ల కల్వ పూవులు యీ యెర్ర కల్వ పూవులు యీ ఆకులు తీగలు యెందుకు యిట్లా వుత్సాహంగా కదిలిపోతున్నై.

అమ్మ : మార్గశిర మాసం కదూ నాన్నా! కళకళలాడుతూ అన్నీ అలంకారంతో అమ్మ దగ్గరకు చేరి ఆడుకోవాలని కోరికతో అట్లా ఉవ్విళ్లూరి వూగివూగి ఒక్కసారి అమ్మవొడిలో పడుతై.

మరిడమ్మ తాతమ్మగారు యింకా కొంతమంది కలిసి స్నానాలకు వస్తారు. కట్టమీద నుండి కాకుమాను లక్ష్మాయమ్మగారు చెర్లోకి దిగుతున్న మరిడమ్మగార్ని యేం మరిడమ్మక్కా! తెల్లగా తెల్లవారి స్నానాలకు వచ్చారు. కృత్తికా స్నానాలు యిప్పుడా చేసేది.

తాతమ్మ (మరిడమ్మ) : జోరున వర్షం! యేం చెయ్యమంటా అమ్మా. లక్ష్మాయమ్మగారు : నీకంటే ముందే వచ్చి ఆ చెర్లో దిగుతున్నది. పక్షులతో పూలతో యేదో మాట్లాడుతున్నట్లున్నది, మీ మనుమరాలు అనసూయ యెప్పుడు వచ్చిందేం.

తాతమ్మ : ఊ – రాత్రే వచ్చిందమ్మా. యెప్పుడొచ్చింది చెరువుకు నేను చూడే లేదు. యింటి దగ్గర కనుపించకపోతే గదిలో పడుకుని నిద్ర పోతున్నదేమోననుకున్నా. యేది యెక్కడున్నది?

లక్ష్మమ్మ : అదే ఆ రేవు దగ్గర పున్నయ్యగారి తోట వైపున, అదిగో దిగుతున్నది. ఇప్పుడిప్పుడే తామరపూలకు పై యెత్తుననుంచునుంది. కూడా ఒక మొగ మనిషి కూడా వున్నాడు. దూరానికి మన కొట్టా పాపయ్య మాదిరిగా వున్నాడు.

తాతమ్మ : లక్ష్మా యమ్మా ! ఎటూ యింత దూరం వచ్చావుగా స్నానం చేసి పోదాం దిగరాదూ? దాదాపు 40 మంది జనం చెరువు నిండా స్నానాలు చేస్తూ సూర్యుడికి అర్ఘ్యం యిచ్చుకుంటూ పాటలు పాడుతూ స్నానాలు చేసి దీపాలు వెలిగించి నీళ్లల్లో వొదిలి పెడతారు. కొందరు నారింజకాయడిప్పల్లో, కొందరు కొబ్బరి చిప్పల్లో, కొందరు అరిటాకు డిప్పల్లో జ్యోతులు వెలిగించి నీళ్లల్లో వొదిలిపెడతారు. ఆ గ్రామంలో మార్గశిర మాసంలో కూడా స్నానాలు చేసి దీపాలు పెడతారు.

అమ్మ వీళ్లకు యెదురుగుండా తూర్పు ముఖం పడమట దిక్కున రేవులో దిగుతుంది. అమ్మ రేవులో అడుగుపెట్టగానే పూలన్నీ యెవరో వూపినట్లు వూగుతూవుంటై.

అమ్మ : “వస్తున్నా! వస్తున్నా!” అని పూల దగ్గరకు వెళుతుంది. ప్రతి పువ్వు అమ్మ గుండెలకు ఆనుకుని పెద్ద సుడిగాలిలో కొట్టుకుని తల్లి వొడిలో వ్రాలాం అన్నట్లు నిద్రిస్తాయి. అమ్మ చెర్లో వున్న ప్రతి పువ్వును, ప్రతి ఆకును, ప్రతి తీగను, తాకి వాటిని గుండెలకు హత్తుకుని వోదారుస్తుంది.

