ప్రేమ చాల ప్రభావం కలది. దానికి వశులు | కానివారుండరు. అది ‘చాలవరకు అవ్యాజమయి ఉంటుంది. అప్పుడు దాని శక్తి ఇనుమడించినట్ల వుతుంది. ప్రేమ వ్యక్తి యందో, వస్తువునందో, పదవి యందో ఏర్పడుతుంది. అది చాల బలీయమై ప్రియమైన ఆ వస్తువును గాని, ఆ వ్యక్తినిగాని విడువలేని స్థితి ఏర్పడుతుంది. ఈ ప్రేమే సందర్భాన్ని బట్టి సమవయస్కులలో అయితే అనురాగమనో, స్నేహమనో దైవమునందో, గురువులయందో అయితే భక్తి అనీ; పిల్లల యందు, శిష్యుల యందు అయితే వాత్సల్యమనీ పిలువబడుతుంది. ఏ పేరుతో పిలిచినా దాని లక్షణం ప్రేమపాత్రులయిన వారిని విడువ లేకపోవడం, వారి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడటం జరుగుతూ ఉంటుంది. ప్రేమ లోపాన్ని కనుపించనీయదు. అందుకే అది గ్రుడ్డిది అని సామాన్యంగా అంటూ ఉంటారు. అయితే ప్రేమ ముదిరితే కోపంగా పరిణమించే ప్రమాదం కూడా లేకపోలేదు. అందుకే అమ్మ ‘ప్రేమ యొక్క రూపాంతరమే కోపం’ అంటుంది. ప్రేమ అంటే మమకారం అని అమ్మ భావన అయి వుంటుంది. మమతా విరహితమైన (అపరిమితమైన ప్రేమకూ, ధర్మానికీ భేదం లేదు కదా! అప్పుడు ప్రేమ కంటే ధర్మం గొప్పది అనడం ఎలా పొసగుతుంది. అందుచేత ఈ వాక్యంలో ప్రేమ అంటే మోహం అని అర్థం చెప్పు కోవాలి.
ఇక ధర్మం అంటే ధర్మాన్ని నిర్వచించడం దుష్కరం. కర్తవ్యం అని, స్వభావం అని, మతం అని వేర్వేరు అర్థాల్లో ఆ పదం ప్రయోగింపబడుతోంది. శాస్త్రాలలో వర్ణాశ్రమ ధర్మాలు చెప్పబడ్డాయి. ఇవి కాక తల్లి ధర్మం, రాజధర్మం, పుత్రధర్మం – ఇలా రకరకాలుగా ధర్మం ఉపదేశించబడ్డది. అందుచేత ధర్మమంటే స్థూలంగా కర్తవ్యమనీ అనుకోవచ్చు. ఈ కర్తవ్యమనేది శాస్త్రాల్లో విధింపబడిన ‘అహింసా పరమో ధర్మః’ ‘సత్యాన్నాస్తి పరోధర్మః’ వంటిదైనా కావచ్చు, లేక ‘నేను ఆజన్మాంతమూ బ్రహ్మచారిగా ఉంటాను.’ ‘నేను పతియాజ్ఞ సర్వదా సర్వథా పాటిస్తాను’ ‘పితృవాక్య పరిపాలన చేస్తాను,’ ‘లోకారాధనం కోసం దేనినైనా విడిచి పెడతాను’ ‘అన్న మాటను నిలబెట్టు కోవడం కోసం ఆలుబిడ్డలనైనా అమ్ముకుంటాను” మున్నగు రీతిగా తాను స్వయంగా ఏర్పరచుకొన్న నియమం (వ్రతం) కావచ్చు.
ప్రేమకూ, ధర్మానికి ఘర్షణ ఏర్పడ్డప్పుడు మాన్యుడైతే ధర్మాన్నే చేపడతాడు. సామాన్యుడైతే ప్రేమపాశబద్ధుడై ధర్మభ్రష్టుడౌతాడు. భర్త ఆజ్ఞను పాలించడం కోసం పతివ్రత ఎంత నీచకార్యమైనా చేయవచ్చు. తల్లి కన్న బిడ్డనే కడతేర్చడానికి పూను కోవచ్చు. అందుకే అమ్మ ‘ ప్రేమ కంటే ధర్మం గొప్పది’ అని ప్రవచించి ఉంటుంది. లేకుంటే ప్రేమమూర్తి అయి బిడ్డలయందు అపారంగా వాత్సల్యామృతాన్ని వర్షించే అమ్మ ఇలా ఎందుకంటుంది ? ప్రేమ, ధర్మం ఈ రెంటిలో ధర్మానికే ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె ఉద్దేశ్యం అనుకోవచ్చు.
- ‘ప్రేమ కంటె ధర్మం గొప్పది’ కనుకనే పరశురాముడు తండ్రి ఆజ్ఞను పాలించడం అనే ధర్మం కోసం ప్రేమ పాత్రురాలయిన మాతృమూర్తి శిరస్సును ఖండించాడు.
- బలిచక్రవర్తి తనకు మిక్కిలి మక్కువ గల త్రిలో కాధిపత్యాన్ని ‘ఆడినమాట తప్పకుండడం’ అనే ధర్మాచరణం కోసం తృణప్రాయంగా త్యాగం చేశాడు.
- శ్రీరామచంద్రుడు సీతాసాధ్వి పాతివ్రత్యం తెలిసి కూడా తన ప్రాణానికి ప్రాణమైన అర్థాంగిని ‘లోకారాధనం’ అనే రాజధర్మం కోసం అడవుల పాలు చేశాడు.
