సో.శ్రీ జన్నాభట్లశాస్త్రితో నాకు 1974లో పరిచయం ఏర్పడింది. అప్పట్లో అంత చనువు ఉండేది కాదు. క్రమేణా మేము పూజా సమయాల్లో ” కలుసుకునే వాళ్ళం.
అమ్మ సన్నిధిలో | వారు చక్కగా సంభాషించేవారు, ఎన్నో జోక్సు వినిపించేవారు, అందరినీ నవ్వించేవారు. అమ్మ కూడా పకపకా నవ్వేది. ఆ సందర్భం చాలా హాయిగా సంతోషంగా ఉండేది. మా పరిచయాలు పెరిగి సన్నిహితులయ్యాము.
హైమాలయంలో మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయం నుండి తెల్లవారిందాకా అభిషేకాలు, అర్చనలు, నవరాత్రులలో త్రికాలపూజలు దీక్షగాచేసేవారు, మాచేత చేయించేవారు. కొన్ని మహనీయ మధురస్మృతులు – 1979లో ప్రప్రధమంగా లలితాకోటి నామార్చన, లక్ష బిల్వార్చన, మల్లెలతో పూజలు, చండీయాగంలో వారితో కలిసి పాల్గొనడం. చండీయాగం చేసినపుడు కేశవన్నయ్య, శాస్త్రి అన్నయ్యలకు సహాయకునిగా వారు చెప్పిన పనులు చేస్తుండే వాడిని. శాస్త్రి అన్నయ్య ఆత్మీయత, ప్రేమ ఇంత అంత అని మాటలలో చెప్పలేను. ఏదన్నా పొరపాటు చేస్తే ఎంతో చనువుగా ‘ఇదేమిటిరా, ఇలా చేశావు? useless fellow! అనేవాడు. ఆ సమయంలో ఆ కంఠధ్వనిలో ఆ కన్నులతో పొంగులు వారే ఆర్ద్రత ప్రేమ వర్ణించలేను. నేను కించిత్ బాధపడతానేమోనని వెంటనే “ఒరేయ్! మనిద్దరిదీ ఒకటే గోత్రంగా! నువ్వు నా కంటే చిన్నవాడివి. ఫర్వాలేదు. అనొచ్చు’ అనేవాడు. “అదేం లేదులే అన్నయ్యా! నువ్వెంతో ప్రేమగా అన్నావు” అనే వాడిని. ఆ పొరపాటు సరిదిద్ది ఏది ఎలా చెయ్యాలో మార్గదర్శనం చేసేవాడు.
జిల్లెళ్ళమూడిలో ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి ఆధారభూతమైన యంత్రాంగం, ప్రణాళిక, కార్యాచరణ, సహకారం, కృషి శాస్త్రి అన్నయ్యదే. అవసరమైన సంభారాలు తీసుకురావడం గానీ, ఋత్విక్కులను ఏర్పాటు చేయడం గానీ, అన్నపూర్ణాలయానికి కావలసిన సరుకులు, సామానులు, కూరగాయలు, ఆలయాల్లో అవసరమైన పూలూ-పళ్ళు, సుగంధద్రవ్యాలూ సేకరించి భద్రంగా తీసుకురావటం గానీ, ఇక ఉత్సవ నిర్వహణ సమయంలో గానీ, ఎంత శ్రమించేవాడో తన భక్తి విశ్వాసాల్ని రంగరించి ఒక తపస్సుగా ఆచరించేవాడు. మరచిపోలేము ఆ వ్యక్తిని, ఆ వ్యక్తిత్వాన్ని. ఒకసారి హైమవతీదేవికి లక్షగాజులతో అర్చన సంకల్పించాడు. ఆ రోజు అలంకరణ చూస్తే కన్నుల పండుగే. ఇవాళ హైమాలయానికి గాని అనసూయేశ్వ రాలయానికి గాని వెడితే శాస్త్రి అన్నయ్య లేని లోటు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొన్నాళ్ళ వరకు ఆ జ్ఞాపకాలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. మళ్ళీ మళ్ళీ ఆయన్ను చూడాలని మళ్ళీ వస్తే బాగుండునని మనస్సు ఎదురు తెన్నులు చూస్తూనే ఉంటుంది.
