“పరబ్రహ్మ స్వరూపిణి శ్రీమాత. ఆమెకు ఇతమిత్థ మయిన రూపం లేదు. అయినా భండాసుర సంహారాది సమయాలలో ఆమె అనేక రూపాలు దాల్చింది. దేవ, మనుష్య, పశు, పక్ష్యాది రూపాలు ధరించింది.
బహువిధ ప్రపంచంలో బహువిధ రూపధారిణి శ్రీమాత” భారతీవ్యాఖ్య.
భగవంతుడు నామరూప రహితుడు. ఏనామంతో పిలిచినా, ఏ రూపంతో ఆరాధించినా పరమాత్మ తత్త్వం ఒక్కటే. “ఏకం సత్ విప్రాః బహుదా వదన్తి” అని వేదవాక్కు శ్రీకృష్ణుని లీలల్లో భగవానుడు – గోపికలుగా, గోపాల కులుగా, గోవులుగా, గోవత్సములుగా ఏకకాలంలో కనిపించిన సంఘటన; ఆ పరమాత్మయే ప్రహ్లాద చరిత్రలో ఒకే నరసింహమూర్తి రూపంలో సర్వత్రా, అదృశ్యంగా వ్యాపించి ఉండడం చూస్తే – భగవంతుని సర్వాంతర్వా మిత్వం, సర్వవ్యాపకత్వం విశద మవుతాయి. ‘విశ్వమే అమ్మ’ అయినప్పుడు జగత్తులోని అన్ని రూపాలూ అమ్మవే. కనుక శ్రీమాత బహురూప.
“అమ్మ” బహురూప. “నేను నేనైననేను”.“ఈ సృష్టి నాది” వంటి వాక్యాలు “అమ్మ”ను బహురూపంగా ప్రత్యక్షం చేస్తున్నాయి.
కొందరికి వాసనారూపంగా, కొందరికి శబ్ద రూపంగా, కొందరికి స్ఫురణరూపంగా, కొందరికి స్పర్శమాత్రంగా, కొందరికి స్వప్నంలో – ఇలా అనేకరకాల అనుభవాలను అనుగ్రహించే “అమ్మ”- బహురూప. పేదరికంతో బాధపడుతున్న ఒక సోదరునితో “ఆ దరిద్రం కూడా నేనే నాన్నా!” అని; ‘భయం తనను ఆవహించింద’ని ఆందోళన పడుతున్న సోదరితో “ఆరాత్రి నేను భయంరూపంలో నీవద్దకు వచ్చాను” – అని చెప్పిన “అమ్మ” – బహురూప.
చిందంబరరావుతాతగారు, మరిడమ్మగారు, లక్ష్మణాచార్యులు గారు వంటి ఎందరో “అమ్మ”ను ఆనాడే రాజరాజేశ్వరిగా ఆరాధించారు. మంత్రసాని గొల్లనాగమ్మకు – అప్పుడే పుట్టిన “అమ్మ” తన నాభికుహరంలో – పద్మాలయగా కనిపించి, కనువిందు చేసింది. చిన్నతనంలోనే, చింతచెట్టు కొమ్మల్లో శ్రీ సత్యనారాయణ మూర్తిగా కనిపించింది. తొమ్మిదేళ్ళ వయస్సులో బాలాత్రిపురసుందరిగా సాక్షాత్కరించి, ఒక సోదరునిలోని దుష్టత్వ సంహారం చేసిన “అమ్మ” బహురూప. శ్రీ లక్ష్మణయతీంద్రులు – ‘ఆ వేదవేద్యుడే రాముడు, ఆ రాముడే లలిత, ఆ లలితయే మన “అమ్మ” అని స్పష్టంగా చెప్పారు. “అమ్మ”ను సాక్షాత్తూ ఆదిపరాశక్తిగా దర్శించి, “శృంగార లహరి” కావ్యంలో అమోఘంగా స్తుతించారు. డా॥ పన్నాల రాధాకృష్ణ శర్మగారు.
