భూమి గుండ్రంగా ఉన్నదని జాగ్రఫీ పుస్తకంలో చదివినప్పుడు, రోదసి కారునలుపని విన్నప్పుడు వ్యోమ మండలంలో ప్రతిఫలించే సూర్యకాంతి రంగు రంగులుగా కనిపిస్తుందని శాస్త్రజ్ఞులు చెప్పినపుడు గగారిన్గాని, టిటీవ్ గాని, మరో అంతరిక్ష యాత్రికుడు గాని అట్టే ఆశ్చర్యపడి ఉండరు. రోదసినౌకలో మహా వేగంతో భూమిచుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు స్వయంగా చూడ గలిగిన సృష్టిదృశ్యము వారిలో ప్రతి ఒక్కరికి మహాద్భుత మనిపించింది.
మరి తాజమహల్ను గురించి విన్నప్పటి కంటే దాని సౌందర్యాన్ని కళ్లారా చూడగలిగినవుడు కలిగే ఆనందం అనంతం. అలాగే ఫలానావ్యక్తి చాలా గొప్ప వాడనో, ఎంతో మంచివాడనో ఎవరైనా చెపుతున్నప్పుడు కలిగే భావం వేరు. అతడి ఘనతనో, సుగుణాలనో స్వయంగా తెలుసుకో గలిగినప్పుడు కలిగే అభిప్రాయం వేరు.
పది సంవత్సరాల క్రితం బుద్ధుడి జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు ప్రతి ఘట్టంలో కరుణ రసం కనిపించింది. ఆయన ఎంతటి శాంతమూర్తిగా కనిపించే వారో! ఎలా ఊహించడం ? గతాన్ని తెలుసుకోగలమేమో గాని దాన్ని చూడలేం. అందుకని ఇరవై అయిదు శతాబ్దాల దూరం కాలవాహినిలో సాగిపోయిన బుద్ధుని పవిత్రమూర్తిని హృదయంలో చిత్రించుకోవడానికి ప్రయత్నించాను. అయితే అది అంత సులభంగా తోచలేదు. ఆయన చిత్తరువులు కాని ప్రతిమలు గాని నాకు ఉపకరించలేదు.
మరికొన్నాళ్ళకు బైబిలు పాఠాలు చదువుకోవడం జరిగింది. క్రీస్తు సహనం సాటిలేనిది. తోటి మానవులకోసం ఎట్టి కష్టనష్టాలను భరించాడు! ఎంతటి బాధలను ఓర్చాడు! ఆయనను చూడగలిగిన నాటి మానవులు ఎంత అదృష్ట వంతులు! ఆయన ఆకృతిని మనస్సులో ప్రతిష్టించుకొందాం అనుకున్నాను. మరి అదీ కష్టసాధ్యమే ననిపించింది.
జయదేవుని గీత గోవిందంలో పోతన భాగ వతంలో, మీరాబాయి గీతాలలో నిక్షిప్తమైన శ్రీ కృష్ణుని ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. కాగా దాని ఫలితమూ అంతంత మాత్రమే.
కృష్ణునిగాని, బుద్ధునిగాని క్రీస్తుని గాని తదేకంగా మనస్సులో నిలుపుకో లేకపోవడానికి నా అశక్తత, అజ్ఞానం కారణాలు కావచ్చు. అయితే కొమ్ములు తిరిగిన తత్వవేత్తలయినా ఆ మహనీయుల్ని పూర్తిగా అర్థం చేసుకోలేరని పెద్దలు అంటారు. అది నిజమే అయి వుంటుంది. అలా కానప్పుడు ఇన్ని భగవద్గీతా వ్యాఖ్యానాలు దేనికి ? బైబిలు పై ఇన్ని కామెంటరీలు దేనికి ? బుద్ధుడు భగవానుడని నమ్మించడానికో, మరొకందుకో, ఇన్ని జాతక కథలు దేనికి?
ఏమైతేనేమి, నేనుమటుకు ఆలోచనలు విరమించుకోలేదు. సంవత్సరాల కాలం జిజ్ఞాసతో యోచించాను. మిత్రులతో చర్చించాను. ఉపన్యాసాలు విన్నాను. వుస్తకాలు చదివాను. ఆలోచనలు, చర్చలు, చదువులు నన్నొక దరికి చేర్చలేదుగాని, కొన్నేళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటనవల్ల గమ్యం చేరడానికి ‘ఇదిగో ఇదే నా త్రోవ’ అని తెలుసుకో గలిగాను. ‘అమ్మ’ ను చూడటమే ఆ సంఘటన.
