“శ్రీ లలితాదేవి భక్తికి వశురాలు. ఏ పేరుతో పిలిచినా భక్తికే వశమై ఉండడం దైవలక్షణం”-భారతీవ్యాఖ్య.
రాగద్వేషాతీతమైన మనస్సుతో, సర్వసమర్పణ భావంతో భగవంతుని ప్రేమించి, ఆరాధించడమే భక్తి.
“చిక్కడు వ్రతముల క్రతువులు
చిక్కడు దానములు శౌచశీల తపములన్
చిక్కడు యుక్తిని, భక్తిని
చిక్కిన క్రియ నచ్యుతుండు సిద్ధము జగతిన్”
అని భక్తికి చిక్కినట్లుగా భగవంతుడు ఇతరములకు చిక్కడని ప్రహ్లాదుని నోట బమ్మెర పోతనామాత్యుడు పలికించాడు. గజేంద్రమోక్షణ ఘట్టంలో కాని, ప్రహ్లాదుని ప్రాణరక్షణ సమయంలో కాని, ద్రౌపది మాన సంరక్షణ సందర్భంలో కాని వారి భక్తికి వశుడై, వారిని రక్షించిన పరమాత్మ భక్తివశ్యుడు. శ్రీ లలితాదేవి కూడ అనన్యభక్తికి వశురాలు కనుక ఆమె భక్తివశ్య.
“అమ్మ” భక్తివశ్య. అమిత భక్తితో, శ్రద్ధతో, ఆరాధనా భావంతో “అమ్మ”ను మనసా, వాచా, కర్మణా సేవించింది శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య. భక్తివశ్య అయిన “అమ్మ”, వసుంధర అక్కయ్యను అనుగ్రహించింది. ఆమె మనస్సులోని కోరికను గ్రహించింది. ఆమెను పాణిగ్రహణం చేసి, ఆమె పట్ల తనకు గల ప్రేమను ప్రకటించింది.
భగవంతుడు ఒక్కడే పరమపురుషుడు. ఈ సత్యాన్ని గ్రహించి, స్త్రీ పురుష భేదం లేకుండా ఆ జగన్నాధుని తమ భర్తగా భావించి, తరించిన వారెందరో మనకు చరిత్రలో కనిపిస్తారు. ఈ విధమైన భక్తికి “మధురభక్తి” అని పేరు. మీరాబాయి, గోదాదేవి వంటివారు ఆ పరమాత్ముని భర్తగా తలచి, భజించి, తరించారు. ఆ కోవకు చెందిన భక్తురాలు మనందరి అక్కయ్య శ్రీమతి బ్రహ్మాండం వసుంధర.
వసుంధర అక్కయ్య “అమ్మ”లో – అమ్మదనంలోని కమ్మదనాన్ని చవిచూస్తూనే, “అమ్మ” సేవలో భర్తృభావాన్ని అనుభవించిన ధన్యురాలు. అందుకే “అమ్మ” – “భర్త అంటే దేహం కాదు. భావమే” అని ప్రకటించింది. యుక్తవయస్సు లోనే “అమ్మ” అండన చేరిన వసుంధర అక్కయ్య. “అమ్మ” సేవకు అంకితమయింది. “అమ్మ” తనకు అప్పగించిన బాధ్యతను ఎంతో ఓర్పుగా, నేర్పుగా నిర్వహించింది. “అమ్మ” దర్శనం కోసం వచ్చే సోదర సోదరీ బృందాన్ని ఎంతో ఆదరంగా, ఆప్యాయంగా పలకరించేది. అన్నపూర్ణకు ప్రతిరూపంగా ఆతిథ్యం ఇచ్చి, “అమ్మ”కు మనోనుకూలయై ప్రవర్తించింది. ఆమెలోని భక్తిప్రపత్తులకు వశురాలైన “అమ్మ” అక్కయ్యను పాణిగ్రహణం చేసి, తన సంపూర్ణ అనుగ్రహాన్ని ఆమెపై వర్షించింది.
వివాహాన్ని గురించి “అమ్మ” చెప్పిన మాటల్లో, అక్కయ్యను వివాహం చేసుకోవటం లోని పరమార్థం అవగతమవుతుంది. “పెనిమిటి అంటే పెన్నిధి”, అదే “దైవసన్నిధి”, “సన్నిధి అంటే లక్ష్యం” అని చెప్పింది “అమ్మ”. “అమ్మ” అండన హాయిగా ఉండాలనుకున్న అక్కయ్య లక్ష్యమే”అమ్మ” అక్కయ్యను వివాహం చేసుకోవడంలోని ఆంతర్యం. “ఒక పెన్నిధి అండను చేరటం పెండ్లి”, “ఆ అండను పొందే పరిణామమే పరిణయం,” “కళంకరహిత మైన మనస్సును కళంకరహితంగా అర్పణ చేయటమే కల్యాణం” అని చెప్పిన “అమ్మ” వాక్యాలకు చక్కటి ఉదాహరణమే ఈ వివాహం. అక్కయ్యకు తనపై గల భక్తిని గమనించిన “అమ్మ” ఆమెను అనుగ్రహించి భక్తివశ్యగా సాక్షాత్కరించింది.
భక్తివశ్య అయిన అర్కపురీశ్వరి అనసూయా మహాదేవికి హృదయపూర్వక ప్రణామాలు సభక్తికంగా సమర్పించుకోవడమే ఈ జన్మకు సార్థకత.