1. Home
  2. Articles
  3. Viswajanani
  4. బిడ్డలు వస్తున్నారు, హారతి ఆపండి – అమ్మ

బిడ్డలు వస్తున్నారు, హారతి ఆపండి – అమ్మ

Nandigama China Devi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : February
Issue Number : 7
Year : 2011

1960వ సంవత్సరం జూన్ 17వ తేదీన ప్రకాశం జిల్లాలో గల మార్టూరు మండలంలోని బొల్లాపల్లి గ్రామంలో రాత్రి 8 గంటల సమయంలో మా నాన్నగారు నందిగామ వెంకట సుబ్బారావుగారు, మా అమ్మగారు నందిగామ అనంతలక్ష్మిగారు, కరణంగారు, బొమ్మరాజు శ్రీరామయ్యగారు వారి కుమార్తెలు మునిపల్లె రాధమ్మగారు, బందా సుబ్బలక్ష్మి గారు వీరంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటుండగా, ఆ సమయంలో మా వూరి రైతు చెంచయ్య అనే ఆయన వచ్చాడు. ఆయన మా అమ్మా వాళ్ళతో నేను ఈ రోజు ఎడ్లను కొనటానికి రేటూరు వెళ్ళి వచ్చాను. అక్కడ దగ్గరలోనే ‘జిల్లెళ్ళమూడి’ అనే గ్రామం వుంది. అక్కడ ‘అమ్మగారు వున్నారు. ఎందరు వచ్చినా, ఎప్పుడు వచ్చినా భోజనాలు పెడుతున్నారు చూసి రమ్మని చెప్తే నేను వెళ్లాను. అక్కడ చాలా బాగుంది. అమ్మ దర్శనం ఇవ్వటం, భోజనాలు పెట్టడం జరుగుతుంది. మీరందరూ తప్పకుండా వెళ్ళి చూసి రండి – అని చెప్పాడు. కాసేపు ముచ్చట్లు చెప్పుకొని ఎవరి ఇళ్ళకు వారు వెళ్ళిపోయారు. మా అమ్మగారికి అదేరోజు రాత్రి స్వప్నంలో గోవులు, గోశాలలు కనిపించాయి. ఆ రోజు నుండి అమ్మను చూడాలి అనే భావన కల్గింది. తరువాత నెలరోజులకి అమ్మని చూడటానికి వీళ్ళంతా దాదాపు పది, పదిహేను మంది దాకా బయలుదేరి వెళ్ళారు. పెదనందిపాడులో ‘కొమరయ్య’ అనే ఆయన – జిల్లెళ్ళమూడి రోడ్డు మీద దిగితే దొంగలభయం నాతో పాటు రేటూరులో దిగండి, నేను అమ్మగారి ఇంటి దగ్గర జాగ్రత్తగా మీ అందరినీ తీసుకొని వెళతానని చెప్పాడు. రాత్రి 7 గంటల సమయంలో వీరంతా రేటూరి నుండి కాలినడకన జిల్లెళ్ళమూడికి బయలుదేరి వెళ్ళారు. సమయం 8 గంటలు అయింది. చెరువు నుంచి మంచి నీళ్ళు కావిళ్ళు తెచ్చేవారు నలుగురు ఎదురై తొందరగా వెళ్ళండి. మీ కోసం హారతి ఆపారు అని చెప్పారు. “హారతి ఆపండి బిడ్డలు వస్తున్నారు” అని అమ్మ చెప్పటం వారు విన్నారట. వీళ్ళంతా కాళ్ళు కడుగుకొని వాళ్ళ చేతిలోని సంచులు అక్కడే పెట్టి అమ్మను చూస్తూ వున్నారట. అప్పుడు అమ్మకు కర్పూరహారతి ఇచ్చారు. ఆ రోజు అమ్మే స్వయంగా తీర్థం ఇచ్చారు. అందరినీ భోజనాలు చేయండి నాయనా! అన్నారు. అప్పుడు అమ్మని చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపించింది. అమ్మని చూడటానికి రెండు కళ్ళు చాలలేదు మా అమ్మకు. ఎంతసేపు చూసినా తనివితీరలేదు. తెల్లటి జరీచీర, నల్లటి ముఖమల్ రవిక, పెద్ద పూలజడ, మెడ నిండా నగలు, చేతికి వంకీలు, గాజులు, వడ్డాణం, అన్నీ ధరించి వున్నారు అమ్మ. విష్ణుమూర్తి మోహినీ అవతారంలో ఎలా వున్నాడో ఆ రోజు అమ్మ అలా వుంది. అంత దేదీప్యమానంగా దివి నుండి భువికి దిగివచ్చిన దేవతలాగా వుంది. మా అమ్మకు అమ్మను ఇంకోసారి చూస్తే బాగుండు అని మనసులో వున్నది. అంతలో అందరూ భోజనాలు చేయటానికి వెళ్ళారు. భోజనాలు చేసిన తరువాత అందరికి చాపలు ఇచ్చారు పడుకోవడానికి. రాత్రి 11 గంటల సమయంలో అమ్మ ఒక్కరే ఇసుక తిన్నె ప్రక్కన మంచంమీద (అలంకార హైమాలయం ఎదురు) కూర్చున్నారు. మా అమ్మగారు లేచి అమ్మ దగ్గరకు వెళ్ళారు. అమ్మ అన్నారు ఏంటమ్మా, వచ్చావు అని. మా అమ్మ ఇందాక నిన్ను చూసినప్పుడు తృప్తిగా లేదమ్మా, మళ్ళీ నిన్ను చూద్దామని వచ్చాను అన్నది. అమ్మ చేతిలో పనసతొనముక్క ఒకటి వుంటే మా అమ్మ దోసిటిలో పెట్టింది. ఆ దోసిటిలో అమ్మ యొక్క రెండు పాదాలు పెట్టారు. ఆ పాదాలు రెండు కళ్ళకు అద్దుకొని, ఆ పనసముక్క తీసుకొని వచ్చింది. అంతే ఆ రాత్రి మా అమ్మ ఎంతో తృప్తిగా నిద్రపోయింది. ఆ రోజు తనకు వచ్చిన స్వప్నాన్ని తరువాత అమ్మ వద్ద జరిగిన సంఘటనను ఎన్నోసార్లు నాకు చెప్తుండేది మా అమ్మ. అమ్మ సాక్షాత్తు శ్రీకృష్ణుడే అని, తన దర్శనానికి ముందే గోవులు, గోశాలలు కనిపించటం ఎన్నోసార్లు చెప్పి ఆనందిస్తూ వుండేది. ఈ సంఘటన మా ఆమ్మ ఎప్పుడూ నాకు చెప్తూ వుండేది. ఆ రోజు తాను చూసిన అమ్మను ఎంతగానో వర్ణించింది. నేను విన్న ఈ సంఘటనను కాగితం మీద పెట్టాలని పించింది. ఎందుకంటే దాదాపు ఈ సంఘటన జరిగి 50 సంవత్సరాలు అయినది. మా అమ్మ వయస్సు ఇప్పుడు 75 సంవత్సరాలు. మరి మనలో కొంతమంది మాత్రమే అమ్మను చూశారు. అమ్మని చూసినా వారికి అమ్మను గురించి తెలియదు కదా. అందుకే మా అమ్మ యొక్క అనుభవాన్ని విశ్వజనని పాఠకులకు అందించాలను కున్నాను. అప్పుడు వాళ్ళు మూడు రోజులు జిల్లెళ్ళమూడిలో వున్నారట. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు మీ ముందు వుంచుతాను. అమ్మగారి పిల్లలు సుబ్బారావు అన్నయ్యకు 20 సంవత్సరాలు, హైమమ్మకు 18 సంవత్సరాలు, రవి అన్నయ్యగార్కి 14 సంవత్సరాలు వయస్సు వుంటుందిట.

