అమ్మ మాట ఒక ఆణిముత్యం అని మనందరికి తెలుసు. అమ్మ అనేక సందర్భాలలో అన్న మాటలను మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే ఆ విషయం అర్థమౌతుంది. నాకు కూడ వ్యక్తిగతంగా అది నిజమయింది.
అంటే 1983వ సంవత్సరం కాలేజి అడ్మిషన్ జరిగే రోజులు. నేను బాపట్ల ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో బి.కామ్ కోర్సులో చేరడానికి దరఖాస్తు చేసుకున్నాను. ఆ విషయం చెప్పటానికి నేను అమ్మ దగ్గరకు వెళ్ళాను. అమ్మ నామాట వినకుండా “నాన్నా నువ్వు B.A. Eng. Litt course చేరుతున్నావా?” అని అడిగింది. నాకు B.Com చదవాలని interestగా వుండేది. అమ్మ దగ్గరకు నేను ఎప్పుడు వెళ్ళినా అమ్మ నా మాట వినకుండా B.A. Eng Litt గురించే మాట్లాడేది. ఇలా తరచూ అడుగుతూ ఉండేది. అప్పుడు అమ్మ దగ్గర ఉన్న మా నాన్న (రామకృష్ణన్నయ్య) మా సంభాషణ వింటూ ఉండేవాడు. అమ్మ ఎందుకు చెప్తున్నదో, దానికి తగిన కారణం ఉంటుందని నమ్మి, మా నాన్న నన్ను ఒప్పించి అమ్మ మాట ప్రకారం ఇంగ్లీషులో చేర్చాడు.
నాకు బాంకింగ్ రంగంలో ఉద్యోగం చేయాలని ఉండేది. మరి అమ్మ అట్లా ఎందుకు చెప్పింది ? ఆలోచిస్తూ ఉండేవాడిని. ఈ సందిగ్ధంలో “నా B.A. Degree పూర్తి అయింది. ఆ తరువాత నా వివాహం జరిగింది. నా భార్యకు టీచర్ ఉద్యోగం వచ్చింది. నేను ఖాళీగా ఉండటం ఎందుకని convent లో English Teacher గా చేసేవాడిని. అప్పుడు మానాన్న నన్ను B.Ed. చేయమని సలహా ఇవ్వగా B.Ed. చేయటం జరిగింది. ఆ విధంగా Teaching line లో స్థిరపడిపోయాను.
ఆ తరువాత అమ్మ నిర్ణయం ప్రకారం నాకు అమ్మ స్థాపించిన పాఠశాలలోనే ఉద్యోగం వచ్చింది. నేను చేరినప్పుడు ఇక్కడ ఇంగ్లీషు సబ్జక్టు లేదు. అంతా సంస్కృతం, తెలుగు. ఒక పేపరు మోడరన్ నాలెడ్జి ఉండేది. అది నేను బోధించేవాడిని. కాలాన్ని బట్టి మా పాఠశాలలో కూడా మార్పు చేయవలసి వచ్చింది. ఇంగ్లీషు, హిందీ, లెక్కలు, సోషల్, సైన్సు సబ్జక్టులు ప్రవేశపెట్టడం జరిగింది. ప్రభుత్వం వారు పిల్లలు S.S.C. Examination వ్రాయటానికి అనుమతించారు. ఈ సంవత్సరం నుండి ఈ పరీక్ష వ్రాయించుట జరుగుతుంది. నేను యిప్పుడు English Teach చేస్తున్నాను. మరియు హెడ్మాస్టర్ బాధ్యతను కూడా అమ్మ అప్పజెప్పింది.
నాకు చాలా ఆశ్చర్యం దాదాపు 30 సంవత్సరాల తరువాత అమ్మ చెప్పిన మాట నిజమయింది. నిజమే మరి “మనకు భవిష్యత్తు అమ్మకు వర్తమానం”. “అమ్మది తోలు నోరు కాదు కదా ! తాలు మాట రావడానికి” ఇటువంటి సంఘటనలు ఎన్నెన్నో…… అమ్మ కాలస్వరూపిణి గదా! మనకేది అవసరమో దాన్ని అమ్మ మనకు యిస్తుంది. అమ్మ తాను పేరు పెట్టిన, తన బడిలో పెరిగిన ఈ ప్రేమపై ప్రేమను చూపించింది.