ధర్మం కోసం ప్రేమను అమ్మ త్యాగం చేస్తుంది. విశ్వకల్యాణం కోసం, జీవకోటి సముద్ధరణ కోసం మనస్సును చంపుకున్నది. ఆత్మార్పణ చేసుకున్నది.
‘తల్లి బుగ్గ గిల్లి త్రాగించదా ఉగ్గు’ అనేది చిన్న ఉదాహరణ. ఒకసారి గోపాల్ అన్నయ్య నాన్నగారి గురించి కొంటెగా ఒక మాట అన్నాడు. వెంటనే అమ్మ చేతిలోని చెంబుతో అన్నయ్య తలమీద బాదింది; చర్మం చిట్లి రక్తం వచ్చింది; చీరె చింపి గాయానికి కట్టు కట్టింది; అన్నయ్య తలను గుండెలకు హత్తుకొని వలవల ఏడ్చింది. శిక్షించడం ధర్మం; అక్కున చేర్చుకోవటం ప్రేమ. ప్రేమకు అతీతంగా ధర్మం చలాయిస్తుంది; ధర్మం చేతిలో ప్రేమ ఓటమిని చవి చూడాల్సిందే.
ఇప్పుడు సామాన్యమైన, మహోన్నతమైన ఉదాహరణ లను మీ ముందు ఉంచుతాను.
1970 జూన్ నెల నుంచి ప్రారంభించి నేను జిల్లెళ్ళమూడి తరచు వచ్చి పోతూ ఉండేవాడిని. అమ్మ నన్ను తన హృదయాంతరాళాల్లోకి చేర్చుకొని ‘నాది’ అనే ఒక స్థానాన్ని ఇచ్చింది. ఆ అలౌకిక మాతృత్వ మమకార మహిమకు ఎవరైనా తన్మయులు కావాల్సిందే, దాసోహం అనాల్సిందే. అలా కొంతకాలం అమ్మ ఒడిలో బడిలో కాలం గడిచింది. ఆ స్వర్ణయుగంలో “ఎవరినీ ఇంత అలవాటు చేసుకోకూడదు” అంటూ తనదైన వాత్సల్యోత్తుంగ తరంగాలలో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. రోజూ అమ్మ మంచం దగ్గరే పడుకునేవాడిని. ఒక రోజున నామం చేస్తూ హైమాలయం దగ్గర నిద్రపోయాను. అది అమ్మకి పెద్ద లోటు అయింది. “అమ్మ దగ్గర పడుకోవటం మానేశావేం?” అంటూ విలవిలలాడింది ఆ మాతృహృదయం. నాకు అప్పుడు 22 ఏళ్ళు; పురిటి బిడ్డను కాను అమ్మ ప్రక్కనే పడుకునేందుకు. కానీ అమ్మ దృష్టి అదే.
1977లో ఉద్యోగ బాధ్యతల్లో పడి తల మునకలై ఉండేవాడిని. ఆశ్చర్యం. అమ్మ నన్ను దగ్గరకు తీయడం తగ్గించింది. ఉండబట్టలేక అడిగాను. వెంటనే అమ్మ “నాన్నా! దూరంగా ఉంటున్నావు కదా ! బెంగపెట్టుకు ఏడుస్తావని మానేశాను” అన్నది. బొమ్మలా నా వైపు చూసేది; యాంత్రికంగా బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చేది. నన్ను చూడలేదు; చూడకుండా ఉండలేదు. కన్నీటిని దాచుకోగలదు; కానీ గుండెలో ఉప్పొంగే మమకార ఉప్పెన తాకిడికి ఆనకట్ట వేయలేదు. బిడ్డ సౌఖ్యం తల్లి ధర్మం అందుకు తల్లిప్రేమను త్యాగం చేసింది.