రవి అన్నయ్య : అమ్మ వీళ్ళంతా ఎలా వస్తారమ్మా ఇక్కడికి అని అడిగారట.

అమ్మ : అదేంటి నాన్నా! వీళ్లు వెళ్ళి ఇంకొకళ్ళకు చెప్తారు. వాళ్ళు వెళ్ళి ఇంకా కొంతమందికి చెప్తారు. అలా వస్తారు నాన్నా! అని చెప్పారుట.

మానాన్న : అమ్మా మేము ఒక్క పూట కూడా అన్నం తినలేకుండా వుండలేము. మీరెలా అన్నం తినకుండా వుంటారమ్మా  అడిగారట.

అమ్మ:  అదేంటి నాన్నా! నాలాగే అజీర్ణవ్యాధి 

మా అమ్మ:  అమ్మకు మల్లెపూలతో పూజ చేస్తుంటే మా అమ్మ నిలబడి చూస్తున్నారట. (ఏటి సూతకం అని)

అమ్మ : అవన్నీ ఇక్కడేం లేవు. వచ్చి పూజ చేసుకోమన్నారు అమ్మ.

మా అమ్మమ్మ: అమ్మగారికి గాజులు తొడగటానికి సందేహిస్తున్నారట. (ఆమెకు భర్త లేడు) 

అమ్మ: వారు కానిది వీరు అయినారా అని గాజులు తొడగమందిట.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!