1983 పూర్వం వింజమూరులో నాన్నగారి పొలం వ్యవహారాల్ని చక్కబెట్టడానికి వెళ్ళినపుడు నాకు వారి దివ్యదర్శన భాగ్యం కలిగింది. మండువేసవి. మిట్టమధ్యాహ్నం. మలమల మాడుతున్నాను. వారి దివ్యదర్శనంతో ఒక్కసారిగా వాతావరణంలో అనూహ్యమైన మార్పు వచ్చింది. క్షణంలో నీడ పరచుకుని వాతావరణం చల్లగా మారింది.
అంతేకాదు. పలు సందర్భాల్లో నాన్నగారు దర్శనం ఇచ్చి నాకు మార్గదర్శనం చేశారు.
రాత్రి భాగంలో బస్సులో, కాలినడకన ప్రయాణం చేసేవాడిని. దారిలో ఒకచోట సర్పం ఉందని నేను భయాందోళనలకు గురి అయ్యాను. జిల్లెళ్ళమూడి వెళ్ళి అలయంలో అడుగుపెట్టగానే నాన్నగారు ఎంతో ధైర్యాన్ని, నిబ్బరాన్ని శాంతిని కలిగించారు. కృతజ్ఞతతో వారి పాదాలపై ఒక పుష్పాన్ని ఉంచాను. అట్టి ఎన్నో అనుభవాల నడుమ అక్టోబరు 2011 లో మరపురాని మహత్వపూర్ణ అనుభవం ఒకటి ఉంది .
ఎప్పుడు జిల్లెళ్ళమూడి వెళ్ళినా శిరస్సు వంచి నాన్నగారికి అంజలి ఘటించడం నాకు అలవాటు. 2011 అక్టోబర్ నెలలో వెళ్ళినపుడు – ఆశ్చర్యం. భౌతికంగా కనిపించిన నాన్నగారి దివ్యరూపం చూశాను. కళ్ళు ఎఱ్ఱగా అర్ధమై ఉన్నాయి, కొద్దిగా ఉబ్బి ఉన్నాయి. (నాకు పొంచి ఉన్న ప్రమాదకర స్థితిపై కన్ను లెర్రచేస్తున్నారా! వాటిని ముందుగానే గ్రహించి కళ్ళనీళ్ళు పెట్టుకుని నాపై వాత్సల్యాన్నీ అనుగ్రహాన్నీ కురిపిస్తున్నారా!) పై పెచ్చు – సరాసరి నా దగ్గరకే వస్తున్నారు ఆలయగర్భగుడిలోంచి. నాన్నగారు తరచు దర్శనం ఇస్తారు కనుక నాకు ఆశ్చర్యం కలగలేదు. సావధానుడనై ఉన్నాను. (అతః పూర్వం నాకు జాతకరీత్యా ఏవో గండాలు, మారకం ఉన్నాయని తెలుసు. వారి దర్శనంతో నాకు ధైర్యం చిక్కింది.)
తర్వాత కాలంలో నేను జ్వరం ఇతర రుగ్మతలతో అనారోగ్యం పాలయ్యాను. జీవనయానం ఒక కల అని తోచింది; జనన మరణాల గురించి ఏవో అనుభవాలు; దర్శనాలు కలిగాయి; మరణానికి అనవసరమైన ప్రాధాన్యత నివ్వరాదనిపించింది. త్వరలో కొద్దిగా కోలుకున్నాను కానీ నా అంతిమ ఘడియలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
విధికి తలవంచి సమర్పణభావంతో ఒకనాటి రాత్రి నాన్నగారి ఉనికి నా చుట్టూ పరచుకున్నట్లుంది. Matrusri Medical Centre building వద్ద వారి రూపాన్ని దర్శించాను. అది ఇంతితై అన్నట్లు వృద్ధి చెంద నారంభించింది. నా కళ్ళకి కనిపిస్తోంది. నేను హైదరాబాద్ వెడుతున్నాను. వారి రూపం నాతో కదలి వస్తోంది.
నాకున్న రుగ్మతలు ఉంటూనే ఉన్నాయి, కానీ నా జీవితానికి చరమాంకము వాయిదా పడ్డట్టు గమనించాను. శారీరక బాధలమూలంగా ఓర్పు క్షీణించింది. తర్వాత 2 నెలలకి నా ఇంట్లో హైదరాబాద్లో హఠాత్తుగా హైమక్క సాక్షాత్కరించింది. ఎంతో ప్రేమ, కరుణతో నాకు అభయాన్నిచ్చింది. “కొంచెం ఓర్పు వహించు. మంచి జరుగుతుంది. నిలదొక్కుకుంటావు. అన్నీ చక్కబడతాయి” అని ధైర్యాన్ని కలిగించింది.
రెండు నెలల్లో శారీరక రుగ్మతలు సమసిపోయాయి. ఆ సమయంలో అమ్మ నాకు ఒక ప్రబోధం చేసింది ఒకానొక స్థలంలో సమయంలో విశ్రాంతిగా గాఢంగా నిద్రపొమ్ము – అని. నేను అలాగే చేశాను. ఆ నిద్రలో ఒక స్వప్నం –
(1985 అమ్మ శరీర త్యాగానికి ముందు, మేడమీద ఆరుబయట అమ్మ నా చేయి పట్టుకుని నడుస్తూండేది. అది అలవాటు.) కానీ అందుకు భిన్నంగా – నాటి స్వప్నంలో అమ్మ ముందు నడుస్తోంది, 5/6 అడుగుల దూరంలో వెనుక నేను నడుస్తున్నాను. నడుస్తూ నడుస్తూ అంతస్థు చివరికి (అంచుకి వచ్చాను. అక్కడ మామూలుగా ఉండే పిట్టగోడ లేదు. అంతే! నేను అక్కడినుండి క్రిందికి పడబోతున్నాను. ఏదో బలీయమైన శక్తి నన్ను క్రిందికి లాగుతోంది. వెనుకకు వంగిపోయి పడటానికి సిద్ధంగా ఉన్నాను. అమ్మ నడక ఆపి తదేకంగా చూపు మరల్చకుండా నా వైపే చూస్తోంది. వెనుకకు వాలి (రాలి) పోతున్న నన్ను ముందుకు లాగి నా ‘కాళ్ళమీద నిలబెట్టింది ఆ చూపు. అదంతా చూస్తున్న అమ్మ రివ్వున నావైపు రాలేదు; కానీ స్పష్టంగా ఒక్కమాట అన్నది “ప్రాణాపాయం కదా, నాన్నా!” అని. అంతలో నాకు గాఢనిద్ర, కలలోంచి మెలకువ వచ్చింది.
ఈ విధంగా అమ్మ, నాన్నగారు, హైమక్క నన్ను మృత్యుముఖంలోంచి కాపాడారు. ప్రాణం పోసి నిలబెట్టారు. ప్రేమమూర్తులు, ప్రాణదాతలు అయిన ఆ త్రిమూర్తుల శ్రీ చరణాలకు సాష్టాంగ ప్రణామములు.