విశాఖపట్టణంలో : విశాఖలో 13-1-2021 అమ్మ మందిరంలో భోగి పండుగ వైభవంగా నిర్వహించబడినది. జిల్లెళ్ళమూడి సంప్రదాయానుసారం ముందుగా అమ్మకు అర్చనాదికములు నిర్వహించారు. పిమ్మట వరుసగా లైన్లో ఒకరి తర్వాత మరొకరు వచ్చి అమ్మపాదాలపై భోగిపళ్ళు పోశారు. తర్వాత అందరూ బారులు తీర్చి ఆసీనులు కాగా సోదరి అయ్యగారి అనూరాధ అమ్మ పాదాల్ని అలంకరించిన భోగిపళ్ళ సముదాయాన్ని అమ్మ దివ్య ఆశీఃపూర్వకంగా అందరి శిరస్సులపై చల్లారు. అందరూ ఒక్కసారి అమ్మ ఒడిలో పసిపాపలై మురిసిపోయారు. శ్రీమతి కుసుమాచక్రవర్తి, శ్రీమురళి, శ్రీమతి పార్వతి ఈ కార్యక్రమంలో ప్రధానపాత్ర పోషించారు. తెలంగాణా రాష్ట్రానికి చెందిన ఒక జిల్లా కలెక్టరు, డి.యస్.పి. గారలు వారి కుటుంబాలతో పిల్ల పాపలతో వచ్చి అమ్మ శుభాశీస్సులు పొందారు.
అమ్మ సత్సంగం : 26-1-2021 గుంటూరుజిల్లా పిడుగురాళ్ళ సమీపంలోని చినగార్లపాడు గ్రామంలో శ్రీసీతారామ శివపార్వతుల కళ్యాణమండపంలో చిత్రకారుడు శ్రీ సి. రవి వేసిన నిలువెత్తు అద్భుత అమ్మ వర్ణ చిత్రాన్ని నెలకొల్పారు. అట్టి అమ్మ దివ్యసాన్నిధ్యంలో అమ్మనామ జప విశిష్టత, అమ్మ మహిమాన్విత తత్త్వవైభవం గురించి విస్తారంగా వివరిస్తూ, సత్సంగాన్ని నిర్వహించారు. MOC పూర్వవిద్యార్థి శ్రీకె. శేషాద్రి మరియు వారి కుటుంబసభ్యులు గామస్థుల సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అమ్మనామ జపదీక్షితులకు జపమాలలు, ఫోటోలు అందించారు. 4 గంటలు సామూహికంగా అమ్మనామ జపం చేశారు. సుమారు 2000 మందికి అమ్మ అన్నప్రసాదాన్ని అందించారు. చిత్రకారుడు శ్రీ సి. రవిని శ్రీశేషాద్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ యం. దినకర్, శ్రీయల్. సత్యనారాయణ (లాలన్నయ్య) శ్రీ వి. ధర్మసూరి, శ్రీయం.వి.ఆర్. సాయిబాబు ప్రభృతులు పాల్గొన్నారు.
బొల్లాపల్లి గ్రామంలో అమ్మనామ సంకీర్తన :
30-12-2020న ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రకాశం జిల్లా బొల్లాపల్లి గ్రామంలో దాదాపు 100 మంది గ్రామస్థులు అమ్మనామ సంకీర్తనలో పాల్గొన్నారు. వారందరికీ జపమాలలు, అమ్మఫోటోలు, జపసంఖ్య నమోదు చేసుకునే పుస్తకాలు పంపిణీ చేశారు. వారికి అమ్మప్రసాదంతో వస్త్రాల్ని కూడా అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎమ్.దినకర్, శ్రీ వి. ధర్మసూరి, శ్రీ ఎమ్.వి.ఆర్.సాయిబాబు, శ్రీ జి. మధుసూదనరావు ప్రభృతులు పాల్గొన్నారు. ఇదేవిధంగా 108 చోట్ల సభలు నిర్వహించి అమ్మ నామ జపాన్ని, అమ్మతత్త్వచింతనను పెంపొందించాలని కార్యకర్తల లక్ష్యం.
జిల్లెళ్ళమూడిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు
మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, జిల్లెళ్ళమూడిలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కళాశాల ప్రిన్సిపల్ డా॥ వి. హనుమంతయ్యగారి అధ్యక్షతన వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమమునకు విశిష్ఠ అతిథిగా ఉభయపరిషత్ల అధ్యక్షులు శ్రీ దినకర్ గారు విచ్చేసి పతాక ఆవిష్కరణ గావించి రాజ్యాంగ ప్రశస్తిని ప్రస్తావించిరి. అలాగే గౌరవ అతిథిగా స్థానిక కార్యదర్శి శ్రీయల్. సత్యనారాయణ (లాలన్నయ్య) గారు రాజ్యాంగ స్ఫూర్తిని కొనియాడారు. ఈ కార్యక్రమములో అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం అదేవిధంగా మాతృశ్రీ ఓరియంటల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ కె. ప్రేమకుమార్ గారు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.