1. Home
  2. Articles
  3. Mother of All
  4. ప్రమాదం అంటే తెలియనిది

ప్రమాదం అంటే తెలియనిది

A V R Subramanyam
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 17
Month : July
Issue Number : 3
Year : 2018

“ప్రమాదం అంటే తెలియనిది. రాబోయే క్షణం ప్రమాదం, సృష్టి ప్రమాదం. అంటే – జరగబోయేది తెలియకపోవటమే ప్రమాదం. మంచికానీ, చెడుకానీ ఏదైనా కానీ; సరిగా చెప్పాలంటే తను ఒకటనుకుంటే ఇంకొకటి జరగటం ప్రమాదం.

పెట్టి లగ్నానికి పెళ్ళి జరగక ఆ లగ్నం మారినప్పుడు ఎంతో ప్రమాదం జరిగిందనుకుంటాము. ఇక్కడ ప్రమాదం కళ్యాణమౌటమా? కాదు.

అనుకున్నదానికి బదులు ఇంకొకటి జరగటం.  కాలవ్యవధి ప్రమాదమైనది.

వ్యావహారికంలో ప్రమాదం అంటే కష్టమైనది అని అర్థం చెప్పు కుంటాము” – అన్నది అమ్మ మాట తల్లిమాట తొలిమాట.

జరగబోయేది తెలియకపోవటమే ప్రమాదం. కాగా అది కాకతాళీయమో యాదృచ్ఛికమో కాదు: ముందుగా నిర్ణయింపబడినది. కానీ వ్యావహారికంగా ప్రమాదం అంటే కష్టదాయకమైనది, కన్నీళ్ళు పెట్టించేది (dangerous) అని అర్థం చెప్పుకుంటాము.

ఒక సుఖం తర్వాత ఒక దుఃఖం, ఒక దుఃఖం తర్వాత ఒక సుఖం ఎలా వస్తాయో, పోతాయో ముందుగా తెలియదు. రెండు సుఖాల మధ్యకాలం (అంతరం) దుఃఖం అనీ, అలాగే రెండు దుఃఖాల మధ్యకాలం సుఖం అనీ. నిర్వచించవచ్చు. అట్టి సుఖదుఃఖాల సమాహారము (a juxtaposition of gay and grief) నకు రెండు స్వీయ అనుభవాల్ని వివరిస్తాను.

డిసెంబరు నెలలో నేను, నా భార్య, మా అమ్మాయి చి.సౌ. హైమ, రెండేళ్ళ మనవరాలు చి॥ శ్రీవిద్య జిల్లెళ్ళమూడి వెళ్ళి 15 రోజులున్నాము. శ్రీవిద్య పుట్టిన తర్వాత అమ్మదర్శనం చేసుకోవటం తనకి అదే ప్రథమం. తనకి అంతఃపూర్వం మాటలు బాగా వచ్చేవి కావు. శ్రీ అనసూయేశ్వరాలయంలో అమ్మకి నమస్కారం చేయించి, అమ్మ నామం చెబితే చక్కగా చెప్పింది. ఆ క్షణం నుండి మాటలు గంగా ప్రవాహంలా వచ్చాయి.

17-12-2017 తేదీన హైదరాబాద్ తిరుగు ప్రయాణమైనాము. కృష్ణా ఎక్స్ప్రెస్ A.C. III Tierలో రిజర్వేషన్ తీసుకున్నాం. బాపట్ల రైల్వేస్టేషన్కి గంట ముందే చేరుకున్నాము – రెండు పెట్టెలు, మూడు సంచీలతో రైలు వచ్చి ఆగింది. B1 పెట్టి ఆగవలసిన చోట 01 పెట్టె ఆగింది. నాలుగు పెట్టెలు దాటి వెళ్ళాలి. ముందు నా భార్య, అమ్మాయి, మనవరాలు వెడుతున్నారు. లగేజ్ తీసుకుని నేను త్వరత్వరగా అడుగులు వేస్తున్నాను. రైలులో ఉన్నవారు చంటి పిల్లను అందుకుని త్వరగా ఎక్కమని తొందర చేశారు. మేము గమనించలేదు. Signal ఇవ్వటం, రైలు కదలటం జరిగిపోయింది. శ్రీవిద్య మాత్రమే రైలులో ఉన్నది. మేము ముగ్గురం, లగేజి ప్లాట్ఫారం మీదే ఉన్నాము.

