అన్నపూర్ణాలయ మ్మలవోకగా నిల్పి
ఆకలి చల్లార్చి అలరినావు
విమలమౌ విజ్ఞాన విద్యాలయమ్మిచ్చి
వేద వీధులలోన వెలసినావు
నరులు తరించగా నామచింతన నిచ్చి
నిత్య యజ్ఞశ్రీగ నెగడినావు
అఖిల స్వతంత్రమౌ అందరింటిని నిల్పి
అందరి కమ్మవై అందినావు
సత్యమగు నఖండ జ్యోతి సర్వదిశల
పరగజేసియు వెలుగౌచు వరలునమ్మ
ఆ అనంతము సంకల్పమంద వచ్చి
కడ కనంతమ్ము నందునే కలిసి యుండె.
ఎక్కడ చూడ నీ వగుచు నెవ్వరి చూచిన నీవె యౌచు నీ
చక్కని రూపె నాదు మనసంతయు నిండగనిమ్ము తల్లి! నీ
వాక్కులు సర్వలోక పరిపాలన దృక్కులు – జీవితాంతమున్
దిక్కయి నన్ను నీ దరికి దీయుము నీ పసివాడు వీడులే.
అమ్మకు నీయగా దగిన దర్ఘ్యమొ పాద్యమొ లేక పుష్పమో
– సమ్మతమైనదే ఫలమొ సాంజలి సల్పుచు నిత్తునంచు నా
నెమ్మదిలో తలంప నవనీతలి సృష్టి సమస్త మమ్మదే
అమ్మది కాని వస్తువిల నన్యముగా కలదే యొసంగగన్.
నా కను మూసినప్పుడును నాదగు కన్నులు విప్పినప్పుడున్
నీ కమనీయరూపమది నిండు మనస్సున చంద్రబింబమై
ప్రాకును నీ కృపారసము పర్విన నాదు హృదంతరమ్ములో
వేకువ తప్ప చీకటులు వెల్వెలబోయి నశించిపోయెడిన్.
తలక్రిందై తపమాచరించెదరు నీ తత్వార్థులై కొంద రా
ఫలసిద్ధిం గనలేక యెప్పటికి ప్రాప్తం బంచు వాపోదు రా
తలపే పట్టని నాకు నీ మృదుల పాదాలే శరణ్యంబులై
కొలువంగల్గిన భాగ్యమబ్బెనిక నాకున్ లేని దేమున్నదే!
అంఆ అని అన్న ఆపదలంటబోవు
అంత అని అన్న ఓంకారమన్న యట్లె
అంత ఉచ్ఛ్వాస నిశ్శ్వాస మదుపుచేయు
ధ్యానసిద్ధిని గూర్చునా ‘అంఆ’ పదము.
‘అంఆ’ ‘అమ్మ’ యనుచు ఆఖరి వరకును
మరువకుండ నెవడు మనసు నిలుపు
జీవజలధి అమ్మ నావలో దరి జేరి
అమ్మ లోకమందు అలరగలడు.
గజమాలల్ గొని అమ్మకంఠము నలంకారమ్ము గావించుచున్
భజనల్ సేయుచు మేళతాళములతో బ్రహ్మోత్సవాల్ సేయుచున్
ప్రజలెల్లన్ ఘన మాతృయజ్ఞమున సంభారాలలో మున్గగా
నిజమాతృత్వ హసన్ముఖోదయముతో నీరాజనా లందుమా!
పట్టిరి హారతుల్ సతులు పల్లకిలో నరుదెంచ నీవు చే
పట్టిరి నీరు బిందెలను వారగ పోయగ గ్రామ మందునన్
ఉట్టికి నెక్కలేని జను లొప్పుగ స్వర్గము కెక్కినట్లు నీ
పుట్టినరోజు పర్వమున పూలను చల్లుచు పూజచేయరే!