‘అమ్మ’ జిల్లెళ్ళమూడిలో ఉంటుందని, జిల్లెళ్ళమూడి గ్రామం బాపట్ల పెదనందిపాడు మార్గంలో ఏడవ మైలురాయి సమీపంలో ఉన్నదని నేనిక్కడ వ్రాయడ మంటే అది అక్షరాలా అమాయకత్వమే ఎందుకంటే యిప్పుడు ‘అమ్మ’ ను గురించి వినని వారు కాని జిల్లెళ్ళమూడి ఎక్కడున్నదో తెలియనివారు కాని ఉండరంటే అది అతిశయోక్తి కాదు. అమ్మ అంటే ‘జిల్లెళ్ళమూడి’ ‘అమ్మ’ అనడం నాకిష్టం లేదు. కారణం ఆమె జిల్లెళ్ళమూడికే కాదు. యావత్ ప్రపంచానికి, సకలజీవకోటికి ‘అమ్మ’. మాటలలో చేతలలో ఆమె ‘అమ్మ’. అమ్మను మరపించే ‘అమ్మ’! (సౌలభ్యం కోసం ఇంతవరకు ‘అమ్మ’ అనే పదానికి కొటేషన్లు వాడాను ఇక అవి అనవసరం.)
ఎట్టకేలకు నా అన్వేషణ ఫలించి నట్లయినది. నేను ఆరాధించిన బుద్ధుడిని, కృష్ణుడిని క్రీస్తుని అమ్మలో చూడగలిగాను.
అమ్మ కరుణామయిగా, ప్రేమమూర్తిగా, సహనరూపిణిగా నాకు కనిపించింది. అప్రయత్నంగా అమ్మ అనుకున్నాను. అలా అనుకోవడానికి నాలో తార్కిక దృష్టి అడ్డు చెప్పింది. అది సులభంగా తోసివేసే అభ్యంతరం కాదు. లొంగి పోయాను. లొంగిపోయి రోజుల తరబడి అమ్మనుగూర్చి ఆలోచించ సాగాను. అమ్మ ప్రవర్తనను చర్చించుకున్నాను. అమ్మను గురించి ఇతరులు కన్నవీ, విన్నవీ తెలుసుకున్నాను. క్రమంగా అమ్మ అమ్మే నన్నభావం బలపడింది.
నేను ఇలా అంటున్నంత మాత్రాన నాకు అమ్మను గురించి చాలా తెలుసునని అర్థం చేసుకోరాదు. అమ్మను అమ్మ అనుకోవడానికి నాకు తెలిసిన “తక్కువ” సరిపోయింది అంతే.
పరిణతి చెందిన మానవత్వమే దైవత్వమని నా విశ్వాసం. ప్రేమ, వాత్సల్యం, కరుణ, సహనం… ఇవన్నీ మానవులకు అసాధ్యమైన వేవీకావు. మరి అందరిలో అవి ఉన్నాయా ? అని అడిగితే తప్పకుండా ఉన్నాయంటాను. అయితే అవి ఎక్కువ తక్కువ పాళ్ళల్లో కావచ్చు. మానవత్వం పరిణతి చెందిన వ్యక్తిలో అవి మూర్తీభవించి ఉండవచ్చు. అటువంటి వ్యక్తికి దైవత్వాన్ని అపాదిస్తే అందులో వింత ఏమీ లేదు..
మానవత్వం మొక్క అనుకుంటే దైవత్వం చెట్టు. దాని శాఖలే ప్రేమ, వాత్సల్యం, కరుణ, సహనం చెట్లతో పాటే పెరుగుతూంటాయి దాని కొమ్మలు.
మానవత్వం మానవులకే పరిమితమా? కాదట. జ్ఞానికి, అజ్ఞానికి తేడా యిక్కడేనట. అమ్మ అంటుంది.
పశువులలో, పక్షులలో, హానికరమైన ప్రాణులలో సయితం మానవత్వాన్ని చూడటమే గాక, అమ్మ వాటికే మానవత్వాన్ని చూపించింది కూడా. ఆ విధంగా జ్ఞానులకు జ్ఞాని కాగలిగింది అమ్మ.
