ఆంగ్లతేదీ ననుసరించి 28.3.21 న ‘అమ్మ’ 99వ జన్మదినోత్సవములు.
- అమ్మ జన్మస్థలి మన్నవగ్రామంలో: అమ్మ ఆలయంలో శ్రీరంగడుబావ మనుమడు సతీసమేతంగా అమ్మకు అభిషేకం, పూజాదికములు నిర్వహించారు. శ్రీ విశ్వజననీ పరిషత్వారు జిల్లెళ్ళమూడినుండి శ్రద్ధగా పంపిన పులిహోర, చక్కెరపొంగలి అమ్మకి నివేదన చేసి అందరికీ పంచారు. శ్రీ నవీన్ నిర్వహించిన ఈ ఉత్సవంలో శ్రీ ఎమ్. దినకర్, శ్రీ లాలన్నయ్య, శ్రీ ఎమ్.వి.ఆర్.సాయిబాబు, శ్రీ కె. ప్రేమకుమార్, మన్నవ స్వాతి, ఓరియంటల్ కళాశాల సిబ్బంది – విద్యార్థులు, మన్నవ గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
అనంతశక్తీ మాతృవాత్సల్య దీప్తి అయిన అమ్మ జన్మదినోత్సవం అమ్మ జన్మ స్థలంలో నిర్వహించుకోవటం విశేష ప్రాముఖ్యతను శోభను సంతరించుకున్నది.
- విశాఖ అమ్మ మందిరంలో: ముందుగా పార్వతిగారు, మురళీ గారలు అమ్మను అభిషేకించి నూతన వస్త్రధారణ కావించారు. పిమ్మట శ్రీ కవిరాయుని కామేశ్వరరావు దంపతులు శ్రీ అనసూయా వ్రతం చేసుకున్నారు. శ్రీ జి. కామేశ్వరరావుగారు అలంకరణ పూజాదికములకు అవసరమైన పూలు, పూలమాలలు సమర్పించారు. పులిహోర, దద్ధ్యోదనం, చక్కెర పొంగలి, రవ్వప్రసాదం, బూరెలు గారెలు దండిగా అమ్మకు నివేదన చేశారు; అందరికీ మహాప్రసాదాన్ని అందించారు.
శ్రీమతి కుసుమక్కయ్య, లక్ష్మిగారు, అనూరాధ, సీతారాం గారు, ఆదిత్య, మోటమర్రి వారు, MOC పూర్వ విద్యార్థులు సూర్యనారాయణ, జగన్నాధం ప్రభృతులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుంచి శ్రీ వి.ధర్మసూరి తమ మిత్రబృందంతో వచ్చి ఉత్సవంలో పాల్గొన్నారు.
3) 28.3.21న సో. శ్రీ కటికి హనుమయ్య గారి ఆర్థిక సహాయంతో గుంటూరుజిల్లా వేటపాలెం మండలం లోని దేశాయిపేటలో నున్న అనాధ వృద్ధ శరణాలయమ నందు 40 మంది వృద్ధులకు అమ్మ (అన్న) ప్రసాదాన్ని ఆదరంగా పంచారు. శ్రద్ధాభక్తులతో అమ్మ నామ సంకీర్తన, అమ్మ తత్త్వ వైభవ స్మరణ కావించారు.