మరొక సన్నివేశం. శ్రీ అనసూయేశ్వరాలయ గర్భగుడి వెలుపల సప్తయోగినుల విగ్రహాల తయారీ – ప్రతిష్ఠ గురించి కేశవశర్మ అన్నయ్య ఎంతో శ్రమ చేసి ఆ దేవతామూర్తుల రూపురేఖలు, ఆయుధధారణ వగైరా సంపూర్ణ సమాచారంతో గొప్ప చిత్రకారునిచే చక్కని చిత్రాలు వేయించి ఇచ్చారు. కానీ చాలాకాలం ఆ సంగతి మరుగున పడింది. SDJD వారు ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనుకున్నారు. ఒక ఆలోచన చేశారు. బెంగుళూరు
శ్రీ రాజరాజేశ్వరీ ఆలయంలో చాలామంది శిల్పులు స్థపతులు ఉన్నారు; వాళ్ళు చేస్తే బాగుంటుంది అని. దానికి స్వామీజీ అనుమతి కావాలి. నేను స్వామీజీతో ప్రస్తావించగానే ఇది తప్పకుండా చేయాలి. ఇది అమ్మ సంకల్పమే కదా!” అని స్థపతిని పిలిచి మాట్లాడారు. శిల్పి పని ప్రారంభించారు. దాదాపు పని పూర్తి కావచ్చింది. ఇక వాటి ప్రతిష్ఠ ఎలా నిర్వహించాలి? పూజా విధానం ఏమిటి? తెలుసుకుందామని శాస్త్రి – అన్నయ్య మా ఇంటికి వచ్చారు. ఇద్దరం స్వామీజీని కలుసుకున్నాం. వారితో శాస్త్రి అన్నయ్య చాలాసేపు మాట్లాడి పూజావిధానం, ప్రతిష్ఠాక్రమం, నివేదనలు వివరాలు తెలుసుకుని జిల్లెళ్ళమూడి వచ్చి అమలు చేశారు. అది మరపురాని సందర్భం, అనుబంధం. అమ్మకి అత్యంత సన్నిహితులు, భక్తులు ఒకరి తరువాత ఒకరు శాశ్వతంగా కనుమరుగై పోతూ ఉంటే ఆ బాధని, మూగవేదనని మాటలలో వ్యక్తం చేయలేను. ఆ వెలితిని పూడ్చలేము; ఆ వెలితి వెలితే!!
ఆత్మీయతా బంధం:
నెల్లూరు డాక్టర్ యస్.వి. సుబ్బారావు గారు అమ్మ పరమభక్తులు, సాక్షాత్తూ అమ్మకే వైద్యసేవలందించిన భాగ్యవంతులు. వారిని ఎక్కువగా జిల్లెళ్ళమూడిలో చూస్తుండేవాడిని. వారు ఎంతో ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ ఉండేవారు, ఎంత పనిలో ఉన్నా ఆత్మీయంగా పలకరించేవారు. 1981లో నాకు వివాహమైంది. మా అత్తవారి ఊరు నెల్లూరు కావున నెల్లూరు వెళ్ళినపుడల్లా డాక్టర్ సుబ్బారావు గారింటికి వెళ్ళేవాడిని. వారు సాధారణంగా ఎక్కువ సమయం ఆస్పత్రిలోనే ఉండేవారు. వారి వద్ద చికిత్స పొందటానికి వచ్చిన రోగులు బారులు తీరి వారి ఇంటిముందు వేచి ఉండేవారు. నేను వచ్చానని వారికి తెలియగానే లోపలికి పిలిపించుకునేవారు. వైద్యం కాసేపు ప్రక్కనపెట్టి నన్ను ఇంట్లోకి తీసికెళ్ళి ఆప్యాయంగా కొంత సమయం నాతో గడిపేవారు. మా అత్తవారు కూడా చిరకాలంగా వారి వద్దనే వైద్యం చేయించుకునే వారు.
క్రమేణ వారితో పరిచయం పెరిగింది. వారితో బాగా ముడివడిన మరపురాని సంఘటన ఒకటి ఉంది. కళాశాల విద్యార్థిని గరుడాద్రి వనజ యొక్క సోదరులు శ్రీ వెంకట సుబ్బయ్యగారు. వారిని చాలా అనారోగ్య స్థితిలో జిల్లెళ్ళమూడి తీసుకువచ్చి మాతృశ్రీ మెడికల్ సెంటర్లో చేర్చారు. వారితో ఏడెనిమిది ఏళ్ళ ప్రాయం గల ఒక పసివాడు కూడా ఉన్నాడు.