‘మా పిల్లను మాకు ఇచ్చెయ్యండి’ అని కేకలు వేస్తున్నాను. నాకు అయోమయమై పోయింది. నాకూతురు, భార్య పరిస్థితి నాకు తెలియదు. రెండేళ్ళ పసిపిల్ల. మాటలు సరిగా రావు. ఎక్కడో ఒక పోలీసు స్టేషన్లో వప్పగిస్తే ఏం చేయాలి మేము? అంతసేపు తల్లిని వదిలి ఉంటుందా? ప్రశ్నలేవీ ఉత్పన్నం కాలేదు. మనస్సు Blank అయిపోయింది.

క్షణకాలంలో రైలు ఆగింది మళ్ళీ. అమ్మ దయవలన ( ఈశ్వరానుగ్రహం వలన) ఎవరో మా అవస్థ చూసి చైన్ లాగారు. తక్షణం రైల్వే సిబ్బంది హుటాహుటిన వచ్చి మమ్మల్ని, మాలగేజిని మా స్థానాల్లో కూర్చుండ బెట్టి వెళ్ళారు. రైలు మళ్ళీ కదిలింది: గుండె కుదుట పడింది.

దర్జాగా రిజర్వేషన్ తీసుకున్నాం, display చూసి సిద్ధంగా ఉన్నాం. ఇది సంతోషం. తర్వాత పసిపిల్ల మాత్రమే రైలులో ఉండటం, రైలు కదలటం దుఃఖం. చైన్లాగటం వలన రైలు ఆగటం, క్షేమంగా మా సీట్లో కూర్చోవటం సుఖం మళ్ళీ. చక్రవత్ పరివర్తనే సుఖానిచ దుఃఖానిచ – ఒక దాని తర్వాత ఒకటి వచ్చి పోతూ ఉంటాయి. వాటి ‘transition’, ‘time interval’ నే అమ్మ ‘కాల వ్యవధి’ అన్నది. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరగటం – అదే ప్రమాదం.

మరొక సంఘటన. నాకు అంబికా (అమ్మ) సహస్రనామ స్తోత్రం అంటే ఇష్టం: రక్షక కవచం. సుఖం కావాలన్నా అదే, దుఃఖం పోవాలన్నా అదే. అదే దిక్కు, దిక్చూచి. 1992లో నేను ఉపాధ్యాయునిగా పనిచేస్తుండే వాడిని. మండల దీక్షగా లలితాసహస్రనామ పారాయణ చేస్తున్నా; కోరిక ఏమీ లేకుండా. ప్రారంభించిన 30 రోజులకి Director of School Education నుంచి ఒక లెటర్ వచ్చింది. – Lecturer Promotion ఇవ్వటానికి ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నామని, నన్ను హాజరుకావాలని.

హైదరాబాద్ వెళ్ళాను. అది సరిగ్గా 40వ రోజు – దీక్షవిరమణ రోజు. పారాయణ పూర్తి చేసి అమ్మ శ్రీ చరణాలకు నమస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయానికి చేరుకున్నా. తదనంతరం ఒకరి తర్వాత ఒకరు ఇంటర్వ్యూకి హాజరవుతున్నారు. ఇంటర్వ్యూ హాలులో 10 మంది అధికారులు, విద్యావంతులు ఉన్నారు. నా ముందు ఒకరు వెళ్ళారు. లోపల నుండి కేకలు తీవ్రస్థాయిలో వినవస్తున్నాయి. ‘నువ్వు రికమండేషన్ చేయించి వచ్చావు కదా! సిఫార్సు చేస్తే ప్రమోషన్ ఇస్తానా?’ అంటూ కోపంతో డైరెక్టరుగారు ఫైల్ నేలకేసి కొట్టి ‘get out’ అన్నారు. ఆ తర్వాత నావంతు. చెమటలు పడుతున్నాయి. లోపల వాతావరణం వేడిగా ఉంది. ఏవో ప్రశ్నలు అడిగి నాపై ఆగ్రహోదగ్రులైతే నాగతి ఏమిటి? ప్రమోషన్ లేకపోతేనేం – బ్రతికుంటే…. అనేకానేక ఆందోళనలు ముప్పిరిగొన్నాయి. యాంత్రికంగా లోపలకి వెళ్ళి నిల్చుని ‘నమస్తే సార్’ అన్నాను. ‘కూర్చో’ అన్నారాయన.

