1. Home
  2. Articles
  3. Viswajanani
  4. ప్రేమే దైవం

ప్రేమే దైవం

K B G Krishna Murty
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 13
Month : January
Issue Number : 6
Year : 2013

మా ప్రసాద్ గుంటూరు బ్రాడీపేట 4/19 అడ్రసు గల ఇంటిలో యుండగా నేను ఎక్కువగా గుంటూరు వెళ్ళి వాళ్ళ యింట్లో వుండేవాడిని. ఆ పోర్షన్ మొదటి అంతస్తులో ఉండేది. పై అంతస్తులో ప్రక్కగా ఉన్న వరండాలో వచ్చి నిల్చుంటే మామిడి చెట్లు చల్లటి గాలి తగులుతూ హాయిగా ఉండేది. ఆ ఇంటి ప్రక్క వారి ఇంటిలో మామిడి చెట్లు చాలా వున్నవి. ఆ చెట్ల నీడ ఈ ఇంటి మీద పడుతూ వుండేది. నేను అక్కడ నిల్చుని పరిశీలనగా చూస్తూ వుండేవాడిని. ఆ చెట్లు ఎప్పుడు నాటినవో తెలియదు. ఆ ఇంటివారు వాటికి కాసిన మామిడికాయలను కొట్టుకొని అమ్ముకోవటం పరిపాటి. అంతే తప్ప వాటికి కావాల్సిన నీరు ఇత్యాదులు పోయటం, వాటిని జాగ్రత్తగా పెంచే అభిలాష వారికి లేదనే చెప్పవచ్చును. కాని అవి భూమి నుండి కావలిసిన నీటిని, ఆహారంను తీసుకొంటూ తనకు పూసిన ఆకులను, పూతను, కాయలను వారికిస్తూ చుట్టూ వుండే వారికి కూడా కావలసిన ప్రాణవాయువును ఇస్తూ అవి గ్రహిస్తూ జీవిస్తున్నవి. వాటి జీవిత మంతా ప్రకృతి పైనే ఆధారపడి యున్నది. అవి కూడా ప్రకృతి తమకు ఏమి ఇస్తే అవి తృప్తిగా తింటూ ఇతరులకు ఆదరంగా పంచుతున్నవి. పశువులైన ఆవులు, బట్టెలు కూడా మనమిచ్చే గడ్డిని, నీటిని గ్రహిస్తూ మనకు అమృత సమానమైన పాలను వాటి దూడలకు ఇస్తూ, యజమానికి కావలసిన పాలునూ ఇస్తూ తృప్తిగా వారి జీవితభాగస్వాము లైనవి. ఈ పాలమీద బ్రతికే కుటుంబాలు అనేకంగా ఉన్నవి. కాని మానవునకు భగవంతుడు అనేకంగా సమకూరుస్తున్నా తను అసంతృప్తి పాలవుతున్నారు. కారణం తృప్తి లేకపోవటమే. మనకు మన పూర్వీకులు 10 ఎకరాలు పొలం ఇస్తే, 50 ఎకరాలు లేవే అనే అసంతృప్తి, ఏ 30 లక్షల నగదు ఇస్తే ఒక కోటిరూపాయలన్నా లేదే అనే అసంతృప్తి, కోట్లున్న వారికి మిలియన్సు మీద దృష్టి. అసలు ఏమి లేని వారికి ఏ రోజు కారోజు జీవితం గడిస్తే తృప్తి. అట్లా తృప్తి పడేవారికి ఆనందం, కరతలామలకమే. కాని ఈ కోట్లు గడిస్తున్న వారికి అది లేదు. ఎంతున్నా వారికి అసంతృప్తే. ఎమ్.ఎల్.ఎ. అయితే మినిష్టర్ కాలేదని, మినిష్టర్ అయితే ఛీఫ్ మినిష్టరు కాలేదని, ఛీప్ మినిష్టరు అయితే ప్రైమ్ మినిష్టరు కాలేదని అసంతృప్తే తప్ప తృప్తి లేదు. ఈ అసంతృప్తే సంఘర్షణలకు తావు అయి హింస, ప్రతిహింస, అసూయ, ద్వేషం ప్రజ్వరిల్లుతున్నవి. ఇవి వున్న వాళ్ళకు శాంతి ఎక్కడ నుండి వస్తుంది? పాశ్చాత్యులకు ఆస్తులు, అంతస్తులు అనేకం ఉన్నా వారికి కరువైంది శాంతే. అందుకే వివేకానందుడు తన పర్యటనలో ఈ శాంతిని ఇవ్వకలిగినది భారతదేశం మాత్రమే అని ప్రకటించారు. వారి నుండి మనకు కావలసిన materialism తీసికొని వారికి కావలసిన శాంతి, ఆధ్యాత్మికత వారికిద్దాం అని. మరి శాంతి అనేది మార్కెటులో కొనుక్కొనే వస్తువు కాదు. మరి ఎక్కడ దొరుకుతుంది ? అంటే అది ఎక్కడ వెతకినా దొరకదు. కారణం అది ఎక్కడో లేదు కాబట్టి. మరి యెక్కడుంది ? అది మనలోనే మన దగ్గరే వున్నది కాబట్టే బయట ఎక్కడా వెదికినా దొరకదు. మరి మన దగ్గరుంటే మనకు కనపడటం లేదేం? అంటే ఇంటిదొంగను ఈశ్వరుడైన కనుక్కోలేడు అంటారు. మరి ఇక్కడ ఇంటి దొంగ ఎవరు ? మనమే. మన మనస్సే. విలయ తాండవం చేస్తున్న అతి హింసను ఎదుర్కొవాలంటే మనస్సు ప్రతిఘటించవలసినదే.ఆ మనస్సే అశాంతిని, హింసను కట్టడి చేయగలదు. ఎట్లా ? ప్రేమతో. అందుకనే అమ్మ తనను ఎవరు ప్రేమించినా, ద్వేషించినా తను అందరినీ ప్రేమించాలని” వాస దాస స్వామిని తన 5వ ఏటనే కోరింది తాను అందరిని ప్రేమిస్తే, ద్వేషం ఎక్కడిది అశాంతి ఎక్కడది. ఎక్కడైతే ద్వేషం లేదో, అశాంతి లేదో అక్కడే శాంతి. ఆ శాంతిలోనే యున్నాడు పరమాత్మ. ఆ పరమాత్మ ఎక్కడో లేడు. మనలోనే, మనగానే మనమే.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!