ఒకసారి ఎవరో అడిగారు జిల్లేళ్ళమూడి అమ్మ నిజంగా దేవతేనా? సర్వశక్తి వంతురాలేనా? అని. అందరికి ఏదో సందర్భంలో వచ్చే అనుమానమే, అది అమ్మకప్పే మాయ తెరే! మా పెద్దఅమ్మాయి చి॥ల॥సౌ॥ దీప్తి విషయంలోనే జరిగిన మూడు సంఘటనలు ఇక్కడ ప్రస్తవిస్తాను.
ఆరోజు 21-9-1983 ‘అమ్మ’ శ్రీ చరణ సన్నిధిలో మా అమ్మాయి, రామకృష్ణ అన్నయ్య మనవరాలుకు బారసాల జరిగింది. అమ్మకు పూజ జరిగాక, అమ్మ పాపకు నామకరణం చేసింది “నాగేంద్రమణి” అని ఎందుకో నా భార్య శ్యామలకు ఈ పేరు నచ్చలేదు. అమ్మ ఎందరికో ఎంతమంచి పేర్లు పెట్టింది నా కూతురుకు ఇలాంటి పేరు పాతపేరు పెట్టిందేమిటి? అని లోలోపల వేదన పడ్తున్నది. తల్లి తండ్రులమైనా ఇంకా పెద్దలచాటు పిల్లలం కాబట్టి బయటపడటానికి ‘సంస్కారం’ ఒప్పుకోదు. నా సంగతి తెలిసిందే అప్పటికి రెండు దశాబ్దలు ‘అమ్మే’ బహిప్రాణంగా బ్రతికిన రామకృష్ణ అన్నయ్య కొడుకునునేను. నా భార్య శ్యామల ‘అమ్మ’తప్ప అన్యమెరగని ‘అచంచల విశ్వాసి’ శ్రీ మోగులూరి రామచంద్రరావుగారి కూతురు.
చాల మధనపడిన తర్వాత నాభార్య శ్యామల అన్నది “అమ్మనిజంగా దేవత అయితే నాబిడ్డకు పెట్టిన పేరు మారుస్తుంది” అని. మరింకేం ఆ ధైర్యంతో ఉండు అని నేను నా భార్యను ఓదార్చాను. రాత్రి 9 గంటలకు వసుంధర అక్కయ్య ద్వారా అమ్మ పిలుపువచ్చింది. “నాన్న! సుబ్బారావు! ప్రొద్దున పెట్టిన పేరు నాకు అసంతృప్తిగా ఉన్నది, కనుక పేరు మారుస్తాను” అని అన్న అమ్మ మా అమ్మాయి పేరును ‘నాగేంద్రమణి’ నుంచి నాగేంద్ర దీప్తి గా మార్చి స్వయంగా కాగితము మీద ఆ పేరు వ్రాసి ఇచ్చింది. మన మనస్సులోని వేదనను మనంచెప్పకుండానే తెలుసుకొన్న అమ్మ సర్వ శక్తిమంతురాలు కాక మరేమిటి? జరిగిన సంఘటనకు భాష్యంచెబుతు కొందరు పెద్దలు ఏమన్నారంటే “పిల్లకు ఏదో దోషం ఉంటే ఈ పేరు మార్పుద్వారా అమ్మ తొలగించినది” అని నిజమేమిటో అమ్మకే ఎరుక.
