భక్తి అంటే ప్రీతి గల దేవి భక్తిప్రియ. భక్తి అంటే భక్తిగల భక్తులు. ఈశ్వరుని యందుండే నిరంతరమైన అనురాగమే భక్తి, నిర్మలమైన ప్రేమభావంతో సర్వేశ్వరుణ్ణి సేవించడమే భక్తి. సర్వాంతర్యామిగా దైవాన్ని గుర్తించి, ఆరాధించే నిశ్చలమైన నమ్మకమే భక్తి. అలాంటి భక్తి పట్ల ప్రీతిగల శ్రీమాత భక్తిప్రియ – భారతీవ్యాఖ్య.
భక్తిగలవారు భక్తులు. భక్తుణ్ణి, భక్తిని వేరుగా చేసి చెప్పడం కష్టం. భక్తుల నుంచి భక్తిని వేరు చేసి చూపడం అంటే వాక్కు నుంచి (పదం) అర్థాన్ని వేరుపరచడం లాంటిది. అది అసాధ్యం. నిర్మలమూ, నిశ్చలమూ, నిష్కామమూ అయిన భక్తి కలవారే నిజమైన భక్తులు. వీరికి మోక్షం కావాలనే కోరిక కూడా ఉండదు. వీరు భగవంతుణ్ణి సేవించకుండా ఉండలేరు కనుక, నిరంతరమూ ఆయన ధ్యాసలోనే ఉంటూ, ఆయన్నే తమ సర్వస్వంగా భావిస్తూ, పూజిస్తూ ఉంటారు.
“గృహ సమ్మార్జనమో, జలాహరణమో, శృంగార పల్యంకికా
వహనంబో, వనమాలికాకరణమో, వాల్లభ్యలభ్యధ్వజ
గ్రహణంబో, వ్యజనాత పత్రధృతియో, ద్రాద్దీపికారోపమో..
“అమ్మ” తానే ఆమె వద్దకు వచ్చింది. “ఎందుకమ్మా!
అని, శ్రీకృష్ణదేవరాయలు తన ‘ఆముక్తమాల్యద’ కావ్యంలో భక్తుని మనస్సు భగవంతుని సేవకు ఎలా అంకితమై ఉంటుందో విడమరచి చెప్పాడు. అలాంటి భక్తుని భక్తి పట్ల ప్రీతిగల శ్రీమాత భక్తిప్రియ.
“అమ్మ” – భక్తిప్రియ. తన భక్తులలోని ఆర్తిని గ్రహించి, వారిని అనుగ్రహించిన సందర్భాలు ఎన్నో “అమ్మ” జీవిత మహోదధిలో తరంగాలుగా పొర్లుకొస్తూ ఉంటాయి. ఏ తరంగాన్ని తాకినా అది మన అంతరంగాన్ని అర్ధం చేస్తూ ఉంటుంది. మన హృదయాన్ని తట్టిలేపుతూ ఉంటుంది. మన మనస్సును కదిలించి వేస్తుంది. అలాంటి సన్నివేశాల్లోని ఒక సంఘటనే 1957 సంవత్సరంలో “అమ్మ” బాపట్లలో చిదంబరరావు తాతగారింట్లో ఉన్నప్పుడు జరిగింది.