- హరిశ్చంద్రుడు సత్యం కోసం రాజ్యాన్నీ, చివరకు ప్రేమాస్పదులయిన భార్యాబిడ్డల్ని పరి త్యజించాడు.
- భీష్ముడు పుత్రధర్మం కోసం ఆ జన్మబ్రహ్మచారిగా ఉండి సత్యవ్రతుడైనాడు.
- హిరణ్యకశిపుడు తండ్రి ధర్మాన్ని (బిడ్డలకు విద్యాబుద్ధులు నేర్పించడం) పాలించడం కోసం కన్నకుమారుడైన ప్రహ్లాదుణ్ణి కడగండ్ల పాలు చేశాడు.
- సుమతి పతి ఆజ్ఞను పాటించడం ధర్మంగా భావించి కుష్ఠురోగి అయిన భర్తకు తార్పుకత్తెగా వ్యవహరించింది.
- కుంతి కన్యా ధర్మరక్షణ కోసం ప్రేమాస్పదుడైన కన్నబిడ్డ కర్ణుణ్ణి గంగపాలు చేసింది.
ఇలా ఇతిహాసాదుల్లో ప్రేమ – ధర్మం వీటికి స్పర్థ ఏర్పడ్డప్పుడు తమకు ప్రేమ పాత్రమైన సుఖాలనూ, వ్యక్తులనూ, ఆశయాలనూ విడచి ధర్మాన్ని అనుష్ఠించడం కనిపిస్తుంది. మోహావిష్ణులయిన మరికొందరు ఇట్టి సంకటపరిస్థితుల్లో ప్రేమపాశబద్ధులై (మోహాంధులై) ధర్మభ్రష్ఠులు కావడమూ జరిగింది.
- ధృతరాష్ట్రుడు పుత్ర ప్రేమకు లొంగి తండ్రి ధర్మాన్నీ, రాజధర్మాన్ని విడిచి సర్వభ్రష్టు డయ్యాడు.
- దుర్యోధనుడు అధికార వ్యామోహంతో ధర్మాధర్మ విచక్షణా శూన్యుడై కులనిర్మూలనానికి కారకు డయ్యాడు.
- రావణుడు కాముకుడై ధర్మవిరుద్ధంగా ప్రవర్తించి నశించాడు.
సామాన్యంగా అందరూ తమకిష్టమయిన వారి కోసం ధర్మ విరుద్ధమైన పని చేయడానికైనా ఇష్టపడతారు. దీనినే ప్రేమ అంటాము.
ఇక ధర్మం ఎంతో త్యాగానికి ప్రేరేపించే
ప్రేమపాత్రులైన వ్యక్తులను కాని, వస్తువులను కాని, పదవులను గాని విడిచి పెట్టనిదే ఆచరింప సాధ్యం కాదు. అంటే ధర్మం కోసం ప్రేమను విడిచి పెట్టాలి లేక మనకు ఇష్టులైన వారిని విడిచి ధర్మాన్ని ప్రేమించాలి. ఇది అందరికీ సాధ్యమైన పని కాదు. సామాన్యులు ప్రేమించగలరు. ప్రేమ కోసం ధర్మాన్ని విడుస్తారు. కాని మాన్యులు ధర్మం కోసం, ప్రేమపాత్రు లయిన వారిని కూడా పరిత్యజించగలరు. అదే వారి ప్రత్యేకత.
స్థూలదృష్టికి ఇది కఠోరం అనిపిస్తుంది. కాని వారి స్థిర చిత్త మట్టిది. అందుకే – ‘వజ్రాదపి కఠోరాణి మృదూని కుసుమాదపి లోకోత్తరాణాం చేతాంసి కోహి విజ్ఞాతు మర్హతి’.
(లోకోత్తరులైన అసాధారణ వ్యక్తుల మనస్సు ఒకసారి పువ్వు కంటే కోమలంగానూ, మరొకసారి వజ్రం కంటే కఠినంగానూ ఉంటుంది. దాని స్థితిని ఎవరు తెలుసుకోగలరు ?- అంటాడు భవభూతి మహాకవి.
మహిమాన్వితగా అందరిచేతా ఆరాధింపబడే అమ్మ పరిపూర్ణ, కరుణామయి అయినప్పటికీ ‘ప్రేమ కంటే ధర్మం గొప్పది’ అని ప్రవచించడం ధర్మ ప్రాధాన్యాన్ని ఉగ్గడించడానికే అయి ఉంటుంది. వ్యక్తు లనూ, వస్తువులనూ ప్రేమించడం అందుకోసం ఎంతటి త్యాగాన్నైనా చేయడానికి సిద్ధపడడం చాల మందికి సాధ్యపడవచ్చు గాని ధర్మం కోసం ప్రేమను (ఇష్టులను) త్యాగం చేయడం కొందరికే సాధ్యం. అట్టి వీరినే స్థితప్రజ్ఞులని, మాన్యులని, లోకోత్తరులని అంటారు.
అమ్మ సూక్తులు ఆమె అనుభవసారమే కనుక అమ్మ ఎంత ప్రేమమూర్తియో అంత ధర్మస్వరూపిణి అని ఈ సూక్తి నిరూపిస్తుంది.
ప్రేమ (మమకారం) – పరిమితము – లోభ దూషితము ధర్మం – శాశ్వతము – త్యాగమయము – అపరిమితము.
(1980 మార్చి నెల ‘మాతృశ్రీ’ పత్రిక నుండి గ్రహించబడినది.)