“భక్తుల మనస్సులనే మానస సరోవరంలో విహరించే హంసి లలితాదేవి. హంసివలె భక్తుల మనస్సులలో ఉంటుంది కనుక ఆమెకు భక్తమానస హంసిక అని పేరు” – భారతీవ్యాఖ్య.
మానవులకు భగవంతుని పట్ల గల ప్రేమే భక్తి. భక్తి గలవారు భక్తులు. సత్యం, ధర్మం, దయ, ప్రేమ వంటివి భగవంతుని గుణాలుగా భావిస్తూ ఉంటాం. అంతేకాదు. “ప్రేమేదైవం” అనీ, రూపుదాల్చిన ధర్మమే శ్రీరామచంద్రుడు” అనీ అంటున్నాం. ఆ గుణాలను అందిపుచ్చుకున్న ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు, ఆంజనేయుడు వంటి వారిని భక్తాగ్రేసరులుగా కీర్తిస్తున్నాం. ఎందుకు? వారి హృదయాల్లో భగవంతుడు నిండుగా కొలువై ఉన్నాడు కనుక. నిష్కపటము, నిశ్చలము, నిర్మలము, రాగద్వేషాతీతమూ ఐన భక్తుల హృదయాలు భగవంతునికి ఆలయాలు. అందువల్లనే భక్తుల మనస్సులు అనే సరోవరంలో నడయాడే ఆడుహంస అనే అర్థంలో భక్తమానస హంసికగా శ్రీ లలితాపరాభట్టారికను స్తోత్రం చేస్తున్నాం.
“అమ్మ” – భక్తమానస హంసిక. మనందరినీ తన బిడ్డలుగా మాత్రమే చూసిన “అమ్మ”లోని మాతృప్రేమను అందుకుంటూనే, మనకు కనిపించని ఆ దైవాన్ని “అమ్మ”లో దర్శించి, “అమ్మ”ను మన ఆరాధ్యదేవతగా అర్చించు కుంటున్నాం. “అమ్మ”కు బిడ్డలుగా, భక్తులుగా ఉన్న మనందరి మనస్సులు అనే సరస్సులలో సంచరిస్తూ ఉన్న భక్తమానస హంసిక “అమ్మ”. భక్తుల మానస రాజహంసి అయిన “అమ్మ”కు వారి మనస్సులు అనే సరస్సులలో ఎడతెగకుండా ఎగసిపడే కోరికలు అనే అలల తాకిడి తెలియకుండా ఎలా ఉంటుంది ? అయితే, భక్తుల (బిడ్డల) కోరికలు నీళ్ళు కలిసిన పాలవంటివి. “అమ్మ” హంసిక కదా ! అందువల్ల పాలనుంచి నీటిని విడదీసినట్లు, భక్తుల కోరికలలో – “తన” నిర్ణయానికి లోబడినవాటిని మాత్రమే తీరుస్తూ, విధి విధానానికి అంతరాయం కలుగకుండా, సృష్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది భక్తమానసహంసిక అయిన “అమ్మ” “తన”కు మహిమలు తెలియవనీ, “తన”కు మాహాత్మ్యాలు చేయడం రాదనీ చెప్తున్నా, “అమ్మ” చూపిన, చూపిస్తున్న అనుగ్రహ విశేషాలు “అమ్మ” బిడ్డలందరకూ అనుభవైక వేద్యాలు.
ఒకసారి ఇద్దరు లేడీడాక్టర్లు “అమ్మ” దర్శనం కోసం జిల్లెళ్ళమూడికి వెళ్ళారు. ఆ రోజు మొదటిసారిగా అన సూయా వ్రతం జరిగింది. “అమ్మ” చరిత్రను విని ఆ డాక్టర్లు ఆనందించారు. ఆ తరువాత “అమ్మ”తో సంభాషించారు. ప్రసాదం తీసికొని గుంటూరుకు ప్రయాణమైనారు. వారు బయలుదేరిన అరగంటకు “అమ్మ” జీపు ఎక్కి ఏడవమైలుకు పోనివ్వమంది. ‘అప్పటికి చీకటి పడుతోంది. ఆ ఇద్దరూ డాక్టర్లూ అక్కడే ఉన్నారు. జీపులో “అమ్మ” ఉన్న సంగతి వారికి తెలియదు. అయినా, వారి ప్రయాణానికి అవసరం కనుక, దారికి అడ్డంగా నిలబడి జీపును ఆపారు. కాని, ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా నిలబడ్డారు. రామకృష్ణ అన్నయ్య వారితో జీపులో “అమ్మ” ఉన్నదని చెప్పారు. వారి ముఖాల్లో కోటి సూర్యకాంతి ప్రభలు. వారు జిల్లెళ్ళమూడిలో ఒక సోదరి వద్ద తమ మనీపర్సు మర్చిపోయి వచ్చారు. చేతిలో చిల్లిగవ్వలేదు. 7వ మైలు దాకా వచ్చాక, తిరిగి వెనక్కి వెళ్ళే ఓపిక లేక, దిక్కుతోచక, గుంటూరుకు ఎలా చేరుతామా? అని విచారిస్తున్నారు. అంతకుముందే వారిలో ఒక డాక్టరు మరొక డాక్టరుతో “అమ్మ” జిల్లెళ్ళమూడి దాటి రాదా?’ అని ప్రశ్నించిందట. నిజమే. సర్వసాధారణంగా ఎప్పుడూ బయటకు రాని “అమ్మ” ఆనాడు వారి కోసమే అలా వచ్చింది. జీపు డ్రైవరును అడిగి వారికి డబ్బులు ఇప్పించింది. వారిని తన జీపులో బాపట్లకు చేర్చింది. ‘మీ ప్రార్థనవిని “అమ్మ” ఎట్లా వచ్చిందో”, అని రామకృష్ణ అన్నయ్య అంటే, వారు ‘ఆ సమయంలో ఏం చేయాలో పాలు పోక దిగులుపడ్డామే కాని, “అమ్మ”ను ప్రార్థించాలని కూడా తోచలేదు’ అని చెప్పారు. అవును మరి. “అమ్మ” భక్తమానస హంసికదా! ప్రత్యేకంగా ప్రార్థన చేసి చెప్పవలసిన పని ఏముంది?