అది 2010 సంవత్సరం, వేసవికాలం. మా పెద్దమ్మయి చి||ల||సౌ|| దీప్తి రెండవసారి గర్భందాల్చింది. మొదటిసారి అనుకోని కారణాలతో, ముందుగానే కాన్పు కావటంతో సీమంతం జరిపించాలనీ, ఆ ‘అమ్మ’ శ్రీచరణసన్నిధిలో జరిపించాలని నిర్ణయించాము, ఏర్పాట్లు జరిగిపోయినాయి, బంధువులందరికి ఆహ్వానాలు వెళ్ళాయి. కానీ కాలనియమాలకు విరుద్ధంగా కుంభవృష్టి ప్రారంభం అయింది. తుఫానుగా మారింది. లైలా తుఫానుగా పేరు పెట్టారు. బాపట్ల దగ్గర తీరం దాటుతుందని వాతావరణ శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. మా ఆవిడ బాగా దిగులు పడ్డది. సీమంతం ఎలానా? అని. అప్పుడు నేను మా అమ్మాయితో అన్నాను “జనంకోసం అయితే విజయవాడలోనే సీమంతం జరుపుదాము. అమ్మకోసం అయితే జిల్లేళ్ళమూడి వెళదాము. ఎవరు రాకపోయినా అమ్మదగ్గర సీమంతం జరుపుకుందాము” అన్నాను. దీప్తినాకు అమ్మ సమక్షంలోనే సీమంతం జరిపించండి అంది. ఎంతైనా రామకృష్ణ అన్నయ్య మనవరాలు కదా!. మేము వెంటనే అ ఏర్పాట్లు చేశాం.
కాని విచిత్రం బాపట్లలో తీరం దాటవలసిన తుఫాను ఒంగోలుదగ్గర దాటటంతో జిల్లెళ్ళమూడిలో ప్రశాంతంగా ఉన్నది. బంధుమిత్రుల సమక్షంలో ఆనందంగా దీప్తి సీమంతం జరిపించింది అమ్మ. అమ్మ సర్వసమర్థురాలు అనటానికి ఇది సాక్ష్యం కదా!. 2015 సం॥ సెప్టెంబరు నెల. బెంగుళూరు, రాచర్ల రహి ఇంట్లో అమ్మ పూజ, సోదరుడు రాచర్ల రహి దీప్తి సెల్కు ఫోనుచేసి మాఅల్లుడు శ్రీకాంత్గారిని కుటుంబ యుక్తంగా అమ్మ పూజకు రమ్మన్నారు, వివరంగా ఇంటి అడ్రస్ మెసేజీ పంపించారు. మా మనవరాళ్ళు చి॥ హన్సిన్, చి||శ్రీనిధి సంతోషానికి అవధులు లేవు. అమ్మ పూజకు వెళుతున్నామని తెగ సంతోషపడ్డారు.
దీప్తి శ్రావణ మంగళ గౌరినోము నోచుకుంటూ పండ్లు కొనటానికి మార్కెట్కు వెళ్ళి అక్కడ సెల్ఫోను పోగొట్టుకుంది. సరే! సెల్ఫోన్ పోతేపోయింది, దానిలో అమ్మపూజ జరిగే అడ్రస్సు విపులంగా ఉందే! ఎలా? అని దీప్తి దిగులుపడి అమ్మకు నమస్కరించుకొన్నది ఎలాగైనా సమస్యను పరిష్కరించమని. తిరిగివాళ్ళకు ఫోను చేద్దామని అన్నా వారి ఫోన్ నెంబరు పోయిన సెల్లోనే ఉన్నాయి. ఏది జరిగితే అదిజరుగుతుందని అమ్మకు తిరిగి నమస్కరించుకుని కస్టమ్కర్కు ఫోను చేసి పోయిన నెంబరు తిరిగి తీసికున్నది. కాసేపటికి ఈసారి సోదరుడు ధర్మసూరి దీప్తికి ఫోన్ చేసి పూజ జరిగే ఇంటి అడ్రస్ వివరంగా చెప్పాడు. మా అల్లుడు, దీప్తి, మనవరాళ్ళు మా వియ్యపురాలు నాగమణి అక్యయ్యగారు అందరూ సంతోషంగా అమ్మ పూజలో పాల్గొన్నారు.
బిడ్డలకు సమస్య వచ్చినా తనదైన రీతిలో పరిష్కరించే అమ్మ శక్తికి కొలమానం ఏమున్నది.