“మనకి హైమ మీదకంటే, హైమకి మన మీద ప్రేమ ఎక్కువ. హైమ ప్రేమకు మన ప్రేమకు పోలిక ఏమిటి?” అని ప్రేమామృతమూర్తి హైమక్క అపురూప అలౌకిక దివ్యతత్వాన్ని విశదీకరించింది అమ్మ. అందుకు రెండు ఉదాహరణలు.
- మేము తెనాలి దగ్గర కొల్లూరులో ఉండగా జూన్ 12, 1963న మా అమ్మగారు ‘అమ్మ’లో ఐక్యమయ్యారు. కార్యక్రమాలు పూర్తి అయ్యాక కాకినాడ పాలిటెక్నిక్ చదవటానికి వెళ్ళేముందు ‘అమ్మ’ని దర్శించుకున్నాను.
‘అమ్మ’ స్వయంగా తన చేత్తో కలిపి పెట్టిన అన్నం తిని, ఆ రాత్రికి అక్కడే ఉండి మర్నాడు కొల్లూరు చేరాను. ఆ మర్నాడు కాకినాడకి బయలుదేరి వెళుతూ విజయవాడ దగ్గర కృష్ణలంకలోని ‘ప్రకృతి చికిత్సాలయం’లో ఉన్న హైమక్కని చూద్దామని వెళ్ళాను. అప్పట్లో హైమక్కయ్య మైగ్రేన్తో బాధ పడుతోందని సాయమ్మగారిని తోడుగా ఉంచి ప్రకృతివైద్యం చేయిస్తున్నారు.
నన్ను చూడగానే హైమక్క నన్ను పట్టుకుని ‘అమ్మ (మాతల్లి శ్రీమతి దమయంతి) పోతే నాకు తెలియకుండా (అంత్యక్రియలు) చేశారు కదూ!” అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది. మా కుటుంబ సభ్యులపై హైమకు గల ఆత్మీయత ఆప్యాయత అర్థంకానివి, అంతులేనివి. మా అమ్మ గారితో హైమ అనురాగ బంధం ప్రగాఢమైనది. ‘అమ్మ’! ‘అమ్మ’ – అని సంబోధిస్తూ కన్నబిడ్డ వలె మా ఇంట్లో తిరుగుతూండేది. కనుకనే మా సోదరులందరినీ సహోదరులగా ప్రేమించటం తనకి సహజమైంది.
కన్నతల్లి చనిపోతే కడసారి చూపులు సైతం దక్కలేదన్నట్లు దుఃఖించింది. హైమ. అందరినీ ‘అమ్మ’లుగా హైమ చూస్తుంది. కనుకనే అమ్మ “హైమ, నేను బింబప్రతిబింబాలం’ అన్నది.
ఆ రాత్రి సాయమ్మగారు నాకు భోజనం వడ్డించి, హైమక్కకి పచ్చికూర ముక్కలు పెట్టారు. “ఇదే నా భోజనం” అని హైమక్క అంటుంటే నాకు కళ్ళనీళ్ళు ఆగలేదు. ఎంతో సుకుమారంగా ఉండే హైమక్కకి ఈ కష్టాలు ఏమిటి? అని బాధ పడ్డాను.
మరునాడు ఉదయం తనకు శ్లేష్మం శుభ్రం చేసుకునేందుకు ఇచ్చిన రబ్బరు ట్యూబ్లను చూపించి మనసులోని బాధను అణచుకొని “ఇక వీటితో యుద్ధం చేయాలి” అంటూ నవ్వింది. ఆ దృశ్యం చూసి నాకు గుండె బరువెక్కింది. తనకన్నా చిన్నవాడిని, ఏమని ధైర్యం చెప్పగలను? రైలు బయలు దేరు సమయం దగ్గర పడుతుండడంతో ఇక తప్పక హైమక్క దగ్గర సెలవు తీసుకుని కాకినాడకి ప్రయాణమయ్యాను.
- మా అన్నయ్య శ్రీ తంగిరాల రాధాకృష్ణమూర్తికి హైమ స్వయంగా వ్రాసిన లేఖ.
జిల్లెళ్లమూడి, 13-9-1962
అన్యయ్యా!
ప్రేమతో నీవు వ్రాసిన కవరు నిన్న 3 గంటలకు క్షేమంగానే చేరింది. నీ మనస్సు తృప్తి గలిగి నందుకు చాలా సంతోషించాను. అన్నయ్యా! నీకవరు తనకు తోడుగా ఇంకో 3 కవర్లను కూడా తెచ్చుకున్నది. ఎక్కడి నుంచో తెలుసా? 1) జానకి 2) గోపాలపురం 3) అడవులదీవి. ఈ నాలుగు ఉత్తరాలతో 1 గంట కాలక్షేపం చేశాను. ఒక్కసారే! రాధా, మధుల ఉత్తరాలు చూసే సరికి ఆనందోత్సాహాలతో ఏం చేయాలో తోచక అమ్మ గదికి పరుగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ చేతిలో నీవు వ్రాసిన కవరు ఉంచాను. అమ్మ సగం చదివి, నన్ను చదువమని ఇచ్చింది. సరే! అని చదివి వినిపించాను. అమ్మ నవ్వుకుని రైటింగ్ చాలా బాగున్నది అనుకున్నది. తరువాత శేషగిరిరావు అన్నయ్యతో ‘వెధవాయ్, అల్లాడుతూ వ్రాశాడు’ – అని చెప్పింది. పోనీలే! అమ్మ ఆ మాటైనా అనుకున్నది – అని సంతోషంతో నీకీ విషయం తెలియ చేయాలని, నిన్ను కూడా సంతోష పెట్టాలనే ఉద్దేశ్యంతో ఉత్తరం ప్రారంభించాను.
