‘అంబికా సాహస్రి’ పద్యకావ్యాన్ని ప్రస్తుత కుర్తాళ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీ స్వామివారు రచించారు. అందలి ఒక పద్యం – ‘అట్టే చూచినకొద్ది వింతగ అనేకాకారముల్ దాల్చు నీ చుట్టున్ నాకొక కాంతిమండలము తోచున్ శాంత గంభీరమై పట్టన్ ని మహాగ్నివిగ్రహమవె! స్పర్శక్రియా వేళలం దెట్టుల్ శీతల చంద్రికారుచులు మాకిప్పింతువో అంబికా’ అనేది.
దీని అర్థం : అమ్మా! నిన్ను దర్శించునపుడు అనేక ఆకృతులు దాలుస్తున్నావు. నీ చుట్టూ ఒక శాంత గంభీరమైన (శుద్ధ సత్త్వ ప్రధానమైన) కాంతివలయము నాకు కనిపిస్తోంది. నీవు స్పృశింప శక్యంగాని మహాగ్ని విగ్రహానివి. కాగా నీ దర్శన స్పర్శన వేళల్లో అట్టి తీవ్ర అగ్ని సెగల స్థానే ప్రశాంత చంద్రికా శీతల జ్యోత్స్నల్ని మాపై కురిపిస్తావు. ఇది ఎలా ? అని.
శ్రీరామచంద్రుని వర్ణిస్తూ వాల్మీకి మహర్షి అంటారు, “తేజసా ఆదిత్య సంకాశం ప్రతిపత్ చంద్ర దర్శనమ్” అని. అంటే శ్రీరాముని తేజస్సు సూర్యతేజ సన్నిభమైనది; కాగా రామదర్శనమ్ పాడ్యమి నాటి చంద్రుని శీతలత్వ సంశోభితం-అని.
కాగా లలితాదేవిని కీర్తిస్తూ ‘ఉద్యత్భాను సహస్రాభా’ (ఒక సూర్యుడు కాదు) ఉదయించే అనేక సూర్య ప్రభావిరాజితము అని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ పద్యంలో ‘అమ్మ’ అ లౌకిక దివ్యప్రతిభా విభూతులు ఎన్నో!
1) చూచిన కొద్ది వింతగా అనేకాకారముల్ దాల్చుదువు: 1950, 1960 ప్రాంతంలో పూజా సమయాల్లో అమ్మ అనేక దర్శనాలను ప్రసాదించేది, అలవోకగా అనేక ముద్రలను ధరించేది, క్షణక్షణానికి రూపం మారుతూండేది. అందు ముఖ్యంగా ఒక దర్శనం శ్రీ చిదంబరరావు తాతగారికి కలిగింది. అపుడు అమ్మ 5 ఏళ్ళ బాలిక. ఒకనాడు ఒకే సమయంలో సినిమా తెరమీద చిత్రాల వలె పలురూపాల్లో దర్శనం ఇచ్చింది. – ఒక ముత్తైదువగా, బాలికగా, బాలాత్రిపురసుందరిగా, గొడ్లు కాచుకునే పిల్లవానిగా, పరదేవతా స్వరూపిణిగా, రోజూ భిక్షాటనకు వచ్చే పేద బ్రాహ్మణునిలా, జ్ఞాన ప్రసూనలా, కుగ్లర్ హాస్పిటల్లో డాక్టర్లా, తన స్నేహితుడు పొన్నూరు గోపాలరావులా, దుర్భరమైన బాధలను ఓర్పుతో అనుభవిస్తున్న సామాన్యగృహిణిలా, పురుటికందులా ఎన్నో రూపాల్లో – విశ్వరూప సందర్శన రీతిగా కనిపించింది.
2) అమ్మ పట్టన్ రాని మహాగ్ని విగ్రహము : అంటే దీపిస్తున్న గొప్ప అగ్నిగోళము అమ్మ అ అన్నారు. ‘దీవ్యతే ఇతి దైవః’ దైవం అంటే స్వయంప్రకాశమాన మూర్తి. మన సౌరకుటుంబంలో కన్నుల ముందు మండుచున్న అగ్నిగోళం కర్మసాక్షి సూర్యభగవానుడు. సూర్యకేంద్రం వద్ద ఉష్ణోగ్రత 11/ 2 కోట్ల డిగ్రీల సెంటీగ్రేడ్.