పాపయ్య ః అమ్మా! యీ పువ్వులు ఆకులు తీగలు నిన్ను చూచినప్పుడు ఒక రకం, నీవు దగ్గర పోయినప్పుడు ఒక రకం, నీవు తాకినప్పుడు ఒక రకం, యిన్ని రకాలుగా వుంటై యెందుకు? ఆ పూలల్లో గూడ తాకినప్పుడు అన్నీ ఒక రకంగాలేవు. నేను చూస్తూనే వున్నాను.. ప్రతిపువ్వుకూ మార్పు వచ్చింది కాని, అన్నీ ఒకే రకంగా కాదు. రకరకాల మార్పులతో కనపడ్డా. యెందుకమ్మా నాకు అట్లా కనుపించినయ్యా? వాటికి అట్లా వచ్చినయ్యా?

అమ్మ : నీవు యింత శ్రద్ధతో యెట్లా కనిపెట్టావు? నీకెందుకొచ్చింది యీ అనుమానం?

పాపయ్య ః తెల్లవారు ఝామున మన జంతువుల్ని నీ వొడిలో చూచినప్పటి నుండి యిదేమిటో తెలుసుకుందామని కలిగింది. అప్పుడు నీవు చెప్పినా నీ మాట మీద నమ్మకం కలగలేదు. కాకి పుల్ల తెచ్చి యిచ్చిందని అన్నప్పటి నుండి, పక్షులన్నీ నీ చుట్టూ తిరిగినప్పుడు యిది యేమిటో తెలుసుకోవాలనిపించింది. చెరువులో నీటి ధ్వని యెన్నడూ విననిది. నువ్వు అడుగుపెట్టగానే పువ్వులు వాలటం యెదురుగుండా కళ్ల యెదుట కనపడ్డది. దాని తరువాత ప్రతిదీ శ్రద్ధతో కనిపెట్టాను. యిది అంతా యెట్లా వున్నా నాకు పోతరాజుగా దర్శనమిచ్చిన తల్లివి – అబద్ధం యెట్లా చెపుతావు? నీవు యేది చెప్పినా నిజమే. కాదు కాదు – పొరపాటు. నిజం నువ్వు చెప్పటం కాదు. నీవు చెప్పింది నిజమవుతుంది తల్లీ.

అమ్మ : ఇంత బాగా మాట్లాడటం యెప్పుడు నేర్చుకున్నా పాపయ్యా ? పాపయ్య ః అంతా నీ దయే తల్లీ! గంపెడంత కన్ను పెట్టుకుని కాపాడే తల్లివి. నీకు తెలియందేముంది.

అమ్మ : అది సరే కాని చూడు. పై వరస చూడు, ఆ దీపాలన్నీ బారులు తీర్చి ఒక్కటిగా వస్తున్నై. యెంత బాగుందో చూడు. ఆకాశాన నక్షత్రాలు యెట్లా వున్నయ్యో యీ చెర్లో దీపాలు అట్లా వున్నై. వస్తున్నై చూడు. నడుస్తున్నై, ఆకాశాన చుక్కలు యిట్లా నడుస్తున్నట్లు కనపడవు.

పాపయ్య ః వాటి చూపు నీవైపే వున్నదమ్మా! చూడు! దీపం పైకొన నీవైపే చూస్తున్నది. యిటే వస్తున్నట్టున్నై. దగ్గరకు పోదామా అమ్మా. వొద్దులే అవి యెటు వస్తయ్యో చూద్దాం. యిది గూడ కనిపెడదాం.

 అమ్మ : యెప్పుడో కనిపెంచాను. యిప్పుడు కనుపించాను.

పాపయ్య : యేమిటమ్మా మళ్లీ అను.

అమ్మ: ఏం లేదు నాయనా యిప్పుడన్నమాటేగా.

పాపయ్య : నాకు అర్థం కాలేదు ఇంకొకసారి వినాలని వుంది.

అమ్మ : నువ్వు అను. నీ నోట పలుకుతేందేమో చూస్తాను. 

పాపయ్య ః అంటే యేనాడో కనిపెంచి, యీనాడు కనుపించావా? దీని అర్థమేమిటమ్మా.