నా ముఖం వైపు చూడలేదు; నా సర్టిఫికేట్స్ చూస్తున్నారు; ‘M.A. (English), Andhra University – || Class – good; M.Ed., – Annamalai University Distance Education II Class నీకేం ఖర్మ వచ్చింది?; P.G.D.T.E – C.I.E.F.L. లో చదువుకున్నావా! You are selected. You can go’ – అన్నారు. ఏం జరుగుతున్నదో నాకు తెలియటం లేదు. అభినందనలు – అవమానాలు – వరాలు. బ్రతుకు జీవుడా అంటూ బయట పడ్డాను. జరిగినదంతా నెమరు వేసుకున్నాను. అమ్మ అకారణకారుణ్యానికి కళ్ళు జలజలా వర్షించాయి. ఆయన నన్ను ఎంపిక చేసి పదోన్నతి నివ్వవచ్చు. ఇవ్వక పోవచ్చు నాకు చెప్పరు – చెప్పాల్సిన అవసరం లేదు.

1993లో ప్రమోషన్ ఇచ్చారు. 16 ఏళ్ళు లెక్చరర్ గా పని చేసి రిటైర్ అయ్యాను. కాగా 16 ఏళ్ళూ ఇదే పరిస్థితి. ఎన్నో సన్మానాలు, అవమానాలు. ఏ తప్పు చేయక పోయినా కోర్టు కేసులు, పోలీసు కేసులు. ఎప్పుడూ శ్రీ అంబికా సహస్రనామస్తోత్ర పారాయణే తారక మంత్రం. అలా అమ్మ కృపతో ఉరితాడు. పసుపుతాడు అయ్యేది. కాసేపు సంతోషం – అంతలో Tension – వెనువెంటనే relief. ఇదంతా అమ్మదయ, నిర్ణయం అనటానికి ఒక బలీయమైన కారణం ఉన్నది.

నేను అమ్మకు చాలా సన్నిహితంగా పెరిగినవాడిని. ఒకనాడు అమ్మ. గదిలోకి వెళ్ళాను. అమ్మ మాత్రమే ఉన్నది శేషశాయిలా. గోడవైపు తిరిగి పడుకుని ఉన్నది. సందర్భం (CONTEXT) ఏమీ లేదు; నేను అన్నాను ‘అమ్మా! మాకు బాధ ఏముంది? మా భారం అంతా నీ మీద వేసి మేము హాయిగా ఉంటాము” – అని. తడుముకోకుండా అమ్మ “వెయ్యండి రా” అన్నది. తక్షణం గిరుక్కున నావైపు తిరిగి “ఒరేయ్! భారం అని నువ్వు అన్నావు, కానీ నేను అనలేదు” అన్నది. గిరికి తరువు, తరువుకి కాయ, తల్లికి బిడ్డ భారం కాదు. కదా!

నిత్యజీవితంలో – ‘రాబోయే క్షణం ప్రమాదం, జరగబోయేది తెలియక పోవటమే ప్రమాదం – మంచికానీ చెడుకానీ ఏదైనా కానీ’ – అన్న అమ్మ మాటలు అక్షర సత్యాలు అని అనుభవంలో నాకు ఋజువైంది.

అయినా అమ్మ బిడ్డలం – మనకేమీ తక్కువ లేదు, చింత లేదు. కొండంత అమ్మ ఇలా కోరి అండన ఉన్నది కదా!

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!