“అమ్మా ! గాయత్రీ ఇక్కడున్నావా ?” – లక్ష్మీకాంత యోగి “ఇప్పుడు చిట్టెమ్మ వయ్యావు కిట్టమ్మా” – యార్లగడ్డ రాఘవయ్య
“అమ్మ సాక్షాత్తూ రాజరాజేశ్వరీ దేవి” – కాశీ కృష్ణా చార్యులు
“అమ్మా ! నీవు కైలాసం నుండి దిగివచ్చిన పార్వతివా !”- ముల్పూరి సబ్రహ్మణ్యశాస్త్రి
“అమ్మ అంటే బమ్మే” – శారదాకుమార్
“అమ్మా ! నీవు మరియమ్మవా ?” ఒక క్రైస్తవ సోదరి.
“అమ్మకథే అవనిగాధా, అవనే అనసూయమ్మ కాదా !” – రాజా
ఇలా ఎందరిలో ఎన్నో రూపాల్లో దర్శనం అనుగ్రహించిన “అమ్మ” – బహురూప.
“నాకు ఇక్కడ ఇలా పూజ చేస్తున్నా, “అమ్మ” అని చేస్తున్నారా ?”
పార్వతి అనీ, రాజరాజేశ్వరి అనీ … ఇంకా ఏవో వాళ్ళ ఇష్టదైవరూపాల్లో చూస్తుంటారు.” అని “అమ్మే” స్పష్టంగా చెప్పింది. అంతేనా ! “ఏ పాదానికి నమస్కరించినా ఈ పాదాలకే అందుతాయి” అని నిర్ద్వంద్వంగా ప్రకటించిన “అమ్మ” బహురూప.
“మీ దృష్టిలో మనుష్యులూ, ఇతర జంతువులూ ఒకటేనా ?” అనే ప్రశ్నకు “అది ఇతరం అనిపించడం లేదు. అన్నీ నేనే అనిపిస్తున్నది” అని సమాధానం ఇచ్చిన “అమ్మ” – బహురూప. “అమ్మ”కు సమర్పించాలని తెచ్చిన మామిడి పళ్ళన్నీ ఎలుక కొరికిందని బాధపడుతున్న ఒక అన్నయ్యతో “ఫర్వాలేదు నాన్నా! ఎలుక తింటే ఏం ? ఎలుకరూపంలో “అమ్మే” వచ్చి తిన్నదేమో !” అంటూ ఒక పండు తీసుకుతిన్న “అమ్మ” బహురూప. నాగుల చవితినాడు “అమ్మ” నోట్లో పాలుపోసి, నాగేంద్రుడిగా “అమ్మ”ను దర్శించినవారూ ఉన్నారు.
రాధగా, శ్రీకృష్ణుడుగా, సీతగా, శ్రీరాముడుగా,ఆంజనేయుడుగా, శ్రీ వేంకటేశ్వరుడుగా, సరస్వతిగా, దుర్గగా, చండికగా, పోలేరమ్మగా, మహమ్మద్, బుద్ధుడుగా, సాయిబాబాగా ఇలా ఎందరో దేవతా మూర్తుల రూపాల్లో తన బిడ్డలకు దర్శనం ప్రసాదించి, వారిని ఆనందపరవశులను చేసిన “అమ్మ” – బహురూప. అంతేకాదు, కూలివాడుగా, డాక్టరు డ్రస్సులో, పెద్ద ముత్తైదువ రూపంలో – ఇలా ఆయా సందర్భాలలో వేరు వేరు మానవాకృతుల్లో కనిపించి, తన బిడ్డలను అనుగ్రహించిన “అమ్మ” – బహురూప.
బహురూప అయిన అనసూయమ్మను ‘అందరింటి’లో మన అందరి “అమ్మ”గా ఆరాధించుకునే అదృష్టవంతులం మనం. “అమ్మ”కు శతకోటి నమస్కారాలు.
– మాతృసంహిత రచయితకు కృతజ్ఞతలు