ఒకసారి శ్రీమతి సక్కుబాయి అక్కయ్య కోరికపై ఆమె కారులో “అమ్మ” షికారుకు బయలుదేరింది. “తన” వెంట లాల, పార్థు అన్నయ్యలను కూడా రమ్మనమంది. ప్రయాణం ఎక్కడికో, ఎందుకో ఎవరికీ తెలియదు. రేపల్లె వైపు కారు ప్రయాణిస్తోంది. భట్టిప్రోలు వచ్చింది. లాల, పార్థు అన్నయ్యల ఆనందానికి అవధులు లేవు. అది వారి జన్మస్థలం. అయితే, వారు “అమ్మ”ను తమ ఇంటికి రమ్మని ఆహ్వానించ లేకపోయారు. భక్తమానస హంసిక అయిన “అమ్మ”కు వారి మనస్సులలలోని కోరిక తెలియకుండా ఎలా ఉంటుంది ? కారును వాళ్ళ ఇంటి ముందు ఆపించింది. వారి సంతోషానికి హద్దులు లేవు. ఇద్దరూ కారులో నుంచి చెంగున ఇంటిలోకి దూకారు. నిద్రపోతున్న తల్లిదండ్రులను లేపారు. వారు తాము విన్నది నిజమా! కలా! అనుకునే లోగానే “అమ్మ” అక్కడ ప్రత్యక్షమైంది. “అమ్మ” పాదాలను గట్టిగా పట్టుకొని ఆ గృహిణి ఆనందం, ఆవేశం, ఆక్రోశం ముప్పిరిగొనగా “అమ్మా” ! ఈ దీనురాలిపై దయ ఉన్నదని నిరూపించడానికి వచ్చావా? ఇవ్వాళ సాయంకాలం నుంచీ ఎంతగానో బాధపడు తున్నాను. “అమ్మ”కు నాపై దయ తప్పిందని. అదికాదని నిరూపించడానికి నీవే స్వయంగా వచ్చావా? ఎంత కరుణామయివి “అమ్మా” అంటూ కన్నీటితో “అమ్మ” పాదాలు కడిగింది. “అమ్మ” వాళ్ళ వంట యింట్లోకి వెళ్ళి, పచ్చడి జాడీల మూతలు తీసి, వాటిని రుచి చూసింది.
ఒక మూలగా ఉన్న గిన్నెలో అడుగున ఉన్న అన్నం తీసుకుని, మెంతి మజ్జిగతో కలిపి, ఆకలితో అలమటిస్తున్నట్లు ఆవురావురమని తింటుంటే, ఆ గృహిణి గుండె చెరువుగా ఏడ్చింది. ఆ మజ్జిగ అన్నమే “అమ్మ” అందరకూ ప్రసాదంగా పంచిపెట్టింది. ఆనందమో, ఆవేదనో తెలియని అనుభూతితో విలపిస్తూ ఆ గృహిణి ‘అమ్మ’కు చేతులు జోడించి నమస్కరించింది. అక్కడ నుంచి బయలుదేరి “అమ్మ” పెదపులివఱఱ్ఱులో అనారోగ్యంతో బాధపడుతున్న ఒక సోదరికి తన దర్శనభాగ్యం కలిగించి, తన వాత్సల్యంతో ఆమెను మైమరపించింది. ఇంటికి వచ్చాక – ‘పిలవకుండానే వాళ్ళ ఇళ్ళకు వెళ్ళావేమమ్మా” అని ప్రశ్నించిన రామకృష్ణ అన్నయ్యతో “వాళ్ళు రమ్మని పిలిచేదేమున్నది? వాళ్ళ బాధే నన్ను పిలిచింది. బాధ కంటే వేరే పిలుపేమున్నది?” అని మెల్లగా, చల్లగా సమాధానమిచ్చింది భక్తమానస హంసిక అయిన “అమ్మ”. నిజమే. ఒక లక్కరాజు సీతమ్మ అక్కయ్య, ఒక సోదరి జానకి మాత్రమే కాదు. ఆర్తిగా ఎవ్వరు “అమ్మా! అని పిలిచినా తక్షణమే వారికి దుఃఖోపశమనాన్ని కలిగించే కరుణారససాగర మాతృశ్రీ అనసూయాదేవి. తన బిడ్డల హృదయసరోవరాల్లో నిరంతరం నిర్విరామంగా నడయాడుతూ ఉండే ఆడుహంస అర్కపురీశ్వరి అనసూయా మహాదేవి. భక్తమానస హంసిక అయిన “అమ్మ”కు వేరే ఆహ్వానం ఎందుకు? ఆవాహనం ఏమిటి? “అమ్మ”తో సంభాషణం “అమ్మ”దర్శనం, “అమ్మ”ను గురించిన చింతన “అమ్మ” మృదుకరస్పర్శ “ఆమె” బిడ్డలకు ఎంతో ఆనందదాయకం. భక్తమానస హంసిక అయిన “అమ్మ”కు మనసారా నమస్కరిస్తూ…. (‘మాతృసంహిత’ రచయితకు కృతజ్ఞతలతో…)