వారిని చూడటానికి అమ్మ ఆస్పత్రికి వెళ్ళింది. కూడా నేనూ వెళ్ళాను. వారి వద్ద అమ్మ కాసేపు ఉండి, మాట్లాడి, ఒళ్ళంతా నిమిరి తక్షణం తిరిగి వచ్చింది. వెంటనే నెల్లూరు డాక్టర్ సుబ్బారావుగారికి ఫోన్ చెయ్యమన్నది. ఆ రోజుల్లో యస్.టి.డి. సౌకర్యం లేదు. Manual Truck Call Book చేశారు. ఆశ్చర్యం. సాధారణంగా పనిచేయని టెలిఫోన్ వెంటనే పలికింది. 10 నిమిషాల లోపే కాల్ కలిసింది. అమ్మ తన గదిలోంచి హాలులోకి ఫోన్ దగ్గరకు వచ్చి సుబ్బారావు గారితో “నాన్నా! నా కోసమైతే ఎట్లా వస్తావో అట్లాగే వెంటనే బయలుదేరిరా” అన్నది. అమ్మ మాట శిరసావహించి వారు రాత్రి గం.9.00ల కల్లా వచ్చేశారు. రాగానే అమ్మకి నమస్కరించుకుని ఆస్పత్రికి వెళ్ళి వెంకట సుబ్బయ్య గారిని పరీక్షించారు.
నాటి రాత్రి డాబాపైన ఆరుబయట అమ్మ మంచం మీద పడుకున్నది. కొద్ది దూరంలో నేనూ పడుకున్నాను. తెల్లవారుజామున గం.5/5.30ల ప్రాంతంలో నాకు మెలకువ వచ్చింది. అప్పటికే అమ్మ లేచి మంచం మీద కూర్చొని వుంది.
అంతలో డాక్టర్ సుబ్బారావు గారు వచ్చారు. అమ్మకు నమస్కరించి “అమ్మా! ఆయనకి ఐదారు రోజులకి కాని చేకూరని అభివృద్ధి, మార్పు, స్వస్థత కేవలం ఒక్క రాత్రిలోనే వచ్చిందమ్మా!” అన్నారు. అందుకు అమ్మ “అందుకే కదా, నాన్నా! నిన్ను పిలిపించాను” అన్నది. వెంటనే వినమ్రులై వారు “అదికాదమ్మా, నేను చేసిందేమీ లేదు. డాక్టర్ పాప వైద్యం సక్రమంగా చేస్తున్నది. సరియైన మందులే వాడుతోంది. ఆయన తృప్తి కోసం ఒక ఇంజెక్షన్ చేసి వచ్చాను. అంతకంటే నేనేమీ చెయ్యలేదమ్మా. ఇది ఎవరు చేశారో నాకు తెలుసు. నువ్వు ఒప్పుకోవు కానీ, ఇదంతా నీ మహిమే. నువ్వే చేశావమ్మా” అన్నాడు. “లేదులే, నాన్నా!” అంటుంది అమ్మ; “అలా కాదులే” అంటారాయన.
కాస్సేపుండి, అమ్మ చిరునవ్వుతో “నిన్న వాడి దగ్గరకు వెళ్ళినపుడు ఆ పసివాడి ఏడుపు చూశాక…” అని ఠక్కున ఆపేసింది అమ్మ. అంటే ఆ పిల్లవాడి దుఃఖం చూసి కరిగిపోయి అమ్మ ఈ నిర్ణయం తీసుకుందా? ఆయనకి అంత శీఘ్రంగా, వేగంగా ఆరోగ్యాన్ని చేకూర్చిందా? అవును. కనుకనే అమ్మ మాట వినినంతనే డాక్టరు గారు సాష్టాంగ నమస్కారం చేసి “అదే కదమ్మా! నేను చెబుతున్నది అదే కదా!” అన్నారు.
ఆ విధంగా అమ్మ యెడల వారి భక్తి విశ్వాసాల్ని ప్రస్ఫుటంగా చూశాను. వారి మందస్మిత వదనం, నిరాడంబరత, సౌమ్యత, సౌహార్ద్రత ఇప్పటికీ నా కళ్ళముందే ఉంటాయి.
అట్లా అమ్మను సేవించుకున్న మహనీయులెందరో ఉన్నారు. వారందరితో కలిసి మెలసి మెలగటం నా అదృష్టం. అది అమ్మ నాకు ప్రసాదించిన వరం. ఆ మహానుభావులందరికీ పాదాభివందనములు చేస్తున్నా.