1. Home
  2. Articles
  3. Mother of All
  4. ప్రేమంటే అమ్మే!

ప్రేమంటే అమ్మే!

V S R Moorty
Magazine : Mother of All
Language : Telugu
Volume Number : 16
Month : July
Issue Number : 3
Year : 2017

‘శ్రీరామచంద్రా! నీవు సాక్షాత్ నారాయణుడివి. వైక్లబ్యం తగదు. దుష్టసంహార కార్యక్రమం నీ లక్ష్యం. ధర్మ పరిరక్షణ నీ కర్తవ్యం. నీ గమ్యం’. అని వశిష్ఠుల వారు అన్నప్పుడు రాముడు, ‘నేను దశరథ కుమారుణ్ణి. విధి నడిపించినట్లు నడవడం నా విధి’, అంటాడు.

‘నేను తప్ప వేరు వస్తువు లేదు. వేదాల్లో నేను సామవేదాన్ని. పక్షులలో గరుడ పక్షిని. మాసాల్లో మార్గశీర్షాన్ని. నేను దైవాన్ని’ అంటాడు కృష్ణ పరమాత్మ.

‘మీరు స్కందులు, కుమారస్వామి రమణ రూపంలో దర్శనమివ్వడం మా భాగ్యం’ అని మహా తపస్వి కావ్యకంఠ వాశిష్ఠ గణపతి ముని, భగవాన్ రమణ మహర్షితో అన్నప్పుడు, ‘మిమ్మల్ని మీరు తెలుసుకోండి. ఆ ఎరుక కలిగితే ద్వైతం సమసిపోతుంది’ అని మహర్షి సమాధానం.

‘త్రేతాయుగం నాటి రాముడు, ద్వాపర నాటి కృష్ణుడు కలబోస్తే ఈ రామకృష్ణుడు’ అన్న పరమహంస ప్రకటన స్మరణీయం.

ఈ సంఘటనల వెనుక మాటల మాటున దాగిన మర్మం, దాని వెనుక ఉన్న మహితత్వం జాతికి వరం. ఆయా అవతారమూర్తుల ఆవిష్కరణలు, అన్వేషణ ప్రారంభం కావడానికి ఆలోచనా స్ఫోరకాలు. అన్వేషణ ముగించడానికి సాఫల్యాలు. అవతార ప్రణాళిక, జాతి సంసిద్ధత, తపస్సాఫల్యం, జీవన పరిపక్వతలకు అనుగుణంగా, ప్రసంగవశాత్తు వెలువడే ఈ మార్మిక శబ్దాలు, వాక్యాలు, ఆయా మహాత్ముల అంతరంగ అభివ్యక్తే.

ఈ భూమిక అందరూ అందుకోదగినది కాదు. ఎవరు నిత్య జీవితాన్ని సత్యానుసంధాన స్ఫూర్తితో సాగిస్తారో, వారు ఈ మాటలను ఆలకించి, ఆచరించి, అనుభవించి, ఆనందతారక స్థితిని అందుకుంటారు. జీవన్ముక్తులుగా, ముక్త జీవనులుగా జన్మను పండించుకుంటారు.

సాధకుడికి పరిపక్వత లేనప్పుడు, అజాగ్రత్తగా ఉన్నప్పుడు మహాత్ముల నోట వెలువడే మాటలను సామాన్యార్ధంలో గ్రహించుకొని పెడచెవిన పెడతాడు. నష్టపోతాడు. యదార్థాన్ని అందుకోలేక కాలగతిలో వెనుకబడిపోతాడు. జీవితాన్ని వృథా చేసుకుంటాడు.

‘నేను అందరికీ అమ్మను’ అన్నది అమ్మ ప్రకటన. ప్రకటించడం బహు సులువు. అమ్మగా ఉండగలగడం సామాన్య విషయం కాదు. ఇంతకీ అమ్మంటే?

ప్రతి జీవి జన్మకూ కారణం అమ్మ. అమ్మలేని ప్రాణి లేదు. అమ్మ ఒడి మొదటి బడి. అమ్మే తొలి గురువు. అమ్మ అయ్యను చూపిస్తుంది. అమ్మ, అయ్య కలిసి లోక గురువును చూపిస్తారు. ఈ ముగ్గురి దయ వలన జీవుడు. తనలో ఉన్న దైవాన్ని దర్శించగలుగుతాడు. తల్లి, తండ్రి, గురువు, దైవం…. ఇది క్రమం. సక్రమం. కాబట్టి అమ్మ దైవం. దేవ అంటే ఆట. అమ్మకు గెలుపోటములు లేవు. ఆడటం ఒక వేడుక. జీవిని గెలిపించడం ఆమెకు ఆనందం. అప్పుడప్పుడూ ఓడించినట్టు ఓడించి, గెలిపించడం ఆమెకు పరమానందం. పాకుతున్న వాడిని నడిపించడం, నడుస్తున్న వాడిని పరిగెత్తించడం, పరుగెత్తుతున్న వాడిని నిగ్రహించడం ఆటలో భాగమే.

అమ్మ – కారణాలు అవసరం లేని ప్రేమకు చిరునామా. భరించడం, క్షమించడం సహజలక్షణాలై, సహనం రూపు కడితే ఆమె అమ్మ. మమకారంతో మనసును మార్దవం చేయగల మహిత శక్తి మాతృమూర్తి.

సమస్త జీవరాశుల పట్ల సహజ ప్రేమతో సంచరిస్తూ సర్వానందమయ స్థితిలో అన్ని వేళలా ఉండగలిగేది మాతృశ్రీ. పిపీలికాది బ్రహ్మ పర్యంతాన్ని ఆత్మగా దర్శించగలగడం అమ్మ నిరూపించిన మహాపరిసత్వం. ఈ అనుభవాన్ని పొంది, ఆత్మానుభూతిని పొందిన వారెందరో! ఎక్కడి అంబా సముద్రం? ఎక్కడి అర్కపురి? అదే.. జిల్లెళ్ళమూడి.

నాలుగు దశాబ్దాల క్రితం రూపుకట్టిన శివమై, బ్రహ్మతేజోమూర్తి అయిన పూర్ణానంద స్వామి అమ్మను జిల్లెళ్ళమూడిలో దర్శించుకోవడం, ఒక అపురూప సన్నివేశం. తన జన్మకు హేతువైన తల్లితో పునర్దర్శించుకోవడం అదనపు అనుభవం. ఆపై జరిగిన ఆధ్మాత్మిక సాధన తీవ్రమై, కర్మ, భక్తి, జ్ఞానయోగాల త్రివేణీ రూపమై పూర్ణానందులను పరవశులను కావించింది.

కామేశ్వరుడి శక్తి అంతా కామేశ్వరిలో ఉంది.

 బిడ్డ శక్తి అంతా అమ్మలోనే ఉంది.

 కర్మ శక్తి అంతా కర్మలో ఉంది. 

దైవంలో అమ్మను చూడడం ఒక స్థాయి.

అమ్మను దైవతంగా దర్శించడం ఒక అనుభవం.

 పూర్ణానందం శిఖర స్థాయిలో శ్రీశైలమైనది అమ్మ కడుపు చలవే!

 తల్లి ప్రేమ మహానంద సాగరం! 

దర్శించగలిగితే శైశవమంతా శివమే!

తడమగలిగిన తల్లి దొరికినప్పుడు బిడ్డకు లోటుంటుందా?

(నమస్తే తెలంగాణ వారి సౌజన్యంతో 7.5.2017 నుండి పునర్ముద్రణం)

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!