అమ్మకు వచ్చిన ఉత్తరాలు శ్రీ శేషగిరిరావు అన్నయ్యగారు చదివి వినిపించారు. అందులో రూర్కెలా నుండి శాస్త్రి అన్నయ్య వ్రాసిన కవరు కూడ ఉన్నది. అన్నీ విని అమ్మ, “ఈ రోజున అన్నీ చాలా బాగున్నై. రాధ వ్రాసింది. కూడా బాగున్నది” అని తృప్తిగా మంచం మీద వాలి పోయింది. అమ్మ ఒకటికి రెండు సార్లు నిన్ను తల్చుకోటం నాకు కూడా తృప్తిగా ఉన్నదనీ, ఉంటుందనీ వ్రాయనక్కర లేదుగా?
అన్నయ్యా! కేశవశర్మ అన్నయ్యకు నిన్ననే కవరు వ్రాశాను. రెండూ ఒకే రోజు చేరవచ్చు. ఏది ముందు చేరినా అందరికీ తెలుస్తుందిగా! జానకికి కూడా ఈ రోజే ఉత్తరం వ్రాశాను. జానకి అమ్మ ఫోటో పంపిందని వ్రాశావు. నేను చేయలేనివి జానకి చాలా చేయగలదు. అది అందరికీ తెలిసిన విషయమేగా? జానకి ప్రేమమూర్తి! జానకిలో ఉన్నప్రేమ నాలో శూన్యం. కానీ నా వల్ల కాకపోయినా జానకి వల్లనైనా నీ మనస్సు తృప్తిగా ఉంటే అదే నాకు తృప్తి. రాత్రి నిన్ను గురించే ఆలోచిస్తూ పడుకున్నాను. కలలో కన్పించావు. చాలా చిక్కిపోయి కన్పించావు అన్నయ్యా! చక్కగా ఆరోగ్యంగా సంతోషంగా ఉండు. ఆరోగ్యం జాగ్రత్త!
అన్నయ్యా! క్లాసుకు వెళ్తున్నానని వ్రాశావు. ఆ క్లాసుని గురించి కాస్త వివరంగా వ్రాస్తావు కదూ! క్లాసు అంటే ప్రైవేటుగా ఏమైనా చదువుతున్నావేమో అనుకున్నానుకానీ, పూర్తిగా అర్ధం కాలేదు. ఈసారి వ్రాసే ఉత్తరంలో వ్రాస్తావుగా!
అమ్మ ఆరోగ్యం మామూలుగానే ఉన్నది. అమ్మ ఆరోగ్యం విషయం వ్రాయాలంటే కష్టం. అన్నయ్యా! ఇప్పుడు కులాసాగా ఉన్నదని వ్రాసి వెళ్ళి చూస్తే, ఏ గొంతు నొప్పితోనో, తలనొప్పి తోనో బాధపడ్తుంటుంది. అమ్మ దగ్గర నేను కూచోవటం కూడా తక్కువే!
అన్నయ్యా! ఈ ఊరికి వరద వచ్చింది. ఇప్పుడే కొంచెం తగ్గుతున్నది. వానలు కూడా ఎక్కువగానే ఉన్నవి. రుక్కిణి అక్కయ్య నిన్ను అడిగానని వ్రాయమన్నది. యోగన్నయ్య చీరాలలో ఉన్నాడు.
ఆకు మందులేమీ వాడటం లేదు. కులాసాగానే ఉన్నాను. నా ఆరోగ్యానికేమీ ఫరవాలేదు అన్నయ్యా! నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూచుకుంటే చాలు.
అన్నయ్యా! టపాటైము కాస్తా అయిపోయింది. ఈ సారికింతే! వెంటనే జవాబు వ్రాయి.
ఈసారి విషయాలు ఎక్కువగా వ్రాస్తాను. ఏమీ అనుకోవద్దు. అడ్రసు వ్రాస్తున్నాను. రవికి కూడా ఉత్తరం వ్రాయి. సరేనా?
ఇక ఉంటా అన్నయ్యా! శెలవు!!
ప్రేమతో నా అన్నయ్యకు నీ చెల్లి హైమ
(రవి అడ్రస్)
C/o శ్రీ రాజుపాలెం రామచంద్రరావు,
కొట్ల బజారు, చీరాల, గుంటూరు జిల్లా.
మా పెద్దన్నయ్య సుబ్బారావు పెళ్ళి పొడగట్లపల్లిలో జరిగింది. పెళ్ళికి హైమ కూడా వచ్చింది. మా ఇంటి ఆడపడుచుగా వచ్చి లాంఛనాలు తీసుకుని తాను ఆనందించి, మమ్మల్నందరినీ ఆనందింపజేసింది.
ఆ ప్రేమమూర్తి నేడు మన ఆరాధ్యమూర్తి. ఆశ్రిత కల్పవల్లి. 28-11-2018న హైమవతీదేవి 75వ జన్మదినోత్సవము (Platinum Jubilee Celebrations) సందర్భముగా శత సహస్రాధిక వందనములు.
ఓం హైమ నమో హైమ శ్రీ హైమ జై హైమ