మన్నవాన్వయ సంభూతాం సీతాపతి కుమారికామ్
అనసూయాం జగద్దేయాం నమామి మమ మాతరం
శ్రీమన్మాతృపదాంబుజద్వయిని సంప్రీతిన్ భజింతున్ మదిన్
శ్రీమాతన్ పదసేవ సల్పెడి గుణశ్రీయోగులన్ గొల్చెదన్
ఆ మాతన్ మనసార చూచెదను నా అంతర్ముఖత్వంబునన్
ప్రేమాశీస్సుల నందజేయ మిము ప్రార్థింతున్ దయామూర్తులన్
మానవి గాగ వచ్చితివి మాయతెఱన్ ఒక టడ్డముంచుచున్
దీనులు వీరు వీరినొక తీరము చేర్చెడి మాతృమూర్తివై
పూనికి వుద్దరింపగ అపూర్వము నీదగు మార్గమెన్న సం
తానము నెల్లబ్రోవ అవతారము దాల్చితి వీధరాస్థలిన్
అచ్చము నీదు బింబమగు హైమయె మాకొక కల్పవృక్షమై
వచ్చినవారి కోర్కెలు కృపామతి యౌచును తీర్చుచుండగా
ముచ్చట దేవుడై నిలిచి ముందుగ నీపతి సోమసేఖరుం
డిచ్చెను త్యాగియౌచు హృదయేశ్వరివా నిను విశ్వమాతగా
నీ నవనీత పాదముల నిల్చెడి చోటుల కందకుండ నా
మానస పద్యపుష్పముల మల్లెలు మొల్లలు పేర్చు చుందులే
పూనిక నా యెడన్ నిలచి పొమ్మిక దాసుడ నౌచు సేవలం
దూనుదు నాంజనేయునిగ నూపిరి నిల్చిన యంతకాలమున్
అన్ని దానములందు అన్నదానము మిన్న
అది చేయదగు ప్రోలు అర్కపురమె
జీవితమ్మున మీరు సేవలో తరియింప
అనువైన భూమి ఈ అర్కపురమె
భక్తితో నిశ్చలాసక్తితో వేద వే
దాంత తత్వమ్మంద అర్కపురమె
ఆత్మబంధువులున్నది అర్కపురమె.
అందరికి సుగతి కూర్చునీ అర్కపురమె
అమర తరువుల నందన మర్కపురమె
అణువణువు నందు అమ్మున్న అర్కపురమె
శేషజీవితకాలమ్ము సేవచేయ
హాయిగా రెండు మీరింక అర్కపురమె.
నీ పాదసేవలో నిండి పండగనిమ్ము
నీ పాదార్చనలోన నిలువనిమ్ము
నీ పాదపూజలో నిశ్చలమతులైన
వారి నెయ్యములోన వరలనిమ్ము
నీ నామచింతనా ధ్యాననిష్ఠాగతిన్
నేను నన్ను మరచి నిలువనిమ్ము
నీ వత్సలత్వాన నెగడిన యెదలోన
మానవత్వము నింపి మసలనిమ్ము
కష్టసుఖములు కూడ నీ కరుణ యనుచు
నడక నడతలు ఒకటిగా నడువనిమ్ము
అంతులేనట్టి ఆనంద మందనిమ్ము
‘నేనునేనైన నేను’ గా నిలువనిమ్ము
సర్వసమ్మత మత స్వారస్య సిద్ధాంత
సామరస్యము నిల్పు ప్రేమమూర్తి
సృష్టి సర్వస్వమ్ము దృష్టితో లాలించు
మమతాను రాగాల మాతృమూర్తి
కులభేదమే కాదు గుణభేదమే లేని
సర్వసమానత్వ సత్యమూర్తి
కూతురిన్ కోడలిన్ చేతమందొకరీతి
భావించినట్టి అద్వైతమూర్తి
సహజ విశ్వకుటుంబ బీజములు వేసి
అందరింటిని చూపిన అందరమ్మ
ఆకలియె అర్హతగ పెట్టు అన్నపూర్ణ
ఐన అనసూయమాతకు అంజలింతు.
నీ దయా వారాశి నీద గల్గినవాడు
కుంటివాడైనను కొండలెక్కు
నీ కరుణను నిల్చి నెగడిన మూగయు
మహితవచస్వియై మసలగలడు.
నీ దివ్యకాంతిలో నిముసమ్ము నిల్చిన
కాకి హంసంబుగా గణనకెక్కు
నీవుగా గుండెలో నిలచియుండిన చాలు
సైతాను దేవతా సామ్యమందు
నీవు మృత్యుంజయత్వము నీయగలవు.
‘అందరికి సుగతి’ నిడెడి ఆదివీవు
పొందవలసిన దంతయు పొందు జగతి
రక్షణయె అమ్మవద్ద యే శిక్షలేదు