అమ్మలో ప్రేమ, వాత్సల్యం, కరుణ, సహనం ఉన్నట్లు కనిపించడమేకాక అనిపించిందని కూడా ఇంతకుముందు పేర్కొన్నాను. ఆ విధంగా ఎలా అనిపించింది ? అది తెలుసుకోవడం ఎలా సాధ్యమైనది? నిజం చెప్పాలంటే అమ్మ విశిష్టతను ఆమె ద్వారా కంటే, అవి ప్రతిఫలించడానికి ఆస్కారమైన వ్యక్తుల నుంచి మరింత సులభంగా గ్రహించ గలిగాను. బలమైన అభిప్రాయాలు ఏర్పరచుకోగలిగాను. అమ్మ అక్షరాలా అమ్మే. సృష్టి తనదిగా భావిస్తుంది. జీవులందరు తన బిడ్డలనుకుంటుంది. తృప్తిగా సాకా లనుకుంటుంది. కలహించుకో వద్దని హితవు చెపుతుంది. హింస (“సహించ లేనిది”) చేయ వద్దంటుంది. ముఠాలు కట్టుకోవద్దంటుంది. వర్గాలు పోవాలంటుంది. వసుధైక కుటుంబాన్ని ప్రబోధిస్తుంది. శుక్ల శోణితాల కులమే తన కులమని చాటి చెప్పి విశ్వమానవిగా భాసిస్తుంది. అశక్తులైన, అంగవికలులైన బిడ్డలపట్ల మాతృ సహజమైన పక్షపాతం చూపిస్తుంది. వ్యాధిపీడితులకు బాధాగ్రస్తులకు జరగవలసినవి జరగకపోతే అల్లాడుతుంది. ఆమె అమ్మగాక మరెవరు?
అమ్మ నా దృష్టిలో రేషనలిస్టుకూడా, ప్రతి వస్తువుని విమర్శాత్మకంగా పరిశీలిస్తుంది. ప్రతి విషయాన్ని తార్కికంగా యోచిస్తుంది. పరిశీలించి యోచించి తెలుసుకుంటుంది. తెలుసుకొని తిరుగు లేని నిర్ణయాలకు వస్తుంది. ప్రజల భాషలో, పండితులకు కూడా ఆశ్చర్యం కలిగేటట్లు, అక్షరరూప మిస్తుంది. అమ్మ మాట్లాడుతుంటే దేవతలు పలికినట్లుంటుంది. తెలుగులో ఇంతటి తీయదనం ఉన్నదా ? అనిపిస్తుంది.
అమ్మ మాట్లాడుతున్నప్పుడు పదాలతో అడుకుంటున్నదా అనిపిస్తుంది. భాష ఎటు తిరగమంటే అటు తిరుగుతుంది. ఆఖరుకు అమ్మ చెప్పదల్చుకున్న భావం కొట్టవచ్చినట్టు పదిలంగా ప్రత్యక్ష మవుతుంది.
ఆమె నిర్వచనాలు మరికొన్ని :
“వర్గ రాహిత్యమే స్వర్గం”
“ముముక్షుత్వమే మోక్షం”
“వైకల్యం లేనిదే కైవల్యం” ఇలా ఎన్నెన్నో..
అమ్మలో ఎంత ఆధ్యాత్మికత కన్పిస్తుందో, అంత భౌతికవాద ధోరణి కూడా ఉన్నది. మూఢాచారాలు మూఢనమ్మకాలు పెట్టుకోవద్దంటుంది. మనస్సే మంత్రమంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగమంటుంది.
అమ్మ అమ్మేగనుక ఆడుకుంటా మంటే ఆడుకోమంటుంది. పాడుకుంటా మంటే పాడుకో మంటుంది. పూజ చేసుకుంటామంటే చేసుకో మంటుంది. నీవే దైవమని స్తోత్రం చేసి కోర్కెల మెమొరాండాన్ని ఏకరువు పెట్టినప్పుడు “అనుకున్న దల్లా జరగదు. తనకున్నదల్లా తప్పదు” అని సమాధానం చెప్పి పంపిస్తుంది.
అమ్మను కొందరు రాజరాజేశ్వరి అంటారు. మరి కొందరు మేరీమాత అంటారు. మరికొందరు మరో ఆరాధ్య దైవమని పిలుస్తారు. అయితే మౌలికంగా ముందు అమ్మ అని విశ్వసిస్తారు. ఆపైన మరెన్ని పేర్లు పెట్టుకుంటే నేమి ?
కృష్ణుడు లీలలు ప్రదర్శించాడని చదువుకున్నాం. బుద్ధుడు, జీసస్ కూడా మహిమలు చూపినట్లు మతగ్రంధాలు చెబుతున్నవి. అలాగే అమ్మను గురించి కూడా వింటున్నాం. అమ్మమటుకు తనకేమీ తెలియ దంటుంది. ఏమైనా ఎవరి అనుభవాలు వారివి.
(11/01/1963 గుంటూరు వాణి ప్రారంభ సంచిక నుండి).