అమ్మ : యేమీలేదు. నిన్ను, ఒక పిల్లవాణ్ని కన్నాననుకో అయిదేళ్ల ఆరేళ్ల పెంచాను. యెవరికో పెంపుడిచ్చాను. పాతిక సంవత్సరాలో నలభై సంవత్సరాలో వచ్చిం తరువాత నేను వెళ్లి నేను మీ అమ్మను అంటే యెట్లా వుంటుంది. ఇదే స్థితి.

పాపయ్య ః యింకా అర్థమయ్యేటట్టు చెప్పమ్మా. 

అమ్మ: యింకా యింతకంటే యేం చెప్పేది. అంటుండగానే దీపాలన్నీ ఒక్కసారిగా లైనుగా వున్నవల్లా వంపు తిరిగి గుండ్రంగా మెలికలేసుకుని అమ్మ దగ్గరకు వస్తే.

పాపయ్య : ఆ మెలికలు చూడమ్మా ఎట్లా వున్నయ్యో. ‘అమ్మా’ అని రాసినట్లున్నై నీ దగ్గరకు అవి అమ్మా అని తలవంచి నీ వొళ్లోకి వస్తున్నై – ‘అమ్మా’ అని గుండెలు కొట్టుకుంటూ! అబ్బా యెంత చిత్రం! నా పోతరాజు యెన్ని రూపాల్లో దర్శనమిస్తున్నాడు. అమ్మే పోతరాజు, పోతరాజే అమ్మ అని గుండెలు కొట్టుకుంటూ యీ వూరంతా యీ అమ్మకు కొబ్బరికాయలు కొట్టకూడదూ యింకా గుళ్లెందుకు. వేరే దేముళ్లెందుకు. యెవరో చిన్నపిల్లగా అనుకుంటున్నారు, యీ వూరంతా యిట్లా కనపడేటట్టు చేయమ్మా, యేనాటికైనా యీ వూరంతా నీకు కొబ్బరి కాయలు కొడతారా తల్లీ.

అమ్మ : ముందు తలకాయ పగలకొట్టి పంపిస్తారు. తరువాత కొబ్బరికాయ మాట.

పాపయ్య : భీ, అయ్యో, అదేమిటి తల్లీ అట్లా అంటావు. అమ్మ : రెండూ వింటావుగా, అంటూ చెర్లోకి లోపలకు వెళ్లి పావుగంట కనపడకుండా పది గజాల దూరం పోయి తలెత్తి పాపయ్యా రా! యిక్కడున్నా! అని కేకవేసి మళ్లా తలముంచుతుంది.

పాపయ్య : అమ్మ తలయెత్తిన చోటికి యీత కొట్టుకుంటూ వస్తాడు. అమ్మ : పాపయ్య బయలుదేరిన చోటుకు వెళ్లి పాపయ్యా నేను యిక్కడ వున్నా రా! అంటుంది.

పాపయ్య ః యెందులో బెట్టినా యేదో గొప్పతనమే కనపడుతున్నది. పాముతల బైటకు పెట్టినట్లు ఎప్పుడో ఒకసారి తల బైట పెడుతున్నది. పామే నయం-తల బైటబెట్టి యీత కొడుతుంది. తలముంచితే చస్తానేమోనని దానికీ భయం. యీ తల్లికి భయమే ముంటుంది. అనుకుని అమ్మవున్న వైపుకు యీత కొట్టుకుంటూ వెళతాడు. అమ్మ తలపైకెత్తి, పాపయ్యా! యిద్దరం ఆడుకుందాం రా! అని చెర్వుకు నాలుగు మూలలా మామూలు యీత కొడుతూ పాటలు పాడుకుంటూ గంటా గంటన్నర సేపు ఆడుకుని గట్టెక్కుతుంది.

తాతమ్మ ః స్నానం చాలిందా? యిప్పుడైనా యింటికి వస్తావా? 

అమ్మ : నేను స్నానానికే వచ్చా! యెందుకు రాను? అంటూ ఆ తడి గుడ్డలతో తాతమ్మ గారి కంటే ముందు యింటికి వెళుతుంది.

(సమాప్తం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!