ఇంటింటికి తిరిగి, కరివేపాకు అమ్ముకునే స్త్రీ, “అమ్మ”ను చూడాలనే కోరికతో ఒకనాడు రోజూలాగానే కరివేపాకు బుట్టతో ఊళ్ళోకి వెళ్తూ, ఆనాడు ఒక అర్ధణా కరివేపాకు అమ్మగలిగినా, ఆ సొమ్ముతో అరటిపళ్ళుకొని, “అమ్మ” చేతికి ఇచ్చి, “అమ్మ” పాదాలకు నమస్కరించు కోవాలని అనుకుందిట. అమ్మదర్శనం, పాదస్పర్శనం కోసం ఆ స్త్రీ ఎంత పరితపించిందో ! అయితే, ఆనాడు పరీక్షగా ఒక్కరు కూడా కరివేపాకు కొనలేదు, సరికదా! ఆమె విన్నట్లుగా కూడా లేరు. ఒక్క అర్థణా కరివేపాకు అమ్మి అయినా, అరటిపళ్ళు కొని “అమ్మ”ను దర్శించాలనుకున్న ఆమె కోరిక తీరకపోవడంతో ఆమె మనసు తల్లడిల్లి పోయింది. పరితప్త హృదయంతో “అమ్మ”ను చూడాలనే కోరికను ఆపుకోలేక చిదంబరరావు తాతగారింటి ముంగిట నిలచింది ఆమె – నిండు మనస్సుతో, మెండైన భక్తితో,
అప్పటికే కొందరు భక్తులు తాము తెచ్చిన పూలు, పళ్ళు వంటివి “అమ్మ”కు సమర్పించి “అమ్మ” ఉన్న గదిలో కూర్చుని ఉన్నారు. ఈమె మాత్రం పళ్ళు లేవనే బాధతో “అమ్మ”ను చూడాలని ఉన్నా గదిలోపలకు వెళ్ళకుండా వాకిట్లోనే ఆగిపోయింది. ఆ భక్తురాలి భక్తికి ప్రీతిచెందిన ఏడుస్తావు?” అంటూ ఆమెను ఊరడించింది. తనతో పాటు వెలుపలికి వచ్చినవారిని చూపిస్తూ, “వీరంతా నన్ను చూడటానికి వచ్చారు. నేను నిన్ను చూడటానికి వచ్చాను” అంటూ ఆమెను ప్రేమగా దగ్గరకు తీసుకుంది భక్తిప్రియ అయిన “అమ్మ”. “అమ్మను చూడటానికి పళ్ళు ఉంటేనేనా వచ్చేది ? నీవు తలపండే (హృదయం) ఇచ్చావు. ఈ పళ్ళన్నిటి కంటే గొప్పదీ, ఇవ్వవలసినదీ అదే ! నీవు తెచ్చిన కరివేపాకు ఇవ్వకూడదనుకున్నావా ? చూడు. కరివేపాకు ఎంత రుచో !” అంటూ బుట్టలోని కరివేపాకును ఆనందంగా నోట్లో వేసుకుని, నమిలి మింగింది. ఆమె మాటలు రానిదానివలె మౌనంగా “అమ్మ” కౌగిట్లో ఒదిగిపోయింది. “అమ్మ” ప్రేమలో కరిగిపోయింది. భక్తిప్రియ అయిన “అమ్మ” ఆమెతో “ఆవేదనే నివేదనమ్మా!” అని పలికి తన భక్తిప్రియత్వాన్ని ప్రకటించింది.
ఈ సంఘటన మనకు ‘కుచేలోపాఖ్యానాన్ని’ గుర్తుకు తెస్తుంది. నిరుపేద అయిన కుచేలుని సాదరంగా ఆహ్వానించి, అతని ఉత్తరీయపు కొంగుకు కట్టి ఉన్న మూటలోని అటుకులను ఆప్యాయంగా స్వీకరించి, ఆనందంగా ఆరగించిన శ్రీకృష్ణపరమాత్మ భక్తిప్రియుడు. నామరూప భేదమే కాని, పరమాత్మతత్త్వం ఒక్కటే. అది ఆనాడు శ్రీకృష్ణభగవానునిగా దర్శనమిచ్చి, గోగోపగోపీ జనాన్ని ఆనంద పరవశులను చేసింది. ఈనాడు అందరి “అమ్మ”గా కనిపించి, మనకు కనువిందొనరించింది.
భక్తిప్రియ అయిన అర్కపురేశ్వరిని భక్తిగా ఆరాధించడం కంటే మనం “అమ్మ”కు ఏం ఇవ్వగలం? నిండు మనస్సుతో “అమ్మ”ను తలుస్తూ, మన జీవితాలను పండించుకుందాం.
శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్యకు కృతజ్ఞతలు.