అంటే పరదేవత అయిన అమ్మ దుర్నిరీక్ష్య. వాస్తవానికి అమ్మని దర్శించలేము. స్పృశించలేము. ఒకసూర్యుడి దరిని జేరలేము. వేయి సూర్యుల సన్నిధికి ఎట్లా జేరగలము? కాగా అమ్మ సాన్నిధ్య భాగ్యాన్ని మనం పొందాము. అందుకు కారణం కేవలం అమ్మ కృప.
అమ్మ తన అప్రతిహతమైన శక్తిని ఆయా సందర్భపూర్వకంగా వివరించింది. ఒకసారి అమ్మ పుసులూరు వెళ్ళింది ఒక ఇంటికి. అది చాలా పెద్ద లోగిలి వెంట ముస్లిం సోదరుడు రహి కూడా ఉన్నాడు. రహి అమ్మతో అన్నాడు “అమ్మా! ఆ లోగిలి ఎంత బాగున్నదో! మనకి కూడా అంత పెద్ద లోగిలి ఉంటే బాగుండును” అని. అందుకు అమ్మ అన్నది, “అదేమిటి నాన్నా! అంత చిన్న కోరిక కోరావు. ఈ ప్రపంచం అంతా మనదే. వాళ్ళని వాడుకొమ్మని తలా కొంచెం ఇచ్చాము” అని తనబాల్యంలో మరొక సందర్భంలో వర్షంలో తడిసి గజగజ వణికే బిచ్చగాళ్ళను ఆదరించి అమ్మ వాళ్ళకి వేడి అన్నం, పులుసు పెట్టి, వాళ్ళు కట్టుకోను ధోవతులూ, తలగుడ్డలూ, కోటు, వాళ్ళ పిల్లలకి నాలుగు గౌనులు ఇచ్చి ‘గబగబా వెళ్ళండి’ అని వాళ్ళని తొందర చేసింది. “మీ వాళ్ళను అడక్కుండా ఇచ్చావా? తెలిస్తే కొడతారేమో” అన్నడొకడు. అపుడు అమ్మ “వాళ్ళను నేను కొట్టకుండా ఉంటే చాలుసు. వాళ్ళు నన్ను కొట్టడమే!” అన్నది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన అనుగ్రహ రూపిణి అమ్మ; పంచకృత్య పరాయణ.
3) శీతల చంద్రికారుచులు మాకిప్పింతువో! : పైన వివరించబడిన అమ్మ నిజస్వరూప స్వభావాలు భౌతిక నేత్రానికి అగుపించవు. అంతర్ముఖ సమారాధ్య కనుక. జిల్లెళ్ళమూడిలో నాలుగు గోడల మధ్య చిన్న పట్టెమంచం మీద కూర్చున్న పరిమిత రూపం మాత్రమే కాదు అమ్మ అంటే. అమ్మ అంటే తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ.
దసరాలలో శ్రీ మహాలక్ష్మీ అవతారం నాడు అమ్మ త్రిశూలాది ఆయుధాల్ని ధరించింది. ఆ సందర్భంలో ఒకరు అన్నారు “అమ్మా! లక్ష్మీదేవికి త్రిశూలం ఉండదు చేస్తోంది. కదా!” అని. అంటే అమ్మ అ లంకరణ శాస్త్రాలలో వర్ణించబడిన మహాలక్ష్మి అ లంకరణకి భిన్నంగా ఉందని. వెంటనే అమ్మ అన్నది “ఒకరితో పోలికేమిటి?” అని. ఈ అమ్మ వాక్యం మీద ఒక గ్రంథమే వ్రాయవచ్చు. అయితే అమ్మను లక్ష్మీదేవితో పోల్చదగునా? లక్ష్మీ సరస్వతులు, గజముఖ షణ్ముఖులు ఇత్యాది దేవతలు అందరూ తన కన్నబిడ్డలని అమ్మ స్పష్టం చేసింది. త్రిమాతలకు తల్లి అయిన అమ్మ ఎవరు? ఈ ప్రశ్నకి సమాధానంగా డాక్టర్ ప్రసాదరాయకులపతి అన్నారు.
