“భక్తులకు నిధి వంటిది. ఎంతమందికి ఎన్ని కోరికలు తీర్చినా ఆమె అనుగ్రహ సంపదకు కొదువలేదు. కనుక, శ్రీమాత భక్తనిధి” – భారతీ వ్యాఖ్య.
భక్తులంటే ఎవరు ? నిరంతరమూ భగవన్నామ స్మరణలో, స్తోత్రపారాయణంలో, భగవచ్చింతనలో కాలం గడిపేవారు. వారికి ధ్యేయం భగవంతుడు. ధ్యానం భగవన్నామం. అలాంటి భక్తుల కోరికలను తీర్చే అమ్మవారు భక్తనిధి నిధి అంటే ఏమిటి? నిధి అంటే గని. గని అంటే – ఎంత తవ్వి తీసుకున్నా తరిగిపోని సంపదలకు స్థానం. మన సంపదలకు సంబంధించిన నవనిధులు ప్రసిద్ధమైనవి. నవవిధ భక్తిమార్గాలను అనుసరించే, నాలుగు రకాల భక్తుల నానావిధములయిన కోరికలను నెరవేర్చే ఏకైక నిధి “అమ్మ”. అందుకే శ్రీమాత భక్తనిధి.
భక్తుల కోరికలు పలురకాలు. ఒకే భక్తునికి కూడా ఎన్నో రకాల కోరికలు. ఒక కోరిక తీరకముందే మరొక కోరిక మనస్సులో మసలుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి విరుద్ధమైన కోరికలు మనస్సును ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఏది కోరుకోవాలో కూడాతెలియని అయోమయంలో మనస్సును పడవేస్తూ ఉంటాయి. అలాంటి రకరకాల కోరికలను భక్తులు భగవతికి విన్నవించుకుంటూ ఉంటారు. తాము నిర్ణయించు కోలేని పరిస్థితుల్లో, తమకు ఏది మంచిదో అది చేయమని అమ్మనే అర్థిస్తుంటారు. కోట్లాది భక్తుల కోరికలను ఈడేర్చే శ్రీమాత భక్తనిధి.
“అమ్మ” – భక్తనిధి. “తృప్తముక్తి” అని చెప్పింది “అమ్మ”. మనం విన్నాం. ఔను కదా ! అనుకున్నాం. కాని, మన జీవితంలో ఏమాత్రం ఆచరించలేక పోతున్నాం. మనం తింటే “అమ్మ”కు కడుపు నిండేది. మనం మంచి బట్టలు కట్టుకుంటే “అమ్మ” కు సంతోషం కలిగేది. మనకు జరిగే శుభాలకు “అమ్మ” ఆనందించేది. మనకు ఏ మాత్రం ఏ కష్టం కలిగినా “అమ్మ” మనసు తల్లడిల్లి పోయేది. అలాంటి “అమ్మ”కు బిడ్డలమైన మనకు మాత్రం ఆ పోలిక రాలేదు.
“అమ్మ”పడే బాధలతో సంబంధం లేకుండా, మన కష్టాలను “ఆమె”కు మొరపెట్టుకుని, “ఆమె” చల్లని చూపులకు, మెల్లని మాటలకు, సుతిమెత్తని చేతి స్పర్శకు ఊరట చెందుతూ, “ఆమె” దివ్య సన్నిధిలో మనల్ని మనం మరచిపోయాం. తనకు ఏ మహిమలు తెలియవని అంటూనే, మన శారీరక మానసిక వ్యాధుల నుంచి అప్పటికప్పుడు రక్షిస్తూ, ఇహపర సుఖాలను అనుగ్రహిస్తూ భక్తనిధిగా దర్శన మిచ్చింది.”అమ్మ”.
ఎందరో పెళ్ళికాని యువతీ యువకులు “అమ్మ” దివ్య దర్శనభాగ్యంచేత గృహస్థులై, తమ జీవితాల్లో సుఖసంతోషాలను పండించుకున్నారు. ఇక ఉద్యోగం రాదని, ఆశ వదులుకొని “అమ్మ” అండన చేరిన ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించి, జీవన భృతిని ఏర్పాటు చేసిన “అమ్మ” భక్తనిధి. సంతానం లేదని సంతాపం చెందిన ఎందరికో కడుపుచల్లగా, ఒడినిండుగా బిడ్డలను ప్రసాదించి, ఆనందాన్ని అందించిన “అమ్మ” భక్తనిధి. రోగగ్రస్తులై జీవితం మీద విరక్తి చెంది, “అమ్మే” దిక్కని నమ్మి, “అమ్మ” పాదాలను ఆశ్రయించిన ఎందరికో, అంతుచిక్కని ఆ రోగాలను నివారించి, చక్కని ఆరోగ్యాన్ని కలిగించిన “అమ్మ” భక్తనిధి. జీవితంలోని చీకటి వెలుగులను, కష్టసుఖాలను అనుభవించి, తమ జీవిత చరమాంకంలో పరమార్థాన్ని కోరుకుని, “అమ్మ” అంకసీమను చేరిన ఎందరికో తన కరుణాకటాక్ష వీక్షణాలతో, అమృతాశీస్సులతో మృత్యుభయాన్ని పోగొట్టి తనలో ఐక్యం చేసుకున్న “అమ్మ” భక్తనిధి. అసంఖ్యాకంగా ఉన్న “అమ్మ” బిడ్డల మనస్సులలోని కోరికలు కోకొల్లలు. ఆ కోరికలను తీర్చే కల్పతరువు “అమ్మ”. కామధేనువు “అమ్మ”. ఎంతమంది ఎన్ని రకాలుగా కోరుకున్నా, ఎన్నెన్ని కోరికలు విన్నవించుకున్నా, కాదనకుండా, లేదనుకుండా వారి వారి కోరికలను నెరవేరుస్తున్న భక్తనిధి “అమ్మ”.అయితే, సముద్రంలోని అలలవలె, మన కోరికలు కూడాఅనంతమైనవి. ఒక సమస్య తీరిందనుకునే లోపలే, ఇంకొక సమస్య తలెత్తుతూ ఉంటుంది. అందుకే “అమ్మ” అంటుంది – “జీవితం సమస్యల తోరణం” అని. సుఖమే కాదు కష్టమూ, సంపదే కాదు దారిద్ర్యమూ కూడా తన అనుగ్రహమే అని స్పష్టంగా చెప్పింది “అమ్మ”. అందువల్లనే తాత్కాలికంగా నైనా, ప్రాపంచిక విషయాలను ప్రక్కకు నెట్టి, దివ్యమైన“అమ్మ” సన్నిధిలో ఉన్న కాసేపు అయినా ప్రశాంత చిత్తంతో ఉండగలిగాం.
వర్షం హర్షదాయకమే. అయినా అందరికీ, అన్నివేళలా అనుకూలం కానట్లే, “అమ్మ” అనుగ్రహంకూడా, మనమన ప్రారబ్ధాలను బట్టి సుఖం రూపంలో, కష్టం రూపంలో వ్యక్తమవుతూ ఉంటుంది. సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించగల మానసిక పరిపక్వతనూ “అమ్మే” మనకు ప్రసాదించాలి. అప్పుడే మన మనస్సులకు ప్రశాంతత. సుఖదుఃఖాల్లో సమస్థితి కలిగి ఉండేలా అనుగ్రహించమని భక్తనిధి అయిన “అమ్మ”ను మనసారా వేడుకుంటూ జయహోమాతా ! శ్రీ అనసూయా !
రాజరాజేశ్వరి ! శ్రీ పరాత్పరి !