సామాజికంగాగానీ, ఆర్థికంగా గానీ ఏ రంగంలో అయినా ఎదిగిన మహాత్ముల జీవితాలను పరిశీలిస్తే కష్టాలే పెట్టుబడిగా కన్పిస్తాయి. సాధారణంగా లోకంలో మనకు సుఖాన్నీ, ఆనందాన్నీ ఏది కల్గిస్తుందో దాని మీద మన దృష్టి నిలుస్తుంది. బాధల నెవ్వరూ ఆహ్వానించరు. కానీ అమ్మ ఆలోచనా దృక్పథమే విలక్షణమైనది. అందుకే ‘బాధలేని బ్రతుకు అనవసరం’ అంటూ ఎవరూ చూడని ఆ రెండో కోణాన్ని దర్శిస్తుంది. కణకణ మండే అగ్నిలో పుఠం పెట్టబడిన బంగారం శుద్ధమైనట్లు బాధ అనే అగ్నిజ్వాలలతో పరితప్తుడయిన మనిషి కూడా రాణింపు పొందుతాడు. ‘శిల్పానికి అందం రావాలంటే ఉలి దెబ్బలు అవసరం’ అని అమ్మే చెప్పింది. ఏది ఏమయినా కష్టాలు శాశ్వతం కాదు. జీవితం సమస్యలతోరణం అయినా సమస్య వెంటే పరిష్కారమూ ఉంటుంది. మనం ద్వంద్వాలుగా చెప్పుకునే శీతోష్టాలు, సుఖదుఃఖాలు చీకటి వెలుగులు ఇవేమీ శాశ్వతంగా ఉండవు. చీకటి వెంటనే వెలుతురు తొంగి చూస్తుంది. శిశిరం వెంటనే వసంతమూ వస్తుంది. దైవానుగ్రహం ఉండాలే గాని భస్మరాసుల నుండే బంగారం పండుతుందని పెద్దలు అంటూ ఉంటారు.
జీవన తత్త్వాన్ని ఆకళింపు చేసుకున్న వ్యక్తిని బాధ ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. భూమి అట్టడుగు పొరల్లో కొన్ని శతాబ్దాల సంఘర్షణ ఫలితంగా శిల జాజ్వల్యమాన మైన వజ్రంగా మారినట్లు జీవితంలో ఏర్పడిన సన్నివేశాల సంఘర్షణ వలన మనిషి వ్యక్తిత్వం ఉద్దీప్తమవుతుంది. సంఘర్షణ మనిషి ఎదుగుదలకు నాంది. అన్నం విలువ తెలియాలంటే ఆకలి బాధ కావాలి కదా !
‘సుఖంహి దుఃఖాన్యను భూయ శోభతే
ఘనాంధకారేష్వివ దీపదర్శనం’ అన్నట్లుగా సుఖం
విలువ తెలియాలంటే బాధ కావాలి. చీకటే లేనప్పుడు వెలుతురు విలువ ఏం తెలుస్తుంది? దుఃఖం అనుభవించి నపుడే గదా సుఖంలో ఉన్న ఆనందం అనుభవంలోకి వచ్చేది. శిల శిల్పంగా మారాలంటే ఎన్నో ఉలిదెబ్బల్ని భరించాలి. అలాగే జీవితంలో రాణించాలంటే బాధలే సోపానాలు. బాధవల్లనే వ్యక్తిలో చైతన్యం ఉద్దీప మవుతుంది. వ్యక్తిత్వ నిర్మాణానికీ, చుట్టూ ఉన్న సమాజాన్నీ, సాటి మనిషిని ఆకళింపు చేసుకోవడానికీ, వారి కష్టాన్ని చూసి స్పందించడానికీ బాధ అవసరం. అందుకే బాధల్లేని బ్రతుకు వ్యర్థం’ అని అమ్మ చెప్పిన ఈ వాక్యం ఉన్నత జీవిత సత్యం. వెలుగు నీడలు, మంచి చెడ్డలు, సుఖ దుఃఖాలు మొదలైన ఈ ద్వంద్వాలు ఒకే నాణానికి రెండు పార్శ్వాలనీ రెండు లేనిది జీవితం పరిపూర్ణం కాదనీ అమ్మ ప్రబోధం అన్పిస్తుంది.