1975లో అమ్మ ఒకసారి అన్నది, “నాన్నా ! కడుపులో ఏదో చీము, నెత్తురూ పెరుగుతోంది” అని. ‘అమ్మా! అది నీకెందుకు ? నాకు ఇచ్చేయి’ అన్నాను. “వద్దు, నాన్నా! మీదగ్గర కొస్తే మందులు వేసి వాటిని తరిమేస్తారు. వాటికీ అమ్మనే” అన్నది. కాలక్రమంలో ఎక్స్ తీస్తే కాన్సర్ అని తేలింది. రామకృష్ణఅన్నయ్య, దినకర్ అన్నయ్యలతో పాడు తోడబుట్టిన వారంతా చింతాక్రాంతు లయ్యారు. వైద్యం కోసం అమ్మను అమెరికా తీసికెళ్ళాలి. అదెలా సాధ్యం. కక్కలేక మ్రింగలేక చేసేది లేక తమ చేతకానితనానికి గుడ్డుకి కుంచెడు నీళ్ళు కారుస్తూ భిన్న మనస్కులై కుమిలిపోతున్నారు. వారి దయనీయస్థితికి కరిగి అమ్మ, నాకేం లేదు. కావాలంటే మళ్ళీ ఎక్సే తీయండి”. అన్నది. ఆశ్చర్యం. ఈసారి ఎక్స్రేలో గడ్డలేదు. అమ్మ మాట యథార్థంగా కనిపించింది, అనిపించింది. ఉన్నదానిని లేనట్లు చూపించింది ఘటనా ఘటనా సమర్థ అమ్మ. ఇదే అమ్మలో ప్రస్ఫుటంగా గోచరించే అపూర్వ ఏకైక విలక్షణ తత్వం. అమ్మ దైవీ సంపత్తిని తల్లిధర్మం కోసం, తల్లి ప్రేమకోసం ఉపయోగిస్తుంది. నేటి కొందరు బాధగురువులవలె ధనార్జన కోసం, కీర్తి కండూతి నివృత్తి కోసం కాదు. తమ తల్లి కోసం తల్లడిల్లే బిడ్డల్ని దుఃఖసాగరం నుంచి తీసి పదిలంగా శాంతిసాగరంలో జారవిడిచింది. ఎక్కడైనా ధర్మానిదే పైచేయి. ఇప్పుడు జగతి నేలు జనని గుండెలోతుల్లోకి వెడదాం.
17, ఫిబ్రవరి 1981 సంవత్సరం అది వాస్తవంగా అమ్మ కనుమరుగైన రోజు; అమ్మ హృదయంలో శరీరంలో అణువణువునా అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందినరోజు; అమ్మ పతిదేవులు మన నాన్నగారు (శ్రీ బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు) ఊపిరి విడిచిన రోజు. నాన్నగారి పార్థివ శరీరాన్ని అమ్మదగ్గరకు తెచ్చారు. అమ్మ శ్వాస ఆగింది; మొదలు నరికిన చెట్టులా నాన్నగారి గుండెలపై వాలిపోయింది. కొన్ని గంటలు అలాగే ఉండిపోయింది. ఇకలేవదు అని నిశ్చయమైంది. దానిని సతీసహగమనం అనవచ్చు, మరేపేరైనా పెట్టవచ్చు. ధైర్యం చేసి గజేంద్రమ్మ అక్కయ్య వెళ్ళి తదుపరి క్రతువు గురించి అమ్మ చెవిలో ప్రస్తావించింది. పావక ప్రభలా అమ్మ లేచింది; శోకదేవతలా సాక్షాత్కరించింది.
ఆ క్షణంలో కర్తవ్యం ఏమిటి ??? కాలక్షేపం కబుర్లు, పిచ్చాపాటీ పొల్లు మాటలు అమ్మ నోటివెంట ఎన్నడూ వెలువడవు.
అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరీలు పతివ్రతలు అని అంటారు; మనం చూడలేదు వారిలో ఏ ఒక్కరినీ. ఆ పంచకన్యల్నీ పోతపోస్తే మన అనసూయమ్మే. కారణం ? చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన ఆత్మహత్యా సదృశమైన కీలకమైన అమ్మ నిర్వచనం; ‘పుణ్యస్త్రీ – పసుపు కుంకుమలు’ అంటే : “భర్తను నిజంగా ప్రేమించే స్త్రీ, తాను భర్తకంటే ముందుగా దాటిపోవాలని కోరుకోదు; ఏ లోటూ లేకుండా చివరివరకు సేవచేసి సాగనంపుతుంది అనేది.
ఆచరణాత్మకంగా అమ్మ ఆ మహోన్నత కఠిన భావనని చాటి చెప్పింది. ఇక చివరి క్షణంలో గజేంద్రమ్మ అక్కయ్య పిలిచినపుడు అమ్మ స్పందించిన తీరు పరంగా నాకు ఒక సన్నివేశం గుర్తుకొస్తోంది. అది ‘Home they brought her warrier dead” అనే టెన్నిసన్ పద్యం. ఆ పద్య సారాంశం :
‘యుద్ధంలో అసువులు బాసిన ఒక వీరుని మృతదేహాన్ని ఆతని సతీమణి చెంతకు తీసుకువస్తారు. ఆమె స్థాణువై పోతుంది. పలకదు, కన్నీరు చిందించదు, విలపించదు. ఆమె ప్రాణం కడగట్టింది. ఆమె దుఃఖిస్తేనే జీవిస్తుంది అని ఎందరో ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అవన్నీ విఫలం కాగా చివరి క్షణంలో
Rose a nurse of ninety years
Set his child upon her knee
Like summer tempest came her tears
‘Sweet my child, I live for thee.