“తపోలభేన దివ్యేన జ్ఞానాగ్ని మయ చక్షుషా॥
వశ్యామి త్వాం మహాదేవీం మాయాం మానుషవిగ్రహాం||”
అని. అంటే తపః ఫలంగా పొందిన దివ్యదృష్టి చేత సామాన్య గృహిణిలా మాయా మానుష వేషధారిణి అయిన అమ్మను ‘మహాదేవి’ అని దర్శిస్తున్నాను అని.
వాస్తవం ఏమంటే ఈ వాస్తవాన్ని తెరమాటున పెట్టి అమ్మ మనపై శాంతియుత శీతల జ్యోత్స్నలను కురిపిస్తోంది. వాస్తవానికి వరంజ్యోతి అమ్మను ‘సువర్ణజ్యోతి’ అని నిగమాంతాలు అభివర్ణించాయి. ఆ జ్యోతిప్రభను అరుణకాంతిగా ఆప్తవాక్యాలు ప్రబో ధించాయి. ‘తామగ్నివర్ణాం తపసా జ్వలన్తీం’ అని దుర్గాసూక్తంలోనూ; ‘నిజారుణ ప్రభాపూర మజ్జద్భహ్మాండ మండలా’ అని లలితా సహస్రనామ స్తోత్రంలోనూ; ‘ఆదిత్య వర్ణే తపసోధిజాతః’ అని శ్రీ సూక్తంలోనూ దర్శించవచ్చు.
కాగా మన చర్మ చక్షువులకు గోచరించినదేమంటే అమ్మ అప్పుడప్పుడు మంటల జ్వరంతో నలిగి పోతుండేది. తాను మన బాధల్ని తీసుకుని భరించేది – అనటానికి ఆధారాలు కోకొల్లలు; కానీ అమ్మ అంగీకరించదు. గడ్డిపోచను కదల్చలేని మనిషి ప్రపంచాన్ని ఒక్కచేత్తో పరిపాలించాలని పోటీపడతాడు. తన కనుసైగతో సకలలోక గమనాన్ని శాసించగల అమ్మ ఎన్నడూ తన కర్తృత్వాన్ని అంగీకరించదు; తద్వారా ఆచరణాత్మకంగా కర్మఫల పరిత్యాగ విభూతిని సుబోధకం చేస్తుంది.
- ‘స్పర్శక్రియా వేళలం దెట్టుల్ శీతల చంద్రికా రుచులు మాకిప్పింతవో?’
ఇదే కీలకాంశం. ‘ఉద్యద్భాను సహస్రాభా’ అన్న స్తోత్రంలోనే ‘సుధాసారాభివర్షిణీ’ అని శ్రీమాత వర్ణింపబడింది. కావున అమ్మ సహజ నిజ అరుణారుణ ప్రభలను విరజిమ్మకుండా, స్పర్శన సంభాషణ సమయాల్లో, చంద్రికాశీతల స్పర్శను అనుగ్రహిస్తోంది; వాత్సల్య సుధారస ధారలను వర్షిస్తోంది. అట్టి ప్రశాంత తేజస్స్వరూపిణి అమ్మ.
‘అరుణాం కరుణాతరంగితాక్షీం….’ అని ప్రార్థిస్తూ అమ్మ శ్రీచరణాలకు శతసహస్రాధిక వందనములను సమర్పిస్తున్నాను.
ఇట్టి వ్యాసముల లక్ష్యం ఏమంటే పన్నాల వారు చెప్పినట్లు అమ్మ అనల్పత్వం ముందు నా అ ల్పత్వాన్ని గుర్తెరిగి వినమ్రతతో అంజలి ఘటించడం. *