ఒక వృద్ధురాలు లేచి వెళ్ళి ఆతని చంటిపాపను తెచ్చి ఆమె తొడమీద కూర్చోబెట్టింది. ఆమె కన్నులు శ్రావణ మేఘాలై కుండపోతగా వర్షించాయి. ‘నా తల్లీ ! నీ కోసం నేను బ్రతుకుతా’ అంటూ ఆమె పునరుజ్జీవితురాలైంది.
మన “అమ్మ” విషయంలో కూడా అదే జరిగింది. నాన్నగారు లేని అమ్మ లేదు. మరుక్షణం నుంచి శ్వాసించడం తనకి ఇష్టం లేదు. కానీ అమ్మకి రెండు ధర్మాలున్నాయి.
- భర్తని ఆరాధించడం 2. బిడ్డల్ని ఆరాధించడం
విశ్వమానవ జాతి సౌభాగ్యదాయకమైన ఒక శక్తి కేంద్రంగా శ్రీ అనసూయేశ్వరాలయ ప్రాదుర్భావం, నిర్మాణం, నిర్వహణ గురించి తాను కొన్నాళ్ళు ఉండాలి. విశ్వజననిగా తన ధర్మం అది. కర్తవ్యం అంత కఠోరమైనది.
సమయం వచ్చినపుడు తన ఒడిలోని అశేష సంతానాన్ని ఎత్తుకొని, కడసారి ముద్దు పెట్టుకొని, నిర్దాక్షిణ్యంగా ప్రక్కన కూర్చోబెట్టి, పోయి ఆలయంలో నాన్నగారి సరసన సుప్రతిష్ఠిత అయింది. ఆయన సాంబశివులైనారు. చరిత్ర’లో అది అమ్మకి మాత్రమే సాధ్యం. మంగళసూత్రాల్ని జగత్కళ్యాణ సూత్రాలుగా ఆవిష్కరించింది.
‘అమ్మ బిడ్డల్ని ఆరాధించడం’ గురించి ఒక ఉదాహరణ. మమతల జాబిల్లి, అమ్మ గర్భసంజాత బంగారు తల్లి హైమ; సకల సద్గుణ సౌరభ ప్రసృత మరుమల్లిక, కారుణ్యదీపిక. అట్టి సహస్రదళ వికసిత సంస్కార రూప కమలాన్ని అమ్మ! ఉద్దేశపూర్వకంగా త్రుంచి వేసింది, కన్నీళ్ళతో కన్నబిడ్డను సమాధి చేసింది.
“హైమను నేనే కన్నాను. నేనే పెంచాను. నేనే చంపుకున్నాను. నేనే దైవత్వమిచ్చాను” అన్న అమ్మ పలుకులు జగన్మాతృ ధర్మానికి దర్పణం పడతాయి. అమ్మ అవతార లక్ష్యం. “మీరంతా నాలా హాయిగా ఉండాలి” అనేది. అంటే జన్మ సంసార బంధ ఆవర్తన చక్రం నుంచి సకల జీవకోటిని విడుదల చేయడం; తన అవ్యాజకరుణారస పూరిత పావన కరకమలాలతో (ఆదిపురుషునిగా, వరాహమూర్తిగా) ఎత్తి చరాచర సృష్టిని సముద్ధరించడం, ‘ఆనందోబ్రహ్మేతి వ్యజానాత్’ అనే తన ఆనందమయ కోశాన్ని అనుగ్రహించడం. అందుకు సకలజీవకోటి ఏం చేసినా, ఏం ఇచ్చినా, ఎన్నటికీ ‘అమ్మ’ ఋణం తీర్చుకోలేనిది. దైవం వచ్చింది శిక్షించటానికి కాదు, రక్షించటానికి
మానవ ప్రతినిధిగా హైమక్కయ్యకు అమ్మ దైవత్వాన్ని అనుగ్రహించింది. ఆచరణాత్మకంగా “మీరు కానిది నేనేదీ కాను” అని నిరూపించింది. కుల మతాదులకే కాదు, గుణాలకు అతీతంగా “రా ! నాన్నా !” అంటూ అందరినీ ఆహ్వానించి, తన ఒడిలో వేసి లాలించే, సేదతీర్చే, రక్షించే తరింపచేసే దివ్యమాతృమూర్తి కారుణ్యవారాశి ‘అమ్మ’ నేడు ఏది ??
సకలకార్యాలకూ కారణమై అకారణంగా సకలకార్యాలను నడిపే సగుణమూర్తిగా, అనంతశక్తిగా, సువర్ణజ్యోతిగా, మూలప్రకృతిగా స్వస్వరూపంతో కృష్ణశిలా విగ్రహరూపంలో శ్రీ అనసూయేశ్వరాలయంలో సహస్ర కోటి సూర్యప్రభలతో ప్రకాశిస్తోంది; కొలువై ఉన్నది. అది జగజ్జననిగా తన ధర్మం. కనుకనే “ప్రేమకంటే ధర్మం గొప్పది” అని అమ్